సాక్షి, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) మహాసభలు ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండు వరకు అమెరికాలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద తెలుగు మహాసభలకు టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న కన్వెన్షన్ సెంటర్ వేదికవుతోంది. ‘సాంస్కృతిక వికాసమే నాటా మాట.. సమాజసేవే నాటా బాట’ అనే నినాదంతో ఇప్పటివరకు ఆ సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది.
నాటా సభలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందులో వంద మందికి పైగా రాజకీయ, సినీ, అధికార ప్రముఖులు ఉంటారని సమాచారం. ఈ సభల్లో దాదాపు 20 వేల మంది వరకు ప్రవాసాంధ్రులు పాల్గొననున్నారు. తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడేలా సంబరాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు సంబంధించి ఏరోజుకారోజు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
ఇందుకు నాటా అధ్యక్షుడు డాక్టర్ కొరసపాటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి ఆతిథ్యం వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు పలు కమిటీల సభ్యులు, వలంటీర్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా మూడురోజుల పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
అంగరంగ వైభవంగా ఏర్పాట్లు
కరోనా తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అంగరంగ వైభవంగా నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు ప్రవాసాంధ్రులు భారీగా నమోదు చేసుకుంటున్నారు. అమెరికా తెలుగు సంఘాల చరిత్రలోనే అతిపెద్ద తెలుగు మహాసభలుగా ఇవి మిగిలిపోనున్నాయని నిర్వాహకులు అంటున్నారు.
ప్రవాసాంధ్రులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒక్క కుటుంబం అనే భావన తీసుకురావడమే ప్రపంచ తెలుగు మహాసభల వెనుక ఉన్న ఉద్దేశమని చెబుతున్నారు. భావి తరాలకు ఘనమైన తెలుగు వారసత్వాన్ని అందించడం, పుట్టిన నేలకు తమవంతు సహాయం చేయడం, కొత్త తరానికి స్ఫూర్తిదాయక సందేశం ఇవ్వడమే నాటా ముందున్న లక్ష్యాలు.
కరోనా తర్వాత నిర్వహిస్తుండటంతో ఎక్కడా రాజీ పడకుండా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాల్లో అత్యున్నత సాంకేతికత, వచ్చిన అతిథులకు అత్యుత్తమ హోటళ్లలో వసతి, రాకపోకలకు అధునాతన రవాణా సౌకర్యం, రుచికరమైన భోజనం, మరిచిపోలేని విధంగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment