హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక పుస్తక ప్రదర్శన జరుగుతుంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈ ప్రదర్శనలో తెలుగు భాషా సాహిత్యాలు, కళా సంస్కృతులకు సంబంధించిన అరుదైన గ్రంథాలు తగ్గింపు ధరల్లో లభిస్తాయి.
2 వ తేదీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. విద్యార్థులచే తెలంగాణ గీతాలాపన, తెలంగాణ 10 జిల్లాల నుంచి వచ్చే 60 మంది కవులతో కవి సమ్మేళనం ఉంటుంది. అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవుల పల్లి ప్రభాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అతిధులుగా పాల్గొంటారని రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు