తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంత ఉద్యోగులను సంస్థ నుంచి బయటకు పంపించేందుకు వర్సిటీ అధికారులు చర్యలు చేపడుతుండడంతో...
వారిని శ్రీశైలానికి రిలీవ్ చేసిన వీసీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంత ఉద్యోగులను సంస్థ నుంచి బయటకు పంపించేందుకు వర్సిటీ అధికారులు చర్యలు చేపడుతుండడంతో అక్కడి బోధన, బోధనేతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రొఫెసర్ చెన్నారెడ్డి, ప్రొఫెసర్ వెంకటరామయ్యలను రిలీవ్ చేస్తున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య శివారెడ్డి ఈ నెల 19న ఉత్తర్వులిచ్చారు. వీరిని ఏపీలోని శ్రీశైలం ప్రాంగణానికి పంపిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పదో షెడ్యూల్‌లోని సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తెలుగువర్సిటీని తన అధీనంలోకి తీసుకుంది. వర్సిటీ సేవలను ఏపీలో కొనసాగించకుండా నిలిపేసింది. 2 నెలల నుంచి ఏపీకి చెందిన ఉద్యోగులకు జీతా లు నిలిపేసింది. తాజాగా ప్రొ. చెన్నారెడ్డి మెడికల్ లీవ్‌కు దరఖాస్తు చేయగా తమకు సంబం ధం లేదని, శ్రీశైలం ప్రాంగణంలో దరఖాస్తు చేయాలని స్పష్టంచేశారు.
ఏపీలో తెలుగు వర్సిటీయే లేనప్పుడు ఎక్కడ రిపోర్టు చేయాలని, తమ జీతభత్యాలు ఎవరిస్తారని ఆ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై గవర్నర్, సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగువర్సిటీ సేవల నిలిపివేత తదతర అంశాలపై కోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.