
సురవరం ప్రతాపరెడ్డి ఒకసారి విశ్వనాథ సత్యనారాయణకు కొంత ఆర్థిక సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఆయనను ఒక సంస్థానాధీశురాలి దగ్గరికి తీసుకెళ్లారు. నాడు సంస్థానాధీశులకు సివిల్, క్రిమినల్ అధికారాలు ఉండేవి. నాటి మర్యాదలను అనుసరించి ఆమె పరదాకు ఆవైపు, ఇవతలివైపు విశ్వనాథ కూర్చున్నారు.
‘‘మీరు చాలా సంప్రదాయికులనీ, మంచి కవిత్వం వ్రాస్తారనీ విన్నాను. కానీ మీరు ‘సాని’ పాటలు కూడా వ్రాశారేమిటండీ?’’ అని ప్రశ్నించిందామె.
ఆమె తన ‘కిన్నెరసాని’ పాటలను గూర్చి అడుగుతున్నదని విశ్వనాథకు అర్థమైంది. ‘‘అమ్మా! అది ఈ ప్రాంతంలో ఒక వాగు పేరు. ఆ పేరుతో పాటలు వ్రాశానే గాని, వాటిల్లో ఎలాంటి అశ్లీలమూ లే’’దని ఎంతచెప్పినా ఆమె వినిపించుకోలేదు. ‘మీరు ఎన్నైనా చెప్పండి సాని సానే’ అని ముక్తాయించింది. ఇది విశ్వనాథ అహాన్ని దెబ్బ తీసింది. ‘‘అమ్మా, ఇందాకటినుంచీ పనివాళ్లు మిమ్మల్ని దొరసానీ! అని పిలుస్తున్నారు గదా, దాని సంగతేవిటి? ఇక వస్తాను, సెలవు’’ అని లేచి వచ్చేశారు.
ఇది చూస్తున్న ప్రతాపరెడ్డి, ‘‘ఎంతపని చేశావయ్యా, ఆమె కోపిస్తే ఏమైనా చేయవచ్చు’’ అన్నారట. అందుకు విశ్వనాథ, ‘‘ఆ ఏం చేస్తుంది, చంపుతుందా? నిజం చెప్పడానికి భయపడటం కన్నా చావడమే నయం’’ అన్నారట. అప్పుడు ప్రతాపరెడ్డి నవ్వుతూ, ‘‘ఏది ఏమైనా మీరీ వేళ నూటపదహార్లు పోగొట్టుకున్నారు’’ అన్నారట.
అందుకు విశ్వనాథ ‘‘నా అభిమానాన్ని మాత్రం పోగొట్టుకోలేదు, అదే నాకు పదివేలు’’ అన్నారట.
(పురాణం ‘విశ్వనాథ ఒక కల్పవృక్షం’ ఆధారంగా)
డి.వి.ఎం.సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment