చెరకుతీపి చింతపులుపు చిత్తూరు కథ
డైరీ....
జూలై 26 శనివారం సాయంత్రం 6 గం.లకు హైదరాబాద్ ఆబిడ్స్ గోల్డెన్ త్రెషోల్డ్‌లో షంషాద్ బేగం కవితా సంపుటి ‘ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకే’ ఆవిష్కరణ. స్కైజహా, దిలావర్ తదితరులు పాల్గొంటారు.ఆగస్టు 1 శుక్రవారం సాయంత్రం 6 గం.లకు హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రసాదమూర్తి కవితా సంపుటి ‘పూలండోయ్ పూలు’ ఆవిష్కరణ. జస్టిస్ బి.చంద్రకుమార్, కె.శివారెడ్డి, ఓల్గా తదితరులు పాల్గొంటారు.
జూలై 28 సోమవారం సాయంత్రం 6 గం.లకు హిమాయత్ నగర్ హోటల్ చట్నీస్‌లో సోమరాజు సుశీల ‘ముగ్గురు కొలంబస్‌లు’ ఆవిష్కరణ. వి.రామారావు, సి.సుబ్బారావు, వరకాల ప్రభాకర్, పొత్తూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొంటారు.చిత్తూరు కథ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు కె.సభా, మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, కేశవ రెడ్డి, నరేంద్ర, మహేంద్ర, నామిని.... వీరంతా ఈ ప్రాంతం నుంచి కథారచనలోకి వచ్చి చెరగని ముద్ర వేసిన రచయితలు. కె.సభా దారి తొలిచి బాట వేస్తే ఆ బాటలోని ఎగుడు దిగుళ్లను సరి చేసి నడిచి చూపినవారు మధురాంతకం రాజారాం. ఆయనను అడ్మైర్ చేసి కలం పట్టిన రచయిత కేశవరెడ్డి. ఇక నామిని- నిర్దిష్టంగా ఒక పల్లెను తీసుకొని అక్కడి జీవనాన్ని విశ్వ జీవనంతో కనెక్ట్ చేయగలిగారు. వేంపల్లి అబ్దుల్ ఖాదర్, పులికంటి కృష్ణారెడ్డి, వి.ఆర్. రాసాని, గోపిని కరుణాకర్, కెఎస్వీ, కె.ఎస్.రమణ, తుమ్మల రామకృష్ణ వీరందరూ చిత్తూరు కథను సంపద్వంతం చేసిన వారే. వర్తమానంలో పసుపులేటి గీత, గూళూరు బాలకృష్ణమూర్తి, మునిసురేశ్ పిళ్లై, పేట శ్రీనివాసులు రెడ్డి, పేరూరు బాలసుబ్రమణ్యం వంటి రచయితలు కథను సీరియస్‌గా సాధన చేస్తున్నారు. ఈ సంకలనంలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య, జిల్ల్లెళ్ల బాలాజీ కథలున్నాయిగాని విమర్శలో ఒకరి కృషి, అనువాదంలో మరొకరి కృషి కథకులుగా వారి స్వీయ ప్రతిపత్తిని దాటి వెళ్లాయి.
ప్రతి ప్రాంతానికి ఉన్నట్టే చిత్తూరుకు కూడా ఒక విశిష్టమైన సంస్కృతి, భాష, జీవనం ఉన్నాయి. అనంతపురంలా దీనికి తీవ్రమైన కరువు లేదు. కడప కర్నూలులా పాలెగాళ్ల పీడా లేదు. రైతు జీవనం, మధ్యతరగతి బతుకు, ఆధ్యాత్మిక ప్రాభవం, తమిళుల ఛాయ, కూడలి స్వభావం... ఇవన్నీ చిత్తూరు కథకులకు తగిన భూమికను ఏర్పరచి పెట్టాయి. అయితే ప్రతిచోటా జరిగినట్టే ఒక ప్రాంతం నుంచి వచ్చిన రచయితలందరూ ఆ ప్రాంత స్థానిక/నైసర్గిక స్వభావాన్ని తమ రచనల్లో చూపాలని లేదు. కేవలం ఇద్దరు ముగ్గురు రచయితలే ఆ ప్రాంతం మొత్తాన్ని ఒడిసి పట్టేయవచ్చు. మిగిలిన రచయితలు ఇతరత్రా వస్తువులను స్వీకరించవచ్చు. ‘చిత్తూరు కథ’ను చూసినప్పుడు అదే అనిపిస్తుంది. ఇక్కడి రచయితలు విస్తారమైన వస్తువును స్వీకరించారనిపిస్తుంది. అలాంటి శైలీ శిల్పాలున్న మంచి కథలు ఇందులో ఉన్నాయి. కాని గోపిని కరుణాకర్- దేవరెద్దు, పులికంటి కృష్ణారెడ్డి- సృష్టికే అందం, గూళూరు బాలకృష్ణమూర్తి- పనసపండు, జిల్లెళ్ల బాలాజీ- సిక్కెంటిక, మహేంద్ర- జర్తె, మధురాంతకం రాజారాం - అంబ పలుకు జగదంబా పలుకూ, వి.ఆర్.రాసాని- తపస్సు, పేట శ్రీనివాసుల రెడ్డి- చిత్తానూరు పంచమి, కె.సభా- మిథున లగ్నం వంటి కథలు చిత్తూరు జీవనాన్ని నిర్దిష్టంగా చూపి ఇవి ఈ స్థలం వల్ల పుట్టిన కథలు అని నిరూపిస్తాయి. ఒక జిల్లా కథలు అన్నప్పుడు పాఠకుడు ఆశించేది ఇలాంటి కథలే. ముఖ్యంగా తిరుమల కథ ఒకటి, తిరుపతి కథ ఒకటి, శ్రీకాళహస్తి కథ ఒకటి అంటే అక్కడి జీవనాన్ని చెప్పే కథలు కూర్చాలనే జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. నల్లమల అడవి/గిరిజన జీవితం, ఏనుగుల దాడి/అంతరాయం, హార్స్‌లీ హిల్స్ ఏకాంతం, అడుగడుగునా ఎదురుపడే పౌరహిత్య జీవనం... వీటిని చెప్పే కథలు ఉంటే ఎంచి ఉంటే చిత్తూరు కథకు పరిపుష్టత చేకూరి ఉండేది. మామిడిపండ్ల మండీ, చింతపండు మార్కెట్, పుత్తూరు వైద్యం, కాణిపాకం కోవెల... ఇవి కదా చిత్తూరు అంటే. ‘పాప నాశనం’ పేరుతో ఒక్క కథా రాయలేకపోయారా? ఈ సంపుటి నేపథ్యంలో చిత్తూరు రచయితలంతా సమావేశమైతే చూడకుండా వదిలేసిన జీవితంపై చర్చించి ముందుకు సాగే వీలు ఉంటుంది. పాప్యులర్ నవలా రచయితలుగా పేరుపడ్డ శైల కుమార్, మేర్లపాక మురళి కథలు ఇందులో ఉన్నాయి. శైల కుమార్ కథ ఓకే. మురళి కథ- కుచ్చిళ్లు నిమిరే దాకా పోతుంది. భక్తికే కాదు రక్తికి కూడా చిత్తూరు క్షేత్రం ఉంది అని చెప్పడానికే దీని ఎంపిక కాబోలు. కేశవరెడ్డి రచన నిడివి ఎక్కువనుకుంటే ఒక భాగమైనా వేయాల్సింది. నామిని కథ లేదు. సంపాదకుడు అడిగి ఉండకపోతే ఆయనను అవమానించినట్టు. అడిగినా ఇవ్వకపోయి ఉంటే ఇందులో ఉన్న రచయితలందరినీ ఆయన అవమానించినట్టు. చాలా కథలు రాసి అనేక బహుమతులు గెల్చుకుని విస్మరణకు లోనైన వీరపల్లి వీణావాణి కథ ఇందులో కనిపించడం ఆనందం కలిగించింది. ఏమైనా ఇది తొలి ప్రయత్నం. కనుక లోపాలు ఉన్నా సాదరంగా ఆహ్వానించాల్సిందే. కథాభిమానుల బుక్‌షెల్ఫ్‌లో ఉండదగ్గ పుస్తకం- చిత్తూరు కథ.