గ్రామాలకు చేయూత | CM Jagan video message on Dallas NATA Telugu Maha Sabhalu | Sakshi
Sakshi News home page

గ్రామాలకు చేయూత

Published Tue, Jul 4 2023 3:58 AM | Last Updated on Tue, Jul 4 2023 3:58 AM

CM Jagan video message on Dallas NATA Telugu Maha Sabhalu - Sakshi

మీలో ఎంతో మంది మూలాలు మన మట్టిలోనే, మన గ్రామాల్లోనే ఉన్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన మీలో ఎంతో మంది అక్కడ రాణించేందుకు కఠోరమైన కమిట్‌మెంట్, ఫోకస్‌ కారణం. ఈ రెండూ మిమ్మల్ని ఆ గడ్డ మీద నిలబెట్టాయి. అలాంటి కమిట్‌మెంట్, ఫోకస్‌ మన రాష్ట్రంలోని పిల్లల్లో ఎంతగానో ఉండటాన్ని నేను చూశా. ఆకాశాన్ని అధిగమించి ఎదిగేందుకు వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలన్న తపనతో నాలుగేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేగలిగాం. గ్లోబల్‌ సిటిజన్‌గా ఎదగాలంటే చదువన్నది ఒక పెద్ద సాధనం. 
    – ప్రవాసాంధ్రులతో సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి: ప్రవాసాంధ్రులు విలువైన తమ నైపుణ్యాలు, అనుభవాలను పంచుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఐక్యంగా కాపాడుకుంటూ ఎన్నారైలు విదేశాల్లో కీలక పదవుల్లో, ఉన్నత స్థానాల్లో రాణిస్తుండటం పట్ల సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేశారు.

అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ‘నాటా’ (నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌) తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం వీడియో సందేశం పంపారు. గ్లోబల్‌ సిటిజన్‌గా ఎదిగేందుకు చదువన్నది కీలక సాధనమన్నారు. మన విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు నాలుగేళ్లుగా విద్యా రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, గ్రామాల్లోనే అందిస్తున్న సేవలను గమనించాలని ఈ సందర్భంగా కోరారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
 
మీరంతా మాకు గర్వకారణం.. 
2023 నాటా కన్వెన్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. నాటా కార్యవర్గానికి మరీ ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్‌తోపాటు అందరికీ శుభాకాంక్షలు. నాలుగేళ్ల క్రితం నేను డల్లాస్‌ వచ్చిన సందర్భంగా మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ మరువలేను. విదేశాల్లో ఉన్న ఇంత మంది తెలుగువారు గొప్పవైన మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా, ఐటీ నిపుణులుగా, నాసా సైంటిస్టులుగా, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా, పేరు పొందిన డాక్టర్లుగా రాణిస్తున్న మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం.    

సర్కారు స్కూళ్ల స్వరూపాన్ని మార్చేశాం 
రాష్ట్రంలో విద్యారంగంలో తెచ్చిన మార్పులను గమనిస్తే మన గవర్నమెంట్‌ బడులన్నీ పూర్తిగా రూపురేఖలు మారుతున్నాయి. నాడు – నేడు అనే గొప్ప కార్యక్రమం ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 8వ తరగతిలోకి రాగానే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్లను నియమించాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్‌ విద్య అందించేలా ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం.

డిసెంబరు నాటికి అన్నిచోట్లా వీటి ఏర్పాటు పూర్తి అవుతుంది. మన గవర్నమెంట్‌ బడుల్లోనే 3వ తరగతి నుంచే టోఫెల్‌కు శిక్షణ ఇచ్చేందుకు ఈటీఎస్, ప్రిన్స్‌టన్‌తో ఒప్పందం చేసుకున్నాం. 3వ తరగతి నుంచే సన్నద్ధం చేసి టోఫెల్‌ ప్రైమరీ, టోఫెల్‌ జూనియర్‌.. ఇలా పదో తరగతి వరకూ శిక్షణ ఇస్తారు. ఇంటర్‌మీడియట్‌లో టోఫెల్‌ సీనియర్‌ను వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నాం.

అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నాం.  ఇవన్నీ విద్యా వ్యవస్ధలో తెచ్చిన మార్పులు. చదువు అనే ఆయుధం ఎంత అవసరమో తెలియచేసేందుకు ఇవన్నీ ఇంతగా చెప్పాల్సి వస్తోంది. సుదీర్ఘంగా వెల్లడించే సమయం లేకున్నా రాష్ట్రంలో మన తర్వాత తరం గురించి ఎంత చిత్తశుద్ధితో ఆలోచన చేస్తున్నామో మీ అందరికీ క్లుప్తంగా వివరించగలిగా.  

గ్రామాల్లోనే 600 రకాల పౌర సేవలు 
విద్యారంగం ఒక్కటే కాదు.. ఏది చూసినా ఇలాంటి మార్పులే కనిపిస్తాయి. అంతెందుకు..  మీ అందరికీ గ్రామాల్లోనే మూలాలు,  పరిచయాలు ఉన్నాయి. ఒక్కసారి మీ గ్రామాన్ని పరిశీలిస్తే ఎప్పుడూ చూడని విధంగా విలేజ్‌ సెక్రటేరియట్‌ మీ కళ్లెదుటే కనిపిస్తుంది. అందులో దాదాపు 10 మంది ఉద్యోగులు మీ ఊరికి సంబంధించిన సేవలు అందిస్తూ కనిపిస్తున్నారు. బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి దాదాపు 600 రకాల సేవలు అందిస్తున్నాం.

ప్రతి 2,000 మంది జనాభాకు ఒకటి చొప్పున గ్రామ సచివాలయాలను తెచ్చి గ్రామాల్లోనే సేవలందిస్తున్న గొప్ప పరిస్థితి ఇవాళ ఉంది. పౌర సేవల్ని వలంటీర్లు ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేస్తున్నారు. పెన్షన్, రేషన్‌ అన్నీ మన ఇంటి ముంగిటికే వస్తున్న గొప్ప వాతావరణం మన రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. విత్తనం నుంచి పంట విక్రయాల వరకూ ప్రతి రైతును చేయి పట్టుకుని నడిపిస్తున్న గొప్ప వ్యవస్ధ మన గ్రామంలోనే కనిపిస్తోంది. నాలుగు అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌లు కూడా కనిపిస్తాయి.  

ప్రివెంటివ్‌ కేర్‌పై దృష్టి 
ప్రివెంటివ్‌ కేర్‌పై ఒక ప్రభుత్వం ఇంత ధ్యాస పెట్టిన పరిస్థితి బహుశా ఎప్పడూ చూసి ఉండరు. బీపీ, షుగర్‌ లాంటి జీవన శైలి జబ్బులకు ఇవే కారణాలుగా కనిపిస్తున్నాయి. సరైన సమయంలో ట్రీట్‌మెంట్‌ చేయలేకపోతే బ్లడ్‌ ప్రెజర్‌ కార్డియాక్‌ అరెస్టుకు, షుగర్, కిడ్నీ వ్యాధులకు దారి తీస్తుంది. మెడికల్‌ బిల్స్‌ను కట్టడి చేయాలంటే ప్రివెంటివ్‌ కేర్‌ చాలా ముఖ్యం. అందుకే ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్, దానికి అనుసంధానంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్‌్టను తెచ్చాం. ఎన్నడూ లేనివిధంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క వైద్య రంగంలోనే 48 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశాం. నాడు – నేడుతో ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేశాం.  

మన గ్రామాల్లో ఆర్థిక సుస్థిరత 
ఇక్కడ మన రాష్ట్రం గురించి మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నిర్లక్ష్యం వహిస్తే వినియోగం పెరిగిపోయి ఉత్పత్తిదారులు లేకుండా పోతారు. దీనివల్ల ఆహార ధాన్యాల కొరత తలెత్తి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు  ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆహార ధాన్యాలను పండించిన తర్వాత మనం వాటిని లాభాలకే విక్రయిస్తాం. ఏ దేశమైనా వాటిని దిగుమతి చేసుకోవాలంటే రవాణా వ్యయం కూడా ఉంటుంది.

అంతేకాకుండా రీటైల్‌ మార్జిన్, సరఫరా వ్యయం కూడా భరించాలి. అందుకే ఏ దేశమైనా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం మొదలుపెడితే ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకున్నట్లే. అలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలి. అలా జరగాలంటే ప్రతి గ్రామంలో నివసిస్తున్న వారి ఆకాంక్షలను నెరవేర్చాలి. ఈ రోజు రాష్ట్రంలో మనం చేస్తున్న పనులతో వాటిని చేరుకోగలం. గ్రామాల్లో ఉన్నవారు ఏం కోరుకుంటారో గమనిస్తే.. తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించాలనుకుంటారు.

పిల్లలకు ఇంగ్లిష్‌ రావాలని, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు కావాలని కోరుకుంటారు. ఇప్పుడు మన గ్రామాల్లో ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో ఉన్నవారి కోసం విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్‌్టను ప్రవేశపెట్టాం. ఇవికాకుండా వ్యవసాయ రంగంలో ప్రిసిసెన్‌ అగ్రికల్చర్‌ అనేది రాబోయే రోజుల్లో సాకారం కానున్న గొప్ప మార్పు. దీనికి బీజం మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే ఆర్బీకేల ద్వారా గ్రామస్ధాయిలో పడింది. రాబోయే రోజుల్లో అన్‌లిమిటెడ్‌ బ్యాండ్‌ విడ్త్‌తో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ప్రతి గ్రామానికి వస్తుంది. డిజిటల్‌ లైబ్రరీలు కూడా వస్తాయి. గ్రామస్ధాయిలో మన కళ్లెదుటే జరుగుతున్న గొప్ప మార్పులివి.   

పోర్టులు, హార్బర్లు, ఇండ్రస్టియల్‌ కారిడార్లు.. 
మౌలిక వసతులపై నాలుగేళ్లుగా పురోగతిని గమనిస్తే పోర్టులు, హార్బర్లు, ఎయిర్‌ పోర్టులు, ఇండస్ట్రియల్‌ కారిడార్లు సాకారమవుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక 75 ఏళ్లుగా రాష్ట్రంలో ఆరు పోర్టులు మాత్రమే ఉండగా ఇప్పుడు మరో 4 పోర్టులు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టాం.

తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమయింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశంలో 11 ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటవుతుండగా అందులో మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్ల పనులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి.    

మన గ్రామాలపై దృష్టి పెట్టండి..
చివరిగా మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. అక్కడ మీరు ఎంతగానో ఎదిగారు. ఎన్నో ఏళ్ల అనుభవం, అపార నైపుణ్యం మీకుంది. మన రాష్ట్రానికి మీరు ఏ రకంగా ఉపయోగపడగలిగితే ఆ రకంగా తోడ్పాటు అందించండి. ఆర్ధికంగా అనే మాటలు కాస్తో కూస్తో బాగుంటాయి కానీ అంతకంటే ఎక్కువగా మీ అనుభవం అవసరం.

ఇప్పటికే అభివృద్ధి చెందిన పాశ్చాత్య ప్రపంచంలో మీరు ఎన్నో ఏళ్లుగా ఉన్నారు కాబట్టి మీ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఇంకా ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రం మీద, మన గ్రామాలపైన ధ్యాస పెట్టగలిగితే అవన్నీ మన రాష్ట్రానికి ఉపయోగపడతాయి. ఇది నా తరపు నుంచి మీకు చేస్తున్న విజ్ఞప్తి. నాటా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా.   

ఏది కావాలన్నా ఇంగ్లిష్‌లోనే.. 
ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు కనిపిస్తున్నాయి. బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ను మన పిల్లలు చదువుతున్నారు. ప్రపంచంలో విజ్ఞానాన్ని నేర్చుకునేందుకు, చదువుకునేందుకు ఉపయోగపడే ఒక గొప్ప మీడియం ఇంగ్లిష్‌. మన పిల్లలు గ్లోబల్‌ సిటిజన్‌గా ఎదగటానికి ఇంగ్లిష్‌ ఒక సాధనం. ఏది చదువుకోవాలన్నా, సబ్జెక్ట్‌పె అవగాహన పెంచుకోవాలన్నా ముందు ఇంగ్లిష్‌పై పూర్తి స్థాయిలో పట్టు రావాలి. వారికి కావాల్సినంత కంటెంట్‌ ఇంటర్నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది. మన ఫోన్‌లోనే ఇవన్నీ అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ ఇంగ్లిష్‌ ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి  పునాదిని మనం గట్టి పరుస్తున్నాం.  

ఈవోడీబీలో మూడేళ్లుగా నంబర్‌ వన్‌ 
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మన రాష్ట్రం వరుసగా మూడేళ్లుగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో టాప్‌ 4, 5 స్థానాల్లో ఉంది. మనందరి ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, మహి­ళా సంక్షేమం, వృద్ధులు, వితంతువులు, ది­వ్యాంగుల సంక్షేమం, సామాజిక న్యాయం, పారదర్శక పాలన.. ఇలా ప్రతి  విషయంలో దేశంలోనే గొప్ప మార్పులకు నాంది పలికింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement