
కొత్త రూటులో మెట్రో
* అసెంబ్లీ ఎదుటి మార్గానికి రెండు ప్రత్యామ్నాయాలు
* ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వానికి అధ్యయన నివేదిక
* తెలుగు వర్సిటీ వద్ద మెట్రో స్టేషన్.. సీఎం ఆమోదం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు కొత్త అలైన్‌మెంట్ మార్పు కొలిక్కి వస్తోంది. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్, పాతబస్తీ ప్రాంతాల్లో మెట్రో అలైన్‌మెంట్ మార్చాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, చారిత్రాత్మక అసెంబ్లీ భవనం ఎదుటి మార్గానికి రెండు ప్రత్యామ్నాయ రూట్లను ప్రతిపాదిస్తూ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
అసెంబ్లీ ఎదుటి ప్రాంతంలో అలైన్‌మెంట్ మార్పు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపిన అనంతరం ఈ మేరకు కొత్త రూటును ఆమోదించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. అసెంబ్లీ ఎదుటి మార్గానికి ప్రత్యామ్నాయంగా పబ్లిక్‌గార్డెన్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వెనక ప్రాంతం- రెడ్‌హిల్స్- డీజీపీ కార్యాలయం వెనుక పోలీసు క్వార్టర్లు- లక్డీకాపూల్ వరకు కొత్త అలైన్‌మెంటును ప్రతిపాదించింది. ఇదే అలైన్‌మెంటును పాటిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ వద్ద కొత్తగా మెట్రో రైల్వే స్టేషన్‌ను నిర్మించాలని రెండో ప్రత్యామ్నాయంలో కోరింది. ఇటీవల జరిగిన ఓ సమీక్షలో సీఎం కేసీఆర్ రెండో ప్రతిపాదనకు ఆమోదించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఈ మేరకు అలైన్‌మెంట్ మార్పులను ఖరారు చేయాలని కోరుతూ ఎల్‌అండ్‌టీ యాజమాన్యం పురపాలక శాఖకు లేఖ రాసింది. సీఎం ఆమోదించినట్లు స్పష్టత లేదని భావనకు వచ్చిన పురపాలక శాఖ.. ఎల్‌అండ్‌టీ లేఖను సీఎం కార్యాలయం పరిశీలన కోసం పంపించింది. త్వరలో ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి.
అసెంబ్లీ ఎదుటి మార్గానికి ప్రత్యామ్నాయంగా వెనక నుంచి దారి మళ్లిస్తే మార్గం పొడవు సుమారు అర కిలో మీటర్ పెరగడంతో పాటు, 20 పిల్లర్లను అదనంగా వేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయ మార్గం వల్ల నాంపల్లి రైల్వే స్టేషన్ ఆస్తులతో పాటు డీజీపీ కార్యాలయం, జవహర్ బాల భవన్ తదితర ప్రభుత్వ భవనాల భూములను సేకరించాలి. అయితే, ఈ మార్పులతో ప్రాజెక్టు వ్యయంపై పడే అదనపు భారంపై మాత్రం ఎల్‌అండ్‌టీ ఎలాంటి సమాచారాన్ని ఈ ప్రతిపాదనల్లో తెలపలేదు.
పాతబస్తీపై కుస్తీ..
ఇక పాతబస్తీలో అలైన్‌మెంట్ మార్పుతో 3.2 కి.మీ మేర మెట్రో మార్గం పెరగనుంది. మరోవైపు మొత్తం మెట్రో మార్గం మూసీ మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో మెట్రో పిల్లర్లు, వయాడక్ట్‌ల నిర్మాణంపై సాంకేతికంగా తలెత్తే ఇబ్బందులు, వాణిజ్య పరంగా ఉన్న ప్రతిబంధకాలపై నిర్మాణ సంస్థ చేపట్టిన అధ్యయనం కొలిక్కి రాలేదు. ఇక సుల్తాన్‌బజార్ మార్కెట్‌ను పరిరక్షించేందుకు కోఠి మహిళా కళాశాల మీదుగా అలైన్‌మెంట్ మార్పునకు సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలపై ఎల్‌అండ్‌టీ అధ్యయనం చేస్తోంది. ఈ నివేదికలు అందడానికి మరింత సమయం పట్టే అవకాశముంది.