రాజమండ్రిలో త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం
అధికార భాషా సంఘం చైర్మన్‌గా పొట్లూరి హరికృష్ణ
ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరిగేలా చూస్తాం
తెలుగు భాషా దినోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
విజయవాడ: తెలుగు విశ్వవిద్యాలయాన్ని త్వరలో రాజమండ్రిలో ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామ్మూర్తి పంతులు 132వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విభజన పూర్తయిన వెంటనే రాజమండ్రిలో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.
లలిత, సాహిత్య, సంగీత, నాటక అకాడమీలను త్వరలో పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇకపై ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికార భాషా సంఘాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. దాని చైర్మన్‌గా తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణను నియమిస్తున్నట్లు ప్రకటించారు. హరికృష్ణతోపాటు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌లతో ఒక కమిటీని వేసి తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.