prabhakar jaini
-
ప్రభాకర్ జైనీకి స్వర్ణ కమలం అవార్డు
రచయిత–దర్శకుడు డా. ప్రభాకర్ జైనీ ‘తెలంగాణా సినీ స్వర్ణ కమలం’ అవార్డు అందుకున్నారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి గానూ, ముఖ్యంగా ‘అంప శయ్య’ వంటి సంచలనాత్మక సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించినందుకు ఈ అవార్డు ప్రదానం చేశారు. హైదరాబాదులో బీజేపీ సినిమా సెల్ ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు సీవీయల్ నర్సింహారావు అధ్యక్షతన ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు, ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ యన్. రామచంద్రరావు అతిథులుగా పాల్గొన్నారు. రెండు సార్లు ‘భరతముని సినీ ఆర్ట్స్ అకాడమీ’ అవార్డులు, నంది అవార్డు పొందిన ప్రభాకర్ జైనీని ‘తెలంగాణా సినీ స్వర్ణ కమలం’ అవార్డుతో సత్కరించడం సముచితంగా ఉందని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లుగా ‘సింహ’ అవార్డులు ప్రకటించకపోవడంతో కళాకారులు నిరాశలో ఉన్నారని, అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికే ఈ అవార్డులు ఇచ్చామన్నారు. నెలరోజుల్లోనే ‘కాకతీయ’ ఫిల్మ్ అవార్డులు ప్రకటిస్తామన్నారు. గాయని మధుప్రియ, టీవీ, సినీ నటుడు అశోక్ కుమార్, సినీ క్రిటిక్ హెచ్. రమేశ్ బాబు, కాంతారావు కుమారుడు టీయల్ రాజా, నటి ఆయేషా జలీల్, డెక్కన్ సినిమా ఆర్కే మామా మొదలైన వారికి కూడా అవార్డులు అందించారు. -
క్యాంపస్‌లో ఏం జరిగింది?
తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ నవలల్లో ఒకటి ‘అంపశయ్య’. ఆ నవల పేరే రచయిత నవీన్ ఇంటి పేరైంది. ప్రస్తుతం ఈ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘క్యాంపస్... అంపశయ్య’. ప్రభాకర్ జైని దర్శకత్వంలో విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్యామ్ కుమార్, పావని హీరో హీరో యిన్లు. దర్శకుడు మాట్లాడుతూ, ‘‘ ‘అంపశయ్య’ నవలను తెరకెక్కించేందుకు మూడేళ్లు శ్రమించా. మారుమూల గ్రామం నుంచి ఓ యువకుడు చదువుకునేందుకు ఉస్మానియా యూనివర్శిటీకి వస్తాడు. అతని జీవితంలో ఒకరోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎదురయ్యే సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ఉస్మానియా క్యాంపస్‌లో షూటింగ్ జరుపుకొన్న మొదటి చిత్రమిది. 1970 నాటి కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాం. చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. కెమేరా: రవికుమార్ నీర్ల, సంగీతం: సందీప్. -
కన్నీటి కథ... ‘అంపశయ్య’
ప్రముఖ రచయిత ‘అంపశయ్య’ నవీన్ రాసిన ‘అంపశయ్య’ నవల ఇప్పుడు వెండి తెరపై ఆవిష్కృతం కావడానికి సిద్ధమైంది. శ్యామ్ కుమార్, పావని జంటగా ‘అమ్మా నీకు వందనం’ ఫేవ్‌ు ప్రభాకర్ జైని దర్శకత్వంలో విజయలక్ష్మి జైని నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘1965-1970 కాలంలోని పేదరికం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కొడుకు చదువు కోసం రూ. 200 కూడా చెల్లించలేని పేదరికం తండ్రిది. ఫీజు కోసం భార్య కడియాలు అమ్మినా డబ్బు సరిపోక, ఆ తండ్రి నిస్సహాయ స్థితిలో కన్నీరు కారుస్తాడు. ఆ సీన్లో వచ్చే పాట, అందులోని సాహిత్యం గుండెలు పిండేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో, మలయాళంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: రవికుమార్ నీర్ల. సంగీతం: సందీప్. -
‘అంపశయ్య’ కథతో...
ఓ యువకుడు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎదుర్కొన్న సంఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘అంపశయ్య’. ప్రముఖ రచయిత నవీన్ రచించిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్యామ్‌కుమార్, పావని జంటగా జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభాకర్ జైని దర్శకుడు. ‘‘1960, 70 ప్రాంతాల్లో సాగే చిత్రం ఇది. నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరలో పూర్తవుతాయి’’ అని దర్శక-నిర్మాతలు తెలిపారు. -
యంగ్ ఎట్ హార్ట్
చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే క్రమంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. లక్ష్యాలను చేరుకున్నారు. పిల్లలూ జీవితంలో స్థిరపడ్డారు.పదవీవిరమణ పొందారు. ఇంకేం సాధించాలి? ‘ఇప్పుడే అసలు జీవితం మొదలైంది’ అంటున్నారు ప్రభాకర్ జైని. వరంగల్‌కు చెందిన ఈ నిత్యకృషీవలుడు... రిటైర్మెంట్ అంటే మరో పనికి కమిట్మెంట్ అంటున్నారు. సంబంధం లేని సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన.. వెండితెర ప్రస్థానాన్ని ఏబీసీడీలతో మొదలుపెట్టి.. విజ్ఞులు మెచ్చే విజయాలు నమోదు చేస్తున్నారు. నచ్చిన పనిలోనే విశ్రాంతి అంటున్న ప్రభాకర్ సిటీప్లస్‌తో పంచుకున్న విశేషాలివీ... వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా రిటైర్మెంట్కు రెండేళ్లకు ముందుగానే ఆఫ్టర్ రిటైర్మెంట్, లైఫ్ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుని, దర్శకత్వశాఖలో తెలుగు యూనివర్సిటీ నుంచి పీజీ డిప్లొమా పూర్తి చేశాను. సరొగసి ప్రక్రియకు గర్భాన్ని అద్దెకిస్తున్న వివాహిత మహిళల కష్టాలను తెరకెక్కిస్తూ ‘అమ్మా నీకు వందనం’ తీశాను. అది ఉత్తమ ప్రయోజనాత్మక చిత్రంగా భరతముని అవార్డ్ అందుకుంది. మలయాళంలోకి అనువాదం కానుంది. తర్వాతి ప్రయత్నంగా ప్రణయవీధుల్లో.. తీశా. శతాబ్దాల చరిత్ర ఉన్న రామప్ప గుడి శిల్పకళా చాతుర్యాన్ని, వైభవాన్ని చాటి చెబుతూ తీసిన చిత్రమిది. అంతకు ముందుగానే ‘హు కిల్డ్ మి’ అనే షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను. రచన...ఓ వ్యాపకం... యువకుడిగా ఉన్నప్పటి నుంచి రాయడం అలవాటు. అవీ సమాజంలోని పలు సంఘటనల్ని, సమస్యల్ని ప్రస్తావిస్తూ సాగినవే. షేర్‌మార్కెట్ హర్షద్ మెహతా బూమ్ నేపథ్యంలో చోర్‌బజార్ పేరుతో డైలీ సీరియల్‌గా ‘రూపాయిలొస్తున్నాయ్ జాగ్రత్త’ రాశాను. అలాగే గమ్యం, కాలవాహిని, అలలవాలున పేరుతో పలు ప్రముఖ దినపత్రికల్లో సీరియల్స్ రాశాను. ఆంగ్లంలోనూ ది టార్గెట్-ఐఏఎస్, ది ఎయిమ్ నవలలు రాశాను. పద్య సంకలనాలూ రాశాను. అప్పట్లో పని ఒత్తిడి వల్ల రాయలేకపోయిన ఆలోచనలకు ఇప్పుడు అక్షర రూపం ఇస్తున్నాను. మరోవైపు నా చిత్రాలకు పాటలు, సంభాషణలు రాస్తున్నాను. అలాగే ఆంగ్లంలో రాసిన ఫేక్స్ నవల ప్రస్తుతం ప్రచురణ దశలో ఉంది. పై పుస్తకాలన్నీ ఒక ఎత్తయితే.. సినీ పరిశ్రమకు వచ్చిన స్వల్పకాలంలోనే చూసిన ఎన్నో విశేషాలు, అనుభవాలు ఏర్చి కూర్చి రాసిన ‘నా సినిమా సెన్సార్ పూర్తయిందోచ్’ ఒక ఎత్తు. ఇప్పటిదాకా సినీ పరిశ్రమకు సంబంధించి వెలుగులోకి రాని అంశాలెన్నో ఇందులో ప్రస్తావించాను. రాయడమే కాదు చదవడమూ ఎక్కువే. వరుసగా 3-4 నవలలు చదివేస్తాను. ఇప్పటిదాకా దాదాపు 5 వేల దాకా ఇంగ్లిష్ నవలలు చదివుంటాను. వయసునెలా జయిస్తున్నానంటే... అర్ధరాత్రి 2 గంటలకే నిద్ర లేచి 2 గంటల పాటు రాసుకుంటాను. ఆ తర్వాత 20 నిమిషాల పాటు కపాలభాతి, 30 నిమిషాల పాటు భస్త్రిక, సూక్ష్మ ప్రాణయామాలు చేస్తాను. తర్వాత ఓ గంట వాకింగ్ చేస్తాను. వీట్‌గ్రాస్ పౌడర్ విత్ వాటర్‌తో పొద్దున్నే తీసుకుంటాను. అరగంట తర్వాత నానబెట్టిన బాదం పప్పు, అక్రోట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటాను. మరో 2 గంటల తర్వాత యాకుల్ట్ (ప్రిబయోటిక్ డ్రింక్) సేవిస్తాను. జొన్న రొట్టె, వెజ్ కర్రీలతో 1 గంట సమయంలో లంచ్ పూర్తి చేస్తాను. గంట తర్వాత పవర్నాప్గా 15 నిమిషాల చిన్న కునుకు. సాయంత్రం 4 గంటల సమయంలో గ్రీన్ టీ, 6 గంటలకు మొలకెత్తిన గింజలు తీసుకుంటాను. మరో గంట తర్వాత వెజ్‌సూప్, ఫ్రూట్ స్క్వాష్ లేదా ప్రొటీన్ షేక్‌లతో డిన్నర్ ముగిస్తాను. రాత్రి 9 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర పోవాల్సిందే. అందుకే ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నాను. -
మాతృత్వపు ఔన్నత్యం
నవలా రచయిత ప్రభాకర్ జైని దర్శకునిగా మారి తీసిన తొలి చిత్రం ‘అమ్మా! నీకు వందనం’. ఓం నమో భగవతే వాసుదేవా ఫిల్మ్స్ పతాకంపై లక్ష్మీ సింహాద్రి శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 9న విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఎవరెన్ని విధాలుగా చూపించినా అమ్మలోని గొప్పతనాన్ని ఎవ్వరూ సంపూర్ణంగా ఆవిష్కరించలేరు. అమ్మ గొప్పతనాన్ని, మాతృత్వపు ఔన్నత్యాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ఈ సినిమా తీశాం. గర్భశోకం కన్నా గర్భకోశం గొప్పదా? అనే ప్రశ్నకు సమాధానం ఇది. జాతీయ స్థాయిలో పురస్కారాలు గెలుచుకునే సత్తా ఉన్న కాన్సెప్ట్ ఇది. కెమెరామేన్ కోట తిరుపతిరెడ్డి నాకు వెన్నెముకగా నిలిచారు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అంతా కథానాయిక స్వప్నే. అన్నారు.