32 ఏళ్ల తెలుగు యూనివర్సిటీ చరిత్రలో ఆమెది ఒక శుభారంభం.మహిళగా అందుకున్న తొలి అవకాశం అది.27 ఏళ్ల తన అనుభవాన్ని లలిత కళా పీఠానికి వన్నె తేవడానికే అంకితం చేస్తానంటున్నారు.తొలి మహిళా రిజిస్ట్రార్ అలేఖ్య పుంజలతో ముఖాముఖి...
నాకు సినారె రాసిన కర్పూర వసంతరాయలు చాలా నచ్చింది. రెడ్డిరాజుల కాలం, నర్తకీమణి లకుమాదేవి జీవితాన్ని ఆయన కళ్లకు కట్టిన తీరు అద్భుతం. ఆ రచన నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది.
భారతీయ సాహిత్యంలో తెలుగు ప్రత్యేకత?
తెలుగు భాష ఎంతటి మహోన్నతమైనదో తెలుగు సాహిత్యం అంతకంటే విస్తృతమైంది. దాన్ని ఈదాలంటే జీవితకాలం సరిపోదు.
సాంస్కృతిక, కళారంగాల్లో మహిళలు ఎక్కువగా కనిపిస్తారు, మరి సాహిత్యరంగంలో ?
సంస్కృతి పరిరక్షణలో మహిళలు ఎప్పుడూ ముందుంటారు. సంస్కృతి కలకాలం మనగలగాలంటే సాహిత్యం, కళలు రెండూ అవసరం. మేం ప్రదర్శిస్తున్న నాట్యరూపాలకు ఆధారం సాహిత్యమే. గతంలో సాహిత్యంలో మహిళలు తక్కువగా కనిపించేవారు. అప్పట్లో మహిళల అభిప్రాయాల వ్యక్తీకరణకు స్వేచ్ఛ తక్కువ. ఇప్పుడది పెరిగింది.
ప్రస్తుతం తెలుగు సభల్లో రచయితల పట్ల గౌరవ సూచకంగా ద్వారాలకు పేర్లు కనిపిస్తున్నాయి. మరో పదేళ్ల తర్వాత రచయిత్రుల పేరుతో ద్వారాలను చూడవచ్చా?
తప్పకుండా... మరో పదేళ్లకు జరిగే తెలుగు మహాసభల్లో రచయిత్రుల పేరుతో స్వాగత ద్వారాలు ఉంటాయి. ఎందుకంటే భావ వ్యక్తీకరణలో నేటి రచయిత్రులు చాలా చురుగ్గా ఉంటున్నారు. స్వాగతించాల్సిన మరో విషయమేమిటంటే.. రచయిత్రులు రాస్తున్నది రొమాంటిక్ పొయెట్రీ కాదు. సామాజిక స్పృహతో, హేతువాద దృక్పథంతో, మహిళాభ్యుదయం ఇతివృత్తంతో వారి రచనలు సాగుతున్నాయి. తెలుగులో కూడా మరో దశాబ్దానికి గొప్ప రచయిత్రులు తెర మీదకు వస్తారనడంలో సందేహం లేదు.
మీకు ఎలాంటి రచనలు ఇష్టం?
ప్రబంధాల రచనలే నాకిష్టం. ఏ కళాకారిణికైనా పారిజాతాపహరణ వంటి ప్రబంధాలే పంచప్రాణాలుగా ఉంటాయి. ఒక్కొక్క సన్నివేశంలో రచయిత ఊహాశక్తి ద్వారా పాఠకులను అత్యున్నత స్థాయికి చేరుస్తారు. దానిని ఒడిసిపట్టుకుంటే మేము అదే భావాన్ని నాట్యంలో ప్రదర్శించగలుగుతాం. నాట్యం ద్వారా ఆ సన్నివేశాన్ని మరికొంత ఎత్తుకి తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత నన్ను అంతగా ప్రభావితం చేసిన మరొక స్త్రీ పాత్ర రాణి రుద్రమదేవి
..: వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment