విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటున్న యార్లగడ్డ
తెలుగు విశ్వ విద్యాలయాపట్టించుకోని చంద్రబాబు సర్కారు
సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపాటు
రాజమహేంద్రవరం రూరల్: ‘తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మానస పుత్రికైన తెలుగు విశ్వ విద్యాలయంపై ఇంత నిర్లక్ష్యమా’ అంటూ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంపై ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరులోని తెలుగు విశ్వ విద్యాలయం సాహిత్య పీఠాన్ని శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాహిత్య పీఠంలో కేవలం తొమ్మిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, వారం రోజులుగా కరెంటు లేకపోయినా పాములు, తేళ్ల మధ్యే వారు జీవించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వంట కూడా వారే చేసుకోవాల్సి వస్తోందన్నారు. గతేడాది గోదావరి పుష్కరాల ముగింపు సందర్భంగా రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఇచ్చిన అనేక హామీల్లో ‘రాజమహేంద్రవరం’ పేరు మార్పు తప్ప మిగిలిన వేవీ అమలుకు నోచుకోలేదన్నారు.
ఇటీవల మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగు వర్సిటీని త్వరలోనే రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, ఆ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం స్థానిక ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కృషి చేయాలన్నారు. ఆదికవి నన్నయ వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలలు ఇంకా ఏయూలో ఉండటం దుర్మార్గమని మండిపడ్డారు.