వనపర్తి గ్రంథాలయంలోని పుస్తకాలు
వనపర్తి టౌన్: మన చరిత్రను తెలుసుకోవాలని ఉందా? సాహితీపరిమళాన్ని ఆస్వాదించాలని ఉందా? చిన్నారులకు చిట్టిపొట్టి కథలు వినిపించాలని ఉందా? పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. వనపర్తిలోని సురవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథాలయానికి ఒక్కసారి వెళ్తేచాలు బోలెడన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త జిల్లా ఏర్పాటుతో ఈ విజ్ఞానభాండాగారానికి మహర్దశ కలగనుంది. గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1 గ్రంథాలయంగా మారనుండడంతో ఈ ప్రాంతవాసులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. జిల్లా గ్రంథాలయాలకు సాధారణంగానే గ్రేడ్1 గుర్తింపు రావడం, దీనికితోడు వనపర్తిశాఖకు అన్ని అర్హతలు ఉండడం, రెఫరెన్స్ విభాగం, దినపత్రికలు అందుబాటులో ఉండడంతో నిరుద్యోగులు, సాహితీప్రియులు, పాఠకులకు మేలు చేకూరనుంది. అంతేకాకుండా చిన్నపిల్లల గ్రంథాలయం, కంప్యూటర్ సౌకర్యం, చౌకగా నెట్‌సేవలు అందుబాటులోకి రానున్నాయి.
సంస్థానాధీశుల కాలంలోనే..
వనపర్తిలో స్వాతంత్య్రానికి పూర్వమే గ్రంథాలయాన్ని 1936లో అష్టభాష బహిరి గోపాల్‌రావు గ్రంథాలయంగా పిలిచేవారు. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో సంపన్నులు సైతం ఇక్కడికే వచ్చి చదివేవారని స్థానికులు చెబుతుంటారు. సమరయోధులు, వనపర్తి తొలి శాసనసభ్యుడైన సురవరం ప్రతాప్‌రెడ్డి స్మారకార్థం వనపర్తి పట్టణ నడిబొడ్డున సాహితీప్రియులు, ప్రజాప్రతినిధుల సూచన మేరకు గ్రంథాలయ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించారు. 1996లో సురవరం ప్రతాప్‌రెడ్డి స్మారక గ్రంథాలయంగా మార్పు చెందింది. గ్రంథాలయం సాధారణ పాఠకులకే కాకుండా వివిధ వత్తి, విద్య, నైపుణ్యం అభ్యసించే విద్యార్థులకు ఉపయుక్తంగా మారింది. ఆధునిక, సాంకేతికవిద్యకు సంబంధించిన స్టడీ మెటిరియల్ లభిస్తుండడంతో పేద విద్యార్థులకు అనుకూలంగా ఉంది. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఎనలేని గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి.
విశిష్టమైన ఖ్యాతి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం మినహా ఎక్కడాలేని విధంగా 2150మంది పాఠకులు వనపర్తి గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం కాలానికి అనుగుణంగా 13,595 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తరువాత వెలువడిన పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ప్రతిరోజు సుమారు 200మంది పాఠకులు గ్రంథాలయానికి విచ్చేస్తుంటారు. జిల్లా ఏర్పాటుతో ఒక లైబ్రేరియన్, అటెండర్, జిల్లా చైర్మన్, జిల్లా కార్యదర్శి, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు కొలువుదీరనున్నారు. ప్రస్తుతం ఇక్కడ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
ఎందరినో నిలబెట్టింది
వనపర్తి గ్రంథాలయంలో చదువుకున్న ఎందరో నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగాలు సాధించారు. మరెందరో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్, నెట్ వంటి పరీక్షల్లో విజయం సాధించారు. ఇటీవల నలుగురు అధ్యాపకులు తెలుగులో పీహెచ్‌డీ చేసేందుకు అనువైన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయని, వాటిని వినియోగించుకున్నాయి. జిల్లా గ్రంథాలయంగా మారితే ఈ ప్రాంతప్రజలకు ఎంతోమేలు కలుగుతుంది.
– నరసింహా, ఇన్‌చార్జ్ గ్రంథాలయాధికారి, వనపర్తి