సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భాష, సంస్కృతి, సాహితీ చరిత్రను ప్రపంచానికి చాటేలా తెలుగు మహాసభల ఏర్పాట్లు ఉండాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. తెలుగు మహాసభల ఏర్పాట్లను మంత్రి కడియం బుధవారం సమీక్షించారు. ఎల్బీ స్టేడియంలో మహాసభల ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన వేదిక నిర్మాణం, స్వాగత ద్వారాలు, స్టాల్స్ ఏర్పాటు చేసే కేంద్రాలు తదితర పనులను పర్యవేక్షించారు.
ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తున్న లేజర్‌షో, బాణసంచా విశేషాలను గురించి నిర్వాహకులతో చర్చించారు. సమావేశంలో సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మహాసభల కోర్ కమిటీ సభ్యులు ఎస్వీ సత్యనారాయణ, ఆయాచితం శ్రీధర్, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలుగు మహాసభలు విజయవంతం అయ్యేందుకు ఉద్యోగులు కృషి చేయాలని టీఎన్‌జీవో కోరింది. ఈ సభల ద్వారా తెలంగాణ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చింది. రేపటి నుంచి 19 వరకు జరగనున్న ఈ మహా సభల పోస్టర్‌ను టీఎన్‌జీవో భవన్‌లో బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎన్‌జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment