పాతపద్ధతిలోనే కొనసాగించాలన్న ఏపీ, నో చెప్పిన తెలంగాణ
అంబేడ్కర్ సార్వత్రిక, తెలుగు వర్సిటీ సేవల వివాదం
హైదరాబాద్: పదో షెడ్యూల్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక, తెలుగు యూనివర్సిటీల సేవల ఒప్పంద విషయంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. భౌగోళికంగా తెలంగాణలో ఉన్న వర్సిటీల సేవలు కావాలంటే ఆ ప్రభుత్వంతో చట్టపరంగా ఒప్పందం కుదుర్చుకోవాలని హైకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. సేవల ఒప్పందం విషయమై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖ కార్యదర్శులు సమావేశం కావాలని సూచించిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు రాజీవ్ రంజన్ ఆచార్య, సుమిత్రా దేవరాతోపాటు అంబేడ్కర్ వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్, తెలుగు వర్సిటీ వీసీ శివారెడ్డి, రిజిస్ట్రార్ తోమాసయ్య, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి చాంబర్‌లో గురువారం భేటీ అయ్యారు.
గతేడాది మాదిరిగా తాము ఎటువంటి నిధులు అందించకున్నా తమ రాష్ట్రానికి సేవలు ఉచితంగా అందించాలని ఏపీ ప్రభుత్వం కోరగా, తెలంగాణ అధికారులు విముఖత వ్యక్తం చేశారు. ఏపీలోని స్టడీ సెంటర్లు, వర్సిటీ పీఠాల నిర్వహణను తాము చేపట్టలేమని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్తోమత లేదని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచించే షరతులు, నిబంధనలను పాటిస్తామని ఏపీ అధికారులు పేర్కొన్నారు. ఎవరివాదనకు వారు కట్టుబడి ఉండడంతో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరలేదు. అయితే, చర్చల ద్వారా వచ్చిన పురోగతిని తమ ముందు ఉంచాలని ఇరురాష్ట్రాల అడ్వొకేట్ జనరళ్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసు ఈ నెల 4వ తేదీన ధర్మాసనం ముంగిట ఏ సమాచారంతో హాజరవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
వర్సిటీల సేవలపై కుదరని సయోధ్య
Published Fri, Sep 4 2015 1:58 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement