అమెరికాలో ఘనంగా 'మనబడి' స్నాతకోత్సవం
సన్నివేల్ (కాలిఫోర్నియా): అమెరికాతో పాటు ప్రపంచంలోని 14 దేశాలలో జన్మించిన తెలుగువారికి తెలుగు భాష నేర్పించేందుకు నిర్వహిస్తున్న 'మనబడి' కోర్సు పూర్తి చేసిన వారికి పట్టాలను ప్రదానం చేశారు. సిలికానాంధ్ర, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సన్నివేల్లో (అమెరికా) స్నాతకోత్సవం జరిగింది. తెలుగు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కర్నాటి తోమాసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పట్టాలను అందజేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా, న్యూజెర్సీ, డల్లాస్లలో నిర్వహించిన పరీక్షలలో 539 మంది సీనియర్, జూనియర్ సర్టిఫికెట్ స్థాయిలలో ఉత్తీర్ణులయ్యారు.
సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభోట్ల ఆనంద్ మాట్లాడుతూ.. అమెరికాలో ప్రారంభమైన మనబడి ప్రపంచమంతా విస్తరించడం సంతోషంగా ఉందని అన్నారు. 14 దేశాల్లో 225 కేంద్రాల్లో నిర్వహిస్తున్న మనబడి కేంద్రాల్లో సుమారు 4300 మంది తెలుగును శాస్త్రీయ పద్దతిలో అభ్యసిస్తున్నారని మనబడి పీఠాధిపతి రాజు చమర్తి చెప్పారు. తెలుగు పరిరక్షణకు కృషి చేస్తామని తెలుగు విశ్వ విద్యాలయం ప్రజా సంబంధిత అధికారి డా.జుర్రు చెన్నయ్య అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య మునిరత్నం నాయుడు, పరీక్ష నిర్వహణ అధికారి డా.రెడ్డి శ్యామల ఆధ్వర్యంలో పట్టాల ప్రదానోత్సవం జరిగింది.
మనబడి విద్యార్థులు, విశ్వ విద్యాలయ అధికారులు, మనబడి కార్యనిర్వాహక వర్గం స్నాతకోత్సవ గౌన్లు, టోపీలు, కండవాలు ధరించి నిర్వహించిన కవాతు సభికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మనబడి ఆర్థిక వ్యవహారాల ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల, శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ కార్యాలయంలో భారత దౌత్యాధికారి కూచిభట్ల వెంకటరమణ, తోండెపు హన్మంతరావు, రవిప్రసాద్ దోనెపూడి, గంటి శ్రీదేవి, శరత్ వేట, శాంతి కూచిభోట్ల, దిలీప్ కొండిపర్తి, అనిల్ అన్నం, ఆనంద్ బండి తదితరులు పాల్గొన్నారు.