ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపుగా నిజమవుతున్నాయి. జాతీయ స్థాయిలో ఎన్డీయే తన హవా కొనసాగిస్తోంది. యూపీఏ అభ్యర్థులు అనుకున్నదానికంటే చాలా ఎక్కువ స్థానాల్లో వెనకంజలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో పరాజయాన్ని మూటగట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక.. ఇలా పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. యూపీపే కంటే ఇతర పార్టీల అభ్యర్థులే ఎక్కువ మంది ముందడుగు వేస్తున్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీ కంచుకోట అమేథీలో కూడా పార్టీ యువరాజు రాహుల్ గాంధీ వెనకంజలో ఉన్నారు. రాష్ట్ర విభజనకు పూర్తిస్థాయిలో పునాదులు వేసి, వ్యూహరచన చేసిన కేంద్ర మంత్రి కపిల్ సిబల్ చాందినీచౌక్ స్థానంలో వెనుకంజలో వేస్తున్నారు. కాన్పూర్లో మురళీ మనోహర్ జోషి, ఝాన్సీలో ఉమాభారతి తదితరుల ముందడుగు వేస్తున్నారు.
మొత్తమ్మీద ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఎన్డీయే కూటమి అభ్యర్థులు 162 స్థానాల్లోను, ఇతర అభ్యర్థులు 128 స్థానాల్లోను ముందడుగులో ఉండగా.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అభ్యర్థులు మాత్రం కేవలం 74 స్థానాల్లో మాత్రమే కాస్త ముందంజ కనబరుస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పిన దానికంటే ఎన్డీఏ మిత్రపక్షాలకు ఎక్కువ స్థానాలే వచ్చేలా కనిపిస్తోంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి రెండంకెల స్థానాలు మాత్రమే వచ్చేలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అత్యల్పంగా 1999 ఎన్నికల్లో 114 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు దానికంటే కూడా తక్కువగా కేవలం రెండంకెల స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పడిపోయేలా ఉంది. యూపీఏ అభ్యర్థులు మొత్తం కలిపి కూడా వంద దాటగలరో లేదోనన్న అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఆధిక్యంలో ఎన్డీయే.. రెండంకెల్లోనే కాంగ్రెస్!!
Published Fri, May 16 2014 9:35 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement