పడావు పడిన నేల పడే తన్లాట
పుస్తక సమీక్ష
ఈ పద్నాలుగు కథలు అనేక సారూప్యతలనూ, పరస్పర విభిన్నతలనూ వొదిగించుకొని ఏడేడు పద్నాలుగు లోకాలను చూపిన అనుభవాన్నిస్తాయి.
ఈ సంకలనంలోని చాలా కథలకూ నేపథ్యం సుదీర్ఘ చరిత్ర. ‘దుఃఖాగ్ని’, ’ సంపుడుపంజెం’, ’పూర్తికాని కథ’, ‘అమ్మ’ గత చరిత్ర రగిల్చిన దుఃఖాలు. వర్తమానంలో ప్రతిఫలిస్తున్న నిఘ్ఠర గాయాలు. ‘తమ్ముడి మరణం’, ‘థర్‌డ డిగ్రీ’, ‘అలికిన చేతులు’ ఆ గాయాలకు పూసిన రక్తపుష్పాలు. వెరసి ఈ కథలన్నీ తెలంగాణ రక్తమాంసాలు.
కవితాత్మకమైన వుద్వేగంతో ప్రారంభమై ప్రతీకాత్మక పాత్రల్ని తలదన్నే పాత్రల్ని రూపొందించుకొని నడిచిన ‘దుఃఖాగ్ని’ తెలంగాణ వుద్యమాన్నీ , వుద్యమానికి మూలమైన దైన్యాన్నీ చిత్రించడంతోనే ఆగకుండా ఒక కార్యాచరణ వైపుకు ముగింపు నిచ్చింది. ‘సంపుడుపంజెం’ దళిత వరస మరణాల దగ్గర ప్రారంభమై, తరతరాలుగా సంస్కృతిని నిలబెడుతున్న వాళ్లని రికార్డు చేయలేక పోవడంలోని వైయక్తిక అసహాయతను చిత్రించింది. ‘అమ్మ’ చరిత్ర మలుపులో ఒక అనివార్యతలో కనుమరుగైపోయిన కొడుకును ఎదురు చూసే తెలంగాణను గుర్తుచేస్తుంది.
ఉద్యమమది ఏదైనా, అదెంత ప్రజాస్వామికమైనదైనా, దానిలోని ‘అతి’ కొందరు కార్యకర్తల్లో వ్యక్తీకరింపబడుతుంది. ప్రతి వుద్యమంలోని కార్యకర్తయినా ‘పూర్తికాని కథ’లోని పాత్రలాగే వుండొచ్చు. ఇక, ఐడెంటిటీ క్రైసిస్‌తో, వ్యకిగత సంక్షోభంతో సతమతమయ్యే వ్యక్తులు వర్తమాన చరిత్రలో కొల్లలు. ఈ సంక్లిష్ట స్థితికి ఉప ఫలితాలుగా వచ్చినవే ‘తమ్ముడి మరణం’ లోని ‘థర్‌డ డిగ్రీ’లోని, ‘అలికిన చేతులు’లోని మృత్యు దుఃఖాలు.
ఈ సంకలనంలోని దుఃఖ దృశ్యాలు అక్కడితోనే ఆగలేదు. ఆధునిక అభివృద్ధి ప్రతిఫలనాలైన రహదారుల మీద మృత్యు కోరలు చాస్తున్న టోల్ గేట్లను చిత్రిస్తూ, ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా వుండాల్సిన ఆరోగ్యశ్రీ కార్యక్రమాల్లో తెల్లకోట్లు జరిపే విశృంఖల ఆపరేషన్లు స్త్రీలను పెడుతున్న హింసలను వివరిస్తూ, స్త్రీని ఆస్తిగా చూసే ‘ఇండియాస్ సన్ ’లోని రేపిస్టు మగ యిగో స్వగత దుఃఖాల మీదుగా, ‘2047’లోని ఆత్మలు చెప్పే అసమ అభివృద్ధి ఆత్మకథలుగా కొనసాగినాయి. ఇన్ని కథలూ మృత్యు చిత్రాలుగా వుండి పాఠకుడి అంతరంగాన్ని కలవరపరుస్తాయి. తెలంగాణ కథలంటే పొక్కిలి నేల మీద పారాడే అమాయక కోడిపిల్లలనిపిస్తాయి.
వీటికి భిన్నంగా ‘చౌరస్తా’ ‘ఇల్లు’ ఇంకో విరుద్ధ కోణాన్ని పట్టి చూపుతున్నాయి. ఆశ్చర్యకరంగా చౌరస్తాలోని ప్రొటాగనిస్ట్ ‘బతుకుడంటే లోకమ్మీద పడి అందినకాడికి దొబ్బుకు తినుడే’ అనే తత్త్వాన్ని కథ ఆద్యంతమూ నిరూపించి నిలబెడతాడు. ‘ఇల్లు’లో త్యాగానికి ప్రతీకగా వుండాల్సిన తెలంగాణ తాత, కొడుకుల మీది కోపంతో మనవడి భవిష్యత్తును కాంక్షించని వికారాన్ని ప్రదర్శిస్తాడు.
మృత్యువుతో పొక్కిలైన నేల ఈ కొత్త వికారాల్ని ఎలా పొందిందని ఆలోచిస్తే, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్‌సలో భాగంగా పొందిందా, దీనికి వేర్లు ‘పూర్తికాని కథ’లో చెప్పిన మేధావుల వైయక్తిక విధ్వంసంలోంచి బయలుదేరాయా అన్నది పరిశోధించాల్సిన అంశం. అయితే ఇవి ఇంగిలీసు విద్యామాయలో పడ్డ తెలంగాణ గ్రామీణుల్లోనూ వ్యాపించాయని ‘చుక్కలురాని ఆకాశం’లోనూ కథనం చేయబడింది.
25 సంవత్సరాలుగా వెలువడుతున్న వార్షిక కథా సంకలనాల కంటే భిన్నమైన కథా సంకలనాల పరంపరను వెలువరించే బాధ్యతను నెత్తికెత్తుకున్న సంపాదకులు ఒక ట్రెండు కథల ఎంపికలోనూ, చాలా కథ ల్లో దొర్లిన అచ్చుతప్పుల మీదనూ మరింత శ్రద్ధ పెట్టివుంటే బావుండేది.
తన్లాట-తెలంగాణ కథ 2014 సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ, వెల్దండి శ్రీధర్; పేజీలు: 160; వెల: 60 ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలు; సంగిశెట్టి ఫోన్: 9849220321
జి.వెంకటకృష్ణ, 8985034894