కావ్యదహనోత్సవం | Gerard Melli Hopkins Not Print Even On Poem In His Career | Sakshi
Sakshi News home page

కావ్యదహనోత్సవం

Published Mon, Feb 24 2020 3:37 AM | Last Updated on Mon, Feb 24 2020 3:37 AM

Gerard Melli Hopkins Not Print Even On Poem In His Career - Sakshi

తన కావ్యాన్ని ఎవరూ చదవడం లేదని నిశ్చయమైన ఒక కవి, ఒక కొత్త సంప్రదాయానికి తెర తీస్తూ కావ్యదహనోత్సవానికి సిద్ధపడ్డాడు. దానికి తగినట్టుగా సభ ఏర్పాటైంది. అధ్యక్షుడు క్లుప్తంగా శ్రోతలకు విషయం వివరించి, కృతికర్తను మాట్లాడవలసిందిగా ఆహ్వానించాడు. అప్పుడు కృతికర్త ప్రసంగం ఇలా సాగింది: ఒకళ్లనొకళ్లు పొగుడుకోవడంతో మొదలై, పార్టీలతో ఆఖరవుతున్న ఈనాటి సాహిత్య సభలని చూస్తున్న నేను; సాహిత్య సమస్యలని నిష్కపటంగా చర్చించే ఉదాత్త సభ చూడగలనా అనుకునేవాడిని. చచ్చిపోతే చచ్చిపోయింది కానీ, నాకింత ఉదాత్త సాహిత్యసభలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నా కావ్యానికి ధన్యవాదాలు అర్పించకుండా ఉండలేను. కాలేజీ పత్రికలకి పద్యాలు, పెళ్లిళ్లకి పంచరత్నాలు రాయడంతో నా సాహిత్యజీవితం మొదలయ్యింది. నా దగ్గిర స్నేహితుడు ఒకడు చనిపోతే, షెల్లీ రాసిన ఎడొనోయిన్‌ దగ్గర పెట్టుకొని, ‘విలపామి’ అనే ఖండకావ్యాన్ని వ్రాశాను. ఆ పద్యాలు అచ్చవగానే, నా మిత్రులందరూ, ‘నీలో సరికొత్త కంఠం మాకు గంభీరంగా వినపడుతున్నది’ అని ఉబ్బేశారు. అప్పటికి నేను కవిననే భ్రాంతి నన్ను పూర్తిగా ఆవరించింది. నా వేషభాషల్లో కూడా మార్పు వచ్చింది. గ్లాస్గో పంచలు, పెద్ద జరీ పంచెలు, శాండో బనీను లీలగా కనిపిస్తూ వుండే తెల్లటి మల్లెపువ్వుల్లాంటి లాల్చీలు, నగిషీ చెక్కిన చెప్పులు, ఇవి నా ట్రేడుమార్కులు!

ఛందోకవిత్వం పేరుతో కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యడం మొదలుపెట్టాను. చిత్రవిచిత్ర బంధనలతో రకరకాల సమాసాలతో, కవితలు వ్రాశాను. దేశంలో ఏ మూల సాహిత్య సభ పెట్టినా వెళ్లేవాడిని. సాహితీ సభలకు వెళ్లడానికి ఏ అర్హతా అక్కరలేదు కదా! అనతికాలంలోనే, దేశంలో హేమాహేమీ సాహిత్యవేత్తలంతా నాకు పరిచయం అయ్యారు. పబ్లిక్‌ మీటింగుల్లో కూడా నన్ను పొగడటం మొదలుపెట్టారు. ఆరు నెలలు తిరక్కుండా ఒక చిన్న ఖండకావ్యానికి సరిపడే పద్యాలు, గేయాలు తయారుచేశాను. దానితో సర్వ యువకవి బంధువుగా ప్రసిద్ధికెక్కిన ఒక పీఠాధిపతి నన్ను వెన్ను చరిచి, తాను ఉపోద్ఘాతం రాస్తాననీ, అచ్చు వెయ్యమనీ వెంటపడ్డాడు. కావ్యానికి అగ్నిశంఖం అన్న పేరు ఆయనే పెట్టాడు. మా వేలువిడిచిన పినతండ్రి ఒకాయన సెంట ర్‌లో కాస్త పెద్ద పదవిలో ఉండటం మూలంగా కృతిపతిని వెతుక్కోవలసిన బాధ తప్పింది. ఆయనతో ఏవో లావాదేవీలుండి, మా ఇంటిచుట్టూ తిరిగే ఈ గోపాలరెడ్డి నా స్నేహం కట్టి, తనకి అంకితం ఇమ్మని కూచున్నాడు. పుస్తకం అచ్చుకయ్యే ఖర్చు కాకండా, ఆవిష్కరణ రోజున ఓ వెయ్యి నూటపదహార్లు ఇస్తానని చెప్పాడు.

పుస్తకం తెల్లటి పాలవెన్నెల లాంటి ఆర్ట్‌ కాగితాల మీద అచ్చయ్యింది. అప్పట్లో మత్స్య, అటవీ శాఖకి డిప్యూటీ మంత్రిగా ఉన్న ఒకాయన సభాధ్యక్షుడిగా వచ్చాడు. దినపత్రికల్లో మా బొమ్మలు బ్రహ్మాండంగా అచ్చయ్యాయి. రెండున్నరేళ్లు ఆ కైపులో కొట్టుకుపోయాను. నా వ్రాతప్రతుల్లో ఎవరికయినా ఓపిక వుండి చూడగలిగితే, అసంపూర్తిగా వదిలేసిన ప్రబంధాలు, చంపూకావ్యాలు, వాస్తవిక, అధివాస్తవిక గేయాలు, ‘నిజము అన్నపూర్ణ నీదు మాట’ మకుటంతో వందలకొద్దీ పద్యాలు దొరుకుతాయి. నేను నా గతజీవితంలోలాగా మీరు ఏ మాట చెబితే చప్పట్లు కొడతారో ఆ మాటలే చెప్పి సెభాస్‌ అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అసలు ప్రపంచ సాహిత్యాలకంటే నా తెలుగు సాహిత్యం గొప్పదని విర్రవీగాను. ఏ భాషలోకి అనువదించినా ఇది కావ్యంగానే నిలబడుతుంది, అన్న కావ్యం ఒక్కటీ మనకు రాలేదు. యునెస్కో వాళ్లు ఫ్రెంచ్‌లోకి అనువదిస్తాం, మీ కావ్యం ఒకటి చెప్పండయ్యా అని అంటే, మనవాళ్లు మీనమేషాలు లెక్కపెట్టి చివరికి వేమన పద్యాలు చూపించారు!

ఒకసారి ఆంధ్రాభ్యుదయోత్సవ సభకి ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్లాను. సభ అధ్యక్షుడు హైస్కూలు హెడ్మాస్టరు. ‘బాబూ! అన్నన్ని మాటలు వాడావు?’ భ్రసృమర, అఘమర్షణ, నిబర్హణ, వీటికి అర్థం ఏమిటీ, అనడిగాడు. నా పద్యాల్లో నేను ఏ అర్థమూ వుద్దేశించి రాయలేదని నిరూపించాడు. ఏలూరులో నేను నా మిత్రులూ రోజూ దాదాపు అరడజను పకోడీ పొట్లాలు తెప్పించుకునేవాళ్లం. పకోడీలు ఒక్కో షాపులో ఒక్కోరకంగా వుండేవి. కానీ, పొట్లం కటిన కాయితాలు మాత్రం అన్నీ అగ్నిశంఖం కాయితాలే! నిజంగా కవిత్వం అంటే ఏమిటి? ఒక గొప్ప కావ్యం వ్రాయాలంటే సంపాదించుకోవలసిన వ్యుత్పత్తి ఎటువంటిది? ఎలాంటి అనుభవాలు ఒక వ్యక్తిని కవిగా చేస్తాయి? ఈ ప్రశ్నలు నన్ను వేధించటం మొదలెట్టాయి. ఆధునిక ఆంగ్ల కవిత్వ యుగప్రవక్తగా విఖ్యాతుడయిన గెరార్డ్‌ మేన్లీ హాప్కిన్స్‌ తన జీవితకాలంలో ఒక్క పద్యం కూడా అచ్చు వెయ్యలేదు. అతని కవిత్వమంటే ఇష్టమయినవాళ్లు అచ్చువేస్తామని చెప్పినా ఒప్పుకోలేదు. ఒక దశలో అంతకుముందు వ్రాసిన పద్యాలన్నీ చింపేసి, ఇక పద్యాలు రాయకూడదని శపథం కూడా చేయడం జరిగింది. అతను చనిపోయింతర్వాత అక్కడక్కడ అతని స్నేహితుల వద్దా, ఇతరత్రా దొరికిన 50, 60 పద్యాలు మాత్రం అతని మిత్రుడు రాబర్ట్‌ బ్రెడ్జెస్‌ ప్రకటించాడు. ఈనాడు హాప్కిన్స్‌ మీద వచ్చిన విమర్శక గ్రంథాలు ఒక బీరువాకి సరిపోతాయి. క్షమించండి. ఇప్పటికే చాలాసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించాను. మనిషి సుఖంగా బ్రతకాలంటే కవిగా డబ్బా వాయించుకోనక్కరలేదు. ఏ దొరస్వామిలాగానో యూనివర్సిటీ ముందు ఒక కిళ్లీకొట్టు పెట్టుకొని ఆనెస్టుగా బ్రతకచ్చు. తెలుగు సాహిత్యంతో ఇక ఈ జన్మలో సంబంధం పెట్టుకోను. కొంతమందికి అనుమానం రావచ్చు; సినిమాలకి మాటలు పాటలు రాస్తానేమోనని. ఆ పనీ చెయ్యను. ఇక సెలవ్‌.


ఒక చారిత్రక ప్రహసనం

ఇటు ఆకలి అటు కాకలి
అటు వేకువ ఇటు లోకువ
అటు మకుటం ఇటు కటకం
అటు సమరం ఇటు భ్రమరం
ఇటు కృస్చేవ్‌ అటు మిస్చీఫ్‌
ఇటు టర్కీ అటు గోర్కీ
నాలో మాత్రం సత్యం నిత్యం
నవ్య భవ్య దివ్యాకృతి (‘అగ్నిశంఖం’)


కవిని ఎవరో కావ్యం రాయమని అభ్యర్థించటం, కవి కృతిని రాయటం, ఆ కృతికన్యను ఒక కృతిభర్తకి అంకితం ఇవ్వడం– ఇలాంటి కర్మలు మన సంప్రదాయంలో ఉన్నప్పుడు, ఎవరూ చదవని పుస్తకానికి దహనోత్సవం ఎందుకు చెయ్యకూడదు? ఈ సందేహం ఒకమారు వెల్చేరు నారాయణరావుకు వచ్చింది. ‘ఎవరైనా అటువంటి దహనకర్మ చేయటానికి ముందుకొస్తే నా పుస్తకాలు ఇస్తాను’ అన్నారు ఆంధ్రవిశ్వకళా పరిషత్తు ప్రధాన లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న అబ్బూరి రామకృష్ణారావు. అదీ నాంది. ఇదే ఊతంగా ఒక ప్రహసనం రాశారు అప్పటికి నవయువకుడైన వేలూరి వేంకటేశ్వరరావు. ‘కావ్యదహనోత్సవం’ చేయాలంటే ముందు కవి కావాలి. అది వేలూరే. ఆయనో కావ్యం రాయాలి. రాశాడు(?). దాని పేరు అగ్నిశంఖం. 14–12–1960 రోజున ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ ఆవరణలో దహనోత్సవం జరగనుందనీ, ‘అమూల్య హర్షాశ్రుతర్పణము’ వదలడానికి అందరూ రావాలనీ పత్రికలు కొట్టించారు. సభ అంటే దానికో అధ్యక్షుడు (మేడేపల్లి వరాహనరసింహ స్వామి) కావాలి, ప్రధాన వాహకుడు (ఎ.సత్యమూర్తి) ఉండాలి, కృతి భర్త (అనంతరం బంగోరెగా ప్రసిద్ధుడైన బి.గోపాలరెడ్డి) తప్పనిసరి. ఇంకా, శ్రోతల్లోంచి చీటీ పంపి మాట్లాడతాననే ఓ యువకుడు (చేకూరి రామారావు).

‘అచ్చుయంత్రం ఏటేటా వేలు లక్షల పుస్తకాలు ప్రజల మీద పడేస్తున్నది. వీటిల్లో మంచి చెడ్డల ఎన్నిక బహు దుస్తరం అయిపోతున్నది’ అంటూ అధ్యక్షుడు సభ ప్రారంభించాడు.  ‘ఒక తుచ్ఛకావ్యం యొక్క తుచ్ఛత్వం లోకానికంతటికీ తెలిసిన చాలా కాలానికిగానీ కవికి’ తెలియదనీ, అలాంటిది ‘అగ్నిశంఖం వ్రాసిన వేంకటేశ్వరరావు మా దగ్గరికొచ్చి, తన కావ్యం క్షుద్రకావ్యం అని’ ఒప్పుకుని దహనోత్సవం జరిపించమన్నాడనీ నిర్వాహకుడు సభను ముందుకు జరుపుతాడు. అనంతరం, ఈ దహనానికి ఎందుకు ఒప్పుకున్నాడో చెబుతూ కవి ప్రసంగిస్తాడు. (ప్రసంగంలోని కొంతభాగం  కథాసారంలో చూడండి.) కవి అప్పటికే నన్నయ్య నుంచి నానాసాహెబ్‌ దాకా ఎన్నో ప్రయోగాలు చేసినవాడు. ఎన్నో బిరుదులు పొందినవాడు. కానీ ప్రచారం వలననే సాహిత్య విలువలు స్థిరపడుతున్నాయని జ్ఞానోదయమైంది. అందుకే, తన ‘సర్వ రచనల మీద మమకారం వదులు’కుంటున్నానని సభాముఖంగా ప్రకటించాడు.

దహనం అంటే భౌతికంగా పుస్తకాన్ని తగలబెట్టడం కాదని వీళ్లందరికీ తెలుసు. తెలుగులో సాహిత్యం పేరుతో చలామణీ అవుతున్న చెత్తను గుర్తించాలని అదొక పిలుపు. అరవై ఏళ్ల కింద ఈ ఘటన సహజంగానే సంచలనం కలిగించింది. ‘విష్‌ క్రెమేషన్‌ సక్సెస్‌’ అని తంతి పంపించాడు శ్రీశ్రీ. మా ఊరికి ఎప్పుడు వస్తారని ఉత్తరం రాశాడు ఇస్మాయిల్‌. ‘ఒక పుస్తకం మరణించిందని మీరెలా చెప్పగలరు?’ అని నిలదీశాడు కొనకళ్ల వెంకటరత్నం. నాటకం, వీధి నాటకం, నిజమైన మనుషులే పాత్రలు కావడం వల్ల ఇంకో వింత రూపం తెచ్చుకున్న ఈ ఘటన– ఇన్నేళ్లూ కేవలం సాహిత్య మరమరాలు కోవలో మౌఖిక ప్రచారంలో ఉండి, అప్పటి విశేషాలు కలుపుకుని వేలూరి 84వ యేట చిరుపుస్తకంగా వచ్చింది.

వేలూరి వేంకటేశ్వరరావు అధ్యాపకుడిగానూ, పరిశోధకుడిగానూ పనిచేశారు. ‘మెటమార్ఫసిస్‌’, ‘ఆనేల, ఆ నీరు, ఆ గాలి’ కథాసంపుటాలు వెలువరించారు. ఒరియా కవి సౌభాగ్యకుమార మిశ్ర కవిత్వం – ‘అవ్యయ’, ‘ద్వాసుపర్ణా’ తెలుగులోకి అనువదించారు. ప్రస్తుత నివాసం అమెరికా.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement