Suravaram Pratap Reddy
-
తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు!
సాక్షి, హైదరాబాద్: అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సుర వరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలుగు భాషకు, పత్రికా రంగానికి సురవరం ప్రతాప్‌రెడ్డి ఎంతో సేవ చేశారని, తెలంగాణ పోరాటంలో సైతం పాల్గొన్నారని కొనియాడారు.సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు ద్వారా ఆ పార్టీ మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి.. శుక్రవారం శాసనసభలో విజ్ఞాపన లేఖను అందించగా, దానిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. పోలీసులు, సెక్యూరిటీ గార్డులు విధి నిర్వహణలో గంటల తరబడి నిలబడి ఉండాల్సి వస్తోందని, తమిళనాడు తరహాలో వారికి కూర్చునే అవకాశం కల్పించాలని సుధాకర్‌రెడ్డి చేసిన మరో విజ్ఞప్తి అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. మేం గతంలోనే నిర్ణయం తీసుకున్నాం: కేటీఆర్తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టడానికి తాము మద్దతిస్తున్నట్టు బీఆర్ఎస్ సభ్యుడు కె.తారక రామారావు తెలిపారు. వాస్తవానికి దీనిపై తాము గతంలోనే నిర్ణయం తీసుకున్నామని, అయితే పదేళ్ల వరకు వర్సిటీ విభజన జరగకపోవడంతో అప్పట్లో సాధ్యం కాలేదని చెప్పారు. రూ.5 కోట్లతో దేశోద్ధారక భవనంలో సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు మీద ఆడిటోరియాన్ని బాగు చేశామని తెలిపారు. ఆయనపై గౌరవంతో 394 మంది కవులతో గోల్కొండ కవుల సంచిక కూడా తెచ్చామన్నారు. అత్యుత్తమ క్రీడా పాలసీ రూపొందిస్తాంరాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి వచ్చే శాసనసభ సమావేశాల్లో నూతన క్రీడా పాలసీని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. చదువులోనే కాదు..క్రీడల్లో రాణించినా ఉన్నతోద్యోగం వస్తుందని, కుటుంబ గౌరవం పెరుగుతుందనే సందేశం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిని రుజువు చేసేందుకే క్రీడాకారులు నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌కు గ్రూప్–1 (డీఎస్పీ) ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నియామకాల క్రమబద్ధీకరణ, సిబ్బంది, వేతనాల హేతుబద్ధీకరణ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు సీఎం సమాధానమిచ్చారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి వీలుగా ఈ చట్ట సవరణ చేస్తున్నామని, సిరాజ్ ఇంటర్మీడియెట్ మాత్రమే చదివినా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు.అత్యధిక మంది క్రీడాకారులను తయారు చేస్తున్న హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న క్రీడా పాలసీలపై అధ్యయనం చేసి అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తామని పేర్కొన్నారు. ఏ స్థాయి క్రీడల్లో ఏ మేరకు రాణిస్తే/ఏ మెడల్ సాధిస్తే ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి? ఎంత ఆర్థిక సహాయం చేయాలి? ఎంత స్థలం కేటాయించాలి? వంటి అంశాలు కొత్త పాలసీలో ఉంటాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో క్రీడలకు రూ.321 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. యువత వ్యసనాలు వీడేలా..మండల కేంద్రాల్లో భూములు అందుబాటులో ఉంటే మినీ స్టేడియం నిర్మిస్తాం. ప్రస్తుతం మాదాపూర్‌లోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ను బ్యాగరికంచె (మీర్ఖాన్పేట)కు తరలిస్తాం. అక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించడానికి బీసీసీఐతో చర్చిస్తే సానుకూలంగా స్పందించింది. కొద్దిరోజుల్లోనే భూమిని కేటాయిస్తాం. రాష్ట్రంలోని యువతను వ్యసనాల బాట నుంచి తప్పించడానికి క్రీడలను వాడుకుంటాం. హైదరాబాద్‌లో గతంలో నిర్మించిన సరూర్‌నగర్, ఎల్బీనగర్ స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయి. వీటన్నింటినీ అప్‌గ్రేడ్ చేసి విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు ఉపయోగిస్తాం..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.ఎమ్మెల్యేల క్రీడా పోటీలను పునరుద్ధరిస్తాంశాసనసభ్యులకు నిర్వహించే క్రీడా పోటీలను పునరు ద్ధరించనున్నట్లు రేవంత్ వెల్లడించారు. శాసనసభలో క్రీడలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మ డి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏటా బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యుల క్రీడాపోటీలు జరిగేవని గుర్తు చేశారు. పదేళ్లుగా క్రీడా స్ఫూర్తి లేకుండా పోయింద న్నారు. వచ్చే సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య క్రీడాపోటీలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలి పారు. అన్ని పార్టీలతో ఓ కమిటీని ఏర్పాటు చేసి, క్రీడా పోటీల నిర్వహణకు కృషి చేయాలని స్పీకర్‌ను కోరారు. -
దొరసాని – కిన్నెరసాని
సురవరం ప్రతాపరెడ్డి ఒకసారి విశ్వనాథ సత్యనారాయణకు కొంత ఆర్థిక సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఆయనను ఒక సంస్థానాధీశురాలి దగ్గరికి తీసుకెళ్లారు. నాడు సంస్థానాధీశులకు సివిల్, క్రిమినల్ అధికారాలు ఉండేవి. నాటి మర్యాదలను అనుసరించి ఆమె పరదాకు ఆవైపు, ఇవతలివైపు విశ్వనాథ కూర్చున్నారు. ‘‘మీరు చాలా సంప్రదాయికులనీ, మంచి కవిత్వం వ్రాస్తారనీ విన్నాను. కానీ మీరు ‘సాని’ పాటలు కూడా వ్రాశారేమిటండీ?’’ అని ప్రశ్నించిందామె. ఆమె తన ‘కిన్నెరసాని’ పాటలను గూర్చి అడుగుతున్నదని విశ్వనాథకు అర్థమైంది. ‘‘అమ్మా! అది ఈ ప్రాంతంలో ఒక వాగు పేరు. ఆ పేరుతో పాటలు వ్రాశానే గాని, వాటిల్లో ఎలాంటి అశ్లీలమూ లే’’దని ఎంతచెప్పినా ఆమె వినిపించుకోలేదు. ‘మీరు ఎన్నైనా చెప్పండి సాని సానే’ అని ముక్తాయించింది. ఇది విశ్వనాథ అహాన్ని దెబ్బ తీసింది. ‘‘అమ్మా, ఇందాకటినుంచీ పనివాళ్లు మిమ్మల్ని దొరసానీ! అని పిలుస్తున్నారు గదా, దాని సంగతేవిటి? ఇక వస్తాను, సెలవు’’ అని లేచి వచ్చేశారు. ఇది చూస్తున్న ప్రతాపరెడ్డి, ‘‘ఎంతపని చేశావయ్యా, ఆమె కోపిస్తే ఏమైనా చేయవచ్చు’’ అన్నారట. అందుకు విశ్వనాథ, ‘‘ఆ ఏం చేస్తుంది, చంపుతుందా? నిజం చెప్పడానికి భయపడటం కన్నా చావడమే నయం’’ అన్నారట. అప్పుడు ప్రతాపరెడ్డి నవ్వుతూ, ‘‘ఏది ఏమైనా మీరీ వేళ నూటపదహార్లు పోగొట్టుకున్నారు’’ అన్నారట. అందుకు విశ్వనాథ ‘‘నా అభిమానాన్ని మాత్రం పోగొట్టుకోలేదు, అదే నాకు పదివేలు’’ అన్నారట. (పురాణం ‘విశ్వనాథ ఒక కల్పవృక్షం’ ఆధారంగా) డి.వి.ఎం.సత్యనారాయణ -
ఉంటే కర్ర నీదే బర్రె
ఒకనాడు ఒక పల్లెకాపు పదకొండు సొరకాయలను కంబట్లో వేసుకొని ఒక గ్రామానికి అమ్ముకొనేదానికి వెళ్లినాడు. గ్రామంలో అమ్మలక్కలు పదిమంది మూగి బేరంచేస్తూ వున్నారు. అంతలో మాలీపటేల్ వేంచేసినాడు. ‘‘ఒరేయ్! ఈడ కూర్చోమని నీకెవరు సెలవిచ్చినారు? మంచి మాటతో ఒక కాయ ఇచ్చిపో’’ అంటూ ఒక పెద్ద కాయను లాగుకొని పోయినాడు. కాపువాడు గొణుక్కుంటూ ఉన్నాడు. గోరుచుట్టు మీద రోకటి పోటన్నట్లుగా పోలీసు పటేలు హాజరైనాడు. ‘‘పట్టుకొని రారా వాణ్ని. ముసాఫిర్ల లెక్కలో వానిపేరు రాయాల్సింది వుంది’’ అని గర్జించినాడు. తలారి వచ్చి తనపాలి ఒక కాయ, పటేలు పాలిటి ఒక కాయ లాగుకొని పోయినాడు. కొంతసేపటికి పెద్ద తలారి వచ్చినాడు. ‘‘ఏయ్, మొన్న నీవంటివాడే వచ్చిండెను. పొద్దు మునిగినప్పుడు కూరగాయ లమ్మునట్లు అమ్మి రాత్రి కోమటోళ్ల యింట్లో కన్నం వేసిండు. పద! చావిట్లో నిన్ను కట్టేస్తాన్’’ అంటూ తానున్నూ ఒక కాయ చేతబట్టుకున్నాడు. ఈ విధంగా పూజారి, పురోహితుడు, కమ్మరి, వడ్ల మొదలైన పదకొండు మంది ఆయగాండ్లు ఒకరి వెనుక ఒకరు వచ్చి కాయలన్నీ లాగుకొని పోయినారు. కాపు ఏడ్చుకుంటూ గొంగడి దులుపుకొని లేస్తున్నాడు. చీకట్లోనే చేనికి పోయినట్టి కర్ణమయ్య అప్పుడే ప్రత్యక్షమైనాడు. ‘‘ఏమిరా ఏడుస్తున్నావు? నిన్నెవరేమన్నారు చెప్పు. తప్పు చేసినోనికి శిక్ష యిప్పిస్తాను’’ అన్నాడు. న్యాయం విచారించే ప్రభువు ఒక్కడైనా ఈ వూరిలో వున్నాడురా నారాయణా అనుకొని కాపు తన పదకొండు సొరకాయలు మాయమైన విధమంతా వినిపించి ‘‘అయ్యా నన్నెట్లన్నా గడ్డ కేయండి’’ అని గొంగడి ఆయన కాళ్లమీద వేసి కాళ్లు పట్టుకొన్నాడు. కర్ణం ఝాడించి తన్ని కంబలి చంకబెట్టుకొని, ‘‘అరే లుచ్ఛా! అందరికీ యిచ్చి నా వంతు తప్పించినావా? నేను తలారివానికంటే పనికిరానివాణ్నా? నా వంతు సొరకాయ యిచ్చి యీ గొంగడి తీసుకుపో’’ అని యింటికి పోయినాడు. కాపు ‘‘నా వంటి దిక్కులేనివారు బతికేదెట్లా’’ అని చిన్న పిల్లవానివలె కొంతసేపు ఏడ్చినాడు. ఒకరిద్దరు ఆడవారు ‘‘పో నాయనా! పొద్దున్నే ఎవరి ముఖం చూచినావో. యీ వూళ్లో అందరూ ఇట్లాంటి మారాజులే. ఇంకోమారు రావద్దు’’ అని బుద్ధి చెప్పినారు. కాపు దీర్ఘాలోచన చేస్తూ ఇంటిబాట పట్టినాడు. ‘‘థూ, దీనికి బదలా తీయకుంటే నేను మనిషినా? అయితే బీదోన్ని ఏమి చేయగలను? దేవునికైనా దెబ్బే గురువు. నేనున్నూ ఏదో మొండి తొండి చేస్తా’’ ఇట్లా ఆలోచనలో మునిగి నడుస్తున్నాడు. తన మోటబావిని సమీపించినాడు. బావిగడ్డపై కూర్చున్నాడు. తటాలున ఒక మెరుపు మెరిసినట్లా వాని తలలో ఆలోచన తళుక్కుమంది. చటుక్కున లేచినాడు. ఊళ్లోకి పోయినాడు. చక్కగా పెండ్లాం వద్దకు వెళ్లి ‘‘ఒసేయి! నీ వంకి ఇట్లా తే. ఇయ్యమంటే! నీకేం ఫర్వాలేదు. మళ్లీ వుగాది నాటికి ఒకటికి నూరు వంకీలు చేయిస్తే నా పేరు వెంకయ్య అను’’ అని వంకీని లాగుకున్నాడు. పటేలుకు దాన్ని 200 రూపాయలకు అమ్మినాడు. పైకం తీసుకొని 10 మైళ్ల దూరంలో వుండే పట్నం చేరుకున్నాడు. షేర్వానీలు, లాగులు, మోజాలు, పగిడీ, నడుముపట్టి, బిల్లలు మొదలైనవి సిద్ధము చేసుకొన్నాడు. నలుగురు అరబ్బు జవానుల జతచేసుకున్నాడు. వారికి బిల్లలను తగిలించినాడు. తానున్నూ బాగా వేషం వేసుకొన్నాడు. ఒక బగ్గీని కిరాయకు మాట్లాడుకొన్నాడు. రెండామడ దూరంలో ఒక పెద్ద బస్తీ ఉండింది. అది నాలుగు బాటలు కలిసే స్థలం. గొప్ప వ్యాపారి పేట. అధికారులు, మంత్రి, నవాబు కూడా ఆ మార్గంగా షికారుకు పొయ్యే స్థలం. ఆ గ్రామంలో మన కాపు దిగినాడు. ఊరబావి గట్టున ఒక పెద్ద మర్రి మానుండింది. దానికింద మేజు కుర్చీలు వేయించినాడు. జవానులను బావిపై పహిరా ఎక్కించినాడు. ప్రొద్దున్నే ఊరులోని ఆడువారు నీటికి వస్తే ఆ జవానులు ‘‘ఖబర్దార్, కడవకొక పైసా యిచ్చి నీళ్లు తీసుకోండి’’ అని బెదిరించినారు. పటేలు పట్వారీ వచ్చినారు. ‘‘ఒరేయ్! మాకు సర్కారు హుకుం అయింది. ఇదిగో ఫర్మాన్’’ అని ఉర్దూ ముద్రలతోనుండే ఫర్మాను చూపించినాడు కాపు. ఉండవచ్చునని గ్రామాధికారు లూరకైనారు. దినమున్నూ పైకం బాగా వసూలు కాబట్టింది. మొదట దినం 20 రూపాయల వరకు వసూలైంది. క్రమేణా ఎక్కువైంది. ‘మర్రిమాన్ పరగణా సుంకం’ చుట్టూ రెండామడ వరకు ప్రసిద్ధి అయిపోయింది. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచినవి. ఒకనాడు సుబేదారు దౌరా వచ్చి గుడారాలు వేయించినాడు. అతని నౌకరు నీటికి పోతే ‘‘పైసా లావ్’’ అన్నారు జవానులు. వారు ఉత్త కడవలతో వాపసు పోయి ‘‘సర్కార్! నల్గురు అరబ్బీ జవానులు పైసా యియ్యంది నీళ్లు తీసుకోనివ్వరు. అరే సుబేదార్ సర్కారు వారికిరా అంటే జంబియాలతో పొడిచేదానికే పైబడవస్తారు సర్కార్!’’ అని విన్నవించుకొన్నారు. అక్కడనే సేవలో ఉన్న పటేలు పట్వారీ లిట్లన్నారు: ‘‘హుజూర్! పందేండ్ల నుండి యీ మర్రిమాన్ పరగణా సుంకం సక్రమంగా వసూలౌతుంది. అందుకు సర్కారు ఫర్మాను వుంది’’. ‘‘ఉంటే ఉండవచ్చును’’ అనుకొని సుబేదారు కూడా పైసలిచ్చి నీరు తెప్పించుకొన్నాడు. ఒకనాడు దీవాన్ బహద్దర్ గారు అక్కడ ఢేరా వేయించినాడు. అతనికిన్నీ ఇదేగతి పట్టింది. అరబ్బులు కడవకు పైసా పెట్టంది ఒక మెట్టు కూడా దిగనియ్యరు. దీవానుగారు అంతా వినుకొని ఇట్లనుకొన్నారు: ‘‘మా హుజూర్ గారు ఫర్మానిచ్చి నారేమో, లేకుంటే నా వద్ద కూడా వసూలు చేసే గుండె వుందా వీనికి?’’ దీవాను గూడా సుంకం చెల్లించుకొన్నాడు. కాపువాణ్ని పట్టే పగ్గాలు లేవు. ఇట్లావుండగా నవాబుగారు షికారుకు పోతూ పోతూ పొద్దు పోయిందని రాత్రికి ఆ వూరులోనే ఠికానా వేసినారు. నవాబో గివాబో ఇప్పటికి కాపువానికెవరున్నూ కంటికాగేటట్లు కనబడలేదు. పైసా ఆడబెట్టి బావిలోకి దిగూ అన్నాడు నవాబు నౌకరును. నవాబుకు షికాయతు అయింది. నవాబుగారిట్లా తమలోనే అనుకున్నారు. ‘‘మా దివాన్జీ మా ఖజానా భర్తీ చేసేదానికి ఈ హుకుం ఇచ్చినాడేమో, పట్నం పోయిన తర్వాత విచారించుతాను. ఇప్పుడుమాత్రం నేనున్నూ ఖానూనుకు బద్ధుణ్నై ఉండాల్సిందే’’ అని నీటిసుంకం చెల్లించుకొన్నాడు. ఈ పాటికి మర్రిమాన్ పరగణాలో రెండంతస్తుల బంగ్లా పెరిగింది. గ్రామంలో సగం భూములు కాపువానివే. 100 ఎద్దుల సేద్యం సాగించినాడు. చుట్టూ 5 ఆమడ దూరం అప్పులిచ్చినాడు. నవాబు నగరానికి వేంచేసిన తర్వాత దివాన్జీని పిలిచి ‘‘దివాన్‌సాబ్, మీరెందుకు నీటి సుంకం ఏర్పాటు చేసినారు? ఇది అన్యాయము కాదా?’’ అని విచారించినాడు. అందుకు దీవాను ‘‘హుజూర్! నేను కూడా సుంకం చెల్లించుకున్నాను. హుజూర్ గారు ఫర్మానె ముబారక్ జారీ చేసి వుంటారని నేనున్నూ అనుకున్నాను’’ అని మనవి చేసుకున్నాడు. ‘‘అరే నీవూ హుకుం ఇయ్యలేదు, నేనూ హుకుం ఇయ్యలేదు. మరి ఈ 15 ఏండ్ల నుండి వాడు ఎట్లా వసూలు చేసినాడు? వాణ్ని గిరఫ్తారీ చేయించి తక్షణం పట్టి తెప్పించు’’ అని ఉరిమినారు. కాపువాడు ఇట్టి ఫర్మాను కొరకై 10 ఏండ్ల నుండి నిరీక్షించుతూనే వున్నాడు. 1000 అష్రఫీలు బంగారు తట్టలో పోసుకొని జరీ పనిచేసిన మఖ్మల్ బట్ట పైన మూసుకొని హుజూరువారికి నజరానా సమర్పించుకొన్నాడు. నజరానా చూచేవరకు నవాబు చల్లబడ్డారు. ‘‘క్యారే నీకీ యెవ్వర్ నీటి సుంకం హుకుం ఇచ్చినార్?’’ అన్నారు నవాబు. ‘‘హుజూర్! గ్యారా కద్దూ బారా కోత్వాల్ హుకుం ఎట్లా ఏర్పడిందో మర్రిమాన్ పరగణా సుంకం కూడా అట్లే ఏర్పాటైంది’’ అన్నాడు కాపు. ‘‘ఏమంటున్నావురా? సరిగా చెప్పు’’. ‘‘నా తప్పులంతా మాఫ్ చేస్తామని సెలవిస్తే అన్నీ మనవి చేసుకుంటాను’’ అని తన కథంతా వర్ణించి చెప్పుకొన్నాడు కాపు. హుజూరు అదేపనిగా నవ్వుతూ ‘‘అరే! నీవు చాలా హుష్యారు మనిషివి. నీ తప్పంతా మాఫ్. ఇకముందు నీవు మా దేవిడీ వద్ద రాత్రి గంటలు కొట్తూ వుండుము. అదే నీకు శిక్ష’’ అని సెలవిచ్చినారు. కాపువానికి కొన్నాళ్ల వరకు తిక్కలేచినట్టుండేది. ఏమిన్నీ ఆదాయం లేదు. అధికారం లేదు. రాత్రులంతా నిద్రకాయవలెను. ఒకనాడు నిద్రమబ్బులో రాత్రి 11 గంటలు కొట్టేది మరిచిపోయినాడు. 12 గంటలకు లేచి కొట్టినాడు. ఈ చిన్నపొరపాటుకు దేవిడీ అంతా తలక్రిందులయ్యింది. హుజూరు 8 గంటల నుండి గంటకొక బేగంగారి గదికి పొయ్యేవారు. 11 గంటలు కొట్టలేదు. 11 గంటల బేగం వద్దకి హుజూరు పోలేదు. మర్నాడు 11 గంటల బేగంగారు గంటల కాపును పిలిపించి ‘‘అరేయ్! నా గంట మరిచిపోకుండా కొట్తూ వుండుము. నెలకు 50 రూపాయిలిస్తాను’’ అన్నది. ‘‘చిత్తం చిత్తం హుజూర్’’ అని కాపు తత్తరపాటుతో అన్నాడు. ‘‘ఈ గంటలలో ఏమో రహస్యం ఉందిరా’’ అని కాపువానికి స్ఫురించింది. ఒకనాడు 9 తప్పించినాడు. ఒకనాడు 10 తప్పించినాడు. ఒకనాడు 12 తప్పించినాడు. ఏ గంట తప్పితే మరునాడే ఆ గంట బేగంగారు కాపువానికి జీతం ఏర్పాటు చేసుకొన్నది. ఈ విధంగా నెలకు 400 రూపాయీల జీతం ఏర్పాటైంది. కొన్ని యేండ్ల తర్వాత నవాబుగారికీ సంగతి తెలిసింది. వీడు చలాకీవాడు అని మెచ్చుకొని వాడు సుంకం వసూలు చేసిన గ్రామమే వానికి ఇనాముగా ఇచ్చి పంపివేసినాడు. సురవరం ప్రతాపరెడ్డి (1896–1953) ‘గ్యారా కద్దూ బారా కోత్వాల్’ సంక్షిప్త రూపం ఇది. పదకొండు ఆనిగెపుకాయలు పన్నెండుమంది ఆయగాండ్లు అని ఈ శీర్షిక అర్థం. ‘మొగలాయి జమానాలో కర్ర యెవనిదో బర్రె వానిది అనే బాపతుగా’ సాగుతున్న వ్యవహారాన్ని ఈ కథ చిత్రించింది. సురవరం– రచయిత, సంపాదకుడు, పరిశోధకుడు, నాయకుడు. ఆయన పరిశోధన గ్రంథం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ సుప్రసిద్ధం. ఆయన సంపాదకత్వంలో వెలువడిన ‘గోలకొండ కవుల సంచిక’ అపురూపమైనది. సురవరం ప్రతాపరెడ్డి -
ఫిరాయింపులను స్పీకర్ అడ్డుకోవడంలేదు
-
విజ్ఞానదివిటి
వనపర్తి టౌన్: మన చరిత్రను తెలుసుకోవాలని ఉందా? సాహితీపరిమళాన్ని ఆస్వాదించాలని ఉందా? చిన్నారులకు చిట్టిపొట్టి కథలు వినిపించాలని ఉందా? పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. వనపర్తిలోని సురవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథాలయానికి ఒక్కసారి వెళ్తేచాలు బోలెడన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త జిల్లా ఏర్పాటుతో ఈ విజ్ఞానభాండాగారానికి మహర్దశ కలగనుంది. గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1 గ్రంథాలయంగా మారనుండడంతో ఈ ప్రాంతవాసులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. జిల్లా గ్రంథాలయాలకు సాధారణంగానే గ్రేడ్1 గుర్తింపు రావడం, దీనికితోడు వనపర్తిశాఖకు అన్ని అర్హతలు ఉండడం, రెఫరెన్స్ విభాగం, దినపత్రికలు అందుబాటులో ఉండడంతో నిరుద్యోగులు, సాహితీప్రియులు, పాఠకులకు మేలు చేకూరనుంది. అంతేకాకుండా చిన్నపిల్లల గ్రంథాలయం, కంప్యూటర్ సౌకర్యం, చౌకగా నెట్‌సేవలు అందుబాటులోకి రానున్నాయి. సంస్థానాధీశుల కాలంలోనే.. వనపర్తిలో స్వాతంత్య్రానికి పూర్వమే గ్రంథాలయాన్ని 1936లో అష్టభాష బహిరి గోపాల్‌రావు గ్రంథాలయంగా పిలిచేవారు. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో సంపన్నులు సైతం ఇక్కడికే వచ్చి చదివేవారని స్థానికులు చెబుతుంటారు. సమరయోధులు, వనపర్తి తొలి శాసనసభ్యుడైన సురవరం ప్రతాప్‌రెడ్డి స్మారకార్థం వనపర్తి పట్టణ నడిబొడ్డున సాహితీప్రియులు, ప్రజాప్రతినిధుల సూచన మేరకు గ్రంథాలయ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించారు. 1996లో సురవరం ప్రతాప్‌రెడ్డి స్మారక గ్రంథాలయంగా మార్పు చెందింది. గ్రంథాలయం సాధారణ పాఠకులకే కాకుండా వివిధ వత్తి, విద్య, నైపుణ్యం అభ్యసించే విద్యార్థులకు ఉపయుక్తంగా మారింది. ఆధునిక, సాంకేతికవిద్యకు సంబంధించిన స్టడీ మెటిరియల్ లభిస్తుండడంతో పేద విద్యార్థులకు అనుకూలంగా ఉంది. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఎనలేని గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. విశిష్టమైన ఖ్యాతి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం మినహా ఎక్కడాలేని విధంగా 2150మంది పాఠకులు వనపర్తి గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం కాలానికి అనుగుణంగా 13,595 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తరువాత వెలువడిన పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ప్రతిరోజు సుమారు 200మంది పాఠకులు గ్రంథాలయానికి విచ్చేస్తుంటారు. జిల్లా ఏర్పాటుతో ఒక లైబ్రేరియన్, అటెండర్, జిల్లా చైర్మన్, జిల్లా కార్యదర్శి, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు కొలువుదీరనున్నారు. ప్రస్తుతం ఇక్కడ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎందరినో నిలబెట్టింది వనపర్తి గ్రంథాలయంలో చదువుకున్న ఎందరో నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగాలు సాధించారు. మరెందరో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్, నెట్ వంటి పరీక్షల్లో విజయం సాధించారు. ఇటీవల నలుగురు అధ్యాపకులు తెలుగులో పీహెచ్డీ చేసేందుకు అనువైన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయని, వాటిని వినియోగించుకున్నాయి. జిల్లా గ్రంథాలయంగా మారితే ఈ ప్రాంతప్రజలకు ఎంతోమేలు కలుగుతుంది. – నరసింహా, ఇన్చార్జ్ గ్రంథాలయాధికారి, వనపర్తి -
మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే!
మే 28న సురవరం జయంతి రాజుల చరిత్రలు మన కంతగా సంబంధించినవి కావు. సాంఘిక చరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినవి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో, ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు, దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పుడెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో యవన్నీ తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన నభిలషింతురు. తేలిన సారాంశమేమన సాంఘిక చరిత్ర మన చరిత్రయే! మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే!! అల్లా ఉద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు, అసఫజా చరిత్రలకంటే మన చరిత్రలు మాత్రము తక్కువ వైనవా? మనము వారివలె ఘోరాలు చేసినవారము కాము. కాన బహుశా మనమే మెరుగేమో! సాంఘిక చరిత్ర మానవ చరిత్ర- ప్రజల చరిత్ర, అది మన సొంత కథ!! అది జనుల జీవనమును ప్రతి శతాబ్దమందెట్లుండునో తెలుపునట్టిది. అది మన తాతముత్తాతల చరిత్ర! వారి యిండ్లు, వారి కట్టు, వారి తిండి, వారి ఆటలు, వారి పాటలు, వారు పడిన పాట్లు, వారు మనకిచ్చిపోయిన మంచి చెడ్డలు, ఇవన్నీ తెలిపి మనకు సహాయపడును. (1949లో తొలిసారి ప్రచురితమైన సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నుండి...) -
'మోదీ చాయ్‌వాలా కాదు, సూట్ వాలా!'
యాదగిరిగుట్ట: ప్రధాని నరేంద్ర మోదీ చాయ్ వాలా కాదని, ఆయన ఖరీదైన సూట్ వాలా అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరుగుతున్న ఆ పార్టీ జిల్లా 20వ మహాసభల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ చాయ్‌వాలా కాదని , ఓ హోటల్ యజమాని కుమారుడని పేర్కొన్నారు. మోదీ రోజుకు 6సార్లు దుస్తులు మార్చుకుంటారని, అలాంటి ఆయన పేదల గురించి ఏం ఆలోచిస్తారని ప్రశ్నించారు. బీజేపీ కార్పొరేట్ శక్తులు, మీడియా సహకారంతో అధికారంలోకి వచ్చిందన్నారు. దేశంలోని 825 చానళ్లకు డబ్బులు ఇచ్చి ఎన్నికల్లో తమ వార్తలు ప్రసారం చేయించుకున్నారన్నారు.ముఖ్యంగా ఈటీవీ, ఈనాడు పత్రికలో బీజేపీకి వ్యతిరేకంగా వార్తలుండవన్నారు. ఈనాడు మీడియాలో రూ.1200 కోట్ల పెట్టుబడులు వచ్చేలా బీజేపీ సహకరించిందని ఆరోపించారు. -
తెలుగు వర్సిటీకి సురవరం పేరు!
సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి ‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం’గా పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైలు సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉన్న ట్లు తెలిసింది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. -
సాంఘిక చరిత్ర మన చరిత్రయే!
గ్రంథం చెక్క రాజుల యుద్ధాలు, తంత్రాలు, దౌష్ట్యాలు సంఘానికి నష్టం కలిగించినట్టివే. ఈ విషయం గుర్తించిన పాశ్చాత్యులు సాంఘిక చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇదియే సరియగు పద్ధతి. రాజుల చరిత్రలు మనకు అంతగా సంబంధించినవి కావు. సాంఘికచరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినట్టివి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో, ఏ ఆటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పుడుడెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన అభిలషింతురు. తేలిన సారాంశమేమన... సాంఘిక చరిత్ర మన చరిత్రయే! మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే!! సాంఘిక చరిత్ర మానవ చరిత్ర. ప్రజల చరిత్ర. అది మన సొంత కథ!! అది జనుల జీవనమును ప్రతి శతాబ్దమందెట్లుండెనో తెలుపునట్టిది. అది మన తాతముత్తాల చరిత్ర! - సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నుంచి (సురవరం ప్రతాపరెడ్డి ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. రేపు ఆయన జయంతి)