సాహిత్య మర్మరాలు
ఒక రోజున సంస్కృత కవి దిగ్గజాలైన దండి, భవభూతి, కాళిదాసు– ముగ్గురూ రాజవీథిలో నడచి వెళుతూ ఉన్నారు. మాటల మధ్య ‘మన ముగ్గురిలో ఎవరు ఎవరి కంటే ఎంత గొప్పవారు?’ అన్న మాట వచ్చింది. ‘ఈ విషయాన్ని గురించి మనలో మనం మాట్లాడుకోవటమెందుకు? అమ్మవారినే అడుగుదాం రండి!‘ అన్నాడు కాళిదాసు. ముగ్గురూ దగ్గరలోనే ఉన్న సరస్వతీదేవి ఆలయానికి వెళ్లారు. కాళిదాసు అమ్మవారిని స్తుతించాడు. అమ్మ ప్రత్యక్షమైంది. కాళిదాసు భక్తిపురస్సరంగా ఆమెకు నమస్కారం చేసి ‘అమ్మా! మాలో ఎవరు గొప్పవారు?’ అని అడిగాడు.
శారదాదేవి చిద్విలాసంగా నవ్వి, ‘కవిర్దండీ కవిర్దండీ, భవభూతిస్తు పండితః– దండి ముమ్మాటికీ మహాకవి. భవభూతి అచ్చమైన పండితుడు’ అన్నది. ఆ తీర్పును విన్న కాళిదాసు అపరిమితమైన ఆగ్రహంతో ‘కోహం రండే?– అట్లా ఐతే మరి నేనెవరినే?’ అని అడిగాడు. భారతీదేవి ప్రశాంతంగా నవ్వి, ‘త్వమేవాహం త్వమేవాహం న సంశయః – నాయనా! వీరిద్దరితో నీకు పోలిక ఎందుకోయీ? అతడు కవి. ఇతడు పండితుడు. నేను అరవై నాలుగు కళలకు అధిష్ఠాన దేవతను. నీవే నేను. నీవే నేను. ఇందులో సందేహ మెంత మాత్రమూ లేదు’ అన్నది. ఆ నిర్ణయాన్ని విన్న ఆ ముగ్గురు మహాకవులు అమ్మకు అంజలి ఘటించారు.
దండి, భవభూతి, కాళిదాసులకు సంబంధించి ప్రచారంలో ఉన్న వృత్తాంత మిది.
-డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణ మూర్తి
Comments
Please login to add a commentAdd a comment