ఒకరోజు ఎదురుచూపు | One Day Waiting For She | Sakshi
Sakshi News home page

ఒకరోజు ఎదురుచూపు

Published Mon, Oct 14 2019 4:31 AM | Last Updated on Mon, Oct 14 2019 4:31 AM

One Day Waiting For She - Sakshi

మేమింకా మంచంలోనే ఉన్నాం అప్పటికి. వాడు వస్తూనే గదిలోని కిటికీలన్నీ మూసేశాడు. అనారోగ్యంగా కనిపించాడు. ఒళ్లు వణుకుతోంది, ముఖం పాలిపోయివుంది. నడుస్తుంటే  నొప్పిగా ఉన్నప్పటికీ నెమ్మదిగా అడుగులు వేశాడు.‘ఏమైంది షట్స్‌?’‘నాకు తలనొప్పిగా ఉంది.’‘నువ్వు కాసేపు పడుకుంటే బాగుంటుంది.’‘ఏం ఫర్లేదు.’‘నువ్వెళ్లి పడుకో. నేను డ్రెస్‌ మార్చుకుని వస్తాను.’కానీ నేను కిందికి దిగేప్పటికి వాడు డ్రెస్‌ చేసుకుని, మంట పక్కన కూర్చున్నాడు. తొమ్మిదేళ్ల పిల్లాడు జబ్బుతో నీరసంగా ఉన్నాడు. నుదుటి మీద చేయి వేస్తే జ్వరంగా ఉందని తెలుస్తోంది.‘కాసేపు పడుకో, నీకు బాలేదు’ అన్నాను.‘నాకు బానేవుంది’ అన్నాడు వాడు.డాక్టర్‌ వచ్చాక వాడి ఉష్ణోగ్రత చూశాడు.‘ఎంతుంది?’ అడిగాను.‘నూటా రెండు.’డాక్టర్‌ మూడు రంగుల్లో ఉన్న మూడు రకాల గోళీలు ఇచ్చి, ఎలా వేయాలో చెప్పాడు. ఒకటి జ్వరం తగ్గడానికి, ఇంకోటి విరేచనం సాఫీగా కావడానికి, మరొకటి కడుపులో మంట ఏమైనా ఉంటే పోవడానికి.కడుపులో ఆమ్లగుణం ఉన్నప్పుడే ఇన్‌ఫ్లూయెంజా క్రిములు బతుకుతాయని చెప్పాడు డాక్టర్‌. చూస్తుంటే ఆయనకు ఇన్‌ఫ్లూయెంజా గురించి సమస్తం తెలిసినట్టు అనిపించింది. జ్వరం నూటా నాలుగు డిగ్రీలకు మించనంతవరకు భయపడవలసింది ఏమీలేదన్నాడు.కొద్దికొద్దిగా వ్యాపిస్తున్న ఫ్లూ ఫలితం ఇది, నిమోనియా రాకుండా చూసుకుంటే ప్రమాదం ఏమీలేదు అన్నాడు. వాడి ఉష్ణోగ్రత ఎంతుందో నోట్‌ చేసి, ఏ మందు ఏ టైముకు వేసుకోవాలో రాసిపెట్టాను.‘నీకోసం నన్ను ఏదైనా చదవమంటావా?’
 
‘నీ ఇష్టం’ అన్నాడు వాడు. వాడి ముఖం పాలిపోయివుంది, కళ్లకింద నల్లటి చారలు ఏర్పడ్డాయి. మంచం మీద పడుకున్నాడు. చుట్టూ జరుగుతున్నదానికి పట్టనట్టుగా కనబడ్డాడు. హొవార్డ్‌ పైల్‌ సముద్రపు దొంగల పుస్తకం గట్టిగా చదివాను. కానీ వాడు దానిమీద మనసు పెట్టి వింటున్నట్టు అనిపించలేదు.‘ఇప్పుడేమనిపిస్తోంది షట్స్‌’ అని అడిగాను.‘ఇందాకటిలాగే ఉంది’ అన్నాడు.వాడికి తరువాతి మాత్ర వేసే సమయం కోసం వేచి చూస్తూ, వాడి కాళ్ల దగ్గర కూర్చుని కాసేపు పుస్తకం నాది నేను చదువుకున్నాను. ఇట్లాంటి సమయంలో వాడు నిద్ర పోవడం సహజం. కానీ నేను మళ్లీ తలెత్తేప్పటికి వాడు నా వైపే వింతగా చూస్తూవున్నాడు.‘కొద్దిసేపు నిద్రపో నానా, నేను మందు వేసుకోవడానికి లేపుతాన్లే.’‘నేను పోను.’కాసేపుండి అన్నాడు నాతో, ‘నీకు విసుగ్గా వుంటే, నా దగ్గర కూర్చోనక్కర్లేదు నానా.’‘నాకెందుకు విసుగ్గా వుంటుందిరా?’‘అంటే, ఇబ్బందిగా ఉండేట్టయితే కూర్చోనక్కర్లేదు అంటున్నా.’జ్వరం వల్ల ఉండే చపలచిత్తంతో అట్లా మాట్లాడుతున్నాడేమో అనిపించి, వాడికి పదకొండింటికి వేయాల్సిన గోళీ వేసి, కాసేపు బయటికి వెళ్లాను.బయట తేటగా, చల్లగా ఉంది. నేల మీదంతా కురిసి గడ్డ కట్టుకుపోయిన సన్నటి మంచు వల్ల   చెట్లు, పొదలు, కుప్పేసిన కలప మెరుపు పూత పూసినట్టుగా కనబడుతున్నాయి. నా ఐరిష్‌ సెట్టర్‌ను కూడా నడకకు తీసుకెళ్లాను. కాసేపు రోడ్డు మీదా, కాసేపు గడ్డకట్టిన కయ్య పక్కనా నడిచాం. కానీ దాని మీద నిలబడటానికిగానీ నడవడానికీ గానీ కష్టంగా ఉంది. ఎర్ర కుక్క తొట్రుపడింది, జారింది, రెండు సార్లు కింద పడింది, ఓసారి దెబ్బ గట్టిగానే తాకించుకుంది, ఇంకోసారి నా తుపాకీని కింద పడగొట్టి మంచు మీద జారుతూపోయేట్టు చేసింది. పొదల్లోంచి మేము ఓ పూరేళ్ల గుంపును లేవగొట్టి, అవి ఒడ్డు వెంబడి కనబడకుండా పోయేలోపల రెండింటిని వేటాడాం. గుంపులోంచి కొన్ని చెట్లమీదకు ఎక్కాయి, కొన్ని కట్టెల మండెల్లోకి మాయమైనాయి, కొన్ని పొదల్లోకి చెల్లాచెదురైనాయి.

స్థిరంగా నిల్చోవడానికి కష్టంగా ఉండటంతో గురి కుదరలేదు. రెండింటిని కాల్చాం, ఐదింటి గురి తప్పాం. కానీ తిరిగి వస్తుండగా ఇంటికి దగ్గరలోనే మరో పూరేళ్ల గుంపు కనబడి సంతోషం వేసింది, మరో రోజు వెతకడానికి కావాల్సినన్ని మిగిలేవున్నాయి.ఇంటికెళ్లేసరికి పిల్లాడు ఎవరినీ గదిలోకి రావద్దు అన్నాడని తెలిసింది. ‘మీరెవరూ రావడానికి వీల్లేదు, నాకున్నది మీకూ అంటుకుంటుంది’ అన్నాడట.నేను పైకి వెళ్లేసరికి వాడిని ఎలా పడుకోబెట్టి వెళ్లానో అలాగే కదలకుండా ఉన్నాడు మంచంలో. అదే పాలిపోయిన ముఖం. చెంపలు మాత్రం జ్వరంతో ఎర్రబారివున్నాయి. రెప్పలు కదల్చకుండా మంచం కాళ్లవైపు చూస్తున్నాడు, ఇందాకటిలాగే. మరోసారి ఉష్ణోగ్రత చూశాను.‘ఎంతుంది?’‘నూటికి దగ్గర’ అన్నాను. నూటా రెండు పాయింట్‌ నాలుగు ఉంది.‘నూటా రెండు’ అన్నాడు వాడు.‘ఎవరన్నారు?’‘డాక్టర్‌.’‘మరీ ఎక్కువేమీ లేదు, భయపడనక్కర్లేదు.’‘నేనేం భయపడట్లేదు, కానీ మళ్లీ మళ్లీ అదే గుర్తుకు వస్తోంది’ అన్నాడు.‘ఎక్కువ ఆలోచించొద్దు, తేలిగ్గా తీసుకో’.‘నేను తేలిగ్గానే తీసుకుంటున్నాను’ అని నిటారుగా చూశాడు. దేన్నో నాకు తెలియకుండా వాడు దాస్తున్నాడు.‘ఇది వేసుకుని కొన్ని నీళ్లు తాగు.’‘దీని వల్ల నిజంగా నయం అవుతుందంటావా?’‘తప్పకుండా అవుతుంది.’నేను మళ్లీ మంచం మీద కూర్చుని, ఇందాకటి సముద్రపు దొంగలు పుస్తకం చదువుదామని చూశాను. కానీ వాడు దృష్టిపెట్టడం లేదని మానుకున్నాను.‘నేను ఏ టైము వరకు చచ్చిపోతానంటావ్‌?’ అడిగాడు వాడు.‘ఏంటి?’‘నేను చచ్చిపోవడానికి ఇంకా ఎంత సేపుంది?’

‘నీకేమీ కాదు. ఏమైంది నీకు?’‘నాకు తెలుసు, నేను చచ్చిపోతాను. డాక్టర్‌ నూటా రెండు అని చెప్పడం నేను విన్నాను.’‘నూటా రెండు జ్వరానికి మనుషులు ఎవరూ చచ్చిపోరు. పిచ్చి మాటలు మాట్లాడకు.’‘నాకు తెలుసు, చచ్చిపోతారు. ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు మా స్కూల్లో నా స్నేహితులు అన్నారు, నలభై నాలుగు డిగ్రీలు దాటితే అంతేనట, మరి నాకుందేమో నూటా రెండు.’వాడు ఈ రోజంతా,పొద్దున తొమ్మిదింటినుంచీ ఎప్పుడు చచ్చిపోతానా అని ఎదురుచూస్తున్నాడు.‘ఒరే పిచ్చి కన్నా, నా పిచ్చి బంగారం. అది మైళ్లు, కిలోమీటర్ల లాంటిది. నువ్వు చనిపోవు. ఆ థర్మామీటర్‌ వేరే. దాన్లో ముప్పై ఏడు సాధారణం. ఇలాంటిదాన్లో తొంభై ఎనిమిది.’‘నిజంగానా?’‘నిజంరా. మైళ్లు, కిలోమీటర్ల లాగే. ఇప్పుడు చెప్పు, మన కార్లో డెబ్బై ప్రయాణించామంటే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది?’‘ఓ’ అన్నాడు. నెమ్మదిగా మంచం కాళ్ల వైపు సారించిన వాడి చూపు తీక్షణత తగ్గింది, వాడి శరీరపు బిర్రు తగ్గింది. తెల్లారేసరికి పూర్తిగా మామూలైపోయాడు. ఏ ప్రాధాన్యతా లేని చిన్న చిన్న విషయాలకోసం కూడా మళ్లీ అల్లరి చేయడం మొదలుపెట్టాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement