200 గ్రంథాల ఆవిష్కరణ | 200 books launch | Sakshi
Sakshi News home page

200 గ్రంథాల ఆవిష్కరణ

Published Wed, Dec 13 2017 2:22 AM | Last Updated on Wed, Dec 13 2017 2:22 AM

200 books launch - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాహిత్యం, చరి త్ర, సంస్కృతి, ప్రముఖుల స్వీయచరిత్ర, కవిత్వం, నవల, కథ వంటి సాహితీ ప్రక్రియల్లో వచ్చిన నూతన పోకడలు వంటి అనేక అంశాలపై పలువురు కవులు, రచయితలు రాసిన సుమారు 200 గ్రంథాలను ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆవిష్కరించనున్నారు. మహాసభల్లో ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే సాహిత్య సదస్సులో విభిన్న అంశాలపై పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. మహా సభలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రత్యేకంగా ముద్రించిన కొన్ని పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు.

తెలంగాణలో శతాబ్దాలుగా వెలుగొందిన పద్య కవిత్వంపై రాసిన ‘పద్య కవితా వైభవం’, ‘నవలా వికాసం’, ‘కంబు కందుల చరిత్ర తదితర పుస్తకాలతో పాటు 6 వేల తెలంగాణ సామెతలతో రూపొందించిన ‘తెలంగాణ సామెతలు’ గ్రంథం, సంకీర్తనలపై ఈగ బుచ్చిదాసు రాసిన పుస్తకం, 1920 నుంచి 1950 వరకు తెలంగాణలో వచ్చిన భావకవిత్వంపై సామిడి జగన్‌రెడ్డి రాసిన ‘తెలంగాణలో భావకవిత్వం’, మాదిరాజు రామ కోటేశ్వర్‌రావు నిజాం కాలంలో తన అనభ వాలపై రాసిన స్వీయచరిత్ర ‘తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం’, తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కాలంలో వెలువడిన పత్రిక ‘సోయి’ వ్యాసాల సంకలనం, డాక్టర్‌ రాజారెడ్డి నాణేలపై రాసిన గ్రంథాలను ఆవిష్కరించనున్నారు.

లండన్‌లోని బ్రిటిష్‌ లైబ్రరీలో ఉన్న 800 తెలుగు పుస్తకాల పట్టిక, ఖమ్మం జిల్లాకు చెందిన చందాల కేశవదాసు రాసిన సినీ పాటలు మొదలుకుని నేటి వరకు తెలంగాణ కవులు రాసిన సినిమా పాటలపై కందికొండ రాసిన ‘తెలంగాణ సినీగేయ ప్రస్థానం’ పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.

ప్రత్యేక సంచిక ఆవిష్కరణ..
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రత్యేక సంచికల ముద్రణ చేపట్టింది. ‘వాంఙ్మయ’ సాహిత్య ప్రత్యేక సంచికతో పాటు తెలుగు మహాసభల పై రూపొందించిన ప్రత్యేక సంచిక ‘తెలుగు వాణి’ని, తెలంగాణ ప్రాచీన, ఆధునిక సాహి త్యం, తెలంగాణ ప్రాచీన, ఆధునిక చరిత్ర, శాసనాలు తదితర అంశాలతో కూడిన మినీ ఎన్‌సైక్లోపీడియాను ఆవిష్కరించనుంది. ‘హైదరాబాద్‌ సంస్థానం–చైతన్యం’, బంజా రాల తీస్‌ ఉత్సవం, కొండరెడ్ల సాహిత్యం తదితర గ్రంథాలను ఆవిష్కరించనున్నారు.

కిట్‌లో మూడు పుస్తకాలు..
మహాసభలకు విచ్చేసే ప్రతినిధులకు కిట్‌లో మూడు పుస్తకాలను అందజేస్తారు. బమ్మెర పోతన సాహిత్యంపై డాక్టర్‌ సి.నారాయణరెడ్డి రాసిన ‘మందార మకరందం’, ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన ‘వాగ్భూషణం– భూషణం’, ఎస్‌ఈఆర్టీ రూపొందించిన ‘తెలంగాణ సాంస్కృతిక వైభవం’పుస్తకాలను ఉచితంగా అందజేయనున్నారు. వీటితో పాటు తెలుగు సంవత్సరాలు, మాసాలు, కార్తెలు, తిథులు, రుతువులు తదితర వివరాలతో కూడిన మరో పుస్తకాన్ని ప్రతినిధులకు అందజేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement