చరిత్రకీ ఉంటుంది కొత్త గొంతు
వ్యవసాయం విస్తరించిన కాలం కూడా అదే. పొగాకు, టమాటా, బంగాళాదుంప, మిరప వంటి వాణిజ్య పంటలు తెలుగు ప్రాంతానికి పరిచయమైన కాలమూ అదే. పత్తి, నీలిమందు పంటలతో వాణిజ్యం సాగించిన సమయం కూడా అదే.
సంపాదకుడు ఆర్. సోమారెడ్డి. ఈ గ్రంథాన్ని రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసిం హన్ ఆవిష్కరిస్తారు. ఐసీహెచ్ ఆర్ చైర్మన్ వై. సుదర్శనరావు తదితరులు పాల్గొంటారు.
చరిత్రను సమగ్రం చేసుకోవడం ఓ నిరంతర ప్రక్రియ. చరిత్రను పునర్ లిఖించుకోవడం, చారిత్రక ఘట్టాలను పునర్ మూల్యాంకన చేసుకోవడం ప్రతి సమాజానికి ఉన్న బాధ్యత. మరణానంతరం ప్రముఖులకి అదనపు కీర్తిని జోడించడం పరిపాటి అని పన్నెండో శతాబ్దానికి చెందిన కల్హణుడు (‘రాజతరంగిణి’ రచయిత) వ్యాఖ్యానిస్తాడు. అంటే ఒక చారిత్రక పురుషుడి మీద వస్త్వాశ్రయ దృష్టితో, సత్యనిష్టతో కూడిన అభిప్రాయానికి రావడానికి సమయం పడుతుందన్నమాట. చారిత్రక ఘట్టాల మీదైనా అంతే. దీనిని పరిహరిస్తే మళ్లీ కొన్ని తరాల వరకు సమగ్ర చరిత్ర అందుబాటులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ప్రారంభించిన కృషి ఇందుకు సంబంధించినదే.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకా రంతో చరిత్ర కాంగ్రెస్ వెలువరించిన కొత్త పుస్తకం ‘మధ్య మలి ఆంధ్రప్రదేశ్ (ఔఅఖీఉ కఉఈఐఉగఅఔ ఊఈఏఖఅ ్కఖఅఈఉఏ) క్రీ.శ. 1324-1724’. చరిత్ర కాంగ్రెస్ వెలువరిస్తున్న గ్రంథాల వరసలో ఇది ఐదో సంపుటం. ఓయూ విశ్రాంత ఆచార్యులు ఆర్. సోమారెడ్డి సంపాదకత్వంలో ఈ సంపుటి వెలువడింది. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ జనరల్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కనిపించే ముసునూరి నాయకులు, రెడ్డి రాజ్యాలు, విజయనగర చరిత్ర, కుతుబ్‌షాహీల గాథ వంటి వాటి మీద గతంలోనూ గ్రంథాలు వెలువడినాయి. మల్లంపల్లి సోమశేఖరశర్మ, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, చిలుకూరి నారాయణరావు, మారెమండ రామారావు, సురవరం ప్రతాపరెడ్డి, గులాం యాజ్దాని వంటి ఉద్దండులు వాటిని ఎంతో శ్రమకోర్చి వెలువరించారు. అయినా కొత్త ఆధారాలు వెలుగు చూస్తూ ఉంటాయి. కొత్త దృక్పథాలు ఆవిష్కృతమవుతూ ఉంటాయి. అందుకే చరిత్రను పునర్ లిఖించుకోవడం మానవాళి ఒక బాధ్యతగా స్వీకరించింది.
క్రీస్తుశకం 1324-1724 మధ్య తెలుగు వారి చరిత్రను, అందులోని పరిణామాలను ఈ పుస్తకం ఆవిష్కరించింది. విజయనగర, బహమనీ, గజపతులు, ముసునూరి నాయకులు, రెడ్డి రాజ్యాలు వంటి చిన్న రాజ్యాలు ఆయా ప్రాంతాలలో తలెత్తుకుని మనుగడ సాగించిన కాలం అదే. వ్యవసాయం విస్తరించిన కాలం కూడా అదే. పొగాకు, టమాటా, బంగాళాదుంప, మిరప వంటి వాణిజ్య పంటలు తెలుగు ప్రాంతానికి పరిచయమైన కాలమూ అదే. పత్తి, నీలిమందు పంటలతో వాణిజ్యం సాగించిన సమయం కూడా అదే. అంటే వాణిజ్యం, వాణిజ్య పంటల అవసరాన్ని గమనించిన కాలం. బలమైన సంఘాల ద్వారా వణిజులూ, వృత్తికులాలూ తమ ఉనికిని చాటుకున్నాయి. ఒక ప్రాంతా న్నే, అది కూడా రాజధానీ, చుట్టుపక్కల ప్రాంతాలకే అభివృ ద్ధిని పరిమితం చేయకుండా నలుదిక్కులను అభివృద్ధి చేయ డానికి జరిగిన ప్రయత్నం గురించి అధ్యయనం చేయడం ఏ కాలం పాలకులకైనా అవసరమే. కృష్ణదేవరాయలు నాగులా పురంలో సేద్య అవసరాల కోసం పెద్ద చెరువును నిర్మిం చాడు. ఆయన మంత్రి రాయసం కొండమరుసయ్య కొండ వీడు ప్రాంతంలో రెండు చెరువులు తవ్వించాడు. మరొక రాజ ప్రముఖుడు అనంతపురం దగ్గర బుక్కసముద్రంలో తవ్వించాడు. అంటే అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడడమనేది తరువాతే మనలో లోపించిందా?
ఆ కాలం ప్రజలకు బయటి ప్రపంచంతో సంపర్కం ఏర్పడి ఇతర సంస్కృతులతో, మతాలతో, భాషలతో పరిచయం కావడంతోపాటు సహిష్ణుతను అలవాటు చేసుకోవడం ఆరంభమైంది. విజయనగర పాలకులు, బహమనీలు కూడా పాలనా వ్యవహారాలలో మతం జోక్యం లేకుండా చూడడం దీని ప్రభావమే కావచ్చు. మతాన్ని వ్యక్తిగత విషయంగానే పరిగణించిన విజయనగర పాలకులు తిరుపతి అభివృద్ధికి చేసిన కృషి ప్రత్యేకమైనది. తిరుపతితోపాటు అహోబిలాన్ని కూడా ఆ పాలకులు పోషించారు.
సంస్కృత సాహిత్య సౌరభాలు, తెలుగు భాషా వికాసం, తెలుగు సాహిత్యంలో కొత్త ధోరణుల ఆవిర్భావం, పర్షియన్ సాహిత్య గుబాళింపు ఎలా జరిగిందో ప్రత్యేకంగా వివరించిన వ్యాసాలు ఉన్నాయి. అప్పటి వాస్తు, యక్షగానం వంటి ప్రదర్శన కళల వికాసాన్ని ఇందులో చదువుతాం. ఈ పుస్తకాన్ని చదవడం నిజంగా ఒక అనుభవం. చరిత్ర అధ్యయనం, పరిశోధన పట్ల తెలుగు ప్రాంతంలో సన్నగిల్లిపోతున్న శ్రద్ధ ఈ సంపుటాలతో పునర్‌వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుందాం.
-గోపరాజు