telugu mahasabhalu
-
గోదావరి చెంతన తెలుగు పరవళ్లు
సాక్షి,రాజమహేంద్రవరం/రాజానగరం:: గోదావరి చెంతన.. సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమని ఛత్తీస్‌గఢ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఇక్కడి గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాజరాజనరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా, ఆదికవి నన్నయ భారతాన్ని ఆంధ్రీకరించి వెయ్యేళ్లయిన సందర్భంగా ఈ సభలు నిర్వహిస్తున్నారు. రాజరాజ నరేంద్రుడు, నన్నయ భట్టారక, నారాయణభట్టు వేదికలపై నిర్వహిస్తున్న ఉత్సవాలను గవర్నర్ విశ్వభూషణ్, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ.. సంస్కృతి, రచనలకు కేరాఫ్ అడ్రస్‌గా రాజమహేంద్రవరం విరాజిల్లుతోందన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. కావ్యాలు, పురాణేతిహాసాలను తెలుగు వాళ్లు అనువదించినట్టు ఎవరూ చేయలేదన్నారు. పోతన భాగవతం, అన్నమయ్య కీర్తనల్లోని పదాలు చూస్తే ముచ్చటేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యకారి వారణాసి రామ్‌మాధవ్, మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కవి అందెశ్రీ, జేఎన్టీయూకే వీసీ ప్రసాదరాజు, ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. పూర్ణకుంభ పురస్కారాలు తెలుగు జాతికి పూర్వీకులు అందించిన సేవలను గుర్తించి, వారి వారసులను సత్కరించడం అభినందనీయమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్, శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి అన్నారు. తెలుగు మహాసభల్లో రాజరాజనరేంద్రుని వేదికపై శుక్రవారం సాయంత్రం జరిగిన పూర్ణకుంభ అవార్డుల ప్రదానోత్సవంలో వారు మాట్లాడారు. తెలుగు జాతికి విశిష్ట సేవలందించిన ప్రముఖులు తరిగొండ వెంగమాంబ, కవయిత్రి మొల్ల, తిక్కన సోమయాజి, డొక్కా సీతమ్మ, పరవస్తు చిన్నయసూరి, గుర్రం జాషువా, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, పెద్దింటి దీక్షిత్‌దాసు, ఘంటసాల వెంకటేశ్వరరావు, మండలి వెంకట కృష్ణారావు, సాలూరి రాజేశ్వరరావు, పీబీ శ్రీనివాస్, జంధ్యాల, జమునా రాయలు, బాపు తదితరుల వారసులను అతిథులు సత్కరించారు. విశ్వనాథ గోపాలకృష్ణ, బుచ్చివెంకటపాతిరాజు, జిత్‌మోహన్‌మిత్రా, ఎర్రాప్రగడ రామకృష్ణ, కూచిభోట్ల ఆనంద్, రసరాజు, బాదం బాలకృష్ణ, వంశీ రామరాజు, చెరుకువాడ రంగసాయి, తనికెళ్ల భరణి, గౌతమీ గ్రంథాలయం, నన్నయ భట్టారక పీఠం, చింతలూరు ఆయుర్వేద ఫార్మసీ ప్రతినిధులు కూడా పురస్కారాలు అందుకున్నారు. -
అంతర్జాతీయ తెలుగు మహాసభలకు విచ్చేయనున్న హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు 5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీ చైతన్యరాజులు తెలిపారు. వారిని హైదరాబాద్ లో మహా సభల సమన్వయకర్త శ్రీ కేశిరాజు రామప్రసాద్ ,ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలసి ఆహ్వానించినట్లు తెలిపారు. 6 జనవరి 2024 సాయంత్రం 6 గంటలకు జరిగే తెలుగు తోరణం సభకు వారు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రముఖులకు "రాజరాజ నరేంద్ర విశిష్ట పురస్కారాలను" ప్రదానం చేసి వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వనున్నారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -డా.గజల్ శ్రీనివాస్, అధ్యక్షులు, 9849013697 -
గ్రామాలకు చేయూత
మీలో ఎంతో మంది మూలాలు మన మట్టిలోనే, మన గ్రామాల్లోనే ఉన్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన మీలో ఎంతో మంది అక్కడ రాణించేందుకు కఠోరమైన కమిట్మెంట్, ఫోకస్ కారణం. ఈ రెండూ మిమ్మల్ని ఆ గడ్డ మీద నిలబెట్టాయి. అలాంటి కమిట్మెంట్, ఫోకస్ మన రాష్ట్రంలోని పిల్లల్లో ఎంతగానో ఉండటాన్ని నేను చూశా. ఆకాశాన్ని అధిగమించి ఎదిగేందుకు వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలన్న తపనతో నాలుగేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేగలిగాం. గ్లోబల్ సిటిజన్‌గా ఎదగాలంటే చదువన్నది ఒక పెద్ద సాధనం. – ప్రవాసాంధ్రులతో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ప్రవాసాంధ్రులు విలువైన తమ నైపుణ్యాలు, అనుభవాలను పంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఐక్యంగా కాపాడుకుంటూ ఎన్నారైలు విదేశాల్లో కీలక పదవుల్లో, ఉన్నత స్థానాల్లో రాణిస్తుండటం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ‘నాటా’ (నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్ సోమవారం వీడియో సందేశం పంపారు. గ్లోబల్ సిటిజన్‌గా ఎదిగేందుకు చదువన్నది కీలక సాధనమన్నారు. మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు నాలుగేళ్లుగా విద్యా రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, గ్రామాల్లోనే అందిస్తున్న సేవలను గమనించాలని ఈ సందర్భంగా కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీరంతా మాకు గర్వకారణం.. 2023 నాటా కన్వెన్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. నాటా కార్యవర్గానికి మరీ ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్తోపాటు అందరికీ శుభాకాంక్షలు. నాలుగేళ్ల క్రితం నేను డల్లాస్ వచ్చిన సందర్భంగా మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ మరువలేను. విదేశాల్లో ఉన్న ఇంత మంది తెలుగువారు గొప్పవైన మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా, ఐటీ నిపుణులుగా, నాసా సైంటిస్టులుగా, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా, పేరు పొందిన డాక్టర్లుగా రాణిస్తున్న మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం. సర్కారు స్కూళ్ల స్వరూపాన్ని మార్చేశాం రాష్ట్రంలో విద్యారంగంలో తెచ్చిన మార్పులను గమనిస్తే మన గవర్నమెంట్ బడులన్నీ పూర్తిగా రూపురేఖలు మారుతున్నాయి. నాడు – నేడు అనే గొప్ప కార్యక్రమం ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 8వ తరగతిలోకి రాగానే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లను నియమించాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్ విద్య అందించేలా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబరు నాటికి అన్నిచోట్లా వీటి ఏర్పాటు పూర్తి అవుతుంది. మన గవర్నమెంట్ బడుల్లోనే 3వ తరగతి నుంచే టోఫెల్‌కు శిక్షణ ఇచ్చేందుకు ఈటీఎస్, ప్రిన్స్టన్తో ఒప్పందం చేసుకున్నాం. 3వ తరగతి నుంచే సన్నద్ధం చేసి టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్.. ఇలా పదో తరగతి వరకూ శిక్షణ ఇస్తారు. ఇంటర్మీడియట్లో టోఫెల్ సీనియర్‌ను వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నాం. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నాం. ఇవన్నీ విద్యా వ్యవస్ధలో తెచ్చిన మార్పులు. చదువు అనే ఆయుధం ఎంత అవసరమో తెలియచేసేందుకు ఇవన్నీ ఇంతగా చెప్పాల్సి వస్తోంది. సుదీర్ఘంగా వెల్లడించే సమయం లేకున్నా రాష్ట్రంలో మన తర్వాత తరం గురించి ఎంత చిత్తశుద్ధితో ఆలోచన చేస్తున్నామో మీ అందరికీ క్లుప్తంగా వివరించగలిగా. గ్రామాల్లోనే 600 రకాల పౌర సేవలు విద్యారంగం ఒక్కటే కాదు.. ఏది చూసినా ఇలాంటి మార్పులే కనిపిస్తాయి. అంతెందుకు.. మీ అందరికీ గ్రామాల్లోనే మూలాలు, పరిచయాలు ఉన్నాయి. ఒక్కసారి మీ గ్రామాన్ని పరిశీలిస్తే ఎప్పుడూ చూడని విధంగా విలేజ్ సెక్రటేరియట్ మీ కళ్లెదుటే కనిపిస్తుంది. అందులో దాదాపు 10 మంది ఉద్యోగులు మీ ఊరికి సంబంధించిన సేవలు అందిస్తూ కనిపిస్తున్నారు. బర్త్ సర్టిఫికెట్ నుంచి దాదాపు 600 రకాల సేవలు అందిస్తున్నాం. ప్రతి 2,000 మంది జనాభాకు ఒకటి చొప్పున గ్రామ సచివాలయాలను తెచ్చి గ్రామాల్లోనే సేవలందిస్తున్న గొప్ప పరిస్థితి ఇవాళ ఉంది. పౌర సేవల్ని వలంటీర్లు ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. పెన్షన్, రేషన్ అన్నీ మన ఇంటి ముంగిటికే వస్తున్న గొప్ప వాతావరణం మన రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. విత్తనం నుంచి పంట విక్రయాల వరకూ ప్రతి రైతును చేయి పట్టుకుని నడిపిస్తున్న గొప్ప వ్యవస్ధ మన గ్రామంలోనే కనిపిస్తోంది. నాలుగు అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్‌లు కూడా కనిపిస్తాయి. ప్రివెంటివ్ కేర్‌పై దృష్టి ప్రివెంటివ్ కేర్‌పై ఒక ప్రభుత్వం ఇంత ధ్యాస పెట్టిన పరిస్థితి బహుశా ఎప్పడూ చూసి ఉండరు. బీపీ, షుగర్ లాంటి జీవన శైలి జబ్బులకు ఇవే కారణాలుగా కనిపిస్తున్నాయి. సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయలేకపోతే బ్లడ్ ప్రెజర్ కార్డియాక్ అరెస్టుకు, షుగర్, కిడ్నీ వ్యాధులకు దారి తీస్తుంది. మెడికల్ బిల్స్‌ను కట్టడి చేయాలంటే ప్రివెంటివ్ కేర్ చాలా ముఖ్యం. అందుకే ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, దానికి అనుసంధానంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టను తెచ్చాం. ఎన్నడూ లేనివిధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క వైద్య రంగంలోనే 48 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశాం. నాడు – నేడుతో ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేశాం. మన గ్రామాల్లో ఆర్థిక సుస్థిరత ఇక్కడ మన రాష్ట్రం గురించి మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నిర్లక్ష్యం వహిస్తే వినియోగం పెరిగిపోయి ఉత్పత్తిదారులు లేకుండా పోతారు. దీనివల్ల ఆహార ధాన్యాల కొరత తలెత్తి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆహార ధాన్యాలను పండించిన తర్వాత మనం వాటిని లాభాలకే విక్రయిస్తాం. ఏ దేశమైనా వాటిని దిగుమతి చేసుకోవాలంటే రవాణా వ్యయం కూడా ఉంటుంది. అంతేకాకుండా రీటైల్ మార్జిన్, సరఫరా వ్యయం కూడా భరించాలి. అందుకే ఏ దేశమైనా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం మొదలుపెడితే ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకున్నట్లే. అలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలి. అలా జరగాలంటే ప్రతి గ్రామంలో నివసిస్తున్న వారి ఆకాంక్షలను నెరవేర్చాలి. ఈ రోజు రాష్ట్రంలో మనం చేస్తున్న పనులతో వాటిని చేరుకోగలం. గ్రామాల్లో ఉన్నవారు ఏం కోరుకుంటారో గమనిస్తే.. తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించాలనుకుంటారు. పిల్లలకు ఇంగ్లిష్ రావాలని, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కావాలని కోరుకుంటారు. ఇప్పుడు మన గ్రామాల్లో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో ఉన్నవారి కోసం విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టను ప్రవేశపెట్టాం. ఇవికాకుండా వ్యవసాయ రంగంలో ప్రిసిసెన్ అగ్రికల్చర్ అనేది రాబోయే రోజుల్లో సాకారం కానున్న గొప్ప మార్పు. దీనికి బీజం మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే ఆర్బీకేల ద్వారా గ్రామస్ధాయిలో పడింది. రాబోయే రోజుల్లో అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రతి గ్రామానికి వస్తుంది. డిజిటల్ లైబ్రరీలు కూడా వస్తాయి. గ్రామస్ధాయిలో మన కళ్లెదుటే జరుగుతున్న గొప్ప మార్పులివి. పోర్టులు, హార్బర్లు, ఇండ్రస్టియల్ కారిడార్లు.. మౌలిక వసతులపై నాలుగేళ్లుగా పురోగతిని గమనిస్తే పోర్టులు, హార్బర్లు, ఎయిర్ పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు సాకారమవుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక 75 ఏళ్లుగా రాష్ట్రంలో ఆరు పోర్టులు మాత్రమే ఉండగా ఇప్పుడు మరో 4 పోర్టులు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టాం. తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమయింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటవుతుండగా అందులో మూడు ఇండస్ట్రియల్ కారిడార్ల పనులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. మన గ్రామాలపై దృష్టి పెట్టండి.. చివరిగా మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. అక్కడ మీరు ఎంతగానో ఎదిగారు. ఎన్నో ఏళ్ల అనుభవం, అపార నైపుణ్యం మీకుంది. మన రాష్ట్రానికి మీరు ఏ రకంగా ఉపయోగపడగలిగితే ఆ రకంగా తోడ్పాటు అందించండి. ఆర్ధికంగా అనే మాటలు కాస్తో కూస్తో బాగుంటాయి కానీ అంతకంటే ఎక్కువగా మీ అనుభవం అవసరం. ఇప్పటికే అభివృద్ధి చెందిన పాశ్చాత్య ప్రపంచంలో మీరు ఎన్నో ఏళ్లుగా ఉన్నారు కాబట్టి మీ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఇంకా ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రం మీద, మన గ్రామాలపైన ధ్యాస పెట్టగలిగితే అవన్నీ మన రాష్ట్రానికి ఉపయోగపడతాయి. ఇది నా తరపు నుంచి మీకు చేస్తున్న విజ్ఞప్తి. నాటా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఏది కావాలన్నా ఇంగ్లిష్‌లోనే.. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కనిపిస్తున్నాయి. బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్‌ను మన పిల్లలు చదువుతున్నారు. ప్రపంచంలో విజ్ఞానాన్ని నేర్చుకునేందుకు, చదువుకునేందుకు ఉపయోగపడే ఒక గొప్ప మీడియం ఇంగ్లిష్. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్‌గా ఎదగటానికి ఇంగ్లిష్ ఒక సాధనం. ఏది చదువుకోవాలన్నా, సబ్జెక్ట్పె అవగాహన పెంచుకోవాలన్నా ముందు ఇంగ్లిష్‌పై పూర్తి స్థాయిలో పట్టు రావాలి. వారికి కావాల్సినంత కంటెంట్ ఇంటర్నెట్లో ఉచితంగా అందుబాటులో ఉంది. మన ఫోన్లోనే ఇవన్నీ అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ ఇంగ్లిష్ ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి పునాదిని మనం గట్టి పరుస్తున్నాం. ఈవోడీబీలో మూడేళ్లుగా నంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మన రాష్ట్రం వరుసగా మూడేళ్లుగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో టాప్ 4, 5 స్థానాల్లో ఉంది. మనందరి ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, మహిళా సంక్షేమం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమం, సామాజిక న్యాయం, పారదర్శక పాలన.. ఇలా ప్రతి విషయంలో దేశంలోనే గొప్ప మార్పులకు నాంది పలికింది. -
నాటా వేడుకలకు వేళాయె!
సాక్షి, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) మహాసభలు ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండు వరకు అమెరికాలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద తెలుగు మహాసభలకు టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న కన్వెన్షన్ సెంటర్ వేదికవుతోంది. ‘సాంస్కృతిక వికాసమే నాటా మాట.. సమాజసేవే నాటా బాట’ అనే నినాదంతో ఇప్పటివరకు ఆ సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. నాటా సభలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందులో వంద మందికి పైగా రాజకీయ, సినీ, అధికార ప్రముఖులు ఉంటారని సమాచారం. ఈ సభల్లో దాదాపు 20 వేల మంది వరకు ప్రవాసాంధ్రులు పాల్గొననున్నారు. తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడేలా సంబరాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు సంబంధించి ఏరోజుకారోజు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇందుకు నాటా అధ్యక్షుడు డాక్టర్ కొరసపాటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి ఆతిథ్యం వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు పలు కమిటీల సభ్యులు, వలంటీర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా మూడురోజుల పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కరోనా తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అంగరంగ వైభవంగా నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు ప్రవాసాంధ్రులు భారీగా నమోదు చేసుకుంటున్నారు. అమెరికా తెలుగు సంఘాల చరిత్రలోనే అతిపెద్ద తెలుగు మహాసభలుగా ఇవి మిగిలిపోనున్నాయని నిర్వాహకులు అంటున్నారు. ప్రవాసాంధ్రులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒక్క కుటుంబం అనే భావన తీసుకురావడమే ప్రపంచ తెలుగు మహాసభల వెనుక ఉన్న ఉద్దేశమని చెబుతున్నారు. భావి తరాలకు ఘనమైన తెలుగు వారసత్వాన్ని అందించడం, పుట్టిన నేలకు తమవంతు సహాయం చేయడం, కొత్త తరానికి స్ఫూర్తిదాయక సందేశం ఇవ్వడమే నాటా ముందున్న లక్ష్యాలు. కరోనా తర్వాత నిర్వహిస్తుండటంతో ఎక్కడా రాజీ పడకుండా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాల్లో అత్యున్నత సాంకేతికత, వచ్చిన అతిథులకు అత్యుత్తమ హోటళ్లలో వసతి, రాకపోకలకు అధునాతన రవాణా సౌకర్యం, రుచికరమైన భోజనం, మరిచిపోలేని విధంగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. -
ద్వీపపు దేశంలో తెలుగు వెలుగులు..!
సాక్షి, హైదరాబాద్: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఆ దేశంలో జాతీయ సెలవు దినం.. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి కార్యక్రమానికి స్వయంగా ఆ దేశ ప్రధాని హాజరై తెలుగువారితో ఆనందం పంచుకుంటారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు తెలుగు భాష బోధన ఉంటుంది. నిత్యం అక్కడి తెలుగు లోగిళ్లలో తెలుగు వెలుగొందుతుంది. తెలుగువారి నోళ్లలో తెలుగు నానుతుంది. తెలుగు నేలకు వేల మైళ్ల దూరంలో ఉన్నా.. వారు తెలుగునే శ్వాసిస్తున్నారు. ఇది హిందూ మహాసముద్రంలో ఉండే చిన్న ద్వీపపు దేశం మారిషస్ ప్రత్యేకత. వచ్చే ఆగస్టులో గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా మారిషస్‌లో నిర్వహించే తెలుగు మహాసభలకు తెలుగు కళాకారులను పంపాలని తెలంగాణ సాంస్కృతిక శాఖను కోరేందుకు ‘మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయం’ అధ్యక్షులు నారాయణ స్వామి సన్యాసి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. తెలుగు మాట్లాటడం ప్రత్యేకత.. మారిషస్ జనాభా 12 లక్షలు.. అందులో లక్ష మందికిపైగా తెలుగువారే. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 5 తరాల కింద ఉపాధి కోసం వలస వెళ్లిన వారి వారసులు ఇప్పుడు కీలకంగా మారారు. అక్కడి ప్రభుత్వంలో ఇద్దరు తెలుగు వారు మంత్రులుగా ఉన్నారు(ఒకరు కొద్దిరోజుల క్రితమే తప్పుకొన్నారు). దాదాపు 150 పాఠశాలల్లో తెలుగును బోధిస్తున్నారు. తమ ఆరోతరం పిల్లలు స్పష్టంగా తెలుగులో మాట్లాడేలా చూస్తున్నామని చెప్పారు. వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న మారిషస్ తెలుగు మహాసభకు అనుబంధంగా దేశ వ్యాప్తంగా వంద తెలుగు సంఘాలున్నాయి. ఆధ్యాత్మికంగా, మాతృభాషాపరంగా ఉన్నతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఏటా మారిషస్ ప్రభుత్వం తెలుగు భాష వ్యాప్తికి రూ.10 లక్షలు తమకు కేటాయిస్తుందని తెలిపారు. ప్రపంచ మహా సభల్లో చేసిన తీర్మానాల అమలు ఎక్కడ వేసిన గొంగళి తరహాలో వదిలేస్తున్నారు. తెలుగు సిలబస్‌ను తాము ఎప్పటికప్పుడు మార్చుకుంటామని, సొంతంగానే పాఠ్యాంశాలు రూపొందించుకుంటామని చెప్పారు. ఐదేళ్లకోసారి.. సభలు..! ప్రతి 5 ఏళ్లకోసారి తెలుగు మహాసభలు నిర్వహించుకుంటున్నామని, వచ్చే సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సహా ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తామని చెప్పారు. మాకు తెలుగు విద్య బోధకులు, సంగీత, నృత్య, వివిధ వాయిద్యాల నిపుణులు కావాల్సిందిగా కోరారు. ప్రతి సంవత్సరం తెలుగులో నిర్వహించే వ్యాసరచన పోటీల్లో ఎంతోమంది విద్యార్థులు పాల్గొని అద్భుతంగా రాస్తున్నారని, కొందరు విద్యార్థులు సొంతంగా కథలు రాస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు ప్రభుత్వాలు సహకరిస్తే వారు మరింతగా రానిస్తారని వెల్లడించారు. -
ఫిబ్రవరి 3,4న ‘తెలుగు మహాసభలు’
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రపంచ తెలుగు సమాఖ్య 11వ ద్వైవార్షిక మహాసభలు, రజతోత్సవ వేడుకలు ఫిబ్రవరి 3, 4 తేదీల్లో చైన్నెలో నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విజయవాడలో గురువారం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ విలువలను భావి తరాలకు అందించడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
ఊరిస్తూ... పూరిస్తూ...
మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్తులో ఏర్పాటైన జి.ఎం.రామశర్మ శతావధానం మూడో రోజు సమస్యా పూరణం పూర్తయింది. పృచ్ఛకులు అడిగిన 25 సమస్యలను అవధాని సునాయాసంగా పూరించారు. మద్దూరి రామ్మూర్తి ఇచ్చిన సమస్యను– పద్యము శారదా హృదయ పద్మము భావ రసైక సద్మమున్ పద్యములన్ భళా యతులు ప్రాసల సత్కవచాల తోడ నైవేద్యముగాగ భారతికి వేద్యము చేయగనొప్పు తప్పుగా పద్యము వ్రాయనివాడు చెడి పాతకమందడు సత్కవీశ్వరా అని పూరించారు. పులికొండ సుబ్బాచారి ఇచ్చిన సమస్యను– పావన భావనా సుమతి భవ్యుడు కౌశికుడండనుండగా జీవనరేఖ భాగ్యముల సిద్ధులు ముద్దుగ గల్గ ఆ మహాదేవుని విల్లు ద్రుంచిన సుధీరుని రాముని భీకర ద్విశత్ రావణు పెండ్లియాడినది రాజిత సీత సకామౖయె భళా! అని పూరించి, అందులో ఉపయోగించిన పదాన్ని వివరించారు. సుందరకాండలో చాలాచోట్ల శత్రురావణః (శత్రువులను ఏడిపించేవాడు) అని వస్తుంది. ఆ అర్థం వచ్చేలా ద్విశత్ రావణు అని సమస్యను పూరించానని వివరించారు. కౌండిన్య తిలక్ ఇచ్చిన సమస్యకు తంపు సీరియళ్ల తంపులు కొంపలన్ కంపలట్లు తగిలె కెంపులూడె కోపతాములకు గురిచేయు సీరియల్స్ కన్న వారె కన్న ఖలులు గలరేఅంటూ సీరియల్స్ చూసే వారిని మించిన ఖలులు ఉన్నారా అని పూరించి శ్రోతలను అలరించారు. లింగవరం పవన్ కుమార్ ఇచ్చిన సమస్యను– శుచిలేనట్టి పదార్థముల్ తినగ వచ్చున్ వ్యాధులెన్నేనియున్ రచితానేక సుశాకపాకములు రారాజిల్లెనీ నేల ప్రచురంబై ప్రచలింపన్మది జంతుహింసలౌరా భావ్యంబహో కాదుపో రుచిమంతమ్మగు కోడి మాంసమది యారోగ్యమ్ము సన్యాసికిన్ అని పూరించడంతో సభంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. చివరగా సుశర్మ ఇచ్చిన సమస్యను... ధరలేడీ మన ముఖ్యమంత్రి సరళిన్ దమ్మున్న ధీనేత పరమంబౌæవరముల్ ప్రసాదముగ పంపన్ ధీరుడౌ శ్రీ పరంపరలూరంగ వెలుంగిలిచ్చునతడే ప్రాజ్ఞుండునా చంద్ర శేఖర మార్గమున సాగుమా కలుగు సౌఖ్యశ్రీ తెలంగాణకున్అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్తుతించి మంగళాశాసనం పలికారు. అలరించిన అప్రస్తుత ప్రసంగం అప్రస్తుత ప్రసంగీకునిగా వ్యవహరించిన పున్నమరాజు అవధానిని ఇబ్బందిపెడుతూ చక్కగా ప్రశ్నించారు. ‘‘మీ మెడలో పూలహారాన్ని మైకుకి ఎందుకు వేశారు?’’ అని ప్రశ్నించిన పున్నమరాజును ‘‘మీ మెడలో వేద్దామనుకున్నాను. కాని మైక్‌కి వేశాను’’ అన్నారు. ‘‘మీరు మైకు ద్వారా మీ కవితా పరిమళాన్ని మాకు అందిస్తున్నారు’’ అని పున్నమరాజు చమత్కరించారు. ‘‘తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. అప్రస్తుత ప్రసంగికుడు ముదిరితే ఏమవుతుంది’’అని చమత్కారంగా అడిగిన ప్రశ్నకు, ‘‘పిచ్చివాడు అవుతాడు. ఎందుకంటే అప్రస్తుత ప్రసంగీకులు మరింత హైపిచ్‌లో అడుగుతారు కదా. అందువల్ల వారు హైపిచ్చివాళ్లు’’ అని చమత్కరించారు అవధాని. ‘‘సునామీ స్త్రీలింగమా, పుంలింగమా’’ అని అడిగిన ప్రశ్నకు ‘‘మీరు సునామీలా ఉన్నారు. సు నామి అంటే మంచి పేరుగల వారు. మీపేరు పున్నమరాజు. మంచి పేరు’’ అన్నారు అవధాని. ‘‘ధార, ధారణ సముపార్జన కోసం రాత్రి పూట రసం పుచ్చుకుంటారా’’ అని అడిగితే, ‘‘శారదాదేవి పాద రసం సేవిస్తాను’’ అని సభ్యులను నవ్వులలో ముంచెత్తారు రామశర్మ. సభ్యులకు ఆనందం పంచే అప్రస్తుత ప్రసంగంలో ప్రశ్నలు బాగానే ఉన్నాయి కాని, సమాధానాలు మాత్రం ఆశించినంత స్థాయిలో రాలేదని పలువురు పండితులు భావించారు. – డా. వైజయంతి -
నాట్యానికి ఆధారం అక్షరమే!
32 ఏళ్ల తెలుగు యూనివర్సిటీ చరిత్రలో ఆమెది ఒక శుభారంభం.మహిళగా అందుకున్న తొలి అవకాశం అది.27 ఏళ్ల తన అనుభవాన్ని లలిత కళా పీఠానికి వన్నె తేవడానికే అంకితం చేస్తానంటున్నారు.తొలి మహిళా రిజిస్ట్రార్ అలేఖ్య పుంజలతో ముఖాముఖి... నాకు సినారె రాసిన కర్పూర వసంతరాయలు చాలా నచ్చింది. రెడ్డిరాజుల కాలం, నర్తకీమణి లకుమాదేవి జీవితాన్ని ఆయన కళ్లకు కట్టిన తీరు అద్భుతం. ఆ రచన నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. భారతీయ సాహిత్యంలో తెలుగు ప్రత్యేకత? తెలుగు భాష ఎంతటి మహోన్నతమైనదో తెలుగు సాహిత్యం అంతకంటే విస్తృతమైంది. దాన్ని ఈదాలంటే జీవితకాలం సరిపోదు. సాంస్కృతిక, కళారంగాల్లో మహిళలు ఎక్కువగా కనిపిస్తారు, మరి సాహిత్యరంగంలో ? సంస్కృతి పరిరక్షణలో మహిళలు ఎప్పుడూ ముందుంటారు. సంస్కృతి కలకాలం మనగలగాలంటే సాహిత్యం, కళలు రెండూ అవసరం. మేం ప్రదర్శిస్తున్న నాట్యరూపాలకు ఆధారం సాహిత్యమే. గతంలో సాహిత్యంలో మహిళలు తక్కువగా కనిపించేవారు. అప్పట్లో మహిళల అభిప్రాయాల వ్యక్తీకరణకు స్వేచ్ఛ తక్కువ. ఇప్పుడది పెరిగింది. ప్రస్తుతం తెలుగు సభల్లో రచయితల పట్ల గౌరవ సూచకంగా ద్వారాలకు పేర్లు కనిపిస్తున్నాయి. మరో పదేళ్ల తర్వాత రచయిత్రుల పేరుతో ద్వారాలను చూడవచ్చా? తప్పకుండా... మరో పదేళ్లకు జరిగే తెలుగు మహాసభల్లో రచయిత్రుల పేరుతో స్వాగత ద్వారాలు ఉంటాయి. ఎందుకంటే భావ వ్యక్తీకరణలో నేటి రచయిత్రులు చాలా చురుగ్గా ఉంటున్నారు. స్వాగతించాల్సిన మరో విషయమేమిటంటే.. రచయిత్రులు రాస్తున్నది రొమాంటిక్ పొయెట్రీ కాదు. సామాజిక స్పృహతో, హేతువాద దృక్పథంతో, మహిళాభ్యుదయం ఇతివృత్తంతో వారి రచనలు సాగుతున్నాయి. తెలుగులో కూడా మరో దశాబ్దానికి గొప్ప రచయిత్రులు తెర మీదకు వస్తారనడంలో సందేహం లేదు. మీకు ఎలాంటి రచనలు ఇష్టం? ప్రబంధాల రచనలే నాకిష్టం. ఏ కళాకారిణికైనా పారిజాతాపహరణ వంటి ప్రబంధాలే పంచప్రాణాలుగా ఉంటాయి. ఒక్కొక్క సన్నివేశంలో రచయిత ఊహాశక్తి ద్వారా పాఠకులను అత్యున్నత స్థాయికి చేరుస్తారు. దానిని ఒడిసిపట్టుకుంటే మేము అదే భావాన్ని నాట్యంలో ప్రదర్శించగలుగుతాం. నాట్యం ద్వారా ఆ సన్నివేశాన్ని మరికొంత ఎత్తుకి తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత నన్ను అంతగా ప్రభావితం చేసిన మరొక స్త్రీ పాత్ర రాణి రుద్రమదేవి ..: వాకా మంజులారెడ్డి -
ఇలా చేద్దాం...!
వలస పాలన నుంచి విముక్తి చెందిన మనం ఇంగ్లిష్ ఆదిపత్య ప్రభావం నుంచి బయటపడితే తప్ప తెలుగు సంపూర్ణ వికాసం చెందదు. ఇలా చెప్పడం అంటే, ఇంగ్లిష్‌ను అంటరాని భాషగా దూరం పెట్టి మడికట్టుకోమని కాదు. ప్రాథమిక స్థాయిలో తల్లి భాషలో విద్యాబోధన జరుపుతూ, తదనంతరం ఆంగ్లం నేర్పించాలి. దేశమేదయినా.. స్థానికంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నిక గన్న మేధావుల్లో అత్యధికులు అలా వచ్చినవారే. ఆంగ్లంలో సాధించే ప్రావీణ్యం తెలుగును పణంగా పెట్టి కావొద్దు. రెండో ప్రాధాన్యతతోనే ఇంగ్లిష్ నేర్చుకోవాలి. ప్రపంచీకరణ రోజుల్లో అదంత తేలిక కాకపోవచ్చు. కష్టమైనా అదే జరగాలి, అప్పుడే తెలుగు బతుకుతుంది. ప్రభుత్వాలు పూనిక వహిస్తే అసాధ్యమేమీ ఉండదు. అన్ని కాలాల్లోనూ భాషను బతికించడం, వృద్ధి పరచడంలో పౌర సమాజంతోపాటు పాలకులదే ప్రధాన పాత్ర. రాజరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య పాలన వరకు ఇదే జరుగుతోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ఆ మేరకు సంకల్పం ఉంటేనే తెలుగు భాషాభివృద్ధికి అండ. ఓట్ల రాజకీయాలకు పెద్దపీట వేస్తున్న ఈ రోజుల్లో ఎవరు ఒత్తిడి తెచ్చారని రాష్ట్రంలో ఇంతపెద్ద తెలుగు పండుగ జరుపుతున్నారు? సంకల్పం అంటే ఇదే! కానీ, ఆచరణలో లోపాలున్నాయి. సభా వేదిక వద్ద ‘మీడియా మీటింగ్ హాల్’ అని ఆంగ్లంలో తాటికాయంత అక్షరాలతో రాయడమే పరభాషా అనుచిత ప్రభావం. ఇది రాష్ట్రమంతా ఉంది. అన్ని నామఫలకాలదీ అదే గతి. ఒకోసారి తెలుగే ఉండదు. ఆశించే మార్పు ప్రభుత్వం నుంచి మొదలవాలి. పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాలు తల్లిభాషను పకడ్బందిగా అమలు పరుస్తాయి. రాయితీ కొనసాగిస్తూ సినిమా పేరు ‘రోబో’ అనుమతించాలన్న ప్రముఖ నటుడు రజనీకాంత్ విజ్ఞప్తిని తమిళ ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇతర భాషలో అయినా ‘రోబో’గానే విడుదలయిన ఆ సినిమా తమిళనాట మాత్రం ’యెన్తిరన్’ (యంత్రం)గా విడుదలయింది. అదీ భాష పట్ల కచ్చితత్వం. అదుండాలి. ..: దిలీప్‌రెడ్డి -
ఆమె.. కవనం జ్వలనం
..: సంగిశెట్టి శ్రీనివాస్ దేశ స్వాతంత్య్రానికి ముందే స్వతంత్రంగా ఆలోచించి కవిత్వం చెప్పిన కవయిత్రులు మనకున్నారు. తెలుగు మహాసభల సందర్భంగా ఆ స్ఫూర్తిదాతలను తలచుకుందాం. తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక సమ్మక్క, సారలమ్మ, రాణి రుద్రమ మొదలు నేటి వరకూ తెలంగాణలో స్త్రీల శౌర్యము ఎంతగానో ఉంది. ఘనమైన పాత్ర పోషించి చరిత్రకెక్కిన మహిళల గురించి ఇవ్వాళ చర్చించుకుంటున్నాం. ఈ చర్చలు చర్యలుగా మారాయి. ఆ చర్యలు పరిశోధనగా మారి తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక వెలుగులోకి వచ్చింది. ఆమె రాసిన పద్యాల్లో ఇప్పుడైతే ఒకటే అందుబాటులో ఉంది. దాని ఆధారంగా ఆమెను తొలి తెలుగు కవయిత్రిగా నేను నిర్ధారించడం జరిగింది. ఈమె రంగనాథ రామాయణము గ్రంథకర్త గోన బుద్ధారెడ్డి కూతురు. తొలి ఉర్దూ కవయిత్రి మహలఖాబాయి చాందా తెలంగాణలో తమ కళల ద్వారా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వారిలో తారామతి, ప్రేమావతి ఉన్నారు. వీళ్లు ప్రేమను కేంద్రంగా చేసుకొని రాశారు. హైదరాబాద్ నగరమే ప్రేమ పునాది మీద ఏర్పడింది. చంచల్‌గూడాలో ఉండే భాగమతిని ప్రేమించిన యువరాజు ఆమె కోసం మూసీనది ఉధృతంగా ప్రవహిస్తున్న కాలంలో తన గుర్రంపై సవారి అయి వచ్చేవాడు. యువరాజు సాహసం చూసి చలించిన రాజు ‘పురానా ఫూల్’ని కట్టించాడు. నిజాం రాజవంశానికి చెందిన హయత్ బ„Š బేగమ్ హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉన్న కిర్క్ పాట్రిక్‌ని ప్రేమించి 1800 ప్రాంతంలో వివాహమాడింది. హైదరాబాద్ ప్రేమతత్వానికి ఇట్లాంటి అనేక నిదర్శనాలున్నాయి. సాహిత్యంలో కూడా వీటి ప్రతిఫలనాలున్నాయి. వాటిలో ఉర్దూలో మహలఖాబాయి చాందా ప్రముఖురాలు. ఉర్దూలోమొదటిసారిగా కవిత్వం రాసిన మహిళ మహలఖాబాయి. ఈమెకు నిజాం ఖాందా తో ‘ప్రేమ’ పూరిత సంబంధాలున్నాయి. తొలి తెలంగాణ ఆధునిక కవయిత్రి రత్నమాంబ తెలంగాణకు తొలి ఆధునిక కవయిత్రి పెనుగోళ్ళ రత్నమాంబ దేశాయి. 1847లో పరిగి తాలూకా ఇప్పటూరులో జన్మించిన ఈమె వేంకటరమణ శతకము, శ్రీనివాస శతకము, బాలబోధ, శివరొరువంజి (యక్షగానం), దశావతార వర్ణన మొదలైన రచనలు వెలువరించారు. దశావతార వర్ణనను తన 72వ యేట రచించారు. ఈమె రచనలు హితబోధిని, నీలగిరి, తెనుగు పత్రికల్లో చోటుచేసుకున్నాయి. 1929లో మరణించిన ఈమె రచనలు ఇప్పుడు ఒకటి అరా తప్ప అందుబాటులో లేవు. 1934లో వెలువడ్డ గోలకొండ కవుల సంచికలో అత్రాఫ్ బల్దా జిల్లాకు చెందిన మొత్తం 33 మంది కవుల రచనలు చోటుచేసుకోగా అందులో ఈమె రచనలు కూడా ఉన్నాయి. ‘సంసార తరణము’ శీర్షికన ఆమె రాసిన మూడు కంద పద్యాలు ఈ సంచికలో ఉన్నాయి. గాంధీని అవతార పురు షునిగా ఆమె రాసిన కవిత్వం 1924లో అచ్చయ్యింది. 1913 డిసెంబర్ హితబోధిని సంచికలో ఆమె రాసిన పద్యాలతో ఆమెను తొలి తెలంగాణ కవయిత్రిగా చెప్పొచ్చు. అంతకు ముందే ఆమె రచనా వ్యాసంగం చేపట్టినప్పటికీ అవి అందు బాటులో లేకపోవడంతో 1913ని ప్రామాణికంగా తీసుకోవ డమైంది. ఈమెను తెలంగాణ కవితారంభానికి మాతృ మూర్తిగా ప్రతిష్టించి గౌరవించాల్సిన అవసరముంది. కందం, శార్దూలం, సీసం, తేటగీతి, ఆటవెలదుల్లో ఆమె పద్యాల్ని రాసింది. తరుణీకృత పాండిత్యము స్థిరమా యీమాట లంచు ఛేదింపకుడీ హరియాజ్ఞగాక నాకీ కరణి యుపన్యాసమొసగు జ్ఞానము గలదే అచల మత ప్రచారకర్త జాలమాంబ ఆధునిక మహిళల విషయానికి వస్తే దళితోద్యమ నేత భాగ్యరెడ్డి వర్మ మేనత్త రంగమ్మ 1880ల నాటికే క్రైస్తవ మతం పుచ్చుకుంది. భాగ్యరెడ్డి వర్మను చదువుకునేలా ప్రోత్సహించింది. దాదాపు ఇదే సమయంలో హైదరాబాద్‌లో అచల మతాన్ని ప్రచారం చేసిన తల్లావఝుల జాలమాంబ అనేక కీర్తనలు రాసింది. కొన్ని సీస పద్యాలు రాసింది. వాటిలో మచ్చుకు ఒక్కటి. కవిత్వంలో తప్పులుంటే ఎత్తి చూపాలని కోరింది. సీ. గురుపుత్రులార మద్గురుమూర్తి స్తోత్రంబు రచియింప బూను నా వచనములను వినలేడ్కగలిగిన వినరయ్య వినిపింతు తప్పులుండిన వాటి దాచబోక దిద్దవలసినది మీ దేశికేంద్రుని మీద మీకు భక్త్యున్నట్టె నాకు గలదు గాని మీవలె నేను కవిత జేయగజాల చాలనంచని విడజాలతోచి నట్లు జేయుదు మీ రందరభయమిడిన ననుచు విజ్ఞాపన మొనర్చి యాజ్ఞగొంటి భాగవత వంశ భవకృష్ణ యోగి రాజ ధీ విశారద మాకదేశి కేంద్ర నేటి స్త్రీవాదికి తీసిపోని సుందరాబాయి 1900లకు ముందే వరంగల్‌లో స్త్రీల సమాజాలు ఏర్పాటయ్యాయి. ఈ పరంపరను హైదరాబాద్‌లో రావిచెట్టు లక్ష్మీనరసమ్మ కొనసాగించింది. తన ఇంట్లోనే విద్యావసతులు ఏర్పాటు చేయడమే గాకుండా గ్రంథాలయోద్యమానికి కూడా అండగా నిలిచారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ, ఆర్థికంగానూ తోడ్పడింది. గ్రంథాలయోద్యమ ప్రభావంతో చాలా మంది పాఠకులుగా మారారు. ఇందులో స్త్రీలు కూడా ఉన్నారు. ఈ పాఠకులు తర్వాతి కాలంలో రచయిత్రులుగా మారినారు. వారిలో 1913లో ‘హితబోధిని’ పత్రికలో స్త్రీ విద్యావశ్యకత గురించి ఎస్.సుందరాబాయి వ్యాసాలు రాసింది. కవిత్వం కూడా అల్లింది. నిజా నికి ఈ పద్యం నేటి స్త్రీవాద రచనల కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. వెలుగులోకి రాని కవయిత్రులు 1928 నాటికే ఒక పద్మశాలి మహిళ ‘స్త్రీల విద్యావశ్యకత’ గురించి వ్యాసాలు రాసి ప్రజాచైతన్యానికి పాదులు వేసింది. ఆమె సికింద్రాబాద్‌కు చెందిన గిడుతూరి రామానుజమ్మ. 1934లో వెలువడిన గోలకొండ కవుల సంచికలో ఒక డజన్ కు మించి కవయిత్రులు రికార్డు కాలేదు. అయితే ఆధునిక కాలంలో తెలంగాణ సోయితో జరిగిన పరిశోధనల్లో జాలమాంబ, సుందరీబాయి వెలుగులోకి వచ్చారు. వీరితో పాటుగా 1935లో గోలకొండ పత్రికలో మాడపాటి హనుమంతరావు పాఠశాల విద్యార్థినులు ఎ.లక్ష్మీదేవి, పి.సావిత్రి, కోమలవల్లి, కె.లక్ష్మీబాయమ్మ, వై.కౌసల్యాదేవి, వై.అమృతమ్మ, నేమాని భారతీ రత్నాకరాంబ, వై.కౌసల్యాదేవి, కె.నీరజాక్షి తదితరుల కవిత్వం చోటు చేసుకుంది. ఇందులో ఎక్కువ మేరకు శ్రీకృష్ణునిపైనే ఉన్నాయి. మాతృభారతి పత్రికలో కేవలం కృష్ణుడిపైనే గాదు ఏసుక్రీస్తుపైనా 1935లోనే కవిత్వాన్ని రాశారు. ఈ గీతాల్ని రాసింది కె.ఫ్లా్లరె¯Œ ్స. బహుశా ఈమె తొలి తెలంగాణ దళిత కవయిత్రి అయివుండే అవకాశమున్నది. దళిత కాకున్నా తొలి క్రైస్తవ స్త్రీగా చెప్పవచ్చు. ఈమె రాసిన రెండు పద్యాల్లో ఒకటి. గీ. మా కొఱకు గాను నీ పుత్రు మమతజేసి పంపితివి, కాని, యాయన, బాధలు వడె దల్లి మరియమ్మ యెంతగా దల్లడిలెనొ చిన్ని కొమరుడేసు క్రీస్తు సిలువ మోయ 1933 నాటికే తెలంగాణ నుంచి ఒక స్త్రీ ప్రణయ కవిత్వం రాయడం విశేషం. ఈ కావ్యం ‘కావ్యావళి’. ఖమ్మం జిల్లాకు చెందిన ఇందుమతీదేవి రాశారు. ఈ కవితా సంపుటి 1936లో విశ్వనాథ సత్యనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం ముందుమాటల్తో వెలువడింది. ఈ పద్యాల్లో ఒక వైపు భర్తను, మరోవైపు దేవుడిని ఇద్దరినీ కొలుస్తూ ‘శ్లేష’ వచ్చే విధంగా కవిత్వమల్లింది. పావనంబగు మీమూర్తి వదల కెపుడు చిత్తసింహాసనము నధిష్టింపజేసి ప్రణయసామ్రాజ్యపట్టభాస్వన్మహోత్స వము గావించెదను ప్రమోద మ్మెలర్ప వీళ్ళే గాకుండా తత్వాలు చెప్పిన మనుసాని వెంకట లక్ష్మమ్మ, చిగుళ్ళపల్లి సీతమ్మ, మక్థల్ సుశీలమ్మ ఇట్లా ఎందరో ఉన్నారు. 1857–1956 మధ్య శతాబ్ది కాలంలో తెలంగాణలోని స్త్రీలు రాసిన లేదా చెప్పిన కవిత్వం రికార్డయినట్లయితే ఆనాటి మహిళా ప్రతిభ, సాహిత్యం, విరహం, మోహం, సరసం, ఆధునికత, అక్షర జ్ఞానం, ఎఱుక ఎలా ఉండేదో అర్థమయితది. చిన్న వాక్యాలు రాయడమే మంచిది మాట్లాడేభాషలో ఎప్పు డూ పెద్ద పెద్ద వాక్యాలు వుండవు. ఎవరైనా మాట్లాడుతూ వున్నప్పుడు చూడండి. మామూలుగా మాట్లాడేటప్పు డైనా, కోపంగా మాట్లాడేటప్పుడైనా, ఆ మాటలన్నీ చిన్న చిన్న వాక్యాలుగానే వుంటాయి. భాష ఎప్పుడూ చిన్న చిన్న వాక్యాలుగా వుండడమే మాట్లాడే భాషలో వుండే సూత్రం. ఈ సూత్రాన్నే రాసే భాషలో కూడా పాటించాలంటే, రాసే భాష కూడా చిన్న చిన్న వాక్యాలతోనే వుండాలి. అలావుంటే అది, మాట్లాడే భాషలాగా తేలిగ్గా అర్థమవుతూ వుంటుంది. ..: రంగనాయకమ్మ ఎవరి ప్రత్యేకత వారిది కవిత్వంలో రసోన్ముఖంగా సాగే అంశాలు ముఖ్యంగా నాలుగు. అవి– అలంకారాలు, గుణాలు, రీతులు, వృత్తులు. ప్రసిద్ధ కవులు తమ కవితా శైలులలో ఈ నాలుగింటిలో ఏదో ఒక దానికి ప్రాముఖ్యాన్ని కల్పించి తమ ప్రత్యేకతలను నిలుపుకొంటూ ఉంటారు. ఈ దృష్టితో సమీక్షిస్తే కవిత్రయం వారిది గుణప్రధానశైలి. శ్రీనాథునిది రీతి ప్రధాన శైలి. ప్రబంధ కవులది అలంకార ప్రధాన శైలి. నాటకీయతను పోషించిన తిక్కనాదులలో వృత్తులకు ప్రాముఖ్యం కనపడుతుంది. ..: జి.వి.సుబ్రహ్మణ్యం అస్పృశ్యులకూ, స్త్రీలకూ అల్లంత దూరంలో ఉన్న అక్షరాన్ని అడ్డంకులను దాటుకుని, అక్షరాలను గుండెలకు అదుముకుని, హృదయాలతో హత్తుకుని సాహిత్యానికి సంపూర్ణత్వాన్ని అద్దిన స్త్రీలెం దరో తెలుగు వెలుగుని దశదిశలా ప్రసరించారు. అక్షరాన్ని కమ్మేసిన పురు షాధిపత్యపు పొరలను చీల్చుకుని తమకు తాముగా ప్రకాశించేందుకు ఎన్నో సాహసాలూ, మరెన్నో త్యాగాలనూ మూటగట్టుకున్న తెలుగు సాహితీ ప్రపంచం మొన్నటి మొల్ల నుంచి, నిన్నటి రంగనాయకమ్మ, ఓల్గా, విమల, నేటి సుభద్ర, వినోదిని లాంటి స్త్రీవాద, దళిత రచయిత్రుల వరకు పరుచుకున్న అనుభవం ఘనమైనది. మొల్ల...: తన కావ్యం అర్థంకాని భాషలో మూగ, చెవిటి ముచ్చట కాకూడదని సులభమైన జానుతెలుగు రామాయణాన్ని రచించిన మొల్ల మన తెలుగు మల్లె. లాలిత్యానికీ, సుకుమారానికీ ప్రతీకైన సిరిమల్లెకాదీమె రాయల రాజులకు తన కావ్యాన్ని అంకితమిచ్చేందుకు తిరస్కరించి, తనకి ఇష్టుడైన రాముడికే తన రామాయణాన్ని అంకితమిచ్చిన నాటి స్త్రీల ఆత్మగౌరవ ప్రతీక. ముద్దుపళని: ఇరవయ్యవ శతాబ్దారంభంలో చర్చనీ యాంశమైన ‘రాధికా స్వాం తనం’ను ఆత్మకథగా రాసిన ముద్దుపళని తంజావూరు నాయక రాజులైన ప్రతాప సింహుడి వద్ద(1739–63) రాజనర్తకి. స్వేచ్ఛా వ్యక్తిత్వానికీ, స్వతంత్ర నిర్ణయాలకూ ప్రతీక. రంగనాయకమ్మ: పెట్టుబడిదారీ విధానపు శ్రమదోపిడీ గుట్టుని రట్టుచేసిన కారల్ మార్క్స్‘పెట్టుబడి’ని అత్యంత సులువుగా సామాన్యుడికి అర్థమయ్యే భాషలో తెలుగు ప్రజలకు పరిచయం చేసిన మహా రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ తెలుగు ప్రజలను ప్రభావితం చేసిన తీరు అసాధారణమైనది. వర్గదృక్పథాన్ని అందించిన రంగనాయకమ్మ స్ఫూర్తి ప్రతి తెలుగు గుండెలోనూ ప్రతిధ్వనిస్తుంది. ‘జానకివిముక్తి’ చలం తర్వాత స్త్రీలోకాన్ని చైతన్యపరిచిన తొలిపుస్తకం. ‘రామాయణ విషవృక్షం’, మూఢనమ్మకాలపై ఆమె రాసిన విమర్శనాత్మక పుస్తకం ‘తులసీదళం కాదది గంజాయి దమ్ము, స్త్రీ, రచయిత్రి, ‘ఇదే నా న్యాయం’, ఎన్నో నవలలూ, విమర్శనాత్మక వ్యాసాలూ తెలుగు సమాజానికి శాస్త్రీయ దృక్పథాన్ని అందించాయి. ఓల్గా: ఆధునిక స్త్రీల అస్తిత్వ ఉద్యమానికి ఓల్గా రచనలే పునాది. ఓల్గా రచనల్లో తొలి ముద్రితం 1969 పైగంబర కవిత్వం. స్త్రీలను అమితంగా ప్రభావితం చేసిన నవలల్లో ‘స్వేచ్ఛ’,‘రాజకీయ కథలు’, ‘నేనూ – సావిత్రీబాయిని’, ‘యుద్ధమూ –శాంతి’, ‘లక్ష్మణరేఖ’, వసంతకన్నాభిరాన్, కల్పనకన్నాభిరాన్, ఓల్గా కలిసి రాసిన ‘మహిళావరణం’ తెలుగు సాహితీరంగాన్ని గొప్ప మలుపుతిప్పాయి. అయితే ఇప్పటి వరకూ వచ్చిన స్త్రీవాద రచనలన్నీ అగ్రవర్ణ స్త్రీలు రాసినవనీ, సతి, వితంతువివాహం దళిత స్త్రీల జీవితాల్లో లేవనీ, అగ్రవర్ణ స్త్రీల సమస్యలపై రాసింది దళిత స్త్రీల సాహిత్యం కాదని, జూపాక సుభద్ర, గోగు శ్యామల, వినోదిని వంటివారు జోగినీ వ్యవస్థ, అస్పృశ్యత, సామాజిక హింస, పాకీపని, లాంటి వెలివేతల వెతలను ప్రశ్నిస్తున్నారు. జూపాక సు¿¶ ద్ర రాసిన ‘అయ్యయ్యో దమ్మక్క, రాయక్క మాన్యం, నల్లరేగడి సాల్లు, కైతునకల దండెం ఆ కోవలోనివే. అంబేడ్కర్ జీవిత చరిత్రను తెలుగులో రాసిన డాక్టర్ విజయభారతిగారి కృషినీ మరువలేం. రేవతీదేవి, జయప్రభ, కొండేపూడి నిర్మల, ఘంటశాల నిర్మల, పాటిబండ్ల రజని, కె.గీత, మహెజాబీన్, శిలాలోలిత, మందరపు హైమావతి, పసుపులేటి గీత, షాజహానా కవిత్వం, కుప్పిలిపద్మ రచనలు తెలుగు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి. ఇటు వర్గదృక్పథం, అటు స్త్రీవాదాన్ని అంతే బలంగా వినిపించారు విమల మోర్తల. విమల రాసిన ‘వంటగది’ కవిత, ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ స్ఫూర్తినినింపాయి. తెలంగాణ బిడ్డ, మహిళోద్యమ ఆవిర్భావకురాలు డాక్టర్.కె.లలిత, ప్రొఫెసర్ సుజీతారూ కృషిని తెలుగు ప్రజలు దారులేసిన అక్షరాల్లో వెతుక్కోవచ్చు. కె.లలిత రాసిన ‘సవాలక్ష సందేహాలు’ గతంలో ఎవ్వరూ తడమని ఎంతో విలువైన గ్రంధం, కె.లలిత, వసంతాకన్నాభిరాన్, సుశీతారూ బృందం అందించిన గొప్ప పరిశోధనాత్మక గ్రంధం ‘మనకు తెలియని మన చరిత్ర’ భారతీయ సమాజంలో ఎనలేని కృషి చేసీ, మరుగునపడిన బెంగళూరు నాగరత్నమ్మ లాంటి ఎందరో స్త్రీల చరిత్రలను వెలికితీసిందిది. స్త్రీవాద చరిత్రకారిణిగా బండారు అచ్చమాంబను తెలుగు సమాజం గుర్తుచేసుకుంటుంది. బహుభాషా కోవిదురాలైన అచ్చమాంబ రాసిన ‘అబల సచ్చరిత్ర రత్నమాల’ (1901) స్త్రీల చరిత్రలను వెలికితీసింది. తెలుగు ప్రజలు సగర్వంగా చెప్పుకునే కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. నాలుగున్నర దశాబ్దాల క్రితమే రుతుక్రమాన్ని సైతం అస్పృశ్యంగా మార్చిన వైనంపై తన ‘మూన్నాళ్ళ ముచ్చట’లో రాయడం గొప్పసంగతి. చిన్న కునుకు కోసం స్త్రీ జీవితాంతం పడే తపనని ‘సుఖాంతం’ కథ ఆవిష్కరిస్తుంది. ..: అత్తలూరి అరుణ -
చరిత్రలో నిలిచిపోయేలా మహాసభలు: పల్లా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లికి దండ వేసి గౌరవించాకే ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతాయని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ సభలు జరుగుతాయని, సభలకు 8 వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. సభల్లో పద్యం, గద్యం వంటి వాటితో పాటు తెలుగు ప్రక్రియలపై చర్చలుంటాయన్నారు. విప్లవ రచయితల సంఘం(విరసం) వంటి సంస్థలు రాజ్యాంగాన్ని గుర్తించవని, పిలిచినా కూడా వారు రారనే ఉద్దేశంతోనే పిలవలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలుగు భాష ఖ్యాతిని పెంచేలా సభలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు అన్నీ ఢిల్లీ నుంచే వస్తాయి కాబట్టి తెలంగాణ తెలుగు రుచించట్లేదని ఎద్దేవా చేశారు. -
ప్రపంచ తెలుగు మహాసభల జ్యోతియాత్ర
పాలకుర్తి/పాలకుర్తి టౌన్: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలోని పోతన సమాధి వద్ద నుంచి బుధవారం జ్యోతియాత్ర ప్రారంభమైంది. ముందుగా ఇక్కడ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదేవసేనతో పాటు విద్యావేత్త చుక్కా రామయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే ఇతర ప్రముఖులు జ్యోతిని వెలిగించి యాత్రను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతియాత్ర బమ్మెర నుంచి హైదరాబాద్‌కు శుక్రవారం చేరుతుందని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథుడి పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం, సోమనాథ కళాపీఠం, తెలంగాణ రచయితల సంఘం సంయుక్తంగా నిర్వహించిన జ్యోతియాత్ర కార్యక్రమంలో ఇంకా జాయింట్ కలెక్టర్ వనజాదేవి, సోమనాథ కళాపీఠం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, అధ్యక్షురాలు రాపోలు శోభరాణి పాల్గొన్నారు. -
మహాసభలపైనా విమర్శలేనా?: కర్నె
సాక్షి, హైదరాబాద్: మన యాస, భాషకు చక్కటి వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలను అందరూ భావిస్తుంటే కొందరు కువిమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. భాష, ప్రాంతం వేర్వేరన్న సంగతిని గుర్తించలేని వారే ఇలా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ యాసతో మాట్లాడనివ్వని పరిస్థితుల్లో భాషకు తల్లులు ఉండరని ఉద్యమంలో చెప్పామని భరతమాత, తెలంగాణ తల్లి మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. గతంలో ఆంధ్రమాత ఉండేదని, కుట్రతో తెలుగుతల్లిగా మార్చారని అన్నారు. ఉద్యమసమయంలో తాము తెలుగుతల్లినే తప్ప ఆంధ్రమాతను విమర్శించలేదని గుర్తుచేశారు. ఇంటి పండుగ వంటి ప్రపంచ తెలుగు మహాసభలను శపిస్తూ మాట్లాడటాన్ని ప్రజలు సహించరని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలకు కమీషన్లే కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. -
నేటి నుంచి మహాసభల కిట్ల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను న భూతో న భవిష్యత్ అన్నట్టుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియంలో ప్రధాన వేదిక నిర్మాణం, ఎనిమిది స్వాగత ద్వారాల ఏర్పాటు, ప్రత్యేక అలంకరణ, మహనీయుల హోర్డింగ్‌లు తదితర ఏర్పాట్లు తుదిదశకు చేరాయి. మరోవైపు గురువారం నుంచే ప్రతినిధులకు మహాసభల కిట్లు, పాస్‌లను అందజేసేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రవీంద్రభారతిలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి బుధవారం విలేకరులకు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన 2000 మంది ప్రతినిధులకు గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కిట్లను అందజేస్తామన్నారు. జిల్లాల నుంచి వచ్చేవారు నగరానికి చేరుకుని ఉంటే.. వాళ్లు కూడా రవీంద్రభారతిలో కిట్లను పొందవచ్చని, శుక్రవారం మధ్యాహ్నం వరకు రవీంద్రభారతిలో కిట్లను అందజేస్తారని చెప్పారు. ప్రతినిధులు తమ వద్ద ఉన్న స్లిప్పు, వరుస సంఖ్య చెబితే చాలు.. కిట్ అందజేస్తారన్నారు. విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ రమేశ్ కిట్ల పంపిణీని పర్యవేక్షిస్తారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు.. వాళ్లు బస చేసే హోటళ్లలోనే కిట్లను అందజేస్తారు. సుమారు 8 వేల మంది ప్రతినిధులు, మరో 1,500 మంది అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు మహాసభల్లో పాల్గోనున్నారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే 6,000 మంది ప్రతినిధులకు నగరంలోని పలు హోటళ్లలో బస కల్పించారు. వారికి అక్కడే భోజనం, వసతి ఉంటాయి. అక్కడి నుంచి వేదికలకు వెళ్లేందుకు అకాడమీయే రవాణా సదుపాయాన్ని కల్పించనుంది. వెయ్యి మంది వలంటీర్లు.. మహాసభల సందర్భంగా ప్రతినిధులకు, అతిథులకు కావలసిన సదుపాయాలను అందజేసేందుకు సాహిత్య అకాడమీ వెయ్యి మంది పరిశోధక విద్యార్థులను వలంటీర్లుగా నియమించింది. వీరు మహాసభల టీషర్టులు, టోపీలు ధరించి ప్రతినిధులకు, అతిథులకు అందుబాటులో ఉంటారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం, ప్రముఖులకు తగిన సేవలు అందజేసేందుకు టూరిజండెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుమారు 700 మందిని వినియోగించనున్నారు. హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న జిల్లాలకు 20 నుంచి 30 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. తెలుగు అధ్యాపకులు, భాషా పండితులు, ప్రతినిధులు, రచయితలు, కవులు వీటిలో ఉచితంగా హైదరాబాద్ చేరుకునే సదుపాయం కల్పిస్తారు. ప్రధాన వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు.. ఎల్బీ స్టేడియంలోని ప్రధాన వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు ప్రారంభోత్సవానికి హాజరయ్యే ముఖ్యఅతిథి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును పూర్ణకుంభం, మంగళవాద్యాలతో వేదిక వద్దకు సాదరంగా తోడ్కొని వస్తారు. రాష్ట్ర గవర్నర్ సరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి స్వాగతోపన్యాసం చేయనున్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. 10 వేల మంది ప్రతినిధులు కూర్చునేందుకు ఏర్పాటు చేయనున్నారు. మరో 20 వేల మంది సాధారణ ప్రజల కోసం గ్యాలరీలో సీట్లు ఏర్పాటు చేయనున్నారు. తీర్మానాలు ఇవీ.. ♦ మహాసభల సందర్భంగా ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగు బోధించాలనే తీర్మానం ఉంటుంది. ♦ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో నామ ఫలకాలు తప్పనిసరిగా తెలుగులోనే ఏర్పాటు చేయాలి. ♦ అధికార భాషా సంఘాన్ని బలోపేతం చేయాలి. ♦ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలి. ♦ వీటితో పాటు మరికొన్ని తీర్మానాలు ఉండే అవకాశం ఉంది. -
సాహితీ చరిత్రను ప్రపంచానికి చాటాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భాష, సంస్కృతి, సాహితీ చరిత్రను ప్రపంచానికి చాటేలా తెలుగు మహాసభల ఏర్పాట్లు ఉండాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. తెలుగు మహాసభల ఏర్పాట్లను మంత్రి కడియం బుధవారం సమీక్షించారు. ఎల్బీ స్టేడియంలో మహాసభల ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన వేదిక నిర్మాణం, స్వాగత ద్వారాలు, స్టాల్స్ ఏర్పాటు చేసే కేంద్రాలు తదితర పనులను పర్యవేక్షించారు. ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తున్న లేజర్‌షో, బాణసంచా విశేషాలను గురించి నిర్వాహకులతో చర్చించారు. సమావేశంలో సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మహాసభల కోర్ కమిటీ సభ్యులు ఎస్వీ సత్యనారాయణ, ఆయాచితం శ్రీధర్, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు మహాసభల పోస్టర్ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలుగు మహాసభలు విజయవంతం అయ్యేందుకు ఉద్యోగులు కృషి చేయాలని టీఎన్జీవో కోరింది. ఈ సభల ద్వారా తెలంగాణ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చింది. రేపటి నుంచి 19 వరకు జరగనున్న ఈ మహా సభల పోస్టర్‌ను టీఎన్జీవో భవన్లో బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. -
తెలుగు మహాసభలకు రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఈనెల 19న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ రానున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్రపతి పర్యటనపై అధికారులతో సీఎస్ సమీక్షించారు. రాష్ట్రపతి ఈ నెల 19న బేగంపేట విమానాశ్రయంకు మధ్యాహ్నం 2.55 కు చేరుకుంటారన్నారు. ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు , ట్రాఫిక్, బందోబస్తు, స్వాగత తోరణాలు, నిరంతర విద్యుత్ సరఫరా, రోడ్లకు మరమ్మతులు, పారిశుద్ధ్యం, పరేడ్, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. 20న ట్యాంక్‌బండ్ వద్ద బుద్ధుని సందర్శించి పుష్పాంజలి ఘటిస్తారని అనంతరం తిరిగి ఢిల్లీకి పయనమవుతారన్నారు. ఈ నెల 23 నుండి శీతాకాల విడిదికి రాష్ట్రపతి విచ్చేయుచున్న నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా సీఎస్ అధికారులను ఆదేశించారు. -
200 గ్రంథాల ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాహిత్యం, చరి త్ర, సంస్కృతి, ప్రముఖుల స్వీయచరిత్ర, కవిత్వం, నవల, కథ వంటి సాహితీ ప్రక్రియల్లో వచ్చిన నూతన పోకడలు వంటి అనేక అంశాలపై పలువురు కవులు, రచయితలు రాసిన సుమారు 200 గ్రంథాలను ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆవిష్కరించనున్నారు. మహాసభల్లో ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే సాహిత్య సదస్సులో విభిన్న అంశాలపై పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. మహా సభలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రత్యేకంగా ముద్రించిన కొన్ని పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. తెలంగాణలో శతాబ్దాలుగా వెలుగొందిన పద్య కవిత్వంపై రాసిన ‘పద్య కవితా వైభవం’, ‘నవలా వికాసం’, ‘కంబు కందుల చరిత్ర తదితర పుస్తకాలతో పాటు 6 వేల తెలంగాణ సామెతలతో రూపొందించిన ‘తెలంగాణ సామెతలు’ గ్రంథం, సంకీర్తనలపై ఈగ బుచ్చిదాసు రాసిన పుస్తకం, 1920 నుంచి 1950 వరకు తెలంగాణలో వచ్చిన భావకవిత్వంపై సామిడి జగన్‌రెడ్డి రాసిన ‘తెలంగాణలో భావకవిత్వం’, మాదిరాజు రామ కోటేశ్వర్రావు నిజాం కాలంలో తన అనభ వాలపై రాసిన స్వీయచరిత్ర ‘తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం’, తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కాలంలో వెలువడిన పత్రిక ‘సోయి’ వ్యాసాల సంకలనం, డాక్టర్ రాజారెడ్డి నాణేలపై రాసిన గ్రంథాలను ఆవిష్కరించనున్నారు. లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న 800 తెలుగు పుస్తకాల పట్టిక, ఖమ్మం జిల్లాకు చెందిన చందాల కేశవదాసు రాసిన సినీ పాటలు మొదలుకుని నేటి వరకు తెలంగాణ కవులు రాసిన సినిమా పాటలపై కందికొండ రాసిన ‘తెలంగాణ సినీగేయ ప్రస్థానం’ పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ప్రత్యేక సంచిక ఆవిష్కరణ.. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రత్యేక సంచికల ముద్రణ చేపట్టింది. ‘వాంఙ్మయ’ సాహిత్య ప్రత్యేక సంచికతో పాటు తెలుగు మహాసభల పై రూపొందించిన ప్రత్యేక సంచిక ‘తెలుగు వాణి’ని, తెలంగాణ ప్రాచీన, ఆధునిక సాహి త్యం, తెలంగాణ ప్రాచీన, ఆధునిక చరిత్ర, శాసనాలు తదితర అంశాలతో కూడిన మినీ ఎన్సైక్లోపీడియాను ఆవిష్కరించనుంది. ‘హైదరాబాద్ సంస్థానం–చైతన్యం’, బంజా రాల తీస్ ఉత్సవం, కొండరెడ్ల సాహిత్యం తదితర గ్రంథాలను ఆవిష్కరించనున్నారు. కిట్‌లో మూడు పుస్తకాలు.. మహాసభలకు విచ్చేసే ప్రతినిధులకు కిట్‌లో మూడు పుస్తకాలను అందజేస్తారు. బమ్మెర పోతన సాహిత్యంపై డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసిన ‘మందార మకరందం’, ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన ‘వాగ్భూషణం– భూషణం’, ఎస్ఈఆర్టీ రూపొందించిన ‘తెలంగాణ సాంస్కృతిక వైభవం’పుస్తకాలను ఉచితంగా అందజేయనున్నారు. వీటితో పాటు తెలుగు సంవత్సరాలు, మాసాలు, కార్తెలు, తిథులు, రుతువులు తదితర వివరాలతో కూడిన మరో పుస్తకాన్ని ప్రతినిధులకు అందజేస్తారు. -
తెలుగుకు వెలుగు..