Telugu University
-
త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ
సాక్షి, అమరావతి : పొట్టి శ్రీరాములు పేరుతో రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీని త్వరలో ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, పలువురు మంత్రులు పాల్గొని అమరజీవితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. చాలాకొద్ది మందే జాతికోసం ఆలోచిస్తారని, పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహార దీక్షచేసి తెలుగుజాతి కోసం ప్రాణాలర్పించగా.. దేశాన్ని ఐకమత్యంగా ఉంచేందుకు పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. వీరిద్దరి వర్థంతులు ఒకేరోజు నిర్వహించుకోవడం గొప్ప అంశమన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రత్యేక ఆంధ్ర కోసం అనేక ఉద్యమాలు జరిగాయని తెలిపారు. మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేలోపే బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇస్తారని 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభలో భోగరాజు పట్టాభి సీతారామయ్య చెప్పారని.. అదే నిజమైందని, 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చంద్రబాబు గుర్తుచేశారు. అమరజీవి పేరుతో హైదరాబాద్‌లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తే తాను నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేశానన్నారు. వచ్చే మార్చి 16 నుంచి అమరజీవి 125వ జయంత్యుత్సవాలు నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయన ఆంధ్ర జాతికి నాయకుడు : డిప్యూటీ సీఎం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. అమరజీవి పొట్టి శ్రీరాములు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడని, ఆయన ఒక కులానికి నాయకుడు కాదని, ఆంధ్ర జాతి మొత్తానికి నాయకుడన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించి 2.2 ట్రిలియన్ డాలర్ల ఆరి్థక వ్యవస్థగా పురోగతి సాధించడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు. కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. రాష్ట్ర విభజన తరువాత తనకు ఆయన గొప్పతనం అర్థమైందన్నారు. మన ఉనికి కోసం మద్రాసులో ఆమరణదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పాడె మోయడానికి కూడా ఆనాడు కష్టపడాల్సి వచ్చిoదని తెలిసి తన గుండె కదిలిపోయిందని పవన్ చెప్పారు. ఘంటసాల, మరో నలుగురు కలిసి పాడె మోశారని, ఈరోజు మనం ఆంధ్రులమని గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది ఆ మహనీయుడు బలిదానంతో పెట్టిన భిక్షేనన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను అమ్ముకోలేని స్థితి గత ప్రభుత్వ పాలనలో ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు!
సాక్షి, హైదరాబాద్: అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సుర వరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలుగు భాషకు, పత్రికా రంగానికి సురవరం ప్రతాప్‌రెడ్డి ఎంతో సేవ చేశారని, తెలంగాణ పోరాటంలో సైతం పాల్గొన్నారని కొనియాడారు.సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు ద్వారా ఆ పార్టీ మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి.. శుక్రవారం శాసనసభలో విజ్ఞాపన లేఖను అందించగా, దానిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. పోలీసులు, సెక్యూరిటీ గార్డులు విధి నిర్వహణలో గంటల తరబడి నిలబడి ఉండాల్సి వస్తోందని, తమిళనాడు తరహాలో వారికి కూర్చునే అవకాశం కల్పించాలని సుధాకర్‌రెడ్డి చేసిన మరో విజ్ఞప్తి అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. మేం గతంలోనే నిర్ణయం తీసుకున్నాం: కేటీఆర్తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టడానికి తాము మద్దతిస్తున్నట్టు బీఆర్ఎస్ సభ్యుడు కె.తారక రామారావు తెలిపారు. వాస్తవానికి దీనిపై తాము గతంలోనే నిర్ణయం తీసుకున్నామని, అయితే పదేళ్ల వరకు వర్సిటీ విభజన జరగకపోవడంతో అప్పట్లో సాధ్యం కాలేదని చెప్పారు. రూ.5 కోట్లతో దేశోద్ధారక భవనంలో సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు మీద ఆడిటోరియాన్ని బాగు చేశామని తెలిపారు. ఆయనపై గౌరవంతో 394 మంది కవులతో గోల్కొండ కవుల సంచిక కూడా తెచ్చామన్నారు. అత్యుత్తమ క్రీడా పాలసీ రూపొందిస్తాంరాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి వచ్చే శాసనసభ సమావేశాల్లో నూతన క్రీడా పాలసీని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. చదువులోనే కాదు..క్రీడల్లో రాణించినా ఉన్నతోద్యోగం వస్తుందని, కుటుంబ గౌరవం పెరుగుతుందనే సందేశం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిని రుజువు చేసేందుకే క్రీడాకారులు నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌కు గ్రూప్–1 (డీఎస్పీ) ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నియామకాల క్రమబద్ధీకరణ, సిబ్బంది, వేతనాల హేతుబద్ధీకరణ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు సీఎం సమాధానమిచ్చారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి వీలుగా ఈ చట్ట సవరణ చేస్తున్నామని, సిరాజ్ ఇంటర్మీడియెట్ మాత్రమే చదివినా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు.అత్యధిక మంది క్రీడాకారులను తయారు చేస్తున్న హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న క్రీడా పాలసీలపై అధ్యయనం చేసి అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తామని పేర్కొన్నారు. ఏ స్థాయి క్రీడల్లో ఏ మేరకు రాణిస్తే/ఏ మెడల్ సాధిస్తే ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి? ఎంత ఆర్థిక సహాయం చేయాలి? ఎంత స్థలం కేటాయించాలి? వంటి అంశాలు కొత్త పాలసీలో ఉంటాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో క్రీడలకు రూ.321 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. యువత వ్యసనాలు వీడేలా..మండల కేంద్రాల్లో భూములు అందుబాటులో ఉంటే మినీ స్టేడియం నిర్మిస్తాం. ప్రస్తుతం మాదాపూర్‌లోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ను బ్యాగరికంచె (మీర్ఖాన్పేట)కు తరలిస్తాం. అక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించడానికి బీసీసీఐతో చర్చిస్తే సానుకూలంగా స్పందించింది. కొద్దిరోజుల్లోనే భూమిని కేటాయిస్తాం. రాష్ట్రంలోని యువతను వ్యసనాల బాట నుంచి తప్పించడానికి క్రీడలను వాడుకుంటాం. హైదరాబాద్‌లో గతంలో నిర్మించిన సరూర్‌నగర్, ఎల్బీనగర్ స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయి. వీటన్నింటినీ అప్‌గ్రేడ్ చేసి విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు ఉపయోగిస్తాం..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.ఎమ్మెల్యేల క్రీడా పోటీలను పునరుద్ధరిస్తాంశాసనసభ్యులకు నిర్వహించే క్రీడా పోటీలను పునరు ద్ధరించనున్నట్లు రేవంత్ వెల్లడించారు. శాసనసభలో క్రీడలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మ డి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏటా బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యుల క్రీడాపోటీలు జరిగేవని గుర్తు చేశారు. పదేళ్లుగా క్రీడా స్ఫూర్తి లేకుండా పోయింద న్నారు. వచ్చే సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య క్రీడాపోటీలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలి పారు. అన్ని పార్టీలతో ఓ కమిటీని ఏర్పాటు చేసి, క్రీడా పోటీల నిర్వహణకు కృషి చేయాలని స్పీకర్‌ను కోరారు. -
జర్నలిజంలో గోపాలకృష్ణకు గోల్డ్ మెడల్
జర్నలిజంలో విస్తృత పరిశోధన చేసిన గోపాలకృష్ణకు గోల్డ్‌మెడల్ లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆధ్యాత్మిక పత్రికలు - భాష, విషయ విశ్లేషణ అన్న అంశంపై M Phil పరిశోధన చేసిన సీనియర్ జర్నలిస్ట్ మల్లాది వెంకట గోపాలకృష్ణకు శ్రీ బొప్పన్న స్మారక స్వర్ణ పథకం లభించింది. రవీంద్ర భారతిలో జరిగిన విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసై చేతుల మీదుగా గోపాలకృష్ణ స్వర్ణ పథకాన్ని అందుకున్నారు. జర్నలిజం కమ్యూనికేషన్ థియరీస్, ఆధ్యాత్మికత, తెలుగు భాష అనే నాలుగు విస్తృతమైన పరిధి కలిగిన రంగాలను మేళవించి, ప్రతిపాదనలు చేసి శాస్త్రబద్ధంగా ఆ ప్రతిపాదనను నిరూపించినందుకు గాను మల్లాది పరిశోధన స్వర్ణ పథకానికి ఎంపికయింది. సబ్ ఎడిటర్ కం రిపోర్టర్ గా వృత్తి జీవితాన్ని మొదలుపెట్టి పలు ఛానళ్లు, పత్రికల్లో పని చేసిన మల్లాది తనదైన శైలిలో ప్రతిభను కనబరిచారు. కవి, రచయిత, భాషావేత్తగా, అనువాదకుడు. బోధకుడిగా నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా రాణించారు. పరిశోధన రంగంలో విస్తృతంగా పని చేసిన మల్లాదిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు తంగడి కిషన్ రావు, రిజిస్ట్రార్, గైడ్ ఆచార్య కడియాల సుధీర్ కుమార్, ఆచార్య వెంకటరామయ్య అభినందించారు. పథకాలు అందుకున్న పరిశోధక విద్యార్థిని విద్యార్థులందరికీ గవర్నర్ తమిళసై శుభాకాంక్షలు తెలిపారు. -
వేముల ప్రభాకర్‌కు కీర్తి పురస్కారం
జగిత్యాల: పట్టణానికి చెందిన ప్రముఖ కవి రచయిత వేముల ప్రభాకర్‌కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. వేముల ప్రభాకర్ శ్రీవరకవి భూమాగౌడుశ్రీ నవల రచనకు గాను కీర్తి పురస్కారం ప్రకటించగా ఈనెల 28న అందుకోనున్నారు. ఇప్పటివరకు మూడు నవలలు, ఒక కథ సంపుటి, ఆరు కవిత సంపుటిలు, స్వీయరచనతో పాటు రెండు సాహితీ గ్రంథాలు, ఒక మాసపత్రిక వారి సంపాదకత్వంలో వెలువడ్డాయి. ఈ సందర్భంగా వేముల ప్రభాకర్‌ను సాహితీవేత్తలు, విద్యావేత్తలు, రచయితలు అభినందించారు. -
తెలుగు వర్సిటీలో 20 కొత్త కోర్సులు
నాంపల్లి: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సాహితీ పురస్కారాలను అందజేసింది. గురువారం తెలుగు వర్సిటీలోని నందమూరి తారక రామారావు కళా మందిరంలో ఏర్పాటు చేసిన పురస్కార ప్రధాన సభలో పది మంది ఉత్తమ గ్రంథ రచయితలకు రూ.20,116 నగదు పారితోషికంతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్ రావు మాట్లాడుతూ... తెలుగు సాహిత్య సేవకు అంకితమైన నిరాడంబర రచయితలకు 2019 సాహితీ పురస్కారాలను అందించడానికి విశ్వవిద్యాలయం ఎంతో గర్వపడుతోందన్నారు. అందుకు సహకరించిన పురస్కారాల నిర్ణాయక సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వర్సిటీలో ఈ విద్యా సంవత్సరంలో 20 కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అలాగే వచ్చే రెండు మాసాల్లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని బాచుపల్లి ప్రాంగణానికి తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య ఆర్.లింబాద్రి మాట్లాడుతూ... సామాజిక మనుగడకు ఆయా ప్రాంతాల సాహిత్య, సంస్కృతి ప్రధాన భూమిక వహిస్తుందని, ఆ దిశగా తెలుగు విశ్వవిద్యాలయం సామాజిక బాధ్యతతో సాహిత్యాన్ని, సంస్కృతిని కాపాడుతున్నందుకు అభినందనలు తెలియజేశారు. -
భారతీయ భాషలతోనే పరిపాలన
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి: పరిపాలన భాషగా భారతీయ భాషలే ఉండాలని, మాతృ భాషే ఏ రాష్ట్రానికైనా పాలన భాష కావాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రాంతీయ భాషల్లోనే జరగాలని ఆయన ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 36వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వలస పాలకులు మన భాషపై ముందుగా దాడి చేశారని, వారి భాషలను బలవంతంగా మనపై రుద్దారన్నారు. భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను అర్థం చేసుకుని ఉమ్మడిగా జీవించడమే నిజమైన విద్యని పేర్కొన్నారు. ప్రపంచీకరణ ఎల్లలు చెరిపేసిన మనిషి తన గతాన్ని, పెరిగిన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకూడదన్నారు. ఆంగ్ల భాష మోజులో తెలుగును చులకన చేయొద్దని హితవు పలికారు. తనతో సహా దేశంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారంతా తెలుగులోనే చదువుకున్నారని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చేసిన కృషిని శ్లాఘించారు. ఈ యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగు భాషను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలని కోరారు. సాంకేతిక పదాలకు సమానమైన తెలుగు అర్థాలతో నిఘంటువు తీసుకురావాలన్నారు. కొత్త విద్యా విధానం ప్రాంతీయ భాషలోనే ఉన్నత విద్య చదివే అవకాశం కల్పిస్తోందన్నారు. అనంతరం తెలుగువాణి పత్రికను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర మంత్రి మహ్మద్ అలీ, యూనివర్సిటీ వీసీ ఆచార్య కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. పురస్కారాల ప్రదానం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు (2018వ సంవత్సరానికి), ప్రముఖ నృత్య కళాకారుడు కళాకృష్ణకు (2019వ సంవత్సరానికి) విశిష్ట పురస్కారాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్ ఛాయా చిత్ర ప్రదర్శన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఏర్పాటు చేసిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’(ఈబీఎస్బీ)పై నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈబీఎస్బీ కింద జత చేసిన హరియాణా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ ఆసక్తికరమైన అంశాలు, కళా రూపాలు, వంటకాలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడల విశిష్టతను తెలియజేసేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఛాయాచిత్ర ప్రదర్శన ఈ నెల 12 నుంచి 14 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. -
తారక రాముడి మానస పుత్రిక..
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు భాషకు వెలుగునివ్వాల్సిన మన ‘తెలుగు విశ్వవిద్యాలయం’ మాతృభాషా పరిరక్షణ విషయంలో ఘోరంగా విఫలమవుతున్నది. ఒకప్పుడు తెలుగు కళాకారులకు ఓ కాణాచీగా కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు భూతలస్వర్గంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూగబోయింది. భాషావికాసం కోసం పాటుపడటం సంగతేమో గానీ, తెలుగుపై ఆసక్తితో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కనీస పాఠాలు బోధించలేని దుస్థితి నెలకొంది. నేడు అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంపై ప్రత్యేకకథనం ! తారక రాముడి మానస పుత్రిక.. తెలుగు భాష, సాహిత్యాలు, సంస్కతి కళలు, జానపద విజ్ఞానం, చరిత్ర తదితర రంగాల్లో సమగ్ర వికాసాన్ని సాధించడం కోసం నాటి ముఖ్య మంత్రి ఎన్టీఆర్ 1985 డిసెంబర్ 2న ఈ వర్సిటీని ప్రారంభించారు. తొలినాళ్లలో ఆయనే దీనికి ఛాన్స్లర్ వ్యవహరించారు. గవర్నర్‌ను ఛాన్సలర్‌గా నియమిస్తేనే గుర్తిస్తామని యూజీసీ పేచీ పెట్టడంతో ఆయన వీసీ పదవి నుంచి వైదొలగారు. నాటి నుంచి రాష్ట్ర గవర్నరే దీనికి వీసీగా వ్యవహరిస్తున్నారు. వర్సిటీలో ఎంఏ తెలుగు, జర్నలిజం, చిత్రం, సంగీతం, రంగస్థల కళలు వంటి కోర్సులను అందిస్తుంది. తెలుగు భాషా వికాసం, పరిరక్షణ కోసం ఏర్పాటైన తెలుగు యూనివర్సిటీలో తెలుగు విభాగాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎంఏ తెలుగు విభాగంలో ఫస్ట్, సెకండ్ ఇయర్ కోర్సులను అందిస్తుంది. మొత్తం 60 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. వీరికి పాఠాంశ్యాలు బోధించేందుకు యూజీసీ నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్ సహా ఇద్దరు రీడర్లు, ముగ్గురు లెక్చరర్స్ అవసరం కానీ ప్రస్తుతం వర్సిటీ తెలుగు శాఖలో ఒక రెగ్యులర్ ఉపాధ్యాయురాలు సహా మరో ముగ్గురు పదవీ విరమణ చేసిన (విజిటింగ్ ఫ్యాకల్టీ) ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్క తెలుగు విభాగంలోనే కాదు దాదాపు అన్ని విభాగాలది ఇదే పరిస్థితి. ఏటా పదవీ విరమణలు చేస్తున్నవారి సంఖ్య పెరుగుతుండటం, ఆ మేరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయకపోవడం, పాలకమండలి ఏర్పాటు చేయకపోవడం, దాదాపు రెండేళ్ల నుంచి వీసీ పోస్టు ఖాళీగా ఉండటం వల్ల వర్సిటీలో అభివృద్ధి కుంటుబడిపోతుంది. వర్సిటీలో అంతర్జాతీయ తెలుగు భాషాభివృద్ధి కేంద్రం ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించక పోవడంతో ఎందుకూ పనికిరాకుండా పోయింది. విదేశాల్లో తెలుగు వెలుగుకు తప్పని కష్టాలు.. తెలుగు రాయడం, మాట్లాడటం రాని దేశాల్లో ఆ భాషను నేర్పించేందుకు వర్సిటీ వేదికగా అంతర్జాతీయ తెలుగు భాషా వికాసం కేంద్రం ఏర్పాటైంది. భాషా విస్తరణలో భాగంగా దేశంలోని తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, చత్తీస్గడ్, అస్సాం, న్యూఢిల్లీ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులు సహా పలు విదేశీ విశ్వవిద్యాలయాల్లోనూ భాషా పీఠాలను ఏర్పాటు చేసింది. ఆయా విశ్వవిద్యాలయాలతో అవగాహాన ఒప్పందాన్ని కుదుర్చుకుని అక్కడి వారికి శిక్షణ ఇస్తోంది. దీనిలో భాగంగా అమెరికాలోని కాలిఫోర్నియా, ఇజ్రాయిల్‌లోని హిబ్రు విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా పీఠాలను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా తెలుగును నేర్చుకోవాలనే విదేశీ ఔత్సాహికులను గుర్తించి సంవత్సరానికి ఐదుగురు చొప్పున నగరానికి రప్పించి తెలుగును నేర్పిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నట్టు అంచనా. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మంది ఉండగా, ఇతర రాష్ట్రాల్లో 4 కోట్లు, విదేశాల్లో మరో 4 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. భాషా పరిరక్షణ కోసమే కాకుండా అంతర్జాతీయంగా తెలుగు భాషా వ్యాప్తికి తన వంతు కృషి చేసింది. అంతేకాదు తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలంటూ చేపట్టిన ఉద్యమానికి తెలుగు విశ్వవిద్యాలయం వేదికైంది. భాషా వికాసం కోసమే కాకుండా తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడంలో వర్శిటీ కీలక పాత్రపోషించింది. ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యానికి ఆశించిన స్థాయిలో సేవలను అందించలేక పోతుంది. వెనుకబడి పోతున్నాం ఇంగ్టిషు భాష మోజులో పడిపోయి మాతృభాషను విస్మరిస్తున్నాం. మాతృభాషను మరిచిపోవడం అంటే కన్నతల్లిని కాదనుకోవడం వంటిదే. మాట్లాడటం, రాయడంలో ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తెలుగు ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరింది. మాతృభాషను ప్రాథమిక మాధ్యమం వరకు విధిగా అమలు చేస్తేనే భాష బతుకుతుంది. లేదంటే పూర్తిగా కనుమరుగవడం ఖాయం. – ఆచార్య గౌరీశంకర్, తెలుగుశాఖ రిటైర్డ్ ప్రొఫెసర్ -
మార్చి రెండో వారంలో నియామకాలు!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వైస్చాన్స్లర్ల నియామకాలు త్వరలోనే జరగనున్నాయి. వీసీల నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులను ఆదేశించడంతో వీసీల నియామకంపై కదలిక మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు. అయితే 10 యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలు ఉండగా, జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు ఇన్చార్జి వీసీని కూడా నియమించలేదు. గతేడాది జూన్ 23 నాటికి జేఎన్ఏఎఫ్ఏయూ, బాసర ఆర్జీయూకేటీకి వీసీలు ఉన్నందున, అప్పట్లో జారీ చేసిన వీసీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో వాటిని పేర్కొనలేదు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ, తెలుగు యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆయా పోస్టులకు 273 మంది ప్రొఫెసర్లు, 984 దరఖాస్తు ఫారాలు అందజేశారు. ఒక్కొక్కరు రెండు మూడింటికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ నామినీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు యూనివర్సిటీల నామినీలను, యూజీసీ నామినీలతో సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసిందే తప్ప కమిటీల సమావేశాలు జరగలేదు. సెర్చ్ కమిటీల్లో యూనివర్సిటీ నామినీగా నియమించిన వారి నియామకం చెల్లదని, యూనివర్సిటీల పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు (ఈసీ) లేకుండా, ఆ ఈసీలు సిఫారసు చేయకుండా పెట్టిన నామినీల నియామకం కుదరదన్న వాదనలు వచ్చాయి. దాంతో సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి.. ఈసీల నియామకం కోసం ప్రతిపాదలను ప్రభుత్వానికి గత నెలలోనే పంపింది. ప్రస్తుతం అది ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. బుధవారం సీఎం ఆదేశాలు జారీ చేసినందున ఈ వారం రోజుల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఆ తర్వాత ఆయా యూనివర్సిటీల నుంచి సెర్చ్ కమిటీల్లో ఉండే యూనివర్సిటీల నామినీల పేర్లను ప్రభుత్వం తెప్పించుకోనుంది. ఆ తర్వాత సెర్చ్ కమిటీలు సమావేశమై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురి పేర్లను ప్రతిపాదించనున్నాయి. మొత్తానికి వచ్చే వారంలో సెర్చ్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సెర్చ్ కమిటీలు ప్రతిపాదించిన పేర్లను ప్రభుత్వం యూనివర్సిటీల ఛాన్స్లర్ అయిన గవర్నర్ ఆమోదానికి పంపనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే గవర్నర్ ఆమోదంతో మార్చి రెండో వారంలో కొత్త వీసీలు రానున్నారు. దరఖాస్తు చేసుకోకున్నా.. యూనివర్సిటీల వీసీలుగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు దరఖాస్తు చేసుకోని వారిని కూడా సెర్చ్ కమిటీ ఎంపిక చేసే వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన నాటికి ప్రొఫెసర్‌గా పదేళ్ల అర్హత లేని వారు కూడా 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని భావించారు. ప్రస్తుతం అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందుకే వారిని సెర్చ్ కమిటీలు పరిగణనలోకి తీసుకుంటాయా లేదా అన్న విషయంలో చర్చ జరుగుతోంది. అయితే సెర్చ్ కమిటీలు వారి పేర్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మూడు వారాల్లోగా నియామకం: సీఎం రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల ఉపకులపతుల (వైస్ ఛాన్సలర్) నియామక ప్రక్రియను రెండు మూడు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించారు. వీసీల నియామకానికి వీలుగా వెంటనే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. సెర్చ్ కమిటీ ద్వారా వీరి పేర్లను తెప్పించుకోవాలని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లపై స్పష్టత వస్తే వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందన్నారు. -
తెలుగు వర్సిటీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు
హైదరాబాద్: నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం అందజేసే వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య పుంజాల ఓ ప్రకటనలో తెలిపారు. కళలు, సంస్కృతి, సంగీతం, నాటకం, చిత్ర శిల్పకళ, జానపద కళలు, విజ్ఞానం, భాషా శాస్త్రం, వ్యాకరణం, సాహిత్యం, చరిత్ర, పురావస్తు శాస్త్ర, జ్యోతిషం వంటి కోర్సు ల్లో చేరవచ్చని తెలిపారు. హైదరాబాదు ప్రాంగణంలో శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్‌లో బ్యాచిలర్ కోర్సుతో పాటుగా ఎంఏ (తెలుగు), ఎంఏ (అనువర్తిత భాషా శాస్త్రం), ఎంఏ (కర్ణాటక సంగీతం), ఎంపీఏ (కూచిపూడి/ఆంధ్రనాట్యం), ఎంపీఏ (జానపద కళలు),ఎంపీఏ (రంగస్థల కళలు), ఎంఏ (జర్నలిజం) సాయంకాలం కోర్సుగా ఎంఏ (జ్యోతిషం) వంటి పోస్ట్రుగాడ్యుయేషన్ కోర్సులు, వివిధ లలిత కళా రంగాలలో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్, కళా ప్రవేశిక, ప్రాథమిక ప్రవీణ కోర్సులున్నట్లు పేర్కొన్నారు. రాజమండ్రి నన్నయ ప్రాంగణంలో ఎంఏ (తెలుగు), శ్రీశైలం పాల్కురికి సోమనాథ ప్రాంగణంలో ఎంఏ (చరిత్ర పురావస్తు శాస్త్రం), కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో ఎంపీఏ (కూచిపూడి నృత్యం) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, రాణి రుద్రమదేవి పేరిణి కేంద్రం ద్వారా రెండేళ్ల కాల వ్యవధితో పేరిణి నృత్య విశారద కోర్సును అందజేస్తున్నట్లు వివరించారు. హైదరాబాదు, రాజమండ్రి, శ్రీశైలం, వరంగల్ కూచిపూడిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ప్రాంగణాల్లోని కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు తెలుగు వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చును. ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా రూ.350 చెల్లించి జూన్ 22లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో జూన్ 29లోగా చెల్లించాల్సి ఉంటుంది. -
సాహిత్య పీఠానికి చంద్రగ్రహణం
సాక్షి, రాజమహేంద్రవరం : ‘తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరాన్ని ప్రధానకేంద్రంచేస్తాం.’ అంటూ గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. దాంతో ఎందరో భాషాభిమానులు బొమ్మూరులోని తెలుగు సాహిత్యపీఠానికి మంచి రోజులు వస్తాయని ఆశించారు. అయితే వారి ఆశ అడియాసే అయింది. అన్ని హామీల్లాగే దీన్ని కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. దాంతో నానాటికీ సాహిత్యపీఠం కునారిల్లిపోతోంది. ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగువారికి గుర్తింపు తీసుకువచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు తెలుగు భాషా సాహిత్యాల పట్ల అభిమానం ఉండేది. 1985 డిసెంబర్ రెండో తేదీన హైదరాబాద్ కేంద్రంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వరంగల్‌లో జానపదపీఠం, కూచిపూడిలో కూచిపూడి నాట్యవిభాగం, శ్రీశైలంలో పురావస్తు పరిశోధన విభాగం, ఆదికవి నన్నయ నడయాడిన, ఆంధ్రమహాభారతం అవతరించిన గడ్డ రాజమహేంద్రవరం శివారునగల బొమ్మూరులో తెలుగు సాహిత్యపీఠం ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఈ సాహిత్య పీఠం ఎంఏ తెలుగు చదువుకునే వారికి, తెలు గు భాషాసాహిత్యాలపై పరిశోధనలు చేసేవారికి కల్పవృక్షంగా భాసించింది. రాష్ట్ర విభజనానంతరం చంద్రగ్రహణంతో పురాతన వైభవం కోల్పోయింది. శిథిలమవుతున్న వసతి గృహాలు అంతా భ్రాంతియేనా? తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రం చేస్తానని పుష్కరాల సాక్షిగా వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఆతర్వాత ఆ ఊసు మళ్లీ ఎత్తలేదు. తెరమీదకు కొత్తవాదనలు వచ్చాయి. విభజన చట్టం, షెడ్యూల్ 10లో సాహిత్యపీఠం ఉండటం వలన ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని మొసలి కన్నీరు మొదలయింది. రాజమహేంద్రవరాన్ని ప్రధాన కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసే సమయానికే సాహిత్యపీఠం ఉమ్మడి ఆస్తుల జాబితాలో ఉంది. ఇదేదో ముఖ్యమంత్రి ప్రకటన తరువాత ఉత్పన్నమైన సమస్య కాదు. అన్నీ తెలిసే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయవిశ్వవిద్యాలయం,హైదరాబాద్‌లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఉమ్మడి ఆస్తుల జాబితాలో ఉన్నవే. అవి మన రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోనే ఉన్నాయి. ఈ సంస్థలకు లేని అడ్డంకి సాహిత్యపీఠం విషయంలో ఎందుకు ఉత్పన్నమవుతోందని పద్మవిభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటివారు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే దానికి నేతలనుంచి సమాధానం లేదు. కాంచవోయి నేటి దుస్థితి ఒకప్పుడు సుమారు 80మందికి పైగా ఎంఏ (తెలుగు) చదువుకునే విద్యార్థులతో, పరిశోధకులతో కళకళలాడిన సాహిత్యపీఠం నేడు బావురుమంటోంది. ఎంఏ మొదటి సంవత్సరంలో ఐదుగురు, రెండో సంవత్సరంలో ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. పూర్తి స్థాయిబోధన సిబ్బంది లేరు. అడపాతడపా, కన్సాలిడేటెడ్ పారితోషికం మీద ఒక అధ్యాపకుడు వచ్చి, పాఠాలు చెబుతున్నారు. సాహిత్యపీఠంలో పూర్తిస్థాయి పర్యవేక్షకులు లేరు. గుంటూరులో ఇన్చార్జి వైస్ చాన్సలర్ ఉన్నారు. తలలేని మొండెంలా సాహిత్యపీఠం మిగిలింది. సుమారు 50,000 అరుదైన పుస్తకాలు ఉన్న గ్రంథాలయాన్ని వినియోగించుకుంటున్నవారు దాదాపు లేరు. బోధనేతర సిబ్బందికి రెండునెలలకో, మూడు నెలలకో జీతాలు విదిలిస్తున్నారు. హాస్టల్ భవనం శి«థిలావస్థకు చేరుకుంది. ఎందుకీ దుస్థితి? రాష్ట్ర విభజన అనంతరం సాహిత్యపీఠం అస్తిత్వంపై, భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముతున్న తరుణంలో, ప్రభుత్వం ప్రేక్షకపాత్రను ధరించింది. సాహిత్యపీఠం క్షీణదశ ప్రారంభం కావడానికి ఇది ప్రధాన కారణం. విద్యార్థులకు భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు. అదనపు భవనాల నిర్మాణం కాలేదు కనుక, సాహిత్యపీఠానికి ఇచ్చిన భూమిలో కొంతభాగాన్ని తిరిగి ఇవ్వాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టురని సాహిత్యపీఠం సిబ్బంది తెలిపారు. ప్రాంగణంలోని కొంత ప్రాంతానికి ప్రత్యేకంగా ఫెన్సింగ్ వేశారు. కొంత భాగం ఆక్రమణలకు గురి అయింది. ఏది ఏమైనా, జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే, ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించక తప్పడం లేదు. కనీసం భాషాసాహిత్యాలను, కళలను రాజకీయ పరిధి దాటి ఆదరిస్తే బాగుంటుందని సాంస్కృతిక రాజధాని ప్రజలు కోరుకుంటున్నారు. -
సీఆర్ రావు జీవితం స్ఫూర్తిదాయకం: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: సీఆర్ రావు జీవితం స్ఫూర్తిదాయకం అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తెలుగు వర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ఆవుల మంజులత తెలుగులోకి అనువదించిన ‘‘డాక్టర్ సీఆర్ రావు జీవితం–కృషి ’’ అనే పుస్తకాన్ని గవర్నర్ బుధవారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సీఆర్ రావు లోకరత్న అని, స్టాటిస్టిక్స్‌లో అద్భుతాలు చేయడం ఆయనకే సాధ్యమన్నారు. కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ను సందర్శించినప్పుడు స్టాటిస్టిక్స్ అంటే సంఖ్యలు మాత్రమే కాదని అందులో సైన్స్ కూడా ఉంటుందన్నారని నరసింహన్ గుర్తు చేశారు. పరిశోధనల నిమిత్తం సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాథమేటిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్(ఏఐఎంఎస్సీఎస్)కు గవర్నర్ ప్రత్యేక నిధి కింద రూ. లక్ష మంజూరు చేశారు. -
ఘనంగా మనబడి స్నాతకోత్సవం
క్యాలిఫోర్నియా : సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. అమెరికాలో క్యాలిఫోర్నియా నగరంలోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో శుక్రవారం మనబడి సంస్థ నిర్వహకులు ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగు యూనివర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనాయరణ చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో మనబడి కలిసి నిర్వహించిన జూనియర్, సీనియర్ సర్టిఫికేట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 300 మంది విద్యార్థులకు ద్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలమైళ్ల దూరంలో ఉన్నా, మాతృభాషపై మమకారంతో తెలుగు భాష నేర్చుకుంటున్న చిన్నారులను, వారిని ప్రోత్సహస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. మనబడి అధ్యక్షుడు రాజు చమర్తి మాట్లాడుతూ.. మొత్తం 1857 మంది విద్యార్థులుకు గాను 1830 మంది ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. అందులో 68.6 శాతం మంది డిస్టింక్షన్లో, 20.4 శాతం మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారని అన్నారు. మిగతా విద్యార్థులకు డాల్లస్, చికాగో, అట్లాంటా, వర్జీనియా, న్యూజెర్సీ నగరాలలో జరగనున్న మనబడి స్నాతకోత్సవాలలో ఎస్వీ సత్యనారయణ చేతుల మీదుగా అందజేయనున్నట్టు తెలపారు. పరీక్షల నిర్వహణలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 2018-19 విద్యాసంవత్సరానికి గాను నమోదు కార్యక్రమం ప్రారంభమైనట్లు వెల్లడించారు. విద్యార్థులు మనబడి వెబ్సైట్ ద్వారా ఆగస్టు 30వ తేది లోగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిబొట్ల మాట్లాడుతూ.. కేజీ నుంచి పీజీ దాకా విద్యాబోధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన మనబడి, సిలికానాంధ్రకు తెలుగు విశ్వవిద్యాలయం తోడు కావడం సంతోషకరమైన విషయమన్నారు. భారత్‌లో నిర్మిస్తున్న సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి కార్యాచరణను ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనబడి ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల, తెలుగు యూనివర్శిటీ అధికారులు ఆచార్య రమేష్ భట్టు, ఆచార్య రెడ్డి శ్యామల, డా.గీతా వాణి, సిలికానాంధ్ర ఉపాధ్యక్షుడు దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిబొట్ల, శ్రీదేవి గంటి, మనబడి బృంద సభ్యులు శ్రీరాం కోట్ని, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, కృష్ణ జయంతి, సాయి కందుల, లక్ష్మి యనమండ్ర తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు వర్సిటీది ఓ విషాద గాథ: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయంలో సమస్యలు తిష్ట వేశాయని, ఆ వర్సిటీది ఓ విషాద గాథ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. బాచుపల్లిలో ఉన్న వర్సిటీ హాస్టల్ 2005లో 50 గదులతో ప్రారంభమైందని, ఇందులో మొదట్లో 100 మంది విద్యార్థులుండగా ఇప్పుడు ఆ సంఖ్య 50కే పరిమితమైందని అన్నారు. హాస్టల్లో మంచినీటి వసతి లేదని, స్థానిక గ్రామ పంచాయతీనే దయతలచి రోజూ ట్యాంకర్ ద్వారా నీరు ఇస్తోందని తెలిపారు. విద్యార్థులు రోజూ పబ్లిక్ గార్డెన్స్‌లోని కళాశాలకు వెళ్లాల్సి ఉంటుందని, కానీ వారికి బస్సు సౌకర్యం లేదని అన్నారు. అసలు బాచుపల్లిలో తెలుగు విశ్వవిద్యాలయం ఉన్న సంగతి ప్రభుత్వానికి తెలుసా..? అని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు, తెలుగు భాషా వికాసం కోసం కనీసం రూ.100 కోట్లు కేటాయించి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్మణ్ కోరారు. మోదీ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు: బీజేపీ సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలతో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీని విమర్శించడం, దూషించడం ద్వారా కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి పెద్ద నాయకుడు కావాలని ఆశపడుతున్నారని ధ్వజమెత్తారు. నైతికత గురించి రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్.. కులం, మతం గురించి ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూసిందని ఆరోపించారు. -
నాట్యానికి ఆధారం అక్షరమే!
32 ఏళ్ల తెలుగు యూనివర్సిటీ చరిత్రలో ఆమెది ఒక శుభారంభం.మహిళగా అందుకున్న తొలి అవకాశం అది.27 ఏళ్ల తన అనుభవాన్ని లలిత కళా పీఠానికి వన్నె తేవడానికే అంకితం చేస్తానంటున్నారు.తొలి మహిళా రిజిస్ట్రార్ అలేఖ్య పుంజలతో ముఖాముఖి... నాకు సినారె రాసిన కర్పూర వసంతరాయలు చాలా నచ్చింది. రెడ్డిరాజుల కాలం, నర్తకీమణి లకుమాదేవి జీవితాన్ని ఆయన కళ్లకు కట్టిన తీరు అద్భుతం. ఆ రచన నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. భారతీయ సాహిత్యంలో తెలుగు ప్రత్యేకత? తెలుగు భాష ఎంతటి మహోన్నతమైనదో తెలుగు సాహిత్యం అంతకంటే విస్తృతమైంది. దాన్ని ఈదాలంటే జీవితకాలం సరిపోదు. సాంస్కృతిక, కళారంగాల్లో మహిళలు ఎక్కువగా కనిపిస్తారు, మరి సాహిత్యరంగంలో ? సంస్కృతి పరిరక్షణలో మహిళలు ఎప్పుడూ ముందుంటారు. సంస్కృతి కలకాలం మనగలగాలంటే సాహిత్యం, కళలు రెండూ అవసరం. మేం ప్రదర్శిస్తున్న నాట్యరూపాలకు ఆధారం సాహిత్యమే. గతంలో సాహిత్యంలో మహిళలు తక్కువగా కనిపించేవారు. అప్పట్లో మహిళల అభిప్రాయాల వ్యక్తీకరణకు స్వేచ్ఛ తక్కువ. ఇప్పుడది పెరిగింది. ప్రస్తుతం తెలుగు సభల్లో రచయితల పట్ల గౌరవ సూచకంగా ద్వారాలకు పేర్లు కనిపిస్తున్నాయి. మరో పదేళ్ల తర్వాత రచయిత్రుల పేరుతో ద్వారాలను చూడవచ్చా? తప్పకుండా... మరో పదేళ్లకు జరిగే తెలుగు మహాసభల్లో రచయిత్రుల పేరుతో స్వాగత ద్వారాలు ఉంటాయి. ఎందుకంటే భావ వ్యక్తీకరణలో నేటి రచయిత్రులు చాలా చురుగ్గా ఉంటున్నారు. స్వాగతించాల్సిన మరో విషయమేమిటంటే.. రచయిత్రులు రాస్తున్నది రొమాంటిక్ పొయెట్రీ కాదు. సామాజిక స్పృహతో, హేతువాద దృక్పథంతో, మహిళాభ్యుదయం ఇతివృత్తంతో వారి రచనలు సాగుతున్నాయి. తెలుగులో కూడా మరో దశాబ్దానికి గొప్ప రచయిత్రులు తెర మీదకు వస్తారనడంలో సందేహం లేదు. మీకు ఎలాంటి రచనలు ఇష్టం? ప్రబంధాల రచనలే నాకిష్టం. ఏ కళాకారిణికైనా పారిజాతాపహరణ వంటి ప్రబంధాలే పంచప్రాణాలుగా ఉంటాయి. ఒక్కొక్క సన్నివేశంలో రచయిత ఊహాశక్తి ద్వారా పాఠకులను అత్యున్నత స్థాయికి చేరుస్తారు. దానిని ఒడిసిపట్టుకుంటే మేము అదే భావాన్ని నాట్యంలో ప్రదర్శించగలుగుతాం. నాట్యం ద్వారా ఆ సన్నివేశాన్ని మరికొంత ఎత్తుకి తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత నన్ను అంతగా ప్రభావితం చేసిన మరొక స్త్రీ పాత్ర రాణి రుద్రమదేవి ..: వాకా మంజులారెడ్డి -
ముంబై వర్సిటీలో తెలుగు శాఖ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తొలిసారి కానప్పటికీ.. తెలంగాణ వచ్చాక మొదటిసారి జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ ప్రత్యేకతను నిరంతరం గుర్తు చేసేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఇందులోభాగంగా ప్రవాస తెలుగువారుండే ప్రాంతాల్లో గుర్తుండిపోయే పనులు చేపట్టాలని సభ నిర్వాహ కమిటీ నిర్ణయించింది. దాదాపు 10 లక్షలకుపైగా తెలుగువారుండే మహారాష్ట్రలో.. తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలల్లో తెలుగు బోధన, ముంబై విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ముంబై–తెలుగు వర్సిటీలు ఒప్పందం చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో పుస్తకాలు ముద్రించి మహారాష్ట్రలోని తెలుగు బోధించే పాఠశాలలకు పంపడం, అక్కడ తెలుగు ఉపాధ్యాయుల నియామకం సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం ప్రారంభించింది. స్థానికుల ఆకాంక్షతో.. మహాసభలను విజయవంతం చేసే క్రమంలో దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో నిర్వాహక కమిటీ సభ్యులు పర్యటిస్తున్నారు. ఆయా నగరాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగు మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ముంబైలో పర్యటించారు. విద్యా బోధన తెలుగులో లేక.. పిల్లల్లో భాషాభిమానం పెంపొందించేందుకు తెలుగు బోధన అవసరమని రమణాచారి, సిధారెడ్డికి అక్కడి స్థానిక తెలుగు కవులు సంగనేని రవీందర్, అమ్మన్న జనార్దన్, సుదర్శన్ వివరించారు. తెలుగు పుస్తకాల పంపిణీ, తెలుగు ఉపాధ్యాయుల నియామకం, ముంబై వర్సిటీలో తెలుగు శాఖ ఏర్పాటు విషయమై చర్చించారు. ఈ విషయాలను వారు మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుకు వివరించగా సానుకూలంగా స్పందించిన గవర్నర్.. అధికారులతో మాట్లాడతానని చెప్పారు. ముంబై నుంచి వెయ్యి మంది ‘మహాసభల కోసం మహారాష్ట్రలోని తెలుగువారు ఉత్సాహంతో ఉన్నారు. ఈసారి 1,000 మంది వరకు అక్కడి నుంచి హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహాసభల సమయంలో ప్రత్యేక రైలు నడపాలని గట్టిగా కోరారు’ – రమణాచారి ప్రత్యేకంగా ఓ పూట చర్చ ‘ఇతర నగరాల్లోని తెలుగువారు భాషా విషయమై ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇతర సమస్యలపై చర్చించేందుకు తెలుగు మహా సభల్లో ప్రత్యేకంగా ఓ పూట కేటాయించాలని అనుకుంటున్నాం. ఆయా ప్రాంతాల ప్రముఖులు వెలుబుచ్చే అంశాల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా చర్చ ఉంటుందని ఆశిస్తున్నాం’ – నందిని సిధారెడ్డి -
ఏ దుస్తులు వేసుకోవాలో అడగాలి: నటుడు
ఆర్టిస్టులకు నిలువుటద్దం మాయాబజార్ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి ఘనంగా మాయాబజార్ షష్టిపూర్తి మహోత్సవం సాక్షి, నాంపల్లి : మాయాబజార్ చిత్రంలోని ఏ సన్నివేశం చూసినా నటించే నటన ఎంతో సహజంగా కనిపిస్తుంది కానీ ఈ రోజు ఆ అవకాశం లేదని సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ రోజుల్లో షూటింగ్‌కు వెళ్లాక ఈ రోజు నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలి బాబు అని అడగాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అప్పుడు అలాంటి పరిస్థితి ఉండేదికానీ నెలజీతం కోసం కొన్ని నెలల పాటు రిహార్సల్స్ చేసేవారన్నారు. సాహిత్య సంగీత సమాఖ్య సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లి తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో విజయ వారి మాయాబజార్ షష్టిపూర్తి మహోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాయాబజార్ చిత్ర విశ్లేషకులుగా హాజరైన జయప్రకాష్‌రెడ్డి, రచయిత వెన్నెలకంటి, సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, చాయాగ్రాహకులు ఎస్. గోపాల్‌రెడ్డి, నాట్య కళాకారిణి శోభానాయుడు, సినీనటులు తనికెళ్ల భరణి, ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాస్, శాంతా బయోటెక్ అధినేత కెఐ వరప్రసాదరెడ్డి, బి. వెంకటరామరెడ్డి, బి. భారతిరెడ్డి హాజరై విశ్లేషించారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజుల్లో సహజంగా నటించే సన్నివేశాలు లేవనన్నారు. ప్రతి ఆర్టిస్టుకు మాయాబజార్ చిత్రం ఓ నిలువుటద్దం లాంటిదన్నారు. సావిత్ర శశిరేఖ లాగా నటించడమంత గొప్పది కాదేమో కానీ, ఘటోత్కచునిగా నటించడం మాత్రం చాలా గొప్ప సన్నివేశమన్నారు. ప్రతి పాత్రకు జీవం పోసిన చిత్రం మాయాబజార్ మరువలేనిదిగా నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా విశాఖ హ్యూమర్ క్లబ్ సంస్థ ఆధ్వర్యంలో పిబరే హ్యూమరసం కడుపుబ్బా నవ్వించే ఆరోగ్యదాయకమైన సభ్యతతో కూడిన లఘు ప్రహసనాల కార్యక్రమం జరిగింది. -
తెలుగు వర్సిటీలో పీహెచ్డీ పేపర్ లీక్
హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ, ఎంఫీల్ ఎంట్రన్స్ పరీక్ష పేపర్ లీక్ కావడం కలకలం రేపింది. రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించిన కామన్ పేపర్ లీకైంది. గురువారం పరీక్ష కేంద్రానికి వచ్చిన ఓ విద్యార్థి 50 ప్రశ్నలకు చేతిపై సమాధానాలు రాసుకొని రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అభ్యర్థులు పరీక్షలను బహిష్కరించి ఆందోళనకు దిగారు. పరీక్ష పత్రం లీక్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న అభ్యర్థులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. లీక్ నేపథ్యంలో ఎంట్రన్ పరీక్షను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. -
తెలుగు వర్సిటీలో పీహెచ్డీ పేపర్ లీక్
-
‘దేశంలో మీడియా న్యూస్‌రూమ్ భవిష్యత్తు’ అంశంపై 14న సదస్సు
సాక్షి, హైదరాబాద్: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటలకు ‘దేశంలో మీడియా న్యూస్‌రూమ్ భవిష్య త్తు’అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ వి.సత్తిరెడ్డి తెలిపా రు. వైస్‌చాన్స్‌లర్ ఎస్వీ.సత్యనారాయణ అధ్యక్షతన డాక్టర్ ఎన్టీఆర్ ఆడిటోరి యంలో జరిగే ఈ సదస్సులో సీనియర్ జర్నలిస్టు విజయసింహ కీలకో పన్యా సం చేయనున్నారు. ఎడిటోరియల్, మేనేజ్మెంట్, ఆడియన్స్ తదితర అంశాల తో ఈ సదస్సు సాగనుంది. -
మన బంధం దృఢమైనది
మంత్రి కేటీఆర్ పలువురికి అరుణ్‌సాగర్ పురస్కారాలు ప్రదానం సిటీబ్యూరో: జర్నలిస్టులు, రాజకీయ నాయకులది ఆలూమగల సబంధమని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్టు అవార్డ్స్ ప్రదానం, స్మారకోపన్యాసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు తమకి రుచించని వార్తలు వేయవచ్చని తనదైన శైలిలో చమత్కారించారు. అరుణ్ సాగర్‌తో తనకు పెద్దగా సాన్నిహిత్యం లేదని, రచనలు చదివిన తర్వాత అద్భుతమైన భాష కనిపించిందన్నారు. అరుణ్‌సాగర్ మృతి తర్వాత టీవీ 5 యాజమాన్యం ఆ కుటుంబానికి అండగా నిలబడిందని, అతని ప్రతిభను గుర్తించి అవార్డు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఫ్రింట్ మీడియా నిర్వాహకులు కూడా ఇలాచేస్తే బాగుంటుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూల నిధి ఇవ్వడంతో పాటు హెల్త్‌కార్డులు, హౌసింగ్ లాంటి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ సమకూర్చే విషయం సీఎం చాలా పట్టుదలగా ఉన్నారన్నారు. టీవీ యాంకర్లు వారానికి ఒకరోజు చేనేత దుస్తులు ధరించేలా మీడియా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. నిర్వాసిత ప్రాంతం నుంచి అరుణ్ సాగర్ హైదరాబాద్ నగరంలో నిలబడి గెలిచాడన్నారు. మంచి రచయిత, జర్నలిస్టు, కవి అని కొనియాడారు. అరుణ్ సాగర్ పేరుతో ఫ్రింట్ మీడియాలో ముగ్గురికి, ఎలక్ట్రానిక్ మీడియాలో ముగ్గురికి, ఒక సాహితీవేత్తకు అవార్డ్స్ అందజేస్తున్నామన్నారు. జ్యూరీ కమిటీ కె. రామచంద్రమూర్తి, కె. శ్రీనివాస్, కట్టా శేఖర్ రెడ్డితో కూడిన కమిటీ అవార్డులకు పేర్లు ఎంపిక చేసిందని వివరించారు. ప్రభుత్వ విప్ పల్లా రా>జేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. కవిగా, జర్నలిస్టుగా అరుణ్‌సాగర్ విలువలు పాటిస్తూ పయనించడం వల్లే అందరిమదిలో నిలిచిపోయారన్నారు. వాదాలు ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా కవిత్వం జోడించి వార్తలు రాసి అందరి మనసులను దోచుకున్నారన్నారు. అనంతరం అరుణ్‌సాగర్ అక్షరశ్వాస పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీవీ5 ఎండీ బి.రవీంద్రనాథ్, ఎమ్మెల్యే జి.కిశోర్, జడ్పీ చైర్మన్ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీకి చెందిన సీనియర్ జర్నలిస్టు తెలంగాణ ప్రాంతవాసి ఎస్.వెంకట నారాయణ మాట్లాడుతూ.. అరుణ్‌సాగర్ రచనలు విలియం ఓట్స్వర్ను గుర్తు చేశాయన్నారు. అవార్డు గ్రహీతలు వీరే.. ఫ్రింట్ మీడియా నుంచి ప్రథమ బహుమతి సరస్వతి రమ (సాక్షి చీఫ్ సబ్ఎడిటర్), రెండో బహుమతి ధాయి శ్రీశైలం (నమస్తే తెలంగాణ), మూడో బహుమతి భూపతి రాములు (ఆంధ్రజ్యోతి), ఎలక్ట్రానిక్ మీడియా నుంచి మొదటి బహుమతి ఉమ (టీవీ5), రెండో బహుమతి రెహనా (ఎన్టీవీ), మూడో బహుమతి జయప్రకాశ్ (ఈటీవీ) ఉన్నారు. మొదట బహుమతికి రూ.75 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు, మూడో బహుమతికి రూ. 25 వేలు అందజేశారు. అరుణ్ సాగర్ సాహితీ పురస్కారాన్ని ఖాదర్ మొహియిద్దీన్కి అందజేశారు. సరస్వతి రమ విదేశాల్లో ఉన్నందున ఆమె మిత్రురాలు ఓ మధు బహుమతి అందుకొన్నారు. -
కావ్య ప్రపంచ సృష్టికర్త ‘కవి’
రాజమహేంద్రవరం కల్చరల్ : ‘అపారమైన కావ్యప్రపంచానికి సృష్టి కర్త కవి. ఒక కవిని సత్కరించుకోవడమంటే భగవంతుని సత్కరించుకోవడమే’ అని బొమ్మూరు తెలుగు సాహిత్యపీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పేర్కొన్నారు. సోమవారం తెలుగుభాషాదినోత్సవాన్ని పురస్కరించుకుని గౌతమఘాట్‌లోని శ్రీవిశ్వవిజ్ఞానవిద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ప్రముఖ తెలుగు గేయకవి మహమ్మద్ ఖాదర్‌ఖాన్‌ను స్కరించారు. ఈ సందర్భంగా సభాసంచాలకత్వం వహించిన ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ రాజులు ప్రపంచాన్ని శాసించగలరేమో గానీ అక్షరసృష్టితో కావ్యజగత్తుని శాసించగల సత్తా ఒక కవికి మాత్రమే ఉందన్నారు. రాజకీయాలు పెరిగాక కవులకు, కళాకారులకు, ఆధ్యాత్మిక వేత్తలకు ప్రాధాన్యత తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వాన్ని, ప్రేమతత్వాన్ని రంగరించి కవితలు అల్లుతున్న ఖాదర్‌ఖాన్‌ను సత్కరించుకోవడం అందరికీ గర్వకారణమన్నారు. అధ్యక్షత వహించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ పీఠంలో కుల, మత వివక్ష లేదన్నారు. స్వాగతవచనాలు పలికిన రాష్ట్రపతి సమ్మానిత చింతలపాటి శర్మ మాట్లాడుతూ భాష ప్రవాహం వంటిదని, పాత పదాలు పోయి, కొత్తపదాలు వస్తూనే ఉంటాయని అన్నారు. తెలుగు భాషలో అరబ్బీ, ఉర్దూ, పారశీపదాలు కలిసిపోయినట్టే, తెలుగు పదాలు అరబ్బీలో కలిసిపోయాయన్నారు. ఇతర భాషాపదాల వినిమయం ఏ భాషకైనా తప్పదన్నారు. వ్యావహారిక భాషోద్యమకారుడు గిడుగు రామమూర్తికి నివాళులర్పించారు. విశ్రాంత ప్రిన్సిపాల్ పసల భీమన్న, ప్రజాపత్రిక గౌరవసంపాదకుడు సుదర్శన శాసి్త్ర,నాట్యాచార్యుడు సప్పా దుర్గా ప్రసాద్ ప్రసంగించారు. ఉమర్ ఆలీషాచేతుల మీదుగా ఖాదర్‌ఖాన్‌ను సత్కరించారు. పలువురు సాహిత్యాభిమానులు హాజరయ్యారు. -
ఎన్టీఆర్ మానసపుత్రిక పై ఇంత నిర్లక్ష్యమా!
తెలుగు విశ్వ విద్యాలయాపట్టించుకోని చంద్రబాబు సర్కారు సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపాటు రాజమహేంద్రవరం రూరల్: ‘తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మానస పుత్రికైన తెలుగు విశ్వ విద్యాలయంపై ఇంత నిర్లక్ష్యమా’ అంటూ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంపై ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరులోని తెలుగు విశ్వ విద్యాలయం సాహిత్య పీఠాన్ని శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాహిత్య పీఠంలో కేవలం తొమ్మిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, వారం రోజులుగా కరెంటు లేకపోయినా పాములు, తేళ్ల మధ్యే వారు జీవించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వంట కూడా వారే చేసుకోవాల్సి వస్తోందన్నారు. గతేడాది గోదావరి పుష్కరాల ముగింపు సందర్భంగా రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఇచ్చిన అనేక హామీల్లో ‘రాజమహేంద్రవరం’ పేరు మార్పు తప్ప మిగిలిన వేవీ అమలుకు నోచుకోలేదన్నారు. ఇటీవల మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగు వర్సిటీని త్వరలోనే రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, ఆ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం స్థానిక ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కృషి చేయాలన్నారు. ఆదికవి నన్నయ వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలలు ఇంకా ఏయూలో ఉండటం దుర్మార్గమని మండిపడ్డారు. -
పాటను దృశ్యంతో చూపడం అభినందనీయం
ప్రముఖ సాహితీవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజమహేంద్రవరం రూరల్ : మాట కంటే పాట మధురమైనది, ఆ పాటను దృశ్యంతో చూపడం అభినందనీయమని ప్రముఖ సాహితీ వేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. శనివారం బొమ్మూరులోని తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠంలో ‘పుష్కరాలు వచ్చెనమ్మ కృష్ణవేణికి’ ప్రత్యేక గీతం సీడీని ఆయన ఆవిష్కరించారు. కడప జిల్లాకు చెందిన గండ్లూరినారాయణరావు గేయరచన చేయగా, ఇరిగేషన్ ఉద్యోగి జివి.రమణ, సురేఖామూర్తి నేపథ్యగానం అందించారు. ఈసందర్బంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ కృష్ణాపుష్కరాలకు సంబంధించిన ఈ పాట పిల్లలకు విజ్ఞానదాయకంగా ఉంటుందన్నారు. పాటతోపాటు కృష్ణానది విశిష్టతను తెలిపే దృశ్యాలను కూడా సీడీలో పొందుపరచడం అభినందనీయం అన్నారు. అనంతరం నేపథ్య గాయకుడు జివి.రమణను అభినందించారు. డాక్టర్ యార్లగడ్డను జీవీరమణ శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాహిత్యపీఠం పీఠాధిపతి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, ప్రముఖ సేవకులు పట్టపగలు వెంకట్రావు, సీనియర్ పాత్రికేయులు సన్నిధానం శాస్త్రి, ఎస్ బ్యాంక్ మేనేజర్ ఘంటసాల శ్యామలకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఏకోపాధ్యాయ పాఠశాలగా సాహిత్య పీఠం
రెండేళ్ల నుంచీ నిధుల కొరత డీన్‌గా ఎండ్లూరి సుధాకర్ రాజమహేంద్రవరం కల్చరల్ : ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు సాహిత్యపీఠం ఏకోపాధ్యాయ పాఠశాలగా మారిపోయింది. నేను ఒక్కడినే పూర్తిస్థాయి అధ్యాపకుడిని, మరో నలుగురు సందర్శకాచార్యులు (విజిటింగ్ప్రొఫెసర్లు’) ఉన్నారు’ అని ఇటీవలే డీన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎండ్లూరి సుధాకర్ పేర్కొన్నారు. తెలుగు సాహిత్య పీఠానికి ఉన్న ఘనమైన చరిత్ర, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్టీఆర్ మానస పుత్రిక దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మానస పుత్రికైన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1985 డిసెంబర్లో ఆవిర్భవించింది. ఎన్టీఆర్ ఆశీస్సులతో నాటి విద్యామంత్రి ఎర్నేని సీతాదేవి పూనుకోవడంతో 1987లో బొమ్మూరులో తెలుగు సాహిత్యపీఠం ఏర్పడింది. బోధన, పరిశోధనలే ప్రధాన అంశాలుగా 48 ఎకరాల్లో సాహిత్యపీఠం నెలకొంది. ఆచార్య బాలాంత్రపు రజనీకాంత రావు, కొత్తపల్లి వీరభద్రరావు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆర్వీఎస్ సుందరం తదితర మహనీయుల సారథ్యంలో నడిచింది. విద్యార్థుల ప్రగతికి బాటలు ఇప్పటివరకు సుమారు 513 మంది విద్యార్థులు తెలుగులో ఎంఏ పట్టా అందుకున్నారు. 390 మంది ఎంఫిల్ పూర్తిచేశారు. సుమారు 341 మంది పరిశోధకులకు డాక్టరేట్ లభించింది. దేశవిదేశాల నుంచి ఎందరో వచ్చి ఇక్కడ పరిశోధనలు చేశారు. ద్వానా శాస్త్రి, అద్దేపల్లి రామ్మెహనరావు, గరికిపాటి నరసింహారావు, ఆర్ఎస్ వెంకటేశ్వరరావు, అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు, కేసాప్రగడ సత్యనారాయణ తదితరులు ఇక్కడ పరిశోధనలు చేసి డాక్టరేట్ అందుకున్నవారే. జీతాలు సక్రమంగా రాక.. ఒకప్పుడు ఎంఏ చదివే విద్యార్థులు ఏటా 40కి పైగా ఉండేవారు. నిరంతరం సాహితీ కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. ప్రస్తుతం 9 మంది తెలుగు ఎంఏ చదువుతున్న విద్యార్థులు, ముగ్గురు పరిశోధకులు ఉన్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో ప్రవేశ ప్రకటన ఆలస్యంగా వెలువడింది. పనిచేస్తున్నవారికి జీతాలు సక్రమంగా అందడం లేదు. సీఎం ప్రకటన సాకరమైతే.. రాజమహేంద్రవరం ప్రధానకేంద్రంగా పూర్తిస్థాయి తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అది సాకారమయ్యే రోజు కోస ంఎదురు చూస్తున్నాం. పూర్తిస్థాయి విశ్వవిద్యాలయం ఏర్పడితే లలితకళలకు సంబంధించిన అన్ని విభాగాలు ఇక్కడికి వస్తాయి. జాషువా కళాపీఠం, కుసుమ ధర్మన్న కళాపీఠం, బోయి భీమన్న కళాపీఠం ఏర్పడటానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే పూర్తిస్థాయి ఉపకులపతిని నియమించాలి. రెండేళ్ల నుంచీ పీఠం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. -
తెలుగు వర్సిటీలో ప్రత్యేక పుస్తక ప్రదర్శన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక పుస్తక ప్రదర్శన జరుగుతుంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈ ప్రదర్శనలో తెలుగు భాషా సాహిత్యాలు, కళా సంస్కృతులకు సంబంధించిన అరుదైన గ్రంథాలు తగ్గింపు ధరల్లో లభిస్తాయి. 2 వ తేదీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. విద్యార్థులచే తెలంగాణ గీతాలాపన, తెలంగాణ 10 జిల్లాల నుంచి వచ్చే 60 మంది కవులతో కవి సమ్మేళనం ఉంటుంది. అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవుల పల్లి ప్రభాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అతిధులుగా పాల్గొంటారని రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు -
ఆదికవి నన్నయ వర్సిటీపై నిర్లక్ష్యం
రాజానగరం : రాష్ట్ర బడ్జెట్లో ఉన్నత విద్యకు అతిస్వల్పంగానే కేటాయించారంటూ విద్యారంగానికి చెందిన పలువురు పెదవి విరుస్తున్నారు. రూ.1,35,688 కోట్ల బడ్జెట్లో ఉన్నత విద్యకు కేవలం రూ. 2,548 కోట్లు కేటాయిం చగా అందులో జిల్లాకు కేవలం రూ.10 కోట్లే కేటాయించారు. ఆ మొత్తంకూడా తెలుగు యూనివర్సిటీకే కేటాయించి, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన ఆదికవి నన్నయ యూనివర్సిటీని విస్మరిం చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు వర్సిటీకి దక్కిందిలా.. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు యూనివర్సిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వారెందరో ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందజేశారు. దాంతో రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా శ్రీకాకుళం, కూచిపూడి శాఖలను అభివృద్ధి చేస్తామన్న పాలకులు ఈ బడ్జెట్లో రూ. 50 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పుడు ఆ హామీకి కూడా పూర్తిగా నెరవేర్చకుండా తెలుగు వర్సిటీకి కేవలం రూ.10 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నారు. సుమారు 40 ఎకరాలు పైబడి భూములు వర్సిటీకి ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉన్న తెలుగు వర్సిటీని రాష్ర్టంలోని 13 జిల్లాలకు విస్తరించాల్సిన సమయంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తెలుగు పాఠకుల హృదయ సామ్రాజ్ఞి
‘నవలకు నీరాజనం’లో యద్దనపూడిని కొనియాడిన వక్తలు హైదరాబాద్: తెలుగు పాఠకుల హృదయ సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనారాణి అని వక్తలు కొనియాడారు. యువతలో కల్పనా భావం పెంపొందించేందుకు ఆమె రచనలు దోహద పడతాయని తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి పేర్కొన్నారు. ఐదు దశాబ్దాల కింద ఆమె రచించిన ‘సెక్రటరీ’ నవల సంచలనం సృష్టించి నేటికీ పాఠకుల మదిలో చిరస్థాయిగా నిలిచిందని కొనియాడారు. సెక్రటరీ నవల స్వర్ణోత్సవం సందర్భంగా లేఖిని మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభ లో జరిగిన ‘నవలకు నీరాజనం’ కార్యక్రమానికి శివారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఓ నవల స్వర్ణోత్సవంతో పాటు 90 ముద్ర ణలకు నోచుకోవడం దేశ చరిత్రలోనే లేదని, సెక్రటరీ నవల ఈ ఘనతను తొలిసారిగా దక్కించుకుందని పేర్కొన్నారు. విశిష్ట అతిథి ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్ర మూర్తి మాట్లాడుతూ.. నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, యువత మ నస్తత్వానికి అద్దంపట్టేలా అప్పట్లోనే సులోచనారాణి రచనలు చేశారని చెప్పారు. ఆత్మగౌరవంతో పాటు గౌరవప్రదంగా జీవించాలనుకునే మనస్తత్వమున్న పాత్రలు ఆమె రచనల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. సెక్రటరీ నవల 90వ ముద్రణను ప్రముఖ చిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ ఆవిష్కరించారు. సులోచనా రాణి అనేక నవలలు సినిమాలుగా వచ్చినా, తాను మాత్రం ఆమె నవలలను సినిమాగా తీయలేకపోయానని చెప్పారు. పాఠకులు చూపిస్తున్న అభిమానానికి హృదయం ఉప్పొంగిపోతోందని సులోచనా రాణి పేర్కొన్నారు. ఒకప్పుడు రచయిత్రుల రచనలు అంతగా ప్రాచుర్యం పొందలేదని, సెక్రటరీ నవలతోనే రచయిత్రుల యుగం ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశ లో రచయిత్రుల పేర్లతో నవలలు రాసే పరిస్థితి వచ్చిందన్నారు. 1965లో సీరియల్‌గా వచ్చిన సెక్రటరీ నవల అదే ఏడాది పుస్తకం గా వచ్చిందని, ఈ పుస్తకం 90 ముద్రణలకు నోచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. రచయిత్రి వాసా ప్రభావతి మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల కింద స్త్రీ మనసు ఏ ప్రేమను కోరుకుందో నేటి స్త్రీ మనసు కూడా అదే ప్రేమను కోరుకుం టోందని చెప్పారు. ఈ సందర్భంగా సులోచనారాణిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జ్యోతి మాస పత్రిక సంపాదకుడు లీలావతిరాఘవయ్య, ఎమెస్కో పబ్లిషర్ ధూపాటి విజయకుమార్, టీవీ సీరియల్ దర్శకురాలు మంజుల నాయుడు, సుధాకర్ పల్లమాల, మృణాళిని, కళాదీక్షితులు, ప్రముఖ నాట్య కళాకారిణి వింజమూరి సుజాత, పొత్తూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభంలో స్నేహలత మురళి బృందం జానపద నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది. -
వారు నిధులిస్తారు.. మీరు చెల్లించండి
అంబేడ్కర్, తెలుగు వర్సిటీల రిజిస్ట్రార్లకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 92 సేవా కేంద్రాలు, శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 3ప్రాంతీయ పీఠాల్లో పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చే నిధులను స్వీకరించి, వాటిని ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాలని హైకోర్టు బుధవారం ఇరు యూనివర్సిటీల రిజిస్ట్రార్లను ఆదేశించింది. ఇదే సమయంలో 92 సేవా కేంద్రాలు, 3 ప్రాంతీయ పీఠాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఉన్న ప్రాంతీయ కేంద్రాలకు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తన సేవలను నిలిపేసిందని, దీనివల్ల 3.5 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంబ దులు పడుతున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. ఇదే సమయంలో ఏపీలోని క్యాంపస్‌లకు తమ సేవలను నిలిపేస్తూ తెలుగు విశ్వవిద్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రెండు వ్యాజ్యాలను బుధవారం ధర్మాసనం మరోసారి విచారించింది. ఏపీలోని స్టడీ సెంటర్లు, ప్రాంతీయ పీఠాల్లో ప్రస్తుతం ఎంత మంది పనిచేస్తున్నారు.. ఎంత మంది పదవీ విరమణ చేశారు.. వారికి చెల్లించాల్సిన మొత్తం ఎంత? తదితర వివరాలను ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఇవ్వాలని 2 యూనివర్సిటీల రిజిస్ట్రార్లను ఆదేశించింది. వాటి ఆధారంగా నిధులకు సంబంధించిన చెక్కులను రిజిస్ట్రార్లకు అందచేయాలని ముఖ్య కార్యదర్శికి తెలిపింది. చెక్కులు అందుకున్న తరువాత ఆ మొత్తాలను ఉద్యోగులకు చెల్లించాలంది. -
తెలుగు వర్సిటీకి నిధులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు యూనివర్సిటీకి చెందిన మూడు ప్రాంగణాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు సంబంధించి నిధులు విడుదల చేయాలని ఏపీ ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏపీ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఎల్.వేణుగోపాలరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొ.పి.విజయప్రకాశ్, ప్రొ.పి.నరసింహారావు, ఉన్నత విద్యాశాఖ డిప్యుటీ కార్యదర్శి నీలకంఠనాధరెడ్డి పాల్గొన్నారు. 3 ప్రాంగణాలకు సంబంధించి 2015 ఆగస్టు నుంచి 2016 మార్చి వరకు సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణకు రూ. 4,34,67,616 ఇవ్వాలని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ ఉన్నత విద్యాశాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వహణకు రూ. 80 లక్షలను వర్సిటీకి విడుదల చేయాలని, 2014 జూన్ నుంచి 2015 జులై వరకు ఇవ్వాల్సిన బకాయి రూ. 6,03,53,560 మొత్తాన్ని రీయింబర్స్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ లేఖపై సమావేశంలో చర్చించి 2016 మార్చి వరకు జీతభత్యాలు, పరీక్షల నిర్వహణకు మాత్రమే నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. వర్సిటీ రిజర్వుడ్ నిధుల్లో ఏపీ వాటా కూడా ఉన్నందున వాటి లెక్క తేల్చే సమయంలో పాత బకాయిలను సర్దుబాటు చేస్తామని తెలంగాణకు లేఖ రాయనున్నారు.అదే విధంగా అంబేడ్కర్ వర్సిటీకి కూడా నిధులు ఇవ్వాలని నిర్ణయించి ఆ మేరకు ఆ వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్‌తో సుమితా దావ్రా మాట్లాడారు. అక్కడి నుంచి ప్రతిపాదనలు రాగానే నిధులు విడుదల చేయనున్నారు. -
విద్యా సమాచారం
నేటి నుంచి తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: తెలుగు వర్సిటీలో ఎంఏ, పీహెచ్డీ కోర్సులకు సంబంధించి బుధవారం నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 వరకు కొనసాగే పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు రిజిస్ట్రార్ తోమాసయ్య మంగళవారం తెలిపారు. జానపద గిరిజన విజ్ఞానం పీహెచ్డీ ప్రవేశ పరీక్ష వరంగల్‌లోని గిరిజ విజ్ఞాన పీఠంలో 17న జరుగుతుంది. మిగిలిన కోర్సుల హైదరాబాద్‌లోని వర్సిటీ ప్రాంగణలో పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీలోనూ తెలుగు వర్సిటీ ప్రవేశాలు సాక్షి, హైదరాబాద్: వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు తెలుగు వర్సిటీ ఏపీలో కూడా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తమ రాష్ర్ట విద్యార్థులకు సేవలు అందించినందుకు ఏ మేరకు నిధులు అవసరమో కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలను తెలంగాణ సర్కారు ఏపీకి అందించనుంది. ఆ వెంటనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ విద్యార్థులకు తెలుగు వర్సిటీ పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలి. తమ రాష్ట్ర విద్యార్థులకు వర్సిటీ సేవలు అందించినందుకు గాను అయిన ఖర్చును ఏపీ ప్రభుత్వం భరించాలి. ఈ అంశంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడిచింది. అయితే గత నెలలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. రేపటి నుంచి ‘ఆయుష్’ కౌన్సెలింగ్ ఏపీలో 15, 16, తెలంగాణలో 17, 18 తేదీల్లో నిర్వహణ విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ఆయుర్వేద, హోమియో, నేచురోపతి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీలో ఈ నెల 15, 16 తేదీల్లో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో, అలాగే తెలంగాణలో ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ జేఎన్టీయూ (కూకట్పల్లి)లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆయుర్వేద(బీఏఎంఎస్) కోర్సుకు ఏపీలోని ఏయూ పరిధిలో ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, విజయవాడలో 28 సీట్లు, ఎస్వీయూ పరిధిలో తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో 39 సీట్లు, ప్రైవేటు కళాశాలైన శ్రీఆది శివసద్గూరు అల్లీ సాహెబ్ కళాశాల, గుంతకల్లులో (ఏ-కేటగిరీ 50+బి-కేటగిరీ 10) 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. హోమియో (బీహెచ్ఎంఎస్) కోర్సుకు సంబంధించి ఏయూ పరిధిలో గురురాజు కళాశాల, గుడివాడలో 39, రాజమండ్రి అల్లు రామలింగయ్య కళాశాలలో 49, ఏయూ పరిధిలో విజయనగరం మహారాజ కళాశాలలో 30, నేచురోపతి (బీఎన్‌వైఎస్)లో ఎస్వీయూ పరిధిలో గుంతకల్లు పతంజలి మహర్షి నేచురోపతి కళాశాలలో 60 సీట్లకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. కాకినాడ జేఎన్టీయూ నిర్వహించిన ఏపీ ఎంసెట్‌లో అర్హత సాధించినవారే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. తెలంగాణలో... ఆయుర్వేద (బీఏఎంఎస్)లో హైదరాబాద్ డాక్టర్ బీఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో 48, వరంగల్ ఏఎల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో 49 సీట్లు అందుబాటులో ఉన్నాయి. హోమియో (బీహెచ్ఎంఎస్)లో హైదరాబాద్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియో కాలేజీలో 59, ప్రైవేటు కళాశాలలైన రంగారెడ్డి జిల్లా కీసరలోని దేవ్స్ హోమియో కళాశాలలో 30, హైదరాబాద్ జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీలో 60, నేచురోపతిలో స్టేట్‌వైడ్ కళాశాల (ఏపీ, తెలంగాణ)కు కలిపి గాంధీ నేచురోపతి మెడికల్ కళాశాలలో 30 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హులు. -
14 నుంచి తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రాంతానికి ప్రకటించిన వివిధ కోర్సులకు ఈ నెల 14 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 14న ఎం.ఎ. తెలుగు, పి.హెచ్.డి తెలుగు, ఎం.ఎ సంగీతం, పి.హెచ్.డి తులనాత్మక అధ్యయనం కోర్సులకు పరీక్షలు జరుగుతాయి. 15న ఎం.సి.జె, ఎం.పి.ఎ రంగస్థల కళలు, పి.హెచ్.డి నృత్యం, పి.హెచ్.డి రంగస్థల కళలు, పి.హెచ్.డి. భాషా శాస్త్రం కోర్సులకు పరీక్షలు ఉంటాయి. 16 న ఎం.పి.ఎ జానపద కళలు, ఎం.ఎ. భాషాశాస్త్రం, పి.హెచ్.డి జ్యోతిష్యం కోర్సులకు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలోనూ, 17న పి.హెచ్.డి జానపద గిరిజన విజ్ఞానం కోర్సుకు వరంగల్ పీఠంలోనూ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఎం.ఎ సంగీతం, ఎం.పి.ఎ రంగస్థల కళలు, జానపద కళల కోర్సులకు మధ్యాహ్నం ప్రాయోగిక పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు చివరి గడువు 17 హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మూడేళ్ల డిగ్రీ కోర్సు (బీఏ, బీకాం, బీఎస్సీ)లో చేరేందుకు ఈ నెల 17 ఆఖరు తేదీ అని హైదరాబాద్‌లోని విద్యానగర్ వర్సిటీ స్టడీసెంటర్ కో ఆర్డినేటర్ వి.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించి వారు, ఇంటర్మీడియెట్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారు ప్రవేశాలకు అర్హులని చెప్పారు. వివరాలకు విద్యానగర్‌లోని స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్ వర్సిటీ అధ్యయన కేంద్రంలోగాని, 040 2005 1557 నంబర్లో గాని సంప్రదించాలన్నారు. 18న ఓయూసెట్ ఎంఈడీ కౌన్సెలింగ్ హైదరాబాద్: ఓయూసెట్-2015లో భాగంగా ఎంఈడీ కోర్సులో ప్రవేశానికి తొలిసారిగా ఈ నెల 18న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. ఉస్మానియా, పాలమూరు వర్సిటీల్లోని 242 సీట్ల భర్తీకి ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ నెల 18న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు. ‘దసరా’లో క్లాసులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు సాక్షి, హైదరాబాద్: ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్న దసరా సెలవుల్లో జూనియర్ కాలేజీలు తరగతులు నిర్వహించినా, విద్యా సంబంధ కార్యక్రమాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 నుంచి 25 వరకు అన్ని కాలేజీలు సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు. మెదక్‌లో ఫారెస్ట్ కాలేజీకి రూ. 45.79 కోట్లు సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా నర్సంపేటలోని ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిసరాల్లో ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు రూ.45.79 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ ఇన్స్టిట్యూట్లో బీఎస్సీ (ఫారెస్ట్రీ), ఎమ్మెస్సీ (ఫారెస్ట్రీ), పీహెచ్డీ (ఫారెస్ట్రీ) కోర్సులు ఆఫర్ చేస్తారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, డెహ్రాడూన్ అనుబంధంగా ఈ ఇన్స్టిట్యూట్ పనిచేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
'కోర్టు తీర్పు మాకు సానుకూలం'
హైదరాబాద్: అంబేడ్కర్, తెలుగు విశ్వవిద్యాలయాలపై కోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సానుకూలంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్క మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలన్నారు. గవర్నర్ మాట కూడా లెక్కచేయకుండా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని వాపోయారు. పాఠ్యపుస్తకాల్లో సిలబస్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. పాఠ్యపుస్తకాల్లో ఆంధ్ర కవుల, రచయితల పాఠాలను తొలగించడం దారుణమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
స్టడీ సెంటర్లకు సేవలు కొనసాగించాలి: హైకోర్టు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు, అంబేద్కర్ యూనివర్సిటీల సేవలు నిలిపివేయడంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ అంశంపై 'సాక్షి' కథనానికి స్పందించిన న్యాయస్థానం... ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శులు కలిసి మాట్లాడుకోవాలని గతవారమే సూచించిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పురోగతి లేకపోవటంతో విద్యార్థుల భవిష్యత్ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న స్టడీ సెంటర్లకు సేవలు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. అలాగే ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఉద్యోగుల జీతాలను ఏపీ ప్రభుత్వమే చెల్లించాలని సూచించింది. ఈ వివాదాన్ని ఎనిమిది వారాల్లోగా తెల్చాలని కేంద్ర హోంశాఖకు ఆదేశిస్తూ, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని క్యాంపస్‌లకు తన సేవల్ని నిలిపేస్తూ శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీలోని క్యాంపస్‌లకు గతంలో మాదిరిగా యథాతథంగా తన సేవల్ని కొనసాగించేలా తెలుగు వర్సిటీని ఆదేశించాలని కోరుతూ ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి జి.కన్నందాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను ప్రతివాదిగా పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయని, ఇందులో 348 మంది విద్యార్థులు చదువుతున్నారని, అలాగే బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. తెలుగు విశ్వవిద్యాలయం తన సేవల్ని ఆంధ్రప్రదేశ్‌లో క్యాంపస్‌లకు నిలిపేయడం వల్ల వీరంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన విషయం తెలిసిందే. -
వర్సిటీల సేవలపై కుదరని సయోధ్య
పాతపద్ధతిలోనే కొనసాగించాలన్న ఏపీ, నో చెప్పిన తెలంగాణ అంబేడ్కర్ సార్వత్రిక, తెలుగు వర్సిటీ సేవల వివాదం హైదరాబాద్: పదో షెడ్యూల్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక, తెలుగు యూనివర్సిటీల సేవల ఒప్పంద విషయంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. భౌగోళికంగా తెలంగాణలో ఉన్న వర్సిటీల సేవలు కావాలంటే ఆ ప్రభుత్వంతో చట్టపరంగా ఒప్పందం కుదుర్చుకోవాలని హైకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. సేవల ఒప్పందం విషయమై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖ కార్యదర్శులు సమావేశం కావాలని సూచించిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు రాజీవ్ రంజన్ ఆచార్య, సుమిత్రా దేవరాతోపాటు అంబేడ్కర్ వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్, తెలుగు వర్సిటీ వీసీ శివారెడ్డి, రిజిస్ట్రార్ తోమాసయ్య, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి చాంబర్లో గురువారం భేటీ అయ్యారు. గతేడాది మాదిరిగా తాము ఎటువంటి నిధులు అందించకున్నా తమ రాష్ట్రానికి సేవలు ఉచితంగా అందించాలని ఏపీ ప్రభుత్వం కోరగా, తెలంగాణ అధికారులు విముఖత వ్యక్తం చేశారు. ఏపీలోని స్టడీ సెంటర్లు, వర్సిటీ పీఠాల నిర్వహణను తాము చేపట్టలేమని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్తోమత లేదని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచించే షరతులు, నిబంధనలను పాటిస్తామని ఏపీ అధికారులు పేర్కొన్నారు. ఎవరివాదనకు వారు కట్టుబడి ఉండడంతో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరలేదు. అయితే, చర్చల ద్వారా వచ్చిన పురోగతిని తమ ముందు ఉంచాలని ఇరురాష్ట్రాల అడ్వొకేట్ జనరళ్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసు ఈ నెల 4వ తేదీన ధర్మాసనం ముంగిట ఏ సమాచారంతో హాజరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. -
తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్, వరంగ ల్ ప్రాంగణాల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రకటించిన వివిధ కోర్సులకు ఈ నెల 7 నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంఏ, ఎంపీఏ, ఎంసీజే, పీజీడిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సులకు ప్రవేశ పరీక్షలను త్వరలో నిర్వహిస్తామని రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య వెల్లడించారు. -
తెలుగు వర్సిటీ పరీక్షలు వాయిదా
నాంపల్లి (హైదరాబాద్): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్, వరంగల్ ప్రాంగణాల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రకటించిన వివిధ కోర్సులకు ఈ నెల 7వ తేదీ నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రెగ్యులర్, సాయంకాలం నిర్వహించే ఎంఏ, ఎంపీఏ, ఎంసీజే, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సులకు ప్రవేశ పరీక్షలను త్వరలో నిర్వహిస్తామని, తేదీలు తరువాత ప్రకటిస్తామని రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. -
తెలుగు వర్సిటీ దూరవిద్య పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 3 నుంచి 23 వరకు హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం కేంద్రాల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే పదో షెడ్యూల్లో ఉ న్న ఈ వర్సిటీ సేవలు కావాలని ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం.. ఒప్పందం లేనిదే సేవలు అందించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం మెట్టు దిగక పోవడంతో వివాదం జఠిలమైంది. స్వయంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ జోక్యం చేసుకున్నా పరి ష్కారం లభించలేదు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో ఏదో ఒక స్పష్టత వచ్చే వరకు పరీక్షల నిర్వహణను నిలిపివేయాలని వర్సిటీ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. దూర విద్య పరీక్షలను రెండు రాష్ట్రాల్లో వాయిదా వేస్తున్నట్లు, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ తోమాసయ్య సోమవారం తెలిపారు. -
రాజమండ్రిలో త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం
అధికార భాషా సంఘం చైర్మన్‌గా పొట్లూరి హరికృష్ణ ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరిగేలా చూస్తాం తెలుగు భాషా దినోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విజయవాడ: తెలుగు విశ్వవిద్యాలయాన్ని త్వరలో రాజమండ్రిలో ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామ్మూర్తి పంతులు 132వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విభజన పూర్తయిన వెంటనే రాజమండ్రిలో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. లలిత, సాహిత్య, సంగీత, నాటక అకాడమీలను త్వరలో పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇకపై ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికార భాషా సంఘాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. దాని చైర్మన్‌గా తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణను నియమిస్తున్నట్లు ప్రకటించారు. హరికృష్ణతోపాటు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌లతో ఒక కమిటీని వేసి తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. -
తెలుగు వర్సిటీ నోటిఫికేషన్ అమలును నిలిపేయండి
హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ పిటిషన్ గతంలో మాదిరిగా సేవలందించేలా ఆదేశించాలని అభ్యర్థన హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని క్యాంపస్‌లకు తన సేవల్ని నిలిపేస్తూ శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీలోని క్యాంపస్‌లకు గతంలో మాదిరిగా యథాతథంగా తన సేవల్ని కొనసాగించేలా తెలుగు వర్సిటీని ఆదేశించాలని కోరుతూ ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి జి.కన్నందాస్ గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను ప్రతివాదిగా పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయని, ఇందులో 348 మంది విద్యార్థులు చదువుతున్నారని, అలాగే బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని కన్నందాస్ వివరించారు. తెలుగు విశ్వవిద్యాలయం తన సేవల్ని ఆంధ్రప్రదేశ్‌లో క్యాంపస్‌లకు నిలిపేయడం వల్ల వీరంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తన సేవల్ని కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేస్తూ తెలుగు వర్సిటీ జారీచేసిన చేసిన నోటిఫికేషన్ ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. పదవ షెడ్యూల్లో ఉన్న సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే వాటిపై ఆ రాష్ట్రానిదే అధికారమని నిబంధనలు చెబుతున్నాయని, ఇందులోభాగంగా రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయినందున తన సేవలు కావాలంటే ఒప్పందం కుదుర్చుకోవాలని తెలుగు వర్సిటీ వైస్‌చాన్సలర్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని తాము కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశామని, అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఏ విధమైన స్పందన రాలేదని వివరించారు. ఇదే విషయాన్ని వైస్‌చాన్సలర్‌కు తెలియచేసి.. వర్సిటీ సేవలను ఏపీ క్యాంపస్‌లకు సైతం కొనసాగించాలని కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తన సేవల్ని ఏపీలోని కేంద్రాలకు అందించకపోవడంపై హైకోర్టు సుమోటోగా విచారణ జరుపుతోందని, అందువల్ల తెలుగు వర్సిటీ విషయంలోనూ జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. -
తెలుగువర్సిటీలో ఏపీ ఆచార్యుల తొలగింపు
వారిని శ్రీశైలానికి రిలీవ్ చేసిన వీసీ సాక్షి, హైదరాబాద్: తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంత ఉద్యోగులను సంస్థ నుంచి బయటకు పంపించేందుకు వర్సిటీ అధికారులు చర్యలు చేపడుతుండడంతో అక్కడి బోధన, బోధనేతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రొఫెసర్ చెన్నారెడ్డి, ప్రొఫెసర్ వెంకటరామయ్యలను రిలీవ్ చేస్తున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య శివారెడ్డి ఈ నెల 19న ఉత్తర్వులిచ్చారు. వీరిని ఏపీలోని శ్రీశైలం ప్రాంగణానికి పంపిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదో షెడ్యూల్లోని సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తెలుగువర్సిటీని తన అధీనంలోకి తీసుకుంది. వర్సిటీ సేవలను ఏపీలో కొనసాగించకుండా నిలిపేసింది. 2 నెలల నుంచి ఏపీకి చెందిన ఉద్యోగులకు జీతా లు నిలిపేసింది. తాజాగా ప్రొ. చెన్నారెడ్డి మెడికల్ లీవ్‌కు దరఖాస్తు చేయగా తమకు సంబం ధం లేదని, శ్రీశైలం ప్రాంగణంలో దరఖాస్తు చేయాలని స్పష్టంచేశారు. ఏపీలో తెలుగు వర్సిటీయే లేనప్పుడు ఎక్కడ రిపోర్టు చేయాలని, తమ జీతభత్యాలు ఎవరిస్తారని ఆ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై గవర్నర్, సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగువర్సిటీ సేవల నిలిపివేత తదతర అంశాలపై కోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. -
'తెలుగు యూనివర్సిటీని రాజమండ్రిలో నెలకోల్పాలి'
-
తెలుగు వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలుగు యూనివర్సిటీ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. తెలంగాణ ప్రభుత్వం సూచనల మేరకు ఆ ప్రాంతం వరకే ప్రవేశాలు పరిమితం కానున్నాయి. హైదరాబాద్‌లోని వర్సిటీ ప్రాంగణం, వరంగల్‌లోని ప్రాంగణంలో మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్లో ఆ వర్సిటీ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ తోమాసయ్య పేర్కొన్నారు. సర్టిఫికెట్ కోర్సుల నుంచి పీహెచ్డీ వరకు వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 తుది గడువు. ఎంఏ స్థాయిలో అనువర్తిత భాషా శాస్త్రం, కర్ణాటక సంగీతం, జ్యోతిష్యం, ఎంపీఏ స్థాయిలో రంగస్థల కళలు, కూచిపూడి, ఆంధ్రనాట్యం, జానపద కళలు, ఎంసీజే , బీఎఫ్‌ఏలో చిత్రలేఖనం, శిల్పం, ప్రింట్ మేకింగ్, పీజీ డిప్లొమాలో తెలుగు భాషా బోధన- భాషా శాస్త్రం, రంగస్థల కళలు, ఫిల్మ్ డెరైక్షన్, జానపద నృత్యం, ట్రావెల్ అండ్ టూరిజం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విత్ ఆస్ట్రాలజీ, ఆర్కిటెక్చర్, డిప్లొమాలో లలిత సంగీతం, హరికథ, మిమిక్రీ, పద్యనాటకం, కూచిపూడి, ఆంధ్రనాట్యం, యక్షగానం, బుర్రకథ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామని రిజిస్ట్రార్ తెలిపారు. రిజిస్ట్రార్, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరిట తీసిన రూ. 350 డీడీని అందజేసి దరఖాస్తు నమూనా, ప్రాస్పెక్టస్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడవచ్చు. -
ఏయూ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన
విశాఖపట్టణం: ఆంధ్రా యూనివర్సిటీలోని తెలుగు శాఖ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులు సోమవారం ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రాన్ని వదిలి కేవలం హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న యూనివర్సిటీకి మాత్రమే అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయటాన్ని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం తీవ్రంగా వ్యతిరేకించింది. నోటిఫికేషన్ విడుదలయి రెండు రోజులైనా ఏపీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని విద్యార్థి సంఘం నాయకులు విమర్శించారు. తెలుగు ప్రజలను అవమానించే విధంగా నోటిఫికేషన్ ఉందంటూ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. తక్షణమే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఏపీలో ఉన్న తెలుగు యూనివర్సిటీ అనుబంధ కేంద్రాలతో పాటు రాజమండ్రి కేంద్రంగా తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
తెలుగు వర్సిటీలో తెలంగాణ ఉద్యోగుల ఆందోళన
డిమాండ్ల సాధన కోసం వీసీ చాంబర్ వద్ద ధర్నా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేసిన అధికారులు ప్రత్యేక రాష్ట్రంలోనూ అదే వైఖరిని కొనసాగిస్తున్నారని విమర్శిస్తూ వైస్ చాన్స్‌లర్ చాంబర్ ఎదుట ధర్నా చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాలను గురించి వీసీ, రిజిస్ట్రార్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలుగు యూనివర్సిటీ తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు ఆరోపించింది. కారుణ్య నియామకాలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా, తమకు అనుకూలంగా ఉన్నవారికి పదోన్నతులు ఇచ్చారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియమించిన కన్సల్టెంట్లను తొలగించడంతోపాటు ఇతర ప్రాంగణాల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన మినిమమ్ టైంస్కేల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా ఆన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సత్తిరెడ్డి, అజయ్‌చంద్ర, రాజ్‌కుమార్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నీ నిబంధనలకు లోబడే..: ఉద్యోగుల ఆందోళన విషయంపై ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ శివారెడ్డి, రిజిస్ట్రార్ తోమాసయ్యలను వివరణ కోరగా.. వర్సిటీలో తెలంగాణ ఉద్యోగులపై ఎలాంటి వివక్షా చూపడం లేదన్నారు. పదోన్నతుల విషయంలో నిబంధనలకు అనుగుణంగా, విభజన కమిటీ ఆమోదం మేరకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవన్నారు. తెలంగాణ వారికే తెలుగు వర్సిటీలో ప్రవేశాలు తెలుగు విశ్వ విద్యాలయంలో తెలంగాణ విద్యార్థులకే ప్రవేశాలు కల్పించేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలుగు విశ్వ విద్యాలయం ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శివారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే ప్రవేశాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం రాతపూర్వక అనుమతి వచ్చాకే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. మరోవైపు ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశామని పేర్కొన్నారు. తె లుగు యూనివర్సిటీ సేవలు కావాలంటూ తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా, ఏపీ మాత్రం ఒప్పందం చేసుకోలేదన్నారు. దీంతో తెలంగాణలోనే ప్రవేశాలు చేపడతామని చెప్పారు. -
కొత్త రూటులో మెట్రో
* అసెంబ్లీ ఎదుటి మార్గానికి రెండు ప్రత్యామ్నాయాలు * ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి అధ్యయన నివేదిక * తెలుగు వర్సిటీ వద్ద మెట్రో స్టేషన్.. సీఎం ఆమోదం! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు కొత్త అలైన్మెంట్ మార్పు కొలిక్కి వస్తోంది. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్, పాతబస్తీ ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ మార్చాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, చారిత్రాత్మక అసెంబ్లీ భవనం ఎదుటి మార్గానికి రెండు ప్రత్యామ్నాయ రూట్లను ప్రతిపాదిస్తూ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. అసెంబ్లీ ఎదుటి ప్రాంతంలో అలైన్మెంట్ మార్పు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపిన అనంతరం ఈ మేరకు కొత్త రూటును ఆమోదించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. అసెంబ్లీ ఎదుటి మార్గానికి ప్రత్యామ్నాయంగా పబ్లిక్‌గార్డెన్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వెనక ప్రాంతం- రెడ్‌హిల్స్- డీజీపీ కార్యాలయం వెనుక పోలీసు క్వార్టర్లు- లక్డీకాపూల్ వరకు కొత్త అలైన్‌మెంటును ప్రతిపాదించింది. ఇదే అలైన్‌మెంటును పాటిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ వద్ద కొత్తగా మెట్రో రైల్వే స్టేషన్‌ను నిర్మించాలని రెండో ప్రత్యామ్నాయంలో కోరింది. ఇటీవల జరిగిన ఓ సమీక్షలో సీఎం కేసీఆర్ రెండో ప్రతిపాదనకు ఆమోదించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఈ మేరకు అలైన్మెంట్ మార్పులను ఖరారు చేయాలని కోరుతూ ఎల్అండ్టీ యాజమాన్యం పురపాలక శాఖకు లేఖ రాసింది. సీఎం ఆమోదించినట్లు స్పష్టత లేదని భావనకు వచ్చిన పురపాలక శాఖ.. ఎల్అండ్టీ లేఖను సీఎం కార్యాలయం పరిశీలన కోసం పంపించింది. త్వరలో ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎదుటి మార్గానికి ప్రత్యామ్నాయంగా వెనక నుంచి దారి మళ్లిస్తే మార్గం పొడవు సుమారు అర కిలో మీటర్ పెరగడంతో పాటు, 20 పిల్లర్లను అదనంగా వేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయ మార్గం వల్ల నాంపల్లి రైల్వే స్టేషన్ ఆస్తులతో పాటు డీజీపీ కార్యాలయం, జవహర్ బాల భవన్ తదితర ప్రభుత్వ భవనాల భూములను సేకరించాలి. అయితే, ఈ మార్పులతో ప్రాజెక్టు వ్యయంపై పడే అదనపు భారంపై మాత్రం ఎల్అండ్టీ ఎలాంటి సమాచారాన్ని ఈ ప్రతిపాదనల్లో తెలపలేదు. పాతబస్తీపై కుస్తీ.. ఇక పాతబస్తీలో అలైన్మెంట్ మార్పుతో 3.2 కి.మీ మేర మెట్రో మార్గం పెరగనుంది. మరోవైపు మొత్తం మెట్రో మార్గం మూసీ మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో మెట్రో పిల్లర్లు, వయాడక్ట్‌ల నిర్మాణంపై సాంకేతికంగా తలెత్తే ఇబ్బందులు, వాణిజ్య పరంగా ఉన్న ప్రతిబంధకాలపై నిర్మాణ సంస్థ చేపట్టిన అధ్యయనం కొలిక్కి రాలేదు. ఇక సుల్తాన్‌బజార్ మార్కెట్‌ను పరిరక్షించేందుకు కోఠి మహిళా కళాశాల మీదుగా అలైన్మెంట్ మార్పునకు సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలపై ఎల్అండ్టీ అధ్యయనం చేస్తోంది. ఈ నివేదికలు అందడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. -
తెలుగు వర్సిటీలో విభజన వివాదం
వచ్చే నెల నుంచి ఏపీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వొద్దని టీ సర్కారు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విభజన వివాదం రాజుకుంది. హైదరాబాద్‌లోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఉన్న వర్సిటీ విభజన చట్టం ఉమ్మడి జాబితాలో ఉండగా ఇక నుంచి కేవలం తెలంగాణకు మాత్రమే సేవలందించేలా ఆ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో కొత్త వివాదం ఏర్పడింది. తెలుగు యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ, ఏపీల్లో నాలుగు ప్రాంగణాలున్నాయి. ఇందులో ఏపీలో నన్నయ్య ప్రాంగణం (రాజమండ్రి), పాలకురికి సోమనాథ ప్రాంగణం (శ్రీశైలం), సిద్ధేంద్రయోగి ప్రాంగణం (కూచిపూడి), తెలంగాణలో పోతన ప్రాంగణం (వరంగల్) ఉన్నాయి. ఏటా ఈ ప్రాంగణాల్లో వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ వర్సిటీ ప్రధాన విభాగంతో పాటు ప్రాంగణాల్లో 350 మంది వరకు పనిచేస్తున్నారు. ఈ వర్సిటీ నిర్వహణకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 58: 42 నిష్పత్తిలో నిధులు విడుదల చేయాలి. తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఏపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఏపీలోని ప్రాంగణాల్లో ప్రవేశాల బాధ్యతను పట్టించుకోవద్దని, కేవలం తెలంగాణ ప్రాంగణ అడ్మిషన ్లను రాష్ట్ర విద్యార్థులతో పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య ఇటీవల వర్సిటీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అలాగే వర్సిటీలోని ఏపీ ఉద్యోగులకు వచ్చేనెల నుంచి జీతాలు చెల్లించవద్దని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ పరిణామంతో వర్సిటీలోని ఏపీ ఉద్యోగులు మంగళవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డిని కలిసి తమ పరిస్థితిని వివరించారు. -
అమెరికాలో ఘనంగా 'మనబడి' స్నాతకోత్సవం
సన్నివేల్ (కాలిఫోర్నియా): అమెరికాతో పాటు ప్రపంచంలోని 14 దేశాలలో జన్మించిన తెలుగువారికి తెలుగు భాష నేర్పించేందుకు నిర్వహిస్తున్న 'మనబడి' కోర్సు పూర్తి చేసిన వారికి పట్టాలను ప్రదానం చేశారు. సిలికానాంధ్ర, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సన్నివేల్‌లో (అమెరికా) స్నాతకోత్సవం జరిగింది. తెలుగు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కర్నాటి తోమాసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పట్టాలను అందజేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా, న్యూజెర్సీ, డల్లాస్‌లలో నిర్వహించిన పరీక్షలలో 539 మంది సీనియర్, జూనియర్ సర్టిఫికెట్ స్థాయిలలో ఉత్తీర్ణులయ్యారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభోట్ల ఆనంద్ మాట్లాడుతూ.. అమెరికాలో ప్రారంభమైన మనబడి ప్రపంచమంతా విస్తరించడం సంతోషంగా ఉందని అన్నారు. 14 దేశాల్లో 225 కేంద్రాల్లో నిర్వహిస్తున్న మనబడి కేంద్రాల్లో సుమారు 4300 మంది తెలుగును శాస్త్రీయ పద్దతిలో అభ్యసిస్తున్నారని మనబడి పీఠాధిపతి రాజు చమర్తి చెప్పారు. తెలుగు పరిరక్షణకు కృషి చేస్తామని తెలుగు విశ్వ విద్యాలయం ప్రజా సంబంధిత అధికారి డా.జుర్రు చెన్నయ్య అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య మునిరత్నం నాయుడు, పరీక్ష నిర్వహణ అధికారి డా.రెడ్డి శ్యామల ఆధ్వర్యంలో పట్టాల ప్రదానోత్సవం జరిగింది. మనబడి విద్యార్థులు, విశ్వ విద్యాలయ అధికారులు, మనబడి కార్యనిర్వాహక వర్గం స్నాతకోత్సవ గౌన్లు, టోపీలు, కండవాలు ధరించి నిర్వహించిన కవాతు సభికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మనబడి ఆర్థిక వ్యవహారాల ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల, శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ కార్యాలయంలో భారత దౌత్యాధికారి కూచిభట్ల వెంకటరమణ, తోండెపు హన్మంతరావు, రవిప్రసాద్ దోనెపూడి, గంటి శ్రీదేవి, శరత్ వేట, శాంతి కూచిభోట్ల, దిలీప్ కొండిపర్తి, అనిల్ అన్నం, ఆనంద్ బండి తదితరులు పాల్గొన్నారు. -
ఆవిష్కరణ
ఏప్రిల్ 23 గురువారం సాయంత్రం 6 గం.లకు హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మనసు ఫౌండేషన్ ప్రచురణ- శ్రీపాద సర్వలభ్య రచనల సంకలనం ఆవిష్కరణ. కేతు విశ్వనాథరెడ్డి, కాళీపట్నం రామారావు, పోరంకి దక్షిణామూర్తి, మృణాళిని, వివినమూర్తి తదితరులు పాల్గొం టారు. శ్రీపాద మనవడు వై.గోపాలకృష్ణ ప్రత్యేక అతిథి. ‘ఆంధ్రజాతికి ఆత్మగౌరవమూ, ఆత్మవిశ్వాసమూ ఇంకా గుర్తుకి రాలేదు. అప్పటికి కాదు, ఇప్పటికి కూడా సారస్వత నిర్మాతలకు ఆంధ్రదేశంలో స్వతంత్ర జీవనమార్గాలు ఏర్పడనే లేదు. మనవాళ్లు ఇప్పుడిప్పుడు కొందరు రచయితల విశిష్టత గుర్తించి ఆదరించడం నేర్చుకుంటున్నారు. ఆదరించడం అంటే మెడలో ఒక పూలదండ వెయ్యడం, కొన్నిచోట్ల వొక ఖద్దరు దుప్పటి భుజాల మీద కప్పడం ఇంతే. అంతేగానీ ఆ రచయితలు నౌకరీ చేసి పొట్ట పోసుకుంటున్నారో అదీ చేతగాక పస్తే ఉంటున్నారో యెవరూ యోచించడం లేదు. కొందరి రచనలు ఆనందం కలిగిస్తున్నాయనుకుంటున్నారేగాని అలాంటి పుస్తకాలతోనే సాహిత్యం ఉన్నతి పొందుతుందనీ ఉన్నత సాహిత్యం సంపాదించుకున్న జాతే స్వేచ్ఛా ఆనందాలను అనుభవించగలుగుతుందనిన్నీ వారు గుర్తించడం లేదు. అయితే సుగంధపుష్పాలు ఆస్వాదించేవారి కోసం యెదురుచూడవు. కీకారణ్యాలలో, ముళ్లడొంకల్లో కూడా అవి పుడుతూనే ఉంటాయి. అది సృష్టి రహస్యం. ప్రకృతం’ - శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి -
విభజనా.. ఒప్పందమా..!
- అ వర్సిటీ ప్రవేశాలపై సందిగ్ధత - తేల్చని తెలంగాణ ప్రభుత్వం, జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి పాలన - ఆందోళనలో తెలుగు వర్సిటీ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పాలనలో ఉన్న హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం పరిస్థితి అయోమయంలో పడింది. దీనితో ఇందులో చేరాలనుకునే విద్యార్థులు డోలయామానంలో చిక్కుకున్నారు. దీనిలోని ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసే గడువు సమీపిస్తుండడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. దీంతో 2015-16 విద్యా సంవత్సరానికి వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ సకాలంలో వస్తుందా? రాదా? అన్న మీమాంస తలెత్తింది. విభజన తర్వాత తెలుగు వర్సిటీని 10వ షెడ్యూల్లో చేర్చిన విషయం తెలిసిందే. ఫలితంగా ఏడాదిపాటు రెండు రాష్ట్రాలకు ఈ వర్సిటీ సేవలందించాలి. అందుకు అవసరమైన నిధులను రెండు రాష్ట్రాలు విడుదల చేయాల్సి ఉంటుంది. రానున్న జూన్ 2కు విభజన జరిగి ఏడాది కాలం పూర్తికానుంది. ఈ క్రమంలో మరికొంత కాలం తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడిగానే కొనసాగిస్తారా? లేక విభజిస్తారా? అన్న అంశం తేలడం లేదు. దీనిపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వర్సిటీ ఉన్నత వర్గాలు పలు దఫాలు కోరిన ఎలాంటి కదలిక లేదు. దిక్కుతోచని స్థితిలో వర్సిటీ వర్గాలు.. తెలుగు వర్సిటీకి వరంగల్‌తోపాటు ఏపీలోని రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడిలో పీఠాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 59 కోర్సుల్లో దాదాపు 625 సీట్లు భర్తీ చేసేందుకు ఏటా మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంటారు. ఎప్పటిలాగే నోటిఫికేషన్ విడుదలకు సరిగ్గా నెల సమయం కూడా లేదు. ఈ క్రమంలో ప్రవేశాలు ఉమ్మడిగానే కల్పించాలా? వద్దా? అన్న అంశాన్ని ప్రభుత్వం తేల్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడిగా కొనసాగించాలన్న ఆలోచన ఉంటే అందుకు ఇరు ప్రభుత్వాలు పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి ముందడుగు పడాలంటే ప్రభుత్వం స్పందించి స్పష్టతనీయాల్సిన అవసరం ఉంది. మూలుగుతున్న నిధులు.. వర్సిటీ అవసరాలు తీర్చడం, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం కోసం యూజీసీ నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక కింద రూ. 10.62 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటికే రూ. 4 కోట్లను యూజీసీ విడుదల చేసింది. ఇన్ని కోట్లను విడుదల చేయడం ఇదే తొలిసారి. విద్యార్థులకు వసతి కల్పించేందుకు హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం కోసం ఆ డబ్బులు ఖర్చు చేయాలన్న యోచనలో వర్సిటీ అధికారులున్నారు. అయితే నిధులను సద్వినియోగం చేసుకునే క్రమంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రవేశాలపై ఎటూ తేలకపోవడంతో అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. ఫలితంగా నిధులు వర్సిటీ ఖజానాలో మూలుగుతున్నాయి. -
తెలుగు యూనివర్సిటీని రాజమండ్రికి తరలిస్తాం
రాజమండ్రి కల్చరల్ : హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమండ్రికి తరలించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఎంపీ మురళీమోహన్ హామీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని తెలుగు సాహిత్యపీఠంలో పద్మభూషణ్, కళాప్రపూర్ణ బోయి భీమన్న పద్య, గేయ సాహిత్యం పై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన మురళీమోహన్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మానసపుత్రిక అయిన ఈ విశ్వవిద్యాలయం తరలింపు విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, పుష్కరాలలోగా ప్రభుత్వ ప్రకటన వెలువడేందుకు కృషి చేస్తామన్నారు. -
రసామృతం..
-
యంగ్ ఎట్ హార్ట్
చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే క్రమంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. లక్ష్యాలను చేరుకున్నారు. పిల్లలూ జీవితంలో స్థిరపడ్డారు.పదవీవిరమణ పొందారు. ఇంకేం సాధించాలి? ‘ఇప్పుడే అసలు జీవితం మొదలైంది’ అంటున్నారు ప్రభాకర్ జైని. వరంగల్‌కు చెందిన ఈ నిత్యకృషీవలుడు... రిటైర్మెంట్ అంటే మరో పనికి కమిట్మెంట్ అంటున్నారు. సంబంధం లేని సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన.. వెండితెర ప్రస్థానాన్ని ఏబీసీడీలతో మొదలుపెట్టి.. విజ్ఞులు మెచ్చే విజయాలు నమోదు చేస్తున్నారు. నచ్చిన పనిలోనే విశ్రాంతి అంటున్న ప్రభాకర్ సిటీప్లస్‌తో పంచుకున్న విశేషాలివీ... వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా రిటైర్మెంట్కు రెండేళ్లకు ముందుగానే ఆఫ్టర్ రిటైర్మెంట్, లైఫ్ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుని, దర్శకత్వశాఖలో తెలుగు యూనివర్సిటీ నుంచి పీజీ డిప్లొమా పూర్తి చేశాను. సరొగసి ప్రక్రియకు గర్భాన్ని అద్దెకిస్తున్న వివాహిత మహిళల కష్టాలను తెరకెక్కిస్తూ ‘అమ్మా నీకు వందనం’ తీశాను. అది ఉత్తమ ప్రయోజనాత్మక చిత్రంగా భరతముని అవార్డ్ అందుకుంది. మలయాళంలోకి అనువాదం కానుంది. తర్వాతి ప్రయత్నంగా ప్రణయవీధుల్లో.. తీశా. శతాబ్దాల చరిత్ర ఉన్న రామప్ప గుడి శిల్పకళా చాతుర్యాన్ని, వైభవాన్ని చాటి చెబుతూ తీసిన చిత్రమిది. అంతకు ముందుగానే ‘హు కిల్డ్ మి’ అనే షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను. రచన...ఓ వ్యాపకం... యువకుడిగా ఉన్నప్పటి నుంచి రాయడం అలవాటు. అవీ సమాజంలోని పలు సంఘటనల్ని, సమస్యల్ని ప్రస్తావిస్తూ సాగినవే. షేర్‌మార్కెట్ హర్షద్ మెహతా బూమ్ నేపథ్యంలో చోర్‌బజార్ పేరుతో డైలీ సీరియల్‌గా ‘రూపాయిలొస్తున్నాయ్ జాగ్రత్త’ రాశాను. అలాగే గమ్యం, కాలవాహిని, అలలవాలున పేరుతో పలు ప్రముఖ దినపత్రికల్లో సీరియల్స్ రాశాను. ఆంగ్లంలోనూ ది టార్గెట్-ఐఏఎస్, ది ఎయిమ్ నవలలు రాశాను. పద్య సంకలనాలూ రాశాను. అప్పట్లో పని ఒత్తిడి వల్ల రాయలేకపోయిన ఆలోచనలకు ఇప్పుడు అక్షర రూపం ఇస్తున్నాను. మరోవైపు నా చిత్రాలకు పాటలు, సంభాషణలు రాస్తున్నాను. అలాగే ఆంగ్లంలో రాసిన ఫేక్స్ నవల ప్రస్తుతం ప్రచురణ దశలో ఉంది. పై పుస్తకాలన్నీ ఒక ఎత్తయితే.. సినీ పరిశ్రమకు వచ్చిన స్వల్పకాలంలోనే చూసిన ఎన్నో విశేషాలు, అనుభవాలు ఏర్చి కూర్చి రాసిన ‘నా సినిమా సెన్సార్ పూర్తయిందోచ్’ ఒక ఎత్తు. ఇప్పటిదాకా సినీ పరిశ్రమకు సంబంధించి వెలుగులోకి రాని అంశాలెన్నో ఇందులో ప్రస్తావించాను. రాయడమే కాదు చదవడమూ ఎక్కువే. వరుసగా 3-4 నవలలు చదివేస్తాను. ఇప్పటిదాకా దాదాపు 5 వేల దాకా ఇంగ్లిష్ నవలలు చదివుంటాను. వయసునెలా జయిస్తున్నానంటే... అర్ధరాత్రి 2 గంటలకే నిద్ర లేచి 2 గంటల పాటు రాసుకుంటాను. ఆ తర్వాత 20 నిమిషాల పాటు కపాలభాతి, 30 నిమిషాల పాటు భస్త్రిక, సూక్ష్మ ప్రాణయామాలు చేస్తాను. తర్వాత ఓ గంట వాకింగ్ చేస్తాను. వీట్‌గ్రాస్ పౌడర్ విత్ వాటర్‌తో పొద్దున్నే తీసుకుంటాను. అరగంట తర్వాత నానబెట్టిన బాదం పప్పు, అక్రోట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటాను. మరో 2 గంటల తర్వాత యాకుల్ట్ (ప్రిబయోటిక్ డ్రింక్) సేవిస్తాను. జొన్న రొట్టె, వెజ్ కర్రీలతో 1 గంట సమయంలో లంచ్ పూర్తి చేస్తాను. గంట తర్వాత పవర్నాప్గా 15 నిమిషాల చిన్న కునుకు. సాయంత్రం 4 గంటల సమయంలో గ్రీన్ టీ, 6 గంటలకు మొలకెత్తిన గింజలు తీసుకుంటాను. మరో గంట తర్వాత వెజ్‌సూప్, ఫ్రూట్ స్క్వాష్ లేదా ప్రొటీన్ షేక్‌లతో డిన్నర్ ముగిస్తాను. రాత్రి 9 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర పోవాల్సిందే. అందుకే ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నాను. -
తెలుగు వర్సిటీకి సురవరం పేరు!
సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి ‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం’గా పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైలు సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉన్న ట్లు తెలిసింది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సమస్యలపై ‘సాక్షి’ సదస్సులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భారీగా మిగిలిన సీట్లు మిగిలాయి. రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీం నో అనడంతో ఈ ఏడాది ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించి, ఇంజనీరింగ్ కోర్సుల్లో సీటు పొందాలని ఆశిస్తున్న వేలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అందుబాటులో ఉన్న సీట్లు, ఎంసెట్ అర్హుల సంఖ్య దృష్ట్యా దాదాపు ప్రతి ఒక్కరికి సీటు లభించే అవకాశం ఉన్నప్పటికీ.. కౌన్సెలింగ్‌లో జాప్యం, కళాశాలలకు అనుమతుల నిరాకరణ వంటి కారణాలతో లక్షకుపైగా సీట్లు భర్తీ కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చేయూతగా నిలిచేందుకు ‘సాక్షి’ మరోసారి ముందుకొస్తోంది. కౌన్సెలింగ్‌లో ప్రస్తుత పరిస్థితులకు దారి తీసిన కారణాలు, విద్యార్థుల భవిష్యత్తు కోణంలో ఇప్పటికైనా చేపట్టదగిన చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా.. ఈ నెల 22 నుంచి 25 వరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సదస్సులు నిర్వహించనుంది. ఈ సదస్సుల్లో ప్రముఖ విద్యావేత్తలు పాల్గొననున్నారు. ప్రస్తుత సమస్యకు పరిష్కార మార్గాలను, ప్రత్యామ్నాయాలను సూచించనున్నారు. సదస్సులు జరిగే ప్రాంతాలు- తేదీలు: హైదరాబాద్- సోమవారం, సెప్టెంబర్ 22 (వేదిక: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం) విశాఖపట్నం-మంగళవారం, సెప్టెంబర్ 23 (వేదిక: వైశాఖి ఫంక్షన్ హాల్స్) విజయవాడ-బుధవారం, సెప్టెంబర్ 24 (వేదిక: ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కాలేజ్ సెమినార్ హాల్) తిరుపతి-గురువారం, సెప్టెంబర్ 25 (వేదిక: ఎస్వీవర్సిటీ సెనేట్ హాల్) -
అవకాశం వస్తే నాటకాలు వేస్తా : గిరిబాబు
నాంపల్లి: అవకాశం వస్తే నాటకాలు వేసేం దుకు సిద్ధంగా ఉన్నానని సినీనటుడు గిరిబాబు పేర్కొన్నారు. శుక్రవారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో మాధురి ఎడ్యుకేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ అసోసియేషన్ హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ రంగస్థల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. సినిమాలు, టీవీలు వచ్చాక నాటక రంగం మరుగున పడిందన్నారు. నాటరంగాన్ని అభివృద్ధి చేసేందుకు అం దరూ ముందుకు రావాలన్నారు. తాను నాటక రంగం నుంచే సినిమాల్లోకి వచ్చానన్నారు. అవకాశం వస్తే నాటకాలు వేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాళ్లపల్లి వేంకట నరసింహారావు పుట్టిన రోజును పురస్కరించుకుని నాటకరంగంలో ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన వారిని ప్రతి ఏటా ఒక్కరిని ఎంపిక చేసి నగదు పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నారని అన్నారు. ఈ పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి ఎ.విజయలక్ష్మికి అందజేశారు. సభకు అధ్యక్షత వహిం చిన ప్రముఖ రంగస్థల ప్రయోక్త డాక్టర్ చాట్ల శ్రీరాములు మాట్లాడుతూ మా ధురి ఎడ్యుకేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ అసోసియేషన్‌ను స్థాపించి ఎనిమిదేళ్లు పూర్తయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రచయిత రావి కొండలరావు, సినీ నటులు కాకినాడ శ్యామల, శివపార్వతి, ప్రముఖ కవి దుగ్గిరాల సోమేశ్వరరావు, ప్రముఖులు మొదలి నాగభూషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర మంచి పార్థసారధి రచించిన తల్లా వఝ్జల సుందరం దర్శకత్వంలో రూ పొందించిన ‘వార్నీ! అదా విషయం?’ నాటిక ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. -
చెరకుతీపి చింతపులుపు చిత్తూరు కథ
డైరీ.... జూలై 26 శనివారం సాయంత్రం 6 గం.లకు హైదరాబాద్ ఆబిడ్స్ గోల్డెన్ త్రెషోల్డ్లో షంషాద్ బేగం కవితా సంపుటి ‘ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకే’ ఆవిష్కరణ. స్కైజహా, దిలావర్ తదితరులు పాల్గొంటారు.ఆగస్టు 1 శుక్రవారం సాయంత్రం 6 గం.లకు హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రసాదమూర్తి కవితా సంపుటి ‘పూలండోయ్ పూలు’ ఆవిష్కరణ. జస్టిస్ బి.చంద్రకుమార్, కె.శివారెడ్డి, ఓల్గా తదితరులు పాల్గొంటారు. జూలై 28 సోమవారం సాయంత్రం 6 గం.లకు హిమాయత్ నగర్ హోటల్ చట్నీస్‌లో సోమరాజు సుశీల ‘ముగ్గురు కొలంబస్‌లు’ ఆవిష్కరణ. వి.రామారావు, సి.సుబ్బారావు, వరకాల ప్రభాకర్, పొత్తూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొంటారు.చిత్తూరు కథ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు కె.సభా, మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, కేశవ రెడ్డి, నరేంద్ర, మహేంద్ర, నామిని.... వీరంతా ఈ ప్రాంతం నుంచి కథారచనలోకి వచ్చి చెరగని ముద్ర వేసిన రచయితలు. కె.సభా దారి తొలిచి బాట వేస్తే ఆ బాటలోని ఎగుడు దిగుళ్లను సరి చేసి నడిచి చూపినవారు మధురాంతకం రాజారాం. ఆయనను అడ్మైర్ చేసి కలం పట్టిన రచయిత కేశవరెడ్డి. ఇక నామిని- నిర్దిష్టంగా ఒక పల్లెను తీసుకొని అక్కడి జీవనాన్ని విశ్వ జీవనంతో కనెక్ట్ చేయగలిగారు. వేంపల్లి అబ్దుల్ ఖాదర్, పులికంటి కృష్ణారెడ్డి, వి.ఆర్. రాసాని, గోపిని కరుణాకర్, కెఎస్వీ, కె.ఎస్.రమణ, తుమ్మల రామకృష్ణ వీరందరూ చిత్తూరు కథను సంపద్వంతం చేసిన వారే. వర్తమానంలో పసుపులేటి గీత, గూళూరు బాలకృష్ణమూర్తి, మునిసురేశ్ పిళ్లై, పేట శ్రీనివాసులు రెడ్డి, పేరూరు బాలసుబ్రమణ్యం వంటి రచయితలు కథను సీరియస్‌గా సాధన చేస్తున్నారు. ఈ సంకలనంలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య, జిల్ల్లెళ్ల బాలాజీ కథలున్నాయిగాని విమర్శలో ఒకరి కృషి, అనువాదంలో మరొకరి కృషి కథకులుగా వారి స్వీయ ప్రతిపత్తిని దాటి వెళ్లాయి. ప్రతి ప్రాంతానికి ఉన్నట్టే చిత్తూరుకు కూడా ఒక విశిష్టమైన సంస్కృతి, భాష, జీవనం ఉన్నాయి. అనంతపురంలా దీనికి తీవ్రమైన కరువు లేదు. కడప కర్నూలులా పాలెగాళ్ల పీడా లేదు. రైతు జీవనం, మధ్యతరగతి బతుకు, ఆధ్యాత్మిక ప్రాభవం, తమిళుల ఛాయ, కూడలి స్వభావం... ఇవన్నీ చిత్తూరు కథకులకు తగిన భూమికను ఏర్పరచి పెట్టాయి. అయితే ప్రతిచోటా జరిగినట్టే ఒక ప్రాంతం నుంచి వచ్చిన రచయితలందరూ ఆ ప్రాంత స్థానిక/నైసర్గిక స్వభావాన్ని తమ రచనల్లో చూపాలని లేదు. కేవలం ఇద్దరు ముగ్గురు రచయితలే ఆ ప్రాంతం మొత్తాన్ని ఒడిసి పట్టేయవచ్చు. మిగిలిన రచయితలు ఇతరత్రా వస్తువులను స్వీకరించవచ్చు. ‘చిత్తూరు కథ’ను చూసినప్పుడు అదే అనిపిస్తుంది. ఇక్కడి రచయితలు విస్తారమైన వస్తువును స్వీకరించారనిపిస్తుంది. అలాంటి శైలీ శిల్పాలున్న మంచి కథలు ఇందులో ఉన్నాయి. కాని గోపిని కరుణాకర్- దేవరెద్దు, పులికంటి కృష్ణారెడ్డి- సృష్టికే అందం, గూళూరు బాలకృష్ణమూర్తి- పనసపండు, జిల్లెళ్ల బాలాజీ- సిక్కెంటిక, మహేంద్ర- జర్తె, మధురాంతకం రాజారాం - అంబ పలుకు జగదంబా పలుకూ, వి.ఆర్.రాసాని- తపస్సు, పేట శ్రీనివాసుల రెడ్డి- చిత్తానూరు పంచమి, కె.సభా- మిథున లగ్నం వంటి కథలు చిత్తూరు జీవనాన్ని నిర్దిష్టంగా చూపి ఇవి ఈ స్థలం వల్ల పుట్టిన కథలు అని నిరూపిస్తాయి. ఒక జిల్లా కథలు అన్నప్పుడు పాఠకుడు ఆశించేది ఇలాంటి కథలే. ముఖ్యంగా తిరుమల కథ ఒకటి, తిరుపతి కథ ఒకటి, శ్రీకాళహస్తి కథ ఒకటి అంటే అక్కడి జీవనాన్ని చెప్పే కథలు కూర్చాలనే జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. నల్లమల అడవి/గిరిజన జీవితం, ఏనుగుల దాడి/అంతరాయం, హార్స్లీ హిల్స్ ఏకాంతం, అడుగడుగునా ఎదురుపడే పౌరహిత్య జీవనం... వీటిని చెప్పే కథలు ఉంటే ఎంచి ఉంటే చిత్తూరు కథకు పరిపుష్టత చేకూరి ఉండేది. మామిడిపండ్ల మండీ, చింతపండు మార్కెట్, పుత్తూరు వైద్యం, కాణిపాకం కోవెల... ఇవి కదా చిత్తూరు అంటే. ‘పాప నాశనం’ పేరుతో ఒక్క కథా రాయలేకపోయారా? ఈ సంపుటి నేపథ్యంలో చిత్తూరు రచయితలంతా సమావేశమైతే చూడకుండా వదిలేసిన జీవితంపై చర్చించి ముందుకు సాగే వీలు ఉంటుంది. పాప్యులర్ నవలా రచయితలుగా పేరుపడ్డ శైల కుమార్, మేర్లపాక మురళి కథలు ఇందులో ఉన్నాయి. శైల కుమార్ కథ ఓకే. మురళి కథ- కుచ్చిళ్లు నిమిరే దాకా పోతుంది. భక్తికే కాదు రక్తికి కూడా చిత్తూరు క్షేత్రం ఉంది అని చెప్పడానికే దీని ఎంపిక కాబోలు. కేశవరెడ్డి రచన నిడివి ఎక్కువనుకుంటే ఒక భాగమైనా వేయాల్సింది. నామిని కథ లేదు. సంపాదకుడు అడిగి ఉండకపోతే ఆయనను అవమానించినట్టు. అడిగినా ఇవ్వకపోయి ఉంటే ఇందులో ఉన్న రచయితలందరినీ ఆయన అవమానించినట్టు. చాలా కథలు రాసి అనేక బహుమతులు గెల్చుకుని విస్మరణకు లోనైన వీరపల్లి వీణావాణి కథ ఇందులో కనిపించడం ఆనందం కలిగించింది. ఏమైనా ఇది తొలి ప్రయత్నం. కనుక లోపాలు ఉన్నా సాదరంగా ఆహ్వానించాల్సిందే. కథాభిమానుల బుక్‌షెల్ఫ్‌లో ఉండదగ్గ పుస్తకం- చిత్తూరు కథ. -
చరిత్రకీ ఉంటుంది కొత్త గొంతు
వ్యవసాయం విస్తరించిన కాలం కూడా అదే. పొగాకు, టమాటా, బంగాళాదుంప, మిరప వంటి వాణిజ్య పంటలు తెలుగు ప్రాంతానికి పరిచయమైన కాలమూ అదే. పత్తి, నీలిమందు పంటలతో వాణిజ్యం సాగించిన సమయం కూడా అదే. సంపాదకుడు ఆర్. సోమారెడ్డి. ఈ గ్రంథాన్ని రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసిం హన్ ఆవిష్కరిస్తారు. ఐసీహెచ్ ఆర్ చైర్మన్ వై. సుదర్శనరావు తదితరులు పాల్గొంటారు. చరిత్రను సమగ్రం చేసుకోవడం ఓ నిరంతర ప్రక్రియ. చరిత్రను పునర్ లిఖించుకోవడం, చారిత్రక ఘట్టాలను పునర్ మూల్యాంకన చేసుకోవడం ప్రతి సమాజానికి ఉన్న బాధ్యత. మరణానంతరం ప్రముఖులకి అదనపు కీర్తిని జోడించడం పరిపాటి అని పన్నెండో శతాబ్దానికి చెందిన కల్హణుడు (‘రాజతరంగిణి’ రచయిత) వ్యాఖ్యానిస్తాడు. అంటే ఒక చారిత్రక పురుషుడి మీద వస్త్వాశ్రయ దృష్టితో, సత్యనిష్టతో కూడిన అభిప్రాయానికి రావడానికి సమయం పడుతుందన్నమాట. చారిత్రక ఘట్టాల మీదైనా అంతే. దీనిని పరిహరిస్తే మళ్లీ కొన్ని తరాల వరకు సమగ్ర చరిత్ర అందుబాటులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ప్రారంభించిన కృషి ఇందుకు సంబంధించినదే. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకా రంతో చరిత్ర కాంగ్రెస్ వెలువరించిన కొత్త పుస్తకం ‘మధ్య మలి ఆంధ్రప్రదేశ్ (ఔఅఖీఉ కఉఈఐఉగఅఔ ఊఈఏఖఅ ్కఖఅఈఉఏ) క్రీ.శ. 1324-1724’. చరిత్ర కాంగ్రెస్ వెలువరిస్తున్న గ్రంథాల వరసలో ఇది ఐదో సంపుటం. ఓయూ విశ్రాంత ఆచార్యులు ఆర్. సోమారెడ్డి సంపాదకత్వంలో ఈ సంపుటి వెలువడింది. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ జనరల్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కనిపించే ముసునూరి నాయకులు, రెడ్డి రాజ్యాలు, విజయనగర చరిత్ర, కుతుబ్‌షాహీల గాథ వంటి వాటి మీద గతంలోనూ గ్రంథాలు వెలువడినాయి. మల్లంపల్లి సోమశేఖరశర్మ, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, చిలుకూరి నారాయణరావు, మారెమండ రామారావు, సురవరం ప్రతాపరెడ్డి, గులాం యాజ్దాని వంటి ఉద్దండులు వాటిని ఎంతో శ్రమకోర్చి వెలువరించారు. అయినా కొత్త ఆధారాలు వెలుగు చూస్తూ ఉంటాయి. కొత్త దృక్పథాలు ఆవిష్కృతమవుతూ ఉంటాయి. అందుకే చరిత్రను పునర్ లిఖించుకోవడం మానవాళి ఒక బాధ్యతగా స్వీకరించింది. క్రీస్తుశకం 1324-1724 మధ్య తెలుగు వారి చరిత్రను, అందులోని పరిణామాలను ఈ పుస్తకం ఆవిష్కరించింది. విజయనగర, బహమనీ, గజపతులు, ముసునూరి నాయకులు, రెడ్డి రాజ్యాలు వంటి చిన్న రాజ్యాలు ఆయా ప్రాంతాలలో తలెత్తుకుని మనుగడ సాగించిన కాలం అదే. వ్యవసాయం విస్తరించిన కాలం కూడా అదే. పొగాకు, టమాటా, బంగాళాదుంప, మిరప వంటి వాణిజ్య పంటలు తెలుగు ప్రాంతానికి పరిచయమైన కాలమూ అదే. పత్తి, నీలిమందు పంటలతో వాణిజ్యం సాగించిన సమయం కూడా అదే. అంటే వాణిజ్యం, వాణిజ్య పంటల అవసరాన్ని గమనించిన కాలం. బలమైన సంఘాల ద్వారా వణిజులూ, వృత్తికులాలూ తమ ఉనికిని చాటుకున్నాయి. ఒక ప్రాంతా న్నే, అది కూడా రాజధానీ, చుట్టుపక్కల ప్రాంతాలకే అభివృ ద్ధిని పరిమితం చేయకుండా నలుదిక్కులను అభివృద్ధి చేయ డానికి జరిగిన ప్రయత్నం గురించి అధ్యయనం చేయడం ఏ కాలం పాలకులకైనా అవసరమే. కృష్ణదేవరాయలు నాగులా పురంలో సేద్య అవసరాల కోసం పెద్ద చెరువును నిర్మిం చాడు. ఆయన మంత్రి రాయసం కొండమరుసయ్య కొండ వీడు ప్రాంతంలో రెండు చెరువులు తవ్వించాడు. మరొక రాజ ప్రముఖుడు అనంతపురం దగ్గర బుక్కసముద్రంలో తవ్వించాడు. అంటే అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడడమనేది తరువాతే మనలో లోపించిందా? ఆ కాలం ప్రజలకు బయటి ప్రపంచంతో సంపర్కం ఏర్పడి ఇతర సంస్కృతులతో, మతాలతో, భాషలతో పరిచయం కావడంతోపాటు సహిష్ణుతను అలవాటు చేసుకోవడం ఆరంభమైంది. విజయనగర పాలకులు, బహమనీలు కూడా పాలనా వ్యవహారాలలో మతం జోక్యం లేకుండా చూడడం దీని ప్రభావమే కావచ్చు. మతాన్ని వ్యక్తిగత విషయంగానే పరిగణించిన విజయనగర పాలకులు తిరుపతి అభివృద్ధికి చేసిన కృషి ప్రత్యేకమైనది. తిరుపతితోపాటు అహోబిలాన్ని కూడా ఆ పాలకులు పోషించారు. సంస్కృత సాహిత్య సౌరభాలు, తెలుగు భాషా వికాసం, తెలుగు సాహిత్యంలో కొత్త ధోరణుల ఆవిర్భావం, పర్షియన్ సాహిత్య గుబాళింపు ఎలా జరిగిందో ప్రత్యేకంగా వివరించిన వ్యాసాలు ఉన్నాయి. అప్పటి వాస్తు, యక్షగానం వంటి ప్రదర్శన కళల వికాసాన్ని ఇందులో చదువుతాం. ఈ పుస్తకాన్ని చదవడం నిజంగా ఒక అనుభవం. చరిత్ర అధ్యయనం, పరిశోధన పట్ల తెలుగు ప్రాంతంలో సన్నగిల్లిపోతున్న శ్రద్ధ ఈ సంపుటాలతో పునర్వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుందాం. -గోపరాజు -
సచివాలయం కన్నా తెలుగు విశ్వవిద్యాలయం మిన్న
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు భాష, సాహిత్య వికాసం కోసం తెలుగు విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి అభినందనీయమని శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి ప్రశంసించారు. తన దృష్టిలో సచివాలయంకన్నా తెలుగు విశ్వవిద్యాలయమే గొప్పదని కొనియాడారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 28వ వ్యవస్థాపక దినోత్సవంసోమవారం ఘనంగా జరి గింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చక్రపాణి.. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు వర్సిటీ ప్రకటించిన విశిష్ట పురస్కారంతోపాటు రూ.లక్ష నగదు, శాలువా, జ్ఞాపికను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలుగు కళారూపాలు కుల, మత, ప్రాంతాల మధ్య ఉన్న అడ్డుగోడలను పెకిలిస్తాయని వ్యాఖ్యానించారు. వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. ఏ సంస్థకు లేని సామాజిక బాధ్యత తెలుగు విశ్వవిద్యాలయంపై ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఆశీర్వాదం, విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి డాక్టర్ జె.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. పురస్కారం అందుకోవడం నా అదృష్టం: ఇనాక్ కన్నడ, సంస్కృత, హిందీ వర్సిటీల కన్నా.. మన తెలుగు విశ్వవిద్యాలయం వంద శాతం గొప్పదని విశిష్ట పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ కొనియాడారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి తర్వాత తనను వరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.