విభజనా.. ఒప్పందమా..!
- అ వర్సిటీ ప్రవేశాలపై సందిగ్ధత
- తేల్చని తెలంగాణ ప్రభుత్వం, జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి పాలన
- ఆందోళనలో తెలుగు వర్సిటీ యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పాలనలో ఉన్న హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం పరిస్థితి అయోమయంలో పడింది. దీనితో ఇందులో చేరాలనుకునే విద్యార్థులు డోలయామానంలో చిక్కుకున్నారు.
దీనిలోని ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసే గడువు సమీపిస్తుండడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. దీంతో 2015-16 విద్యా సంవత్సరానికి వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ సకాలంలో వస్తుందా? రాదా? అన్న మీమాంస తలెత్తింది. విభజన తర్వాత తెలుగు వర్సిటీని 10వ షెడ్యూల్‌లో చేర్చిన విషయం తెలిసిందే. ఫలితంగా ఏడాదిపాటు రెండు రాష్ట్రాలకు ఈ వర్సిటీ సేవలందించాలి. అందుకు అవసరమైన నిధులను రెండు రాష్ట్రాలు విడుదల చేయాల్సి ఉంటుంది. రానున్న జూన్ 2కు విభజన జరిగి ఏడాది కాలం పూర్తికానుంది. ఈ క్రమంలో మరికొంత కాలం తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడిగానే కొనసాగిస్తారా? లేక విభజిస్తారా? అన్న అంశం తేలడం లేదు. దీనిపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వర్సిటీ ఉన్నత వర్గాలు పలు దఫాలు కోరిన ఎలాంటి కదలిక లేదు.
దిక్కుతోచని స్థితిలో వర్సిటీ వర్గాలు..
తెలుగు వర్సిటీకి వరంగల్‌తోపాటు ఏపీలోని రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడిలో పీఠాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 59 కోర్సుల్లో దాదాపు 625 సీట్లు భర్తీ చేసేందుకు ఏటా మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంటారు. ఎప్పటిలాగే నోటిఫికేషన్ విడుదలకు సరిగ్గా నెల సమయం కూడా లేదు. ఈ క్రమంలో ప్రవేశాలు ఉమ్మడిగానే కల్పించాలా? వద్దా? అన్న అంశాన్ని ప్రభుత్వం తేల్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడిగా కొనసాగించాలన్న ఆలోచన ఉంటే అందుకు ఇరు ప్రభుత్వాలు పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి ముందడుగు పడాలంటే ప్రభుత్వం స్పందించి స్పష్టతనీయాల్సిన అవసరం ఉంది.
మూలుగుతున్న నిధులు..
వర్సిటీ అవసరాలు తీర్చడం, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం కోసం యూజీసీ నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక కింద రూ. 10.62 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటికే రూ. 4 కోట్లను యూజీసీ విడుదల చేసింది. ఇన్ని కోట్లను విడుదల చేయడం ఇదే తొలిసారి. విద్యార్థులకు వసతి కల్పించేందుకు హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం కోసం ఆ డబ్బులు ఖర్చు చేయాలన్న యోచనలో వర్సిటీ అధికారులున్నారు. అయితే నిధులను సద్వినియోగం చేసుకునే క్రమంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రవేశాలపై ఎటూ తేలకపోవడంతో అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. ఫలితంగా నిధులు వర్సిటీ ఖజానాలో మూలుగుతున్నాయి.