వచ్చే నెల నుంచి ఏపీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వొద్దని టీ సర్కారు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విభజన వివాదం రాజుకుంది. హైదరాబాద్‌లోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఉన్న వర్సిటీ విభజన చట్టం ఉమ్మడి జాబితాలో ఉండగా ఇక నుంచి కేవలం తెలంగాణకు మాత్రమే సేవలందించేలా ఆ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో కొత్త వివాదం ఏర్పడింది. తెలుగు యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ, ఏపీల్లో నాలుగు ప్రాంగణాలున్నాయి. ఇందులో ఏపీలో నన్నయ్య ప్రాంగణం (రాజమండ్రి), పాలకురికి సోమనాథ ప్రాంగణం (శ్రీశైలం), సిద్ధేంద్రయోగి ప్రాంగణం (కూచిపూడి), తెలంగాణలో పోతన ప్రాంగణం (వరంగల్) ఉన్నాయి. ఏటా ఈ ప్రాంగణాల్లో వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఈ వర్సిటీ ప్రధాన విభాగంతో పాటు ప్రాంగణాల్లో 350 మంది వరకు పనిచేస్తున్నారు. ఈ వర్సిటీ నిర్వహణకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 58: 42 నిష్పత్తిలో నిధులు విడుదల చేయాలి. తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఏపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఏపీలోని ప్రాంగణాల్లో ప్రవేశాల బాధ్యతను పట్టించుకోవద్దని, కేవలం తెలంగాణ ప్రాంగణ అడ్మిషన ్లను రాష్ట్ర విద్యార్థులతో పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య ఇటీవల వర్సిటీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అలాగే వర్సిటీలోని ఏపీ ఉద్యోగులకు వచ్చేనెల నుంచి జీతాలు చెల్లించవద్దని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ పరిణామంతో వర్సిటీలోని ఏపీ ఉద్యోగులు మంగళవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డిని కలిసి తమ పరిస్థితిని వివరించారు.
తెలుగు వర్సిటీలో విభజన వివాదం
Published Wed, Jun 17 2015 2:00 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
Advertisement
Advertisement