
తెలుగు వర్సిటీలో తెలంగాణ ఉద్యోగుల ఆందోళన
డిమాండ్ల సాధన కోసం వీసీ చాంబర్ వద్ద ధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేసిన అధికారులు ప్రత్యేక రాష్ట్రంలోనూ అదే వైఖరిని కొనసాగిస్తున్నారని విమర్శిస్తూ వైస్ చాన్స్‌లర్ చాంబర్ ఎదుట ధర్నా చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాలను గురించి వీసీ, రిజిస్ట్రార్‌ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలుగు యూనివర్సిటీ తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు ఆరోపించింది.
కారుణ్య నియామకాలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా, తమకు అనుకూలంగా ఉన్నవారికి పదోన్నతులు ఇచ్చారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియమించిన కన్సల్టెంట్లను తొలగించడంతోపాటు ఇతర ప్రాంగణాల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన మినిమమ్ టైంస్కేల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా ఆన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సత్తిరెడ్డి, అజయ్‌చంద్ర, రాజ్‌కుమార్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్నీ నిబంధనలకు లోబడే..: ఉద్యోగుల ఆందోళన విషయంపై ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ శివారెడ్డి, రిజిస్ట్రార్ తోమాసయ్యలను వివరణ కోరగా.. వర్సిటీలో తెలంగాణ ఉద్యోగులపై ఎలాంటి వివక్షా చూపడం లేదన్నారు. పదోన్నతుల విషయంలో నిబంధనలకు అనుగుణంగా, విభజన కమిటీ ఆమోదం మేరకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవన్నారు.
తెలంగాణ వారికే తెలుగు వర్సిటీలో ప్రవేశాలు
తెలుగు విశ్వ విద్యాలయంలో తెలంగాణ విద్యార్థులకే ప్రవేశాలు కల్పించేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలుగు విశ్వ విద్యాలయం ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శివారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే ప్రవేశాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం రాతపూర్వక అనుమతి వచ్చాకే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. మరోవైపు ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశామని పేర్కొన్నారు. తె లుగు యూనివర్సిటీ సేవలు కావాలంటూ తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా, ఏపీ మాత్రం ఒప్పందం చేసుకోలేదన్నారు. దీంతో తెలంగాణలోనే ప్రవేశాలు చేపడతామని చెప్పారు.