గెలుస్తామన్న ఆశ ఏమాత్రం లేదు: సింఘ్వీ
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటోంది. గతంలో గెలిచిన స్థానాల్లోని 164 చోట్ల ఇప్పటికి అది వెనకంజలో ఉంది. దేశవ్యాప్తంగా కేవలం 69 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు విజయం దిశగా దూసుకెళ్తున్న ఎన్డీయే కూటమి 318 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఎన్డీయే బలం గతం కంటే దాదాపు 178 వరకు పెరిగింది. ఇతరులు కూడా 152 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తున్నారు. యూపీఏ కూటమి మొత్తానికి కలిపి కేవలం 68 స్థానాల్లోనే ఆధిక్యం కనిపిస్తోంది.
పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ తదితరులు కాంగ్రెస్ ఓటమిని అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇది ఘోర పరాజయం లాగే కనిపిస్తోందని సింఘ్వీ స్వయంగా చెప్పారు. తమకు ఏమాత్రం ఆశ కనిపించడంలేదని ఆయన అన్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సోనియాగాంధీ విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఓటమిని స్వయంగా అంగీకరించే అవకాశం కనిపిస్తోంది.