
మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే!
మే 28న సురవరం జయంతి
రాజుల చరిత్రలు మన కంతగా సంబంధించినవి కావు. సాంఘిక చరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినవి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో, ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు, దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పుడెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో యవన్నీ తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన నభిలషింతురు. తేలిన సారాంశమేమన సాంఘిక చరిత్ర మన చరిత్రయే! మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే!! అల్లా ఉద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు, అసఫజా చరిత్రలకంటే మన చరిత్రలు మాత్రము తక్కువ వైనవా? మనము వారివలె ఘోరాలు చేసినవారము కాము. కాన బహుశా మనమే మెరుగేమో!
సాంఘిక చరిత్ర మానవ చరిత్ర- ప్రజల చరిత్ర, అది మన సొంత కథ!! అది జనుల జీవనమును ప్రతి శతాబ్దమందెట్లుండునో తెలుపునట్టిది. అది మన తాతముత్తాతల చరిత్ర! వారి యిండ్లు, వారి కట్టు, వారి తిండి, వారి ఆటలు, వారి పాటలు, వారు పడిన పాట్లు, వారు మనకిచ్చిపోయిన మంచి చెడ్డలు, ఇవన్నీ తెలిపి మనకు సహాయపడును.
(1949లో తొలిసారి ప్రచురితమైన సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నుండి...)