సీజర్‌ అంటే ఏమనుకున్నావ్‌..? | Gaius Julius Caesar was just like real time kikck hero charecter | Sakshi
Sakshi News home page

సీజర్‌ అంటే ఏమనుకున్నావ్‌..?

Published Thu, Jul 28 2016 11:20 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

సీజర్‌ అంటే ఏమనుకున్నావ్‌..?

సీజర్‌ అంటే ఏమనుకున్నావ్‌..?

‘‘పురుషులందు పుణ్యపురుషులు..’’ అంటారు పెద్దలు. ఈ మాటకు వేర్వేరు అర్థాలు వాడుకలో ఉన్నా..ఎప్పటికప్పుడు మహానుభావులు మనకు ఎదురవుతూనే ఉంటారు. వీరు ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రవర్తిస్తారో వారికే ఓ పట్టాన బోధపడదు. ‘కిక్‌’ సినిమాలో కథానాయకుడిలా ఏదో ఒక వింత పని చేయందే వీరికి కిక్కుండదు. క్రీస్తు పూర్వం చివరిదశ కాలానికి చెందిన రోమన్‌ జనరల్‌ జూలియస్‌ సీజర్‌ కూడా అలాంటివాడే..!

ప్రాచీన రోమన్‌ రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, సైన్యాధిపతి అయిన ‘జూలియస్‌ సీజర్‌’ను బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పుకొంటారు చరిత్రకారులు. ఇతడు రాజనీతి వ్యవహారాల్లోనే గాక లాటిన్‌ భాషలో గద్య కవిత్వం రాయడంలోనూ దిట్ట. ఈయన గురించి ఒక విచిత్రమైన కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే..!

క్రీ.పూ.75వ సంవత్సరంలో ప్రస్తుత గ్రీసు, టర్కీల మధ్యనున్న ఏజియన్‌ సముద్రం గుండా ప్రయాణిస్తున్నాడు పాతికేళ్ల సీజర్‌. సహాయకులు సేవలందిస్తుండగా.. ప్రకృతి అందాలను ఓడపై నుంచి చూస్తూ హాయిగా సముద్రయానం చేసేస్తున్నాడు. అలా ఓడ ఓ దీవి సమీపానికి చేరుకోగానే ఊహించని ప్రమాదం ఎదురైంది సీజర్‌ బృందానికి. కండలు తిరిగిన సముద్రపు దొంగలు (పైరేట్స్‌) ఓడను చుట్టుముట్టారు.

ఏం జరుగుతోందో సీజర్‌కు అర్థమయ్యేలోపే మారణాయుధాల సాయంతో అతడి బృందాన్ని బంధించి, తమ నౌకల్లోకి ఎక్కించుకున్నారు. తమను ఎందుకు బంధించారో తెలియని సీజర్‌.. విడుదల చేయాల్సిందిగా సముద్రపు దొంగలను కోరాడు. దానికి వారు ఒప్పుకోలేదు. ‘‘అడగ్గానే విడిచిపెట్టేయడానికి వెర్రివాళ్లలా కనిపిస్తున్నామా..? 20 టాలెంట్ల వెండి ఇస్తేనే నిన్ను విడిచిపెడతాం’’ అంటూ గట్టిగా బదులిచ్చారు. ఈ మొత్తాన్నీ ఇప్పటి లెక్కల్లో చెప్పుకోవాలంటే 620 కేజీలకు పైమాటే!

వేరే ఎవరైనా అయితే తమ సహాయకులను పంపించి పైరేట్లు కోరిన మొత్తాన్నీ తెప్పించేవారు. కానీ, జూలియస్‌ సీజర్‌ అలా చేయలేదు. పైరేట్లను ఎగాదిగా చూస్తూ వికటాట్టహాసం చేశాడు. ‘‘ఏయ్‌..! సీజర్‌ అంటే ఏమనుకున్నారు..? ముష్టి 20 టాలెంట్ల వెండి అడుగుతారా..? నా విలువ ఎంతో తెలుసా..! కనీసం 50 టాలెంట్లు అడిగితే కానీ నా సహాయకులను పంపను’’ అంటూ పట్టుదలకు పోయాడు. సీజర్‌ మాటలకు సముద్రపు దొంగలు తొలుత బుర్రలు గోక్కున్నారు. అయినప్పటికీ, చేసేదేం లేక అతడు చెప్పినట్టే కానిచ్చారు. అలా, వెళ్లిన సీజర్‌ పరిచారకులు వెండితో తిరిగి వచ్చేసరికి 38 రోజులు పట్టింది. అయితే, ఇన్ని రోజులూ ఈ రోమ్‌ వీరుడు పైరేట్ల చేతిలో బందీగా ఉండాల్సింది పోయి, వారిపైనే పెత్తనం చెలాయించాడట! పైరేట్లకు కవిత్వం చెబుతూ, లాటిన్‌ భాషలో వ్యాసాలు రాస్తూ కాలం గడిపేశాడట. అక్కడితో ఆగక.. సముద్రపు దొంగలతో తన వ్యక్తిగత పనులనూ ఈయన చేయించుకునేవాడని చెబుతాడు చరిత్రకారుడు ప్లుటార్చ్‌.

అలా కొద్ది రోజులు గడిచాక పైరేట్లు సీజర్‌ పెత్తనాన్ని తట్టుకోలేకపోయారట. అతడితో వేగలేక, సొమ్ము వచ్చినా రాకున్నా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని అతడితో చెప్పారు. సాధారణంగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో బందీలు ఎగిరి గంతేస్తారు. కానీ, ఈ రోమన్‌ జనరల్‌ మాత్రం చిత్రంగా ప్రవర్తించాడు. పైరేట్ల మాటలను పట్టించుకోకుండా.. ‘‘మీకు నగదు ముట్టచెప్పందే నేను ఇక్కడి నుంచి వెళ్లను..’’ అంటూ భీష్మించుకు కూర్చున్నాడు. తీరా నగదు వచ్చాక వారికి అందిస్తూ.. ‘‘మీ అంతు చూస్తాను. మిమ్మల్నందరినీ శిలువలకు వేలాడదీస్తాను’’ అంటూ వెళ్లిపోయాడు.

చెప్పినట్టుగానే కొద్ది వారాల వ్యవధిలోనే ఒక చిన్న ఓడల సమూహాన్ని వెంటబెట్టకుని అక్కడకు చేరుకున్నాడు సీజర్‌. అయితే, అతడి హెచ్చరికను పెద్దగా పట్టించుకోని పైరేట్లు అక్కడే కాలక్షేపం చేస్తూ కనిపించారు. అంతే.. వారందరినీ బందీలుగా పట్టుకుని తమ రాజ్యానికి తీసుకెళ్లాడు. పనిలో పనిగా తన 50 టాలెంట్ల వెండితో పాటు దొంగల సొత్తును సైతం వెనక్కి తీసుకొచ్చాడు. ఇన్ని చేసిన వాడు శూల దండన విధించకుండా ఉంటాడా..! ఇదంతా చూసిన అప్పటి ప్రజలు జూలియస్‌ సీజర్‌ వింత ప్రవర్తనకు నోరెళ్లబెట్టారట! భలే విచిత్రమైన వ్యక్తి కదూ..!


Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement