‘‘తలుపు! తలుపు!’’
తలుపు తెరవలేదు.
గదిలో గడియారం టింగుమని వొంటి గంట కొట్టింది.
‘‘ఎంత ఆలస్యం చేస్తిని? బుద్ధి గడ్డి తిన్నది. రేపట్నుంచి జాగ్రత్తగా వుంటాను. యాంటినాచల్లా పోయి సానిదాని పాట సరదాలో మనసు లగ్నమై పోయింది. ఒక్క పాట సరదాతోటి కుదరలేదు. పాడే మనిషి మీదిక్కూడా మనసు పరుగెత్తుతోంది. లేకుంటే, నేను పోకిరి మనిషిలాగ పాట ముగిసిందాకా కూర్చోవడమేమిటి? ఏదో వొక అవకాశం కలగజేసుకుని దానితో నాలుగు మాటలు ఆడడపు ఆసక్తి ఏమిటి? యిదుగో, లెంపలు వాయించుకుంటున్నాను. రేపట్నుంచి పాటకు వెళితే వొట్టు. మరి వెళ్లను. నిశ్చయం. గట్టిగా గాని పిలిస్తినట్టయినా కమలిని లేవగలదు. మెల్లిగా తలుపు తట్టి రాముణ్ని లేపగలిగితినా చడీ చప్పుడూ లేకుండా పక్కజేరి పెద్దమనిషి వేషం వెయ్యవచ్చు.
గోపాలరావు తలుపు చేతనంటగానే, రెక్క విడబారింది. ‘‘అరే యిదేమి చెప్మా!’’ అనుకొని తలుపు మెల్లిగ తెరిచేసరికి, నడవలో దీపం లేదు. పడకగది తలుపు తీసిచూస్తే దాన్లోనూ దీపం లేదు. చడీచప్పుడూ లేకుండా అడుగువేస్తూ మంచము దరికిపోయి, కమలిని మేలుకొని వున్నదా, నిద్రించుతున్నదా అని కనిపెట్ట ప్రయత్నించెను గాని, యేర్పరించ లేకపోయినాడు. బల్లమీద తడివి అగ్గిపెట్టె తీసి ఒక పుల్ల వెలిగించినాడు. మంచం మీద కమలిని లేదు. నిశ్చేష్టుడైపోయినాడు. చేతినుంచి అగ్గిపుల్ల రాలింది. గదినీ, అతని మనస్సునీ చీకటి కమ్మింది. వెఱి< శంకలూ, అంతకు వెఱి< సమాధానాలూ మనసున పుట్టుతూ గిట్టుతూ వ్యాకులత కలగజేశాయి. నట్టి వాకిట వచ్చి నిలబడ్డాడు. చుక్కల కాంతిని నౌకరుగానీ, దాసీగానీ కానరాలేదు.
తిరిగి గదిలోకి పోయి దీపం వెలిగించి, గది నాలుముఖాలా పరికించి చూశాడు. కమలిని ఎక్కడా కానరాలేదు. వీధి గుమ్మం దగ్గిరికి వెళ్లి తలుపు తెరిచి చూసేసరికి, చుట్ట కాలుస్తూ తల ఎత్తి ఆకాశం మీది చుక్కల్ని చూస్తూ రావుడు కనపడ్డాడు. ‘‘రామా!’’ అని పిలిచాడు. రావుడి గుండె జల్లుమంది; నోట్లో చుట్ట జారి కిందపడ్డది.
‘‘రా వెధవా!’’
కాలీడ్చుకుంటూ రావుడు దగ్గర కొచ్చాడు.
‘‘మీ అమ్మేదిరా?’’
‘‘మా యమ్మా బాబు? మా కొంపలున్నాది.’’
‘‘నీ అమ్మ కాదురా! నా భార్యరా.’’
ఆ మాటతో రావుడికి మతి పోయింది. ‘‘ఎక్కడుంటారు బాబూ? అమ్మగోరు గదిలో తొంగున్నారు బాబూ!’’
‘‘యింట్లో ఎక్కడా లేదురా, యిల్లు విడిచి నువ్వెక్కడికి పోయినావురా?’’
రావుడు మొహం ఓరజేసుకుని ‘‘నౌఖరోడికి కాల్నొస్తుంది, కడుపు నొస్తుంది బాబూ. పెద్దయ్యోరు మరీ మరీ అప్పసెప్పి ఎల్లినారు గందా, అమ్మగారి నొక్కర్నీ ఒగ్గేసి నిసి రాత్రేళ సానమ్మ గారి–’’
రావుడి వీపు మీద రెండు వీశ గుద్దులు పడ్డాయి.
‘‘సంపేసినారు బాబూ’’
గోపాలరావు దయగలవాడు. కోపం దిగజారి పశ్చాత్తాపం కలిగింది. వీపు నిమిరి, గదిలోకి తీసుకువెళ్లాడు. కుర్చీమీద తాను కూచుని ‘రామా ఏమాయెరా!’యని దైన్యంతోటి అన్నాడు.
రావుడు యీ తట్టూ, ఆ తట్టూ చూసి ‘‘ఏటో మాయలా ఉంది, బాబూ’’ అన్నాడు.
‘‘పుట్టింటిగ్గానీ వెళ్లివుండునా?’’
‘‘అంతోరు కారనా? కోపగించితే సెప్పజాల్నుగానీ, ఆడోరు సదువుకుంటే ఏటౌతది బాబూ?’’
‘‘విద్య విలువ నీకేం తెలుసురా’’ అని గోపాలరావు మోచేతులు బల్లపైన ఆనిచ్చి, ఆ నడుమ శిరస్సు వుంచి తలపోస్తూ ఉన్నంతలో, ముద్దులొలికే చేవ్రాలున్న వుత్తరవొకటి బల్లమీద కనపడ్డది. పైకి చదివాడు.
‘‘అయ్యా!
‘‘ప్రియుడా!’ పోయి ‘అయ్యా’ కాడికి వొచ్చిందా?’’
‘‘పెయ్య పోయిందా బాబూ?’’
‘‘మూర్ఖుడా! ఊరుకో.’’
‘‘అయ్యా! పది దినములాయె రాత్రుల నింటికి మీ రాకయే నే నెరుగను. మీటింగులకు బోవుచుంటిమంటిరి. లోకోపకారమునకై యుద్యమముల నిదురమాని చేయుచుంటిమంటిరి. నేనింట నుండుటను గదా మీరిన్ని కల్లలు పలుకవలసి వచ్చెను. మీచే దినదినము అసత్యమాడించుట కన్న మీ త్రోవకు అడ్డుగ నుండకుండుటయే, పతి మేలు కోరిన సతికి కర్తవ్యము కాదా? నేనీ రేయి కన్నవారింటికి చనియెద. సంతసింపుడు.’’
ఉత్తరం ముగించి, ‘‘నేను పశువును’’ అని గోపాలరావు అనుకున్నాడు.
‘‘అదేటి బాబూ, అలా శలవిస్తారు?’’
‘‘శుద్ధ పశువును’’
రావుడు అతి ప్రయత్నం చేత నవ్వు ఆపుకున్నాడు.
‘‘గుణవతి, విద్యవతి, వినయ సంపన్నురాలు, నా చెడుబుద్ధికి తగిన శాస్తి చేసింది.’’
‘‘అమ్మగారేటి సేసినారు బాబూ!’’
‘‘పుట్టింటికి వెళ్లిపోయింది– గాని, నీకు తెలియకుండా ఎలా వెళ్లిందిరా?’’
రావుడు రెండడుగులు వెనక్కి వేసి, ‘‘నా తొంగున్నాను కావాల బాబు! అలిగితే సెప్పసాల్ను గాని బాబు, ఆడదాయి సెప్పకుండా పుట్టినోరింటికి ఎల్తానంటే లెంపలోయించి కూకోబెట్టాలి గాని మొగోర్లాగా రాతలూ, కోతలూ మప్పితే ఉడ్డోరం పుట్టదా బాబూ?’’
‘‘ఓరి మూర్ఖుడా! భగవంతుడి సృష్టిలోకల్లా ఉత్కృష్టతమయిన వస్తువు విద్య నేర్చిన స్త్రీ రత్నమే. శివుడు పార్వతికి సగం దేహం పంచియిచ్చాడు కాదా. ఇంగ్లీషువాడు భార్యను ‘బెటర్ హాఫ్’ అంటాడు. అనగా పెళ్లాం మొగుడికన్న దొడ్డది అన్నమాట. బోధపడ్డదా?’’
‘‘నాకేం బోధకాదు బాబు?’’ రావుడికి నవ్వు ఆచుకోవడం అసాధ్యం కావచ్చింది.
‘‘నీ కూతుర్ని బడికి పంపిస్తున్నాం కదా, విద్య యొక్క విలువ నీకే బోధపడుతుంది. మీ వాళ్లకంటే అప్పుడే దానికి ఎంత నాగరికత వొచ్చిందో చూడు. ఆ మాట అలా వుణ్ణియ్యిగాని, యిప్పుడు నువ్వో నేనో వెంటనే బయల్దేరి చెంద్రవరం వెళ్లాలి. నే వెళ్డానికి శెలవు దొరకదు. నువ్వు తాతల నాటి నౌఖరువి. నీ మీద కమలినికి యిష్టం. గనక నువ్వే వెళ్లడం మంచిది.’’
‘‘శలవైతే యెలతాను. ఆర్రానంటే–’’
‘‘యింద పది రూపాయలు. బతిమాలి తీసుకొస్తివట్టాయనా, మరి పది రూపాయలిస్తాను.’’
‘‘సిత్తం.’’
‘‘ఐతె, యేవిటి చెప్పాలో తెలుసునా?’’
‘‘యేటా బాబూ? సెప్పకుండా లేసి రావడం మా మంచి పని సేసినారమ్మా. బాబు నా యీపు పగలేసినారు. రండి రండమ్మా అని సెప్తాను.’’
‘‘నన్ను క్షమించి దెబ్బ మాట మర్చిపో. కమలినితో ఎన్నడూ దెబ్బల మాట చెప్పబోకు. ఈమాట జ్ఞాపకం ఉంచుకుంటావు గదా?’’
‘‘సిత్తం’’
‘‘నువ్వు కమలినితో చెప్పవలసిన మాటలేవో చెబుతాను. బాగా చెవొగ్గి విను... పంతులికి బుద్ధి వొచ్చిందను...’’
‘‘అదేటి బాబు!’’
‘‘నీకెందుకు? నే అన్న మాట గట్టిగా జ్ఞాపకం వుంచుకుని చెప్పు. పంతులికి బుద్ధి వొచ్చింది అను. యిటుపైని ఎన్నడూ, రాత్రిళ్లు యిల్లు కదలరు. ఇది ఖరారు. తెలిసిందా?’’
రావుడు తల వూపాడు.
‘‘ఇంకా ఏవిటంటే, గెడ్డం పట్టుకుని బతిమాలుకున్నానని చెప్పమన్నారు. దయదల్చి పంతుల లోపాలు బయట పెట్టొద్దన్నారు. (ఇది ముఖ్యమైన మాట. విన్నావా?) మీరు దగ్గర లేకపోవడం చేత వెఱె<త్తినట్టున్నారు. గడియో యేడు లాగ గడుపుతున్నారు. (యీ మాట మరవగలవు జాగర్త.) యేం చెప్పాలో తెలిసింది గదా? ఒక్కమాటైనా మరచిపోకు.’’
‘‘తెలిసింది బాబూ.’’
‘‘యేం చెబుతావో నాకోమాటు చెప్పు.’’
రావుడు తల గోక్కుంటూ, ‘‘యేటా– యేటా– అదంత నాకేం తెల్దు బాబూ. నేనంతాను... అమ్మా నా మాటినుకోండి. కాలం గడిపినోణ్ణి– పిన్నల్ని సూసినాను, పెద్దల్ని సూసినాను, యిన్నారా? ఆడోరు యజమాని సెప్పినట్టల్లా ఇని వల్లకుండాల. లేకుంటే, పెద్ద పంతులోర్లాగా సిన్న పంతులోరు కూడ సెడిపోతారు. మీ శెవుల్లో మాట. పట్టంలోకి బంగారం బొమ్మలాంటి సానెమ్మోరొస్సినారు. ఆ సానెమ్మోర్ని సూసినకాణ్ణుంచీ పంతులు మనసు, మనసులా నేదు. నా మాటిని రండి. లేకుంటే మీ సిత్తం, అంతాను.’’
‘‘ఓరి వెధవా!’’ అని గోపాలుడు కోపంతో కుర్చీ మీంచి ఉరికాడు.
తప్పించుకుని రావుడు ఊసలాగ గది పైకి దాటాడు.
అంతలో మంచం కింద నంచి అమృతం వొలికే కలకల నవ్వూ, మనోహరిౖయెన నూపురముల రొద, విననయ్యెను.
కొత్త సంవత్సరం దిద్దుబాటుకు ఒక అవకాశం.
Published Mon, Dec 31 2018 12:14 AM | Last Updated on Mon, Dec 31 2018 12:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment