విమలాశాంతి సాహిత్య సాంఘిక సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో పలు సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
అనంతపురం కల్చరల్ : విమలాశాంతి సాహిత్య సాంఘిక సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో పలు సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు శాంతినారాయణ ఓ ప్రకటనలో వెల్లడించారు. లలితకళాపరిషత్తు వేదికగా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాలను రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ, ఆర్డీటీ కల్చరల్ విభాగం వారు రూపొందించారు. ఉదయం 10 గంటలకు సకల వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జానపద గీతాలాపన, 11 గంటలకు డాక్టర్ శాంతి నారాయణ రచించిన ‘పెన్నేటి మలుపులు’ నవలావిష్కరణ ఉంటాయి.
మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛోఫెర్రర్, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ తదితరులు నవల గురించి ప్రసంగిస్తారు. అనంతరం ‘తెలుగు సాహిత్యం, సమాజం–దళిత బహుజన, గిరిజన, మైనార్టీల అస్థిత్వం’ అనే అంశంపై చర్చా వేదిక ఉంటుంది. ప్రముఖ రచయితలు లక్ష్మీనరసయ్య, బండి నారాయణస్వామి తదితరులు సమన్వయం చేస్తారు. సాయంత్రం రెండు రాష్ట్రాలకు చెందిన 120 మంది కళాకారులు, రచయితలు, కవులతో సమ్మేళనం ఉంటుంది. రాత్రి 7 గంటలకు డాక్టర్ విజయభాస్కర్ రచించిన ‘రాజిగాడు రాజయ్యాడు’ అనే సందేశాత్మక నాటకం ప్రదర్శిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాహితీ, కళాభిమానులు విరివిగా విచ్చేయాలని శాంతినారాయణ కోరారు.