తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు! | We Are Considering Name Suravaram Pratap Reddy For Telugu University Says CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు!

Published Sat, Aug 3 2024 12:56 AM | Last Updated on Sat, Aug 3 2024 1:28 AM

We Are Considering Name Suravaram Pratap Reddy For Telugu University Says CM Revanth Reddy

అన్ని రాజకీయ పక్షాలు అంగీకరిస్తే పెడతాం

అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి

వచ్చే శాసనసభా సమావేశాల్లో కొత్త క్రీడా పాలసీ

భూములున్న మండల కేంద్రాల్లో మినీ స్టేడియంలు నిర్మిస్తాం

బ్యాగరికంచెలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్‌ స్టేడియం

సాక్షి, హైదరాబాద్‌: అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సుర వరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలుగు భాషకు, పత్రికా రంగానికి సురవరం ప్రతాప్‌రెడ్డి ఎంతో సేవ చేశారని, తెలంగాణ పోరాటంలో సైతం పాల్గొన్నారని కొనియాడారు.

సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు ద్వారా ఆ పార్టీ మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి.. శుక్రవారం శాసనసభలో విజ్ఞాపన లేఖను అందించగా, దానిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. పోలీసులు, సెక్యూరిటీ గార్డులు విధి నిర్వహణలో గంటల తరబడి నిలబడి ఉండాల్సి వస్తోందని, తమిళనాడు తరహాలో వారికి కూర్చునే అవకాశం కల్పించాలని సుధాకర్‌రెడ్డి చేసిన మరో విజ్ఞప్తి అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. 

మేం గతంలోనే నిర్ణయం తీసుకున్నాం: కేటీఆర్‌
తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టడానికి తాము మద్దతిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ సభ్యుడు కె.తారక రామారావు తెలిపారు. వాస్తవానికి దీనిపై తాము గతంలోనే నిర్ణయం తీసుకున్నామని, అయితే పదేళ్ల వరకు వర్సిటీ విభజన జరగకపోవడంతో అప్పట్లో సాధ్యం కాలేదని చెప్పారు. రూ.5 కోట్లతో దేశోద్ధారక భవనంలో సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు మీద ఆడిటోరియాన్ని బాగు చేశామని తెలిపారు. ఆయనపై గౌరవంతో 394 మంది కవులతో గోల్కొండ కవుల సంచిక కూడా తెచ్చామన్నారు. 

అత్యుత్తమ క్రీడా పాలసీ రూపొందిస్తాం
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి వచ్చే శాసనసభ సమావేశాల్లో నూతన క్రీడా పాలసీని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. చదువులోనే కాదు..క్రీడల్లో రాణించినా ఉన్నతోద్యోగం వస్తుందని, కుటుంబ గౌరవం పెరుగుతుందనే సందేశం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిని రుజువు చేసేందుకే క్రీడాకారులు నిఖత్‌ జరీన్, మహమ్మద్‌ సిరాజ్‌కు గ్రూప్‌–1 (డీఎస్పీ) ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ నియామకాల క్రమబద్ధీకరణ, సిబ్బంది, వేతనాల హేతుబద్ధీకరణ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు సీఎం సమాధానమిచ్చారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి వీలుగా ఈ చట్ట సవరణ చేస్తున్నామని, సిరాజ్‌ ఇంటర్మీడియెట్‌ మాత్రమే చదివినా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు.

అత్యధిక మంది క్రీడాకారులను తయారు చేస్తున్న హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న క్రీడా పాలసీలపై అధ్యయనం చేసి అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తామని పేర్కొన్నారు. ఏ స్థాయి క్రీడల్లో ఏ మేరకు రాణిస్తే/ఏ మెడల్‌ సాధిస్తే ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి? ఎంత ఆర్థిక సహాయం చేయాలి? ఎంత స్థలం కేటాయించాలి? వంటి అంశాలు కొత్త పాలసీలో ఉంటాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో క్రీడలకు రూ.321 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు.  

యువత వ్యసనాలు వీడేలా..
మండల కేంద్రాల్లో భూములు అందుబాటులో ఉంటే మినీ స్టేడియం నిర్మిస్తాం. ప్రస్తుతం మాదాపూర్‌లోని ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌’ను బ్యాగరికంచె (మీర్‌ఖాన్‌పేట)కు తరలిస్తాం. అక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్‌ స్టేడియం నిర్మించడానికి బీసీసీఐతో చర్చిస్తే సానుకూలంగా స్పందించింది. కొద్దిరోజుల్లోనే భూమిని కేటాయిస్తాం. రాష్ట్రంలోని యువతను వ్యసనాల బాట నుంచి తప్పించడానికి క్రీడలను వాడుకుంటాం. హైదరాబాద్‌లో గతంలో నిర్మించిన సరూర్‌నగర్, ఎల్బీనగర్‌ స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయి. వీటన్నింటినీ అప్‌గ్రేడ్‌ చేసి విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు ఉపయోగిస్తాం..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.

ఎమ్మెల్యేల క్రీడా పోటీలను పునరుద్ధరిస్తాం
శాసనసభ్యులకు నిర్వహించే క్రీడా పోటీలను పునరు ద్ధరించనున్నట్లు రేవంత్‌ వెల్లడించారు. శాసనసభలో క్రీడలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మ డి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏటా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసనసభ్యుల క్రీడాపోటీలు జరిగేవని గుర్తు చేశారు. పదేళ్లుగా క్రీడా స్ఫూర్తి లేకుండా పోయింద న్నారు. వచ్చే సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య క్రీడాపోటీలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలి పారు. అన్ని పార్టీలతో ఓ కమిటీని ఏర్పాటు చేసి, క్రీడా పోటీల నిర్వహణకు కృషి చేయాలని స్పీకర్‌ను కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement