- రెండేళ్ల నుంచీ నిధుల కొరత
- డీన్‌గా ఎండ్లూరి సుధాకర్
ఏకోపాధ్యాయ పాఠశాలగా సాహిత్య పీఠం
Published Sun, Aug 7 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
రాజమహేంద్రవరం కల్చరల్ :
‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు సాహిత్యపీఠం ఏకోపాధ్యాయ పాఠశాలగా మారిపోయింది. నేను ఒక్కడినే పూర్తిస్థాయి అధ్యాపకుడిని, మరో నలుగురు సందర్శకాచార్యులు (విజిటింగ్‌ప్రొఫెసర్లు’) ఉన్నారు’ అని ఇటీవలే డీన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎండ్లూరి సుధాకర్ పేర్కొన్నారు. తెలుగు సాహిత్య పీఠానికి ఉన్న ఘనమైన చరిత్ర, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఎన్టీఆర్ మానస పుత్రిక
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మానస పుత్రికైన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1985 డిసెంబర్‌లో ఆవిర్భవించింది. ఎన్టీఆర్ ఆశీస్సులతో నాటి విద్యామంత్రి ఎర్నేని సీతాదేవి పూనుకోవడంతో 1987లో బొమ్మూరులో తెలుగు సాహిత్యపీఠం ఏర్పడింది. బోధన, పరిశోధనలే ప్రధాన అంశాలుగా 48 ఎకరాల్లో సాహిత్యపీఠం నెలకొంది. ఆచార్య బాలాంత్రపు రజనీకాంత రావు, కొత్తపల్లి వీరభద్రరావు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆర్‌వీఎస్ సుందరం తదితర మహనీయుల సారథ్యంలో నడిచింది.
విద్యార్థుల ప్రగతికి బాటలు
ఇప్పటివరకు సుమారు 513 మంది విద్యార్థులు తెలుగులో ఎంఏ పట్టా అందుకున్నారు. 390 మంది ఎంఫిల్ పూర్తిచేశారు. సుమారు 341 మంది పరిశోధకులకు డాక్టరేట్ లభించింది. దేశవిదేశాల నుంచి ఎందరో వచ్చి ఇక్కడ పరిశోధనలు చేశారు. ద్వానా శాస్త్రి, అద్దేపల్లి రామ్మెహనరావు, గరికిపాటి నరసింహారావు, ఆర్‌ఎస్ వెంకటేశ్వరరావు, అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు, కేసాప్రగడ సత్యనారాయణ తదితరులు ఇక్కడ పరిశోధనలు చేసి డాక్టరేట్ అందుకున్నవారే.
జీతాలు సక్రమంగా రాక..
ఒకప్పుడు ఎంఏ చదివే విద్యార్థులు ఏటా 40కి పైగా ఉండేవారు. నిరంతరం సాహితీ కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. ప్రస్తుతం 9 మంది తెలుగు ఎంఏ చదువుతున్న విద్యార్థులు, ముగ్గురు పరిశోధకులు ఉన్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో ప్రవేశ ప్రకటన ఆలస్యంగా వెలువడింది. పనిచేస్తున్నవారికి జీతాలు సక్రమంగా అందడం లేదు.
సీఎం ప్రకటన సాకరమైతే..
రాజమహేంద్రవరం ప్రధానకేంద్రంగా పూర్తిస్థాయి తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అది సాకారమయ్యే రోజు కోస ంఎదురు చూస్తున్నాం. పూర్తిస్థాయి విశ్వవిద్యాలయం ఏర్పడితే లలితకళలకు సంబంధించిన అన్ని విభాగాలు ఇక్కడికి వస్తాయి. జాషువా కళాపీఠం, కుసుమ ధర్మన్న కళాపీఠం, బోయి భీమన్న కళాపీఠం ఏర్పడటానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే పూర్తిస్థాయి ఉపకులపతిని నియమించాలి. రెండేళ్ల నుంచీ పీఠం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది.
Advertisement