
ప్రదానపుటుంగరం తానే కొనేసుకుని, రిచర్డ్ తనని పెళ్ళి చేసుకొమ్మని అడుగుతాడనుకున్న 33 ఏళ్ళ ఛార్లెట్ (లాట్టీ) ఆశలని వమ్ము చేస్తూ ఆ ప్రసక్తే ఎత్తడు అతను. అక్క ఫిలిస్‌కి ఫోన్ చేసి వెక్కుతూ, ‘రిచర్డ్ పెళ్ళి గురించి మాట్లాడలేదు. అతనితో మూడేళ్ళు గడిపాను’ అని చెప్తుంది లాట్టీ.
‘తన విడాకుల సమస్యతోనే తలమునకలవుతున్న ఫిలిస్‌కు ‘ఏ బోయ్‌ఫ్రెండుతో సంబంధం తెగిపోయినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, ఆ తరువాత పశ్చాత్తాపపడే అలవాటు లాట్టీకి’ అని తెలుసు.
కొన్ని రోజుల్లోనే, 15 ఏళ్ళ పాత స్నేహితుడైన బెన్, లాట్టీకి ఫోన్ చేసి ‘ముప్పై ఏళ్ళొచ్చేవరకూ మనిద్దరికీ పెళ్ళి కాకపోతే మనం పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం కదా!’ అన్న తమ ఒప్పందాన్ని గుర్తు చేస్తాడు.
లాట్టీకి బెన్ గురించి తెలిసినది శూన్యం. తన పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో అతణ్ని ఒకసారి కలుసుకున్న తరువాత అతణ్ని చూడను కూడా లేదు. అయినప్పటికీ, మరింకేం ఆలోచించకుండా ‘పెళ్ళి అయ్యేవరకూ శృంగారం జరగదు’ అన్న షరతు పెట్టి, అదే రోజు పెళ్ళి చేసేసుకుంటుంది. తాము మొదటిసారి కలుసుకున్న ‘ఇకొనోస్’ అనే గ్రీక్ ఐలాండుకి హనీమూన్ గడపడానికి వెళ్ళిపోతుంది, ‘వెడ్డింగ్ నైట్’ నవల్లో.
ఆ పెళ్ళి రద్దు చేయాలంటే, లాట్టీ హనీమూన్ జరగకూడదు కనుక, ట్రావెల్ పత్రిక ఎడిటర్‌గా పని చేస్తున్న ఫిలిస్ తన పరపతి ఉపయోగించి, కొత్తదంపతులు ఉంటున్న హోటెల్ యజమాని ‘నీకో’కి, వారిద్దరూ ఏకమవకుండా ఆటంకాలు కలిగించమని చెబుతుంది.
ఆమె ప్రయత్నాలకి తోడుగా బెన్ స్నేహితుడైన లోర్కాన్ కూడా యీ పెళ్ళికి వ్యతిరేకే. అతనికి బెన్ అపరిపక్వత, సంబంధాలకు కట్టుబడి ఉండలేకపోయే స్వభావం తెలుసు. లోర్కాన్, ఫిలిస్, ఫిలిస్ కొడుకు నోవా– బెన్, లాట్టీలు ఉండే హోటెల్‌కు వెళ్తారు. లోర్కాన్, ఫిలిస్ మాట్లాడుకుంటూ– తమ తమ విడాకుల్లో ఎదురయిన కష్టాల గురించి చెప్పుకుంటారు. ఫిలిస్, ‘నా మనస్సు బొబ్బలు కట్టింది. అవి ఎవరికీ కనబడవు’ అంటుంది. ‘విడాకులు నియంత్రిత విస్ఫోటం వంటివి. దానికి బయటున్నవారందరూ సరిగ్గానే ఉంటారు’ అంటాడు లోర్కాన్. ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటారు.
కొత్తజంటకి నీకో కలిపించిన సమస్యలు– గదిలో బిగ్గరగా టీవీలో వస్తున్న పిచ్చి ప్రోగ్రాములని ఆపుచేయలేకపోవడం, డబుల్ బెడ్‌కి బదులు రెండు మంచాలు దూరదూరంగా వేసి ఉండటం వంటి హాస్య సంఘటనలు. అతనికి సహకరించిన అతని స్టాఫ్ పుణ్యమా అని వివాహం సంపూర్ణం అవదు. ఆశాభంగం కలిగిన జంట, తాము తొలిసారి కలుసుకున్న గెస్ట్‌హౌస్ అయితే నయం అనుకుని అక్కడికి వెళ్తారు. అక్కడ పోట్లాడుకుని తము పెళ్ళి చేసుకోవడమే తప్పనే నిర్ణయానికి చేరి, ‘పోనీ, ఆఖరిసారి హోటెల్లోనే ప్రయత్నించి, ఆ తరువాత విడాకులు తీసుకుందాం’ అనుకుంటారు. అలా అవడానికి ముందే నీకో, ఫిలిస్‌తో ఫోన్లో మాట్లాడుతూ– తను వారి మొదటిరాత్రికి ఎలా అడ్డుపడ్డాడో అని చెప్పడం వింటుంది లాట్టీ.
ఫిలిస్ తన బృందంతో పాటు చెల్లెల్ని కలుసుకోడానికి వచ్చినప్పుడు, లాట్టీ అక్కను క్షమించదు. అప్పుడు రిచర్డ్ వచ్చి, తనని పెళ్ళి చేసుకొమ్మని లాట్టీని అడుగుతాడు. విడిపోయిన ప్రేమికులు వొకటవుతారు. ఫిలిస్ లోర్కాన్‌తో పాటు డ్రింక్స్ కోసం వెళ్తుంది. ఇద్దరి మధ్యా సంబంధం తలెత్తుతోందన్న రచయిత్రి సోఫీ కిన్సెలా సూచింపుతో, నవల ముగుస్తుంది.
వేగంగా నడిచే కథ– అక్కా చెల్లెళ్ళిద్దరి దృష్టికోణాలతో చెప్పబడి, ముందుకీ వెనక్కీ నడుస్తుంటుంది. పుస్తకంలో హాస్యం, చమత్కారానికీ కొదవ ఉండదు. శైలి అద్భుతమైనది. డయల్ ప్రెస్ ఈ నవలని పబ్లిష్ చేసినది 2014లో.
కృష్ణ వేణి