వాన కురుస్తుండగా ట్యాంక్‌బండ్‌పై అందెశ్రీ, కీరవాణిలకు జ్ఞాపికలు అందజేస్తున్న గవర్నర్ రాధాకృష్ణన్. చిత్రంలో సీఎం రేవంత్, భట్టి
దేశ విదేశాల్లో మన విజయ పతాక
దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్
ప్రపంచ నంబర్ వన్ బ్రాండ్‌గా హైదరాబాద్ ఎదగాలి
గత పదేళ్లలో రాష్ట్రంలో స్వేచ్ఛపై దాడి, విధ్వంసం
మేం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం..
పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలుకొట్టాం..
ఇక సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనం దిశగా సాగుదాం
మేమే సర్వజు్ఞలమన్న భ్రమ లేదు..
పాలనలో తప్పులుంటే దిద్దుకుంటాం
తెలంగాణతో సోనియాగాం«దీది తల్లి బంధమని వ్యాఖ్య
పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికి తెలంగాణ ఒక దిక్సూచి కావాలని.. తెలంగాణ విజయ పతాక దేశ విదేశాల్లో సగర్వంగా ఎగరాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ పల్లెలు పాడి పంటలతో వెలగాలని.. ఒకనాడు పొట్ట చేతపట్టుకుని పట్నాలకు వెళ్లిన యువత రేపటి రోజున ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో కాదు ఏకంగా ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను సమున్నతంగా నిలపాలని.. ఆ శక్తి, సత్తువ, తెలివి మనకు ఉన్నాయని అన్నారు.
హైదరాబాద్ మన బ్రాండ్, ప్రపంచ నంబర్ వన్ బ్రాండ్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ఆ దిశలో ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు, వ్యవస్థల సహకారం కావాలని కోరారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఘనంగా నివాళి అర్పిస్తున్నా. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాం«దీలకు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. ప్రత్యేక శ్రద్ధతో మన చిరకాల వాంఛను నెరవేర్చిన సోనియా గాందీ, నాటి లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, నాటి బీజేపీ ముఖ్య నేత సుష్మా స్వరాజ్ ఈ ముగ్గురు తల్లులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. దశాబ్ది ఉత్సవానికి సోనియా గాం«దీని ఏ హోదాలో ఆహ్వానించారని కొందరు ప్రశ్నించారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు సోనియాగాం«దీని ఈ సమాజం తల్లిగా గుర్తించి, గౌరవిస్తుంది.
స్వేచ్ఛను హరిస్తే తెలంగాణ ఊరుకోదు..
పెత్తనాన్ని ప్రశ్నిస్తాం, ప్రేమను పంచుతాం, ఆకలిని తట్టుకుంటాం.. కానీ స్వేచ్ఛను హరిస్తే భరించలేం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ.. అన్యాయం జరిగితే తిరగబడే నైజం దాని సొంతం. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. ‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం’ అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు.
రాష్ట్రంలో ప్రజాపాలన తెచ్చాం..
డిసెంబరు 7 నుంచి రాష్ట్రంలో మొదలైన ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. ప్రగతిభవన్‌ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. సచివాలయంలోకి సామాన్యుడు కూడా రాగలిగేలా చేశాం. ధర్నాచౌక్‌కు అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛ ఇచ్చాం.
ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు లేవు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలను సాధించినప్పుడే తెలంగాణ సాధనకు సార్థకత. రాజకీయ విమర్శల జోలికి పోవడం లేదు.. కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్‌కు పునాదులు వేసుకోగలం.
గత పదేళ్లలో స్వేచ్ఛపై దాడి
పదేళ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైంది. తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపైనా దాడి జరిగింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. సంస్కతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదు. అది గతం.. ఇప్పుడు ప్రజల కోసం ఎన్నికైన ప్రభుత్వం వచ్చింది. ప్రజా ప్రభుత్వంలో జరుపుకొంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే దీనికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది.
సంక్షేమం దిశగా ముందడుగు..
అభయ హస్తం గ్యారంటీలకు కోటి తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిని కంప్యూటరీకరించి, పరిష్కరించే ప్రక్రియ నడుస్తోంది. మేం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి తెచ్చాం. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నది కాంగ్రెస్ పేటెంట్. దీనికింద చికిత్సల పరిమితిని రూ.పది లక్షలకు పెంచాం. 70 రోజుల్లోనే 30వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గ్రూప్–1, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చాం. తొలిదశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి పేద మహిళలకు బాసటగా నిలుస్తున్నాం.
అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇచ్చాం. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొంటున్నాం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాం. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. దావోస్ పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుని.. అవి కార్యరూపం దాల్చేలా కార్యచరణ మొదలుపెట్టాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకుంటాం. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి కాలం చెల్లింది. ఏపీతో ఆస్తుల విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకుంటాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
సాంస్కృతిక పునరుజ్జీవనం అవసరం..
అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చేందుకు రాష్ట్రం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం దిశగా ముందుకు సాగాలని ప్రభుత్వం నిర్ణయించింది. భావి తెలంగాణ నిర్మాణానికి ఈ రెండు ఇప్పుడు కీలక అంశాలు. బోనం నుంచి బతుకమ్మ వరకు.. సాయుధ పోరాటం నుంచి స్వరాష్ట్ర ఉద్యమం వరకు.. సమ్మక్క–సారలమ్మ నుంచి జోగులాంబ వరకు.. భద్రాద్రి రాముడి నుంచి కొమురం భీం వరకు మన సంస్కృతి, చరిత్ర గొప్పవి. వీటి పునరుజ్జీవనం జరగాలి.
– పదేళ్ల తెలంగాణకు రాష్ట్ర గీతం లేకపోవటం దారుణం. ఉద్యమకాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తినిచ్చిన అందెశ్రీ రచన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..’ గేయం ఇక నుంచి మన రాష్ట్ర అధికార గీతం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తొలి అడుగు.
– తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అవి ప్రతిబింబించాలి. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. అందుకోసం వివిధ వర్గాల సూచనలు, సలహాలు తీసుకుంటున్నాం.
– ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, సంస్థల సంక్షిప్త పేర్లు, వాహన రిజిస్ట్రేషన్‌లో రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలుగా టీజీ ఉండాలన్న ప్రజాభీష్టాన్ని గౌరవిస్తూ ఆ మేరకు చర్యలు తీసుకున్నాం.
– నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉండేలా తెలంగాణ తల్లి రూపాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి. ఈ రూపురేఖలతో పునరుజ్జీవనం జరగాల్సి ఉంది. ఈ నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే.
ఆర్థిక పునరుజ్జీవానికి చర్యలిలా..
గత పదేళ్ల ఇష్టారాజ్య పాలనతో రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుంది. మా పాలనలో ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే సమయంలో సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదు. దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్‌కు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు ‘గ్రీన్ తెలంగాణ–2050 మాస్టర్ ప్లాన్’ తయారు చేస్తున్నాం.
– ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ.. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబర్బన్ తెలంగాణ.. రీజనల్ రింగ్ రోడ్డు అవతల రాష్ట్ర సరిహద్దుల వరకు గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం.
– మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దబోతున్నాం. దీనికోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించాం. రీజనల్ రింగ్ రోడ్డును వీలైనంత తొందరలో పూర్తి చేసేలా ప్రయతి్నస్తాం. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం.
– ఉద్యమకాలంలో పోరాటపంథాలో ఉన్న యువకుల్లో కొందరు ఇప్పుడు డ్రగ్స్‌కు బానిసయ్యారు. అందుకే రాష్ట్రంలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేకుండా చేస్తాం. ఈ విషయంలో తప్పు చేసేవారు ఏస్థాయి వారైనా ఉపేక్షించం.
Comments
Please login to add a commentAdd a comment