పాటను దృశ్యంతో చూపడం అభినందనీయం
-
ప్రముఖ సాహితీవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
రాజమహేంద్రవరం రూరల్ :
మాట కంటే పాట మధురమైనది, ఆ పాటను దృశ్యంతో చూపడం అభినందనీయమని ప్రముఖ సాహితీ వేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. శనివారం బొమ్మూరులోని తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠంలో ‘పుష్కరాలు వచ్చెనమ్మ కృష్ణవేణికి’ ప్రత్యేక గీతం సీడీని ఆయన ఆవిష్కరించారు. కడప జిల్లాకు చెందిన గండ్లూరినారాయణరావు గేయరచన చేయగా, ఇరిగేషన్ ఉద్యోగి జివి.రమణ, సురేఖామూర్తి నేపథ్యగానం అందించారు. ఈసందర్బంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ కృష్ణాపుష్కరాలకు సంబంధించిన ఈ పాట పిల్లలకు విజ్ఞానదాయకంగా ఉంటుందన్నారు. పాటతోపాటు కృష్ణానది విశిష్టతను తెలిపే దృశ్యాలను కూడా సీడీలో పొందుపరచడం అభినందనీయం అన్నారు. అనంతరం నేపథ్య గాయకుడు జివి.రమణను అభినందించారు. డాక్టర్ యార్లగడ్డను జీవీరమణ శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాహిత్యపీఠం పీఠాధిపతి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, ప్రముఖ సేవకులు పట్టపగలు వెంకట్రావు, సీనియర్ పాత్రికేయులు సన్నిధానం శాస్త్రి, ఎస్ బ్యాంక్ మేనేజర్ ఘంటసాల శ్యామలకుమారి తదితరులు పాల్గొన్నారు.