సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఎంసెట్–2022) నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈసారి కూడా ఈ పరీక్షను హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. తెలంగాణలో 18, ఆంధ్రప్రదేశ్‌లో 5 జోన్లలో.. జూలై 14 నుంచి 20వ తేదీ మధ్య ఈ పరీక్ష జరుగుతుంది.
ఇంటర్మీడియెట్ తత్సమానమైన పరీక్ష రెండో ఏడాది రాస్తున్న అభ్యర్థులు ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష కూడా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది. ఎంసెట్‌ను రెండు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. అగ్రికల్చర్, మెడికల్ ఎంసెట్ ద్వారా ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహించే ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ బ్రాంచ్‌ల్లో సీట్లు పొందే వీలుంది.
70 శాతం సిలబస్‌తోనే..
ఈసారి కూడా 70 శాతం ఇంటర్ సిలబస్‌లోంచే ఎంసెట్ ప్రశ్నావళి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఇంటర్ సిలబస్‌ను కుదించిన సంగతి తెలిసిందే. ఎంసెట్‌లో మొత్తం 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్ మార్కులు ఉండవు. 3 గంటల వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాలి. కనీస మార్కులతో ఇంటర్ పాసైనా ఎంసెట్ రాసేందుకు అవకాశం కల్పించారు.
కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇంటర్ విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష మొత్తం ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు ఎవరి జోన్‌లో వారు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
పెరగనున్న అభ్యర్థుల సంఖ్య!
ఈసారి కూడా ఎంసెట్ అభ్యర్థుల సంఖ్య పెరిగే వీలుంది. ఇంటర్ విద్యార్థులందరూ కనీస మార్కులతో ఉత్తీర్ణులైన నేపథ్యంలో అందరూ ఎంసెట్ రాసేందుకు అవకాశం ఏర్పడింది. 2021లో నిర్వహించిన ఎంసెట్‌కు 2,51,604 మంది దరఖాస్తు చేస్తే, పరీక్షకు 2,27,00 మంది హాజరయ్యారు. ఇందులో 1,94,550 మంది (85.70) అర్హత సాధించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 175 ఉన్నాయి. వీటిల్లో కన్వీనర్ కోటా కింద 79,790 సీట్లు ఉన్నాయి.
ఏప్రిల్ 6 నుంచి ఈసెట్ దరఖాస్తులు
డిప్లొమా కోర్సులు పూర్తి చేసి, ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందాలనుకునే వారికి నిర్వహించే ఈ–సెట్ కోసం కూడా ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జేఎన్‌టీయూహెచ్ ఈసెట్ విభాగం తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు జూన్ 8గా పేర్కొంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https:// ecet. tsche. ac. in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వొచ్చు. జూలై 13న ఈసెట్ నిర్వహించనున్నారు. ఫీజును రూ.400 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు), రూ.800 (ఇతరులకు) ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment