యంగ్ ఎట్ హార్ట్
చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే క్రమంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. లక్ష్యాలను చేరుకున్నారు. పిల్లలూ జీవితంలో స్థిరపడ్డారు.పదవీవిరమణ పొందారు. ఇంకేం సాధించాలి? ‘ఇప్పుడే అసలు జీవితం మొదలైంది’ అంటున్నారు ప్రభాకర్ జైని. వరంగల్‌కు చెందిన ఈ నిత్యకృషీవలుడు... రిటైర్‌మెంట్ అంటే మరో పనికి కమిట్‌మెంట్ అంటున్నారు. సంబంధం లేని సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన.. వెండితెర ప్రస్థానాన్ని ఏబీసీడీలతో మొదలుపెట్టి.. విజ్ఞులు మెచ్చే విజయాలు నమోదు చేస్తున్నారు. నచ్చిన పనిలోనే విశ్రాంతి అంటున్న ప్రభాకర్ సిటీప్లస్‌తో పంచుకున్న విశేషాలివీ...
వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా రిటైర్‌మెంట్‌కు రెండేళ్లకు ముందుగానే ఆఫ్టర్ రిటైర్‌మెంట్, లైఫ్ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుని, దర్శకత్వశాఖలో తెలుగు యూనివర్సిటీ నుంచి పీజీ డిప్లొమా పూర్తి చేశాను. సరొగసి ప్రక్రియకు గర్భాన్ని అద్దెకిస్తున్న వివాహిత మహిళల కష్టాలను తెరకెక్కిస్తూ ‘అమ్మా నీకు వందనం’ తీశాను. అది ఉత్తమ ప్రయోజనాత్మక చిత్రంగా భరతముని అవార్డ్ అందుకుంది. మలయాళంలోకి అనువాదం కానుంది. తర్వాతి ప్రయత్నంగా ప్రణయవీధుల్లో.. తీశా. శతాబ్దాల చరిత్ర ఉన్న రామప్ప గుడి శిల్పకళా చాతుర్యాన్ని, వైభవాన్ని చాటి చెబుతూ తీసిన చిత్రమిది. అంతకు ముందుగానే ‘హు కిల్డ్ మి’ అనే షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను.
రచన...ఓ వ్యాపకం...
యువకుడిగా ఉన్నప్పటి నుంచి రాయడం అలవాటు. అవీ సమాజంలోని పలు సంఘటనల్ని, సమస్యల్ని ప్రస్తావిస్తూ సాగినవే. షేర్‌మార్కెట్ హర్షద్ మెహతా బూమ్ నేపథ్యంలో చోర్‌బజార్ పేరుతో డైలీ సీరియల్‌గా ‘రూపాయిలొస్తున్నాయ్ జాగ్రత్త’ రాశాను. అలాగే గమ్యం, కాలవాహిని, అలలవాలున పేరుతో పలు ప్రముఖ దినపత్రికల్లో సీరియల్స్ రాశాను. ఆంగ్లంలోనూ ది టార్గెట్-ఐఏఎస్, ది ఎయిమ్ నవలలు రాశాను. పద్య సంకలనాలూ రాశాను. అప్పట్లో పని ఒత్తిడి వల్ల రాయలేకపోయిన ఆలోచనలకు ఇప్పుడు అక్షర రూపం ఇస్తున్నాను. మరోవైపు నా చిత్రాలకు పాటలు, సంభాషణలు రాస్తున్నాను.
అలాగే ఆంగ్లంలో రాసిన ఫేక్స్ నవల ప్రస్తుతం ప్రచురణ దశలో ఉంది. పై పుస్తకాలన్నీ ఒక ఎత్తయితే.. సినీ పరిశ్రమకు వచ్చిన స్వల్పకాలంలోనే చూసిన ఎన్నో విశేషాలు, అనుభవాలు ఏర్చి కూర్చి రాసిన ‘నా సినిమా సెన్సార్ పూర్తయిందోచ్’ ఒక ఎత్తు. ఇప్పటిదాకా సినీ పరిశ్రమకు సంబంధించి వెలుగులోకి రాని అంశాలెన్నో ఇందులో ప్రస్తావించాను. రాయడమే కాదు చదవడమూ ఎక్కువే. వరుసగా 3-4 నవలలు చదివేస్తాను. ఇప్పటిదాకా దాదాపు 5 వేల దాకా ఇంగ్లిష్ నవలలు చదివుంటాను.
వయసునెలా జయిస్తున్నానంటే...
అర్ధరాత్రి 2 గంటలకే నిద్ర లేచి 2 గంటల పాటు రాసుకుంటాను. ఆ తర్వాత 20 నిమిషాల పాటు కపాలభాతి, 30 నిమిషాల పాటు భస్త్రిక, సూక్ష్మ ప్రాణయామాలు చేస్తాను. తర్వాత ఓ గంట వాకింగ్ చేస్తాను. వీట్‌గ్రాస్ పౌడర్ విత్ వాటర్‌తో పొద్దున్నే తీసుకుంటాను. అరగంట తర్వాత నానబెట్టిన బాదం పప్పు, అక్రోట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటాను. మరో 2 గంటల తర్వాత యాకుల్ట్ (ప్రిబయోటిక్ డ్రింక్) సేవిస్తాను. జొన్న రొట్టె, వెజ్ కర్రీలతో 1 గంట సమయంలో లంచ్ పూర్తి చేస్తాను. గంట తర్వాత పవర్‌నాప్‌గా 15 నిమిషాల చిన్న కునుకు. సాయంత్రం 4 గంటల సమయంలో గ్రీన్ టీ, 6 గంటలకు మొలకెత్తిన గింజలు తీసుకుంటాను. మరో గంట తర్వాత వెజ్‌సూప్, ఫ్రూట్ స్క్వాష్ లేదా ప్రొటీన్ షేక్‌లతో డిన్నర్ ముగిస్తాను. రాత్రి 9 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర పోవాల్సిందే. అందుకే ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నాను.