సాక్షి, హైదరాబాద్: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఆ దేశంలో జాతీయ సెలవు దినం.. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి కార్యక్రమానికి స్వయంగా ఆ దేశ ప్రధాని హాజరై తెలుగువారితో ఆనందం పంచుకుంటారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు తెలుగు భాష బోధన ఉంటుంది. నిత్యం అక్కడి తెలుగు లోగిళ్లలో తెలుగు వెలుగొందుతుంది. తెలుగువారి నోళ్లలో తెలుగు నానుతుంది. తెలుగు నేలకు వేల మైళ్ల దూరంలో ఉన్నా.. వారు తెలుగునే శ్వాసిస్తున్నారు. ఇది హిందూ మహాసముద్రంలో ఉండే చిన్న ద్వీపపు దేశం మారిషస్ ప్రత్యేకత. వచ్చే ఆగస్టులో గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా మారిషస్‌లో నిర్వహించే తెలుగు మహాసభలకు తెలుగు కళాకారులను పంపాలని తెలంగాణ సాంస్కృతిక శాఖను కోరేందుకు ‘మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయం’ అధ్యక్షులు నారాయణ స్వామి సన్యాసి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు.
తెలుగు మాట్లాటడం ప్రత్యేకత..
మారిషస్ జనాభా 12 లక్షలు.. అందులో లక్ష మందికిపైగా తెలుగువారే. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 5 తరాల కింద ఉపాధి కోసం వలస వెళ్లిన వారి వారసులు ఇప్పుడు కీలకంగా మారారు. అక్కడి ప్రభుత్వంలో ఇద్దరు తెలుగు వారు మంత్రులుగా ఉన్నారు(ఒకరు కొద్దిరోజుల క్రితమే తప్పుకొన్నారు). దాదాపు 150 పాఠశాలల్లో తెలుగును బోధిస్తున్నారు. తమ ఆరోతరం పిల్లలు స్పష్టంగా తెలుగులో మాట్లాడేలా చూస్తున్నామని చెప్పారు. వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న మారిషస్ తెలుగు మహాసభకు అనుబంధంగా దేశ వ్యాప్తంగా వంద తెలుగు సంఘాలున్నాయి. ఆధ్యాత్మికంగా, మాతృభాషాపరంగా ఉన్నతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఏటా మారిషస్ ప్రభుత్వం తెలుగు భాష వ్యాప్తికి రూ.10 లక్షలు తమకు కేటాయిస్తుందని తెలిపారు. ప్రపంచ మహా సభల్లో చేసిన తీర్మానాల అమలు ఎక్కడ వేసిన గొంగళి తరహాలో వదిలేస్తున్నారు. తెలుగు సిలబస్‌ను తాము ఎప్పటికప్పుడు మార్చుకుంటామని, సొంతంగానే పాఠ్యాంశాలు రూపొందించుకుంటామని చెప్పారు.
ఐదేళ్లకోసారి.. సభలు..!
ప్రతి 5 ఏళ్లకోసారి తెలుగు మహాసభలు నిర్వహించుకుంటున్నామని, వచ్చే సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సహా ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తామని చెప్పారు. మాకు తెలుగు విద్య బోధకులు, సంగీత, నృత్య, వివిధ వాయిద్యాల నిపుణులు కావాల్సిందిగా కోరారు. ప్రతి సంవత్సరం తెలుగులో నిర్వహించే వ్యాసరచన పోటీల్లో ఎంతోమంది విద్యార్థులు పాల్గొని అద్భుతంగా రాస్తున్నారని, కొందరు విద్యార్థులు సొంతంగా కథలు రాస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు ప్రభుత్వాలు సహకరిస్తే వారు మరింతగా రానిస్తారని వెల్లడించారు.
ద్వీపపు దేశంలో తెలుగు వెలుగులు..!
Published Sun, Jul 28 2019 12:20 PM | Last Updated on Sun, Jul 28 2019 12:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment