మన బంధం దృఢమైనది
మంత్రి కేటీఆర్ పలువురికి అరుణ్‌సాగర్ పురస్కారాలు ప్రదానం
సిటీబ్యూరో: జర్నలిస్టులు, రాజకీయ నాయకులది ఆలూమగల సబంధమని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్టు అవార్డ్స్ ప్రదానం, స్మారకోపన్యాసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు తమకి రుచించని వార్తలు వేయవచ్చని తనదైన శైలిలో చమత్కారించారు. అరుణ్ సాగర్‌తో తనకు పెద్దగా సాన్నిహిత్యం లేదని, రచనలు చదివిన తర్వాత అద్భుతమైన భాష కనిపించిందన్నారు. అరుణ్‌సాగర్ మృతి తర్వాత టీవీ 5 యాజమాన్యం ఆ కుటుంబానికి అండగా నిలబడిందని, అతని ప్రతిభను గుర్తించి అవార్డు ఇవ్వడం గొప్ప విషయమన్నారు.
ఫ్రింట్ మీడియా నిర్వాహకులు కూడా ఇలాచేస్తే బాగుంటుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూల నిధి ఇవ్వడంతో పాటు హెల్త్‌కార్డులు, హౌసింగ్ లాంటి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ సమకూర్చే విషయం సీఎం చాలా పట్టుదలగా ఉన్నారన్నారు. టీవీ యాంకర్లు వారానికి ఒకరోజు చేనేత దుస్తులు ధరించేలా మీడియా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. నిర్వాసిత ప్రాంతం నుంచి అరుణ్ సాగర్ హైదరాబాద్ నగరంలో నిలబడి గెలిచాడన్నారు. మంచి రచయిత, జర్నలిస్టు, కవి అని కొనియాడారు. అరుణ్ సాగర్ పేరుతో ఫ్రింట్ మీడియాలో ముగ్గురికి, ఎలక్ట్రానిక్ మీడియాలో ముగ్గురికి, ఒక సాహితీవేత్తకు అవార్డ్స్ అందజేస్తున్నామన్నారు. జ్యూరీ కమిటీ కె. రామచంద్రమూర్తి, కె. శ్రీనివాస్, కట్టా శేఖర్ రెడ్డితో కూడిన కమిటీ అవార్డులకు పేర్లు ఎంపిక చేసిందని వివరించారు. ప్రభుత్వ విప్ పల్లా రా>జేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. కవిగా, జర్నలిస్టుగా అరుణ్‌సాగర్ విలువలు పాటిస్తూ పయనించడం వల్లే అందరిమదిలో నిలిచిపోయారన్నారు. వాదాలు ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా కవిత్వం జోడించి వార్తలు రాసి అందరి మనసులను దోచుకున్నారన్నారు. అనంతరం అరుణ్‌సాగర్ అక్షరశ్వాస పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీవీ5 ఎండీ బి.రవీంద్రనాథ్, ఎమ్మెల్యే జి.కిశోర్, జడ్పీ చైర్మన్ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీకి చెందిన సీనియర్ జర్నలిస్టు తెలంగాణ ప్రాంతవాసి ఎస్.వెంకట నారాయణ మాట్లాడుతూ.. అరుణ్‌సాగర్ రచనలు విలియం ఓట్స్‌వర్‌ను గుర్తు చేశాయన్నారు.
అవార్డు గ్రహీతలు వీరే..
ఫ్రింట్ మీడియా నుంచి ప్రథమ బహుమతి సరస్వతి రమ (సాక్షి చీఫ్ సబ్‌ఎడిటర్), రెండో బహుమతి ధాయి శ్రీశైలం (నమస్తే తెలంగాణ), మూడో బహుమతి భూపతి రాములు (ఆంధ్రజ్యోతి), ఎలక్ట్రానిక్ మీడియా నుంచి మొదటి బహుమతి ఉమ (టీవీ5), రెండో బహుమతి రెహనా (ఎన్టీవీ), మూడో బహుమతి జయప్రకాశ్ (ఈటీవీ) ఉన్నారు. మొదట బహుమతికి రూ.75 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు, మూడో బహుమతికి రూ. 25 వేలు అందజేశారు. అరుణ్ సాగర్ సాహితీ పురస్కారాన్ని ఖాదర్ మొహియిద్దీన్‌కి అందజేశారు. సరస్వతి రమ విదేశాల్లో ఉన్నందున ఆమె మిత్రురాలు ఓ మధు బహుమతి అందుకొన్నారు.