పుట్టిన చోటును వెతికే సింహం | A Book Written By Krishnaveni | Sakshi
Sakshi News home page

పుట్టిన చోటును వెతికే సింహం

Published Mon, Jan 7 2019 1:14 AM | Last Updated on Mon, Jan 7 2019 1:14 AM

A Book Written By Krishnaveni - Sakshi

కొత్త బంగారం

1986. ఐదేళ్ళ సరూ, పక్క ఊరి రైల్వే స్టేషన్లో తప్పిపోయి, పొరపాటున కలకత్తా వెళ్ళే రైలెక్కుతాడు. తన ఊరు ‘గినెస్తలే’ అనీ, తల్లి ‘అమ్మీ’ రాళ్ళు మోస్తూ, తమ నలుగురు పిల్లల్నీ పోషిస్తుందనీ తప్ప మరేదీ తెలియదు. హిందీ తప్ప మరే భాషా రాదు. సరూ కలకత్తా రోడ్లమీదతిరుగుతూ మూడు వారాలు గడిపిన తరువాత, పిల్లాడిని వొక అనా«థాశ్రమంలో పెడుతుంది ప్రభుత్వం. ఆస్ట్రేలియా జంటయిన సూ, జాన్‌ బ్రియలీ– కుర్రాడిని దత్తు తీసుకుంటారు. సరూ నిజ జీవిత కథ అయిన, ‘ఎ లాంగ్‌ వే హోమ్‌’ నవలకి కథకుడు– తన అసలు పేరైన ‘షేరూ’ (సింహం) పలకడానికి నోరు తిరగని సరూయే. ఆ తరువాత, బ్రియలీ దంపతులు మానసిక సంతులనం లేని మాంతోష్‌ని దత్తు తీసుకుంటారు కానీ అతని ప్రస్తావన ఎక్కువ ఉండదు.

సరూకి మాతృదేశం గుర్తుండేలా, సూ– కొడుకు గదిలో అనాథాశ్రమంలో తీసిన అబ్బాయి ఫొటోతో పాటు ఇండియా మ్యాప్‌ కూడా పెడుతుంది. సరూ తన గత జీవితపు అస్పష్టమైన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకుంటాడు. ‘మరొక దేశానికి, సంస్కృతికి మారడం అంత కష్టం కాలేదు నాకు. ఇండియాలో నా జీవితంతో పోలిస్తే ఆస్ట్రేలియాలోనే చక్కగా గడిపాను. కాకపోతే, అమ్మీ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉండేది. అది అసాధ్యం అని తెలిసిన తరువాత, బతకాలంటే దొరికిన ప్రతీ అవకాశాన్నీ అందిపుచ్చుకోవాలని అర్థం అయింది’ అంటాడు. అతను హాస్పిటాలిటీ మానేజ్మెంట్‌ చదువుతున్నప్పుడు, గూగుల్‌ ఎర్త్‌ రిలీజ్‌ అవుతుంది. జ్ఞాపకం ఉన్న కొండగుర్తులతోనూ, తన ఇండియన్‌ క్లాస్మేట్స్‌ సహాయంతోనూ– ఇండియన్‌ రైల్వే లైన్ల పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ, శాటిలైట్‌ ఇమేజెస్‌ వెతుకుతాడు.

మధ్యప్రదేశ్‌లో ఉన్న ఖాండ్వా పక్కనున్న గణేష్‌ తలై తన పల్లె అని కనుక్కోడానికి ఆరేళ్ళు పడుతుంది. 2012లో సరూ తన ఊరు వస్తాడు. షేరూ తిరిగి వస్తాడన్న ఆశతో అమ్మీ ఊరు మారదు. సరూ అమ్మీకి ఇల్లు కొనిస్తాడు. ఇంటివారితో వీడియో చాట్లు చేస్తూ అనేకసార్లు ఇండియా వస్తూపోతాడు. ఆఖరికి, అతని ఇద్దరు తల్లులూ కలుసుకుంటారు. సరూ నవల చివర్న చెప్తాడు: ‘‘నా ఊరిని, కుటుంబాన్ని కనుక్కోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయితే, అది నా పాత జీవితానికి తిరిగి వెళ్ళడం కోసం కాదు. జీవితమంతా ఆస్ట్రేలియాలోనే గడిపాను. ఇక్కడ నాకు తెంచుకోలేని కుటుంబ బంధాలున్నాయి... నేనెవరో, ‘ఇల్లు’ అని దేన్ని పిలవాలో అన్నదాని గురించి నాకే అయోమయమూ లేదు. ఒక్క కుటుంబమూ లేని తప్పిపోయిన కుర్రాడిని. ఇప్పుడు నాకు రెండు కుటుంబాలు ఉన్నాయి, రెండు గుర్తింపులు కావు.

నేను సరూ బ్రియలీని.’’ సరూ జ్ఞాపకాలనీ, అతని వెతుకులాటనీ చూపిస్తూ, కథనం వెనక్కీ ముందుకీ మారుతుంటుంది. రచయిత సరూ బ్రియలీ కథ– సగం ప్రపంచాన్ని చుట్టివచ్చి, తన గతాన్ని తిరిగి చేజిక్కించుకుని, రెండు భిన్నమైన సంస్కృతులని తనవిగా చేసుకున్న అతని దృఢచిత్తం గురించినది. ఉద్విగ్నభరితంగా ఉండే పుస్తకం –పట్టుదల, ప్రయత్నాల కొదవ లేకపోయినప్పుడు దేన్నైనా సాధించవచ్చన్న ఆశ లేవనెత్తుతుంది. కథనం స్పష్టంగా, సరళంగా ఉంటుంది. ‘కుటుంబం అంటే ఏమిటి!’ అన్న ప్రశ్న పుస్తకమంతటా కనిపిస్తుంది. స్ఫూర్తిదాయకమైన బ్రియలీ ప్రయాణపు పుస్తకం, కట్టుకథకున్నంత ఆశ్చర్యాన్ని కనపరుస్తుంది. నవలని వైకింగ్‌ 2014లో పబ్లిష్‌ చేసింది. దీని ఆధారంగా తీసిన ‘లయన్‌’  సినిమా 2016లో వచ్చింది.
- కృష్ణ వేణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement