విధ్వంస గాయాలు మాన్పుకున్నఘనకీర్తి తెలంగాణ సొంతం
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా జై తెలంగాణ అనలేని మూర్ఖుడు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా జై తెలంగాణ అనలేని మూర్ఖుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు.
శుభాకాంక్షల సందేశంలోనూ జై తెలంగాణ అనలేదని, జాక్‌పాట్ ముఖ్యమంత్రి రేవంత్‌కు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమ చరిత్ర తెలియదని అన్నారు. తె లంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు.
ప్రజల ఆకాంక్షకు పురుడు పోసింది కేసీఆర్
‘సీఎం రేవంత్ మూర్ఖుడు.. దశాబ్ది ఉత్సవాలను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉంటే నెల రోజుల పాటు సంబురాలు నిర్వహించే వాళ్లం. మలిదశ ఉద్యమంతో 2001లో టీఆర్‌ఎస్‌తో కొత్త విప్లవాన్ని çసృష్టించి చరిత్రను మలుపు తిప్పి తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ పురుడు పోశారు. ఆధునిక భారత దేశం కళ్లారా చూసిన మరో స్వాతంత్య్ర పోరాటం తెలంగాణ ఉద్యమం.
సబ్బండ వర్గాలు కొట్లాడి, పోట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం మనది. అమరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని దశాబ్దం గడిచిన సందర్భమిది. 60 ఏళ్ల విధ్వంస గాయాలను పదేళ్ల వికాసంతో మాన్పుకున్న ఘనకీర్తి తెలంగాణ సొంతం. తెలంగాణ మరింతగా అభివృద్ది చెంది దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా.. ’అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఘనంగా వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయడంతో పాటు అమరులకు నివాళి అర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి జాతీయ జెండా, పార్టీ జెండాను ఎగురవేశారు.
తర్వాత ఉద్యమ జ్ఞాపకాలతో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ యాది’ఫోటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతి, కూతురు ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభించారు. ఉద్యమ ఘట్టాలతో పాటు పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు అద్దం పట్టే రీతిలో ఏర్పాటు చేసిన ఈ ఫోటో గ్యాలరీని కేటీఆర్ నేతలతో కలిసి సందర్శించారు.
అమరులకు నివాళులర్పించిన కేసీఆర్
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 11.30కు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ నేతలు ఆయనకు గులాబీలతో స్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కేసీఆర్ అమరులకు నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో గంట 20 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు.
రాష్ట్ర సాధన ఉద్యమ జ్ఞాపకాలను మననం చేసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించే పంథాను వివరించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆట పాటలతో హోరెత్తించారు. సమావేశం ముగిసిన తర్వాత కళింగ భవన్‌లో కేటీఆర్ నేతలతో కలసి భోజనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment