నెలూరు జిల్లాకు అమరజీవి పేరు పెట్టా
మార్చి 16 నుంచి అమరజీవి 125వ జయంత్యుత్సవాలు
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన కారణభూతుడు
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్
సాక్షి, అమరావతి : పొట్టి శ్రీరాములు పేరుతో రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీని త్వరలో ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, పలువురు మంత్రులు పాల్గొని అమరజీవితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. చాలాకొద్ది మందే జాతికోసం ఆలోచిస్తారని, పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహార దీక్షచేసి తెలుగుజాతి కోసం ప్రాణాలర్పించగా.. దేశాన్ని ఐకమత్యంగా ఉంచేందుకు పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. వీరిద్దరి వర్థంతులు ఒకేరోజు నిర్వహించుకోవడం గొప్ప అంశమన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రత్యేక ఆంధ్ర కోసం అనేక ఉద్యమాలు జరిగాయని తెలిపారు.
మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేలోపే బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇస్తారని 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభలో భోగరాజు పట్టాభి సీతారామయ్య చెప్పారని.. అదే నిజమైందని, 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చంద్రబాబు గుర్తుచేశారు. అమరజీవి పేరుతో హైదరాబాద్‌లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తే తాను నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేశానన్నారు. వచ్చే మార్చి 16 నుంచి అమరజీవి 125వ జయంత్యుత్సవాలు నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు.
ఆయన ఆంధ్ర జాతికి నాయకుడు : డిప్యూటీ సీఎం
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. అమరజీవి పొట్టి శ్రీరాములు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడని, ఆయన ఒక కులానికి నాయకుడు కాదని, ఆంధ్ర జాతి మొత్తానికి నాయకుడన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించి 2.2 ట్రిలియన్ డాలర్ల ఆరి్థక వ్యవస్థగా పురోగతి సాధించడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు.
కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. రాష్ట్ర విభజన తరువాత తనకు ఆయన గొప్పతనం అర్థమైందన్నారు. మన ఉనికి కోసం మద్రాసులో ఆమరణదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పాడె మోయడానికి కూడా ఆనాడు కష్టపడాల్సి వచ్చిoదని తెలిసి తన గుండె కదిలిపోయిందని పవన్ చెప్పారు.
ఘంటసాల, మరో నలుగురు కలిసి పాడె మోశారని, ఈరోజు మనం ఆంధ్రులమని గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది ఆ మహనీయుడు బలిదానంతో పెట్టిన భిక్షేనన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను అమ్ముకోలేని స్థితి గత ప్రభుత్వ పాలనలో ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment