
మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్తులో ఏర్పాటైన జి.ఎం.రామశర్మ శతావధానం మూడో రోజు సమస్యా పూరణం పూర్తయింది. పృచ్ఛకులు అడిగిన 25 సమస్యలను అవధాని సునాయాసంగా పూరించారు. మద్దూరి రామ్మూర్తి ఇచ్చిన సమస్యను– పద్యము శారదా హృదయ పద్మము భావ రసైక సద్మమున్ పద్యములన్ భళా యతులు ప్రాసల సత్కవచాల తోడ నైవేద్యముగాగ భారతికి వేద్యము చేయగనొప్పు తప్పుగా పద్యము వ్రాయనివాడు చెడి పాతకమందడు సత్కవీశ్వరా అని పూరించారు. పులికొండ సుబ్బాచారి ఇచ్చిన సమస్యను– పావన భావనా సుమతి భవ్యుడు కౌశికుడండనుండగా
జీవనరేఖ భాగ్యముల సిద్ధులు ముద్దుగ గల్గ ఆ మహాదేవుని విల్లు ద్రుంచిన సుధీరుని రాముని భీకర ద్విశత్ రావణు పెండ్లియాడినది రాజిత సీత సకామౖయె భళా! అని పూరించి, అందులో ఉపయోగించిన పదాన్ని వివరించారు. సుందరకాండలో చాలాచోట్ల శత్రురావణః (శత్రువులను ఏడిపించేవాడు) అని వస్తుంది. ఆ అర్థం వచ్చేలా ద్విశత్ రావణు అని సమస్యను పూరించానని వివరించారు.
కౌండిన్య తిలక్ ఇచ్చిన సమస్యకు తంపు సీరియళ్ల తంపులు కొంపలన్ కంపలట్లు తగిలె కెంపులూడె కోపతాములకు గురిచేయు సీరియల్స్ కన్న వారె కన్న ఖలులు గలరేఅంటూ సీరియల్స్ చూసే వారిని మించిన ఖలులు ఉన్నారా అని పూరించి శ్రోతలను అలరించారు. లింగవరం పవన్ కుమార్ ఇచ్చిన సమస్యను– శుచిలేనట్టి పదార్థముల్ తినగ వచ్చున్ వ్యాధులెన్నేనియున్ రచితానేక సుశాకపాకములు రారాజిల్లెనీ నేల ప్రచురంబై ప్రచలింపన్మది జంతుహింసలౌరా భావ్యంబహో కాదుపో రుచిమంతమ్మగు కోడి మాంసమది యారోగ్యమ్ము సన్యాసికిన్ అని పూరించడంతో సభంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. చివరగా సుశర్మ ఇచ్చిన సమస్యను... ధరలేడీ మన ముఖ్యమంత్రి సరళిన్ దమ్మున్న ధీనేత పరమంబౌæవరముల్ ప్రసాదముగ పంపన్ ధీరుడౌ శ్రీ పరంపరలూరంగ వెలుంగిలిచ్చునతడే ప్రాజ్ఞుండునా చంద్ర శేఖర మార్గమున సాగుమా కలుగు సౌఖ్యశ్రీ తెలంగాణకున్‌అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్తుతించి మంగళాశాసనం పలికారు.
అలరించిన అప్రస్తుత ప్రసంగం
అప్రస్తుత ప్రసంగీకునిగా వ్యవహరించిన పున్నమరాజు అవధానిని ఇబ్బందిపెడుతూ చక్కగా ప్రశ్నించారు. ‘‘మీ మెడలో పూలహారాన్ని మైకుకి ఎందుకు వేశారు?’’ అని ప్రశ్నించిన పున్నమరాజును ‘‘మీ మెడలో వేద్దామనుకున్నాను. కాని మైక్‌కి వేశాను’’ అన్నారు. ‘‘మీరు మైకు ద్వారా మీ కవితా పరిమళాన్ని మాకు అందిస్తున్నారు’’ అని పున్నమరాజు చమత్కరించారు. ‘‘తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. అప్రస్తుత ప్రసంగికుడు ముదిరితే ఏమవుతుంది’’అని చమత్కారంగా అడిగిన ప్రశ్నకు, ‘‘పిచ్చివాడు అవుతాడు. ఎందుకంటే అప్రస్తుత ప్రసంగీకులు మరింత హైపిచ్‌లో అడుగుతారు కదా. అందువల్ల వారు హైపిచ్చివాళ్లు’’ అని చమత్కరించారు అవధాని. ‘‘సునామీ స్త్రీలింగమా, పుంలింగమా’’ అని అడిగిన ప్రశ్నకు ‘‘మీరు సునామీలా ఉన్నారు. సు నామి అంటే మంచి పేరుగల వారు. మీపేరు పున్నమరాజు. మంచి పేరు’’ అన్నారు అవధాని. ‘‘ధార, ధారణ సముపార్జన కోసం రాత్రి పూట రసం పుచ్చుకుంటారా’’ అని అడిగితే, ‘‘శారదాదేవి పాద రసం సేవిస్తాను’’ అని సభ్యులను నవ్వులలో ముంచెత్తారు రామశర్మ. సభ్యులకు ఆనందం పంచే అప్రస్తుత ప్రసంగంలో ప్రశ్నలు బాగానే ఉన్నాయి కాని, సమాధానాలు మాత్రం ఆశించినంత స్థాయిలో రాలేదని పలువురు పండితులు భావించారు.
– డా. వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment