సాక్షి, హైదరాబాద్: తెలుగు యూనివర్సిటీ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. తెలంగాణ ప్రభుత్వం సూచనల మేరకు ఆ ప్రాంతం వరకే ప్రవేశాలు పరిమితం కానున్నాయి. హైదరాబాద్‌లోని వర్సిటీ ప్రాంగణం, వరంగల్‌లోని ప్రాంగణంలో మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్‌లో ఆ వర్సిటీ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ తోమాసయ్య పేర్కొన్నారు. సర్టిఫికెట్ కోర్సుల నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 తుది గడువు. ఎంఏ స్థాయిలో అనువర్తిత భాషా శాస్త్రం, కర్ణాటక సంగీతం, జ్యోతిష్యం, ఎంపీఏ స్థాయిలో రంగస్థల కళలు, కూచిపూడి, ఆంధ్రనాట్యం, జానపద కళలు, ఎంసీజే , బీఎఫ్‌ఏలో చిత్రలేఖనం, శిల్పం, ప్రింట్ మేకింగ్, పీజీ డిప్లొమాలో తెలుగు భాషా బోధన- భాషా శాస్త్రం, రంగస్థల కళలు, ఫిల్మ్ డెరైక్షన్, జానపద నృత్యం, ట్రావెల్ అండ్ టూరిజం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విత్ ఆస్ట్రాలజీ, ఆర్కిటెక్చర్, డిప్లొమాలో లలిత సంగీతం, హరికథ, మిమిక్రీ, పద్యనాటకం, కూచిపూడి, ఆంధ్రనాట్యం, యక్షగానం, బుర్రకథ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామని రిజిస్ట్రార్ తెలిపారు. రిజిస్ట్రార్, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరిట తీసిన రూ. 350 డీడీని అందజేసి దరఖాస్తు నమూనా, ప్రాస్పెక్టస్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ చూడవచ్చు.
తెలుగు వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
Published Tue, Aug 18 2015 4:18 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
Advertisement
Advertisement