vishwanatha satyanarayana
-
అభిమాన సంపన్నులు
విద్యావంతులైన వాళ్లు ఎవరైనా జీవితాంతం తమ గురువులను స్మరించుకుంటారు. మన దేశంలో గురుశిష్య పరంపర వేదకాలం నుంచి ఉంది. పాశ్చాత్య నాగరికతల్లో కూడా క్రీస్తుపూర్వం నుంచే గురుశిష్య పరంపర కొనసాగేది. విద్య నేర్పించే గురువులే లేకుంటే, ఈ ప్రపంచం ఇంకా అజ్ఞానాంధకార యుగంలోనే మిగిలి ఉండేదేమో! గురువులు లేని లోకాన్ని ఊహించుకోలేం. గురువులు ఊరకే పాఠాలను వల్లెవేయించడమే కాదు, భావితరాలను జ్ఞానసంపన్నులుగా తీర్చిదిద్దుతారు. పరోక్షంగా సమాజాన్ని మెరుగుపరుస్తారు. బడిలో చేరిన పిల్లల మీద తల్లిదండ్రుల కంటే గురువుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో గురువుల మీద అమితమైన గురి ఉంటుంది. ‘ఎలా ఆలోచించాలో తెలిసిన వాళ్లకు అధ్యాపకుల అవసరం లేదు’ అని మహాత్మాగాంధీ అన్నారు. అయితే, అమాయకపు బాల్యావస్థలో ఆలోచనను పదునెక్కించే గురువులు అత్యవసరం. జీవితాన్ని ప్రభావితం చేసే మానవ సంబంధాల్లో గురుశిష్య సంబంధం ప్రత్యేకమైనది. లోకంలో ఎందరో ఉత్తమ గురువులు, వారు తీర్చిదిద్దిన ఉత్తమ శిష్యులు ఉన్నారు. వారందరూ గతించిపోయినా, వారి చరిత్రను జనాలు చర్వితచర్వణంగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. మన పురాణాల్లోనూ గురుశిష్యుల కథలు కొల్లలుగా కనిపిస్తాయి. పురాణాల్లో దేవతలకు బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు గురువులుగా వాసికెక్కారు. అవతార పురుషులైన రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపని మహర్షి గురువులుగా ఉండేవారు. పురాణ గురువుల్లో మిగిలినవారిదంతా ఒక ఎత్తు అయితే, ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పిన చండా మార్కుల వారిది మరో ఎత్తు. దండోపాయాన్ని సాధనంగా ఎంచుకున్న తొలిగురువు బహుశా ఆయనే! చండామార్క వారసులైన గురువులు అక్కడక్కడా తారసపడుతుంటారు. మనుషుల్లో ఉండే వైవిధ్య వైరుద్ధ్యాలు గురుశిష్యుల్లోనూ కనిపిస్తాయి. గురువులందరూ ఉత్తములేనని, శిష్యులందరూ ఆణిముత్యాలేనని చెప్పలేం. గురువుల్లో ఔదార్యమూ, ఉదాత్తతలతో పాటే స్వార్థ సంకుచిత లక్షణాలూ కనిపిస్తాయి. గురువులు కూడా మానవ మాత్రులే! ఏకలవ్యుడి బొటన వేలును గురుదక్షిణగా కోరిన ద్రోణుడు మనకు తెలుసు. గురువుకే పంగనామాలు పెట్టిన ఆషాఢభూతి కూడా మనకు తెలుసు. గురజాడవారి ‘కన్యాశుల్కం’లోని గిరీశం ఆషాఢభూతికి ఏమీ తీసిపోయే రకం కాదు. కాకుంటే, అతగాడు గురుత్వం వెలగబెట్టాడు. గిరీశం శిష్యరికంలో వెంక టేశానికి చుట్ట కాల్చడం పట్టుబడిందే గాని, చదువు ఒంటబట్టలేదు. అయితే, మన దేశంలో వివిధ రంగాల్లో రాణించిన గురువులు, గురువులకు గర్వకారణంగా నిలిచిన శిష్యులు ఎందరో ఉన్నారు. సాహితీరంగంలో తమదైన ముద్రవేసిన గురుశిష్యులు కొందరు ఇప్పటికీ ప్రస్తావనల్లోకి వస్తుంటారు. అటువంటి గురుశిష్యుల్లో మొదటగా చెప్పుకోవల సిన వారు – తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఆయన శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ. వారిద్దరూ అరుదైన గురుశిష్యులు. పాండితీ ప్రాభవంలోను, కవన శైలిలోనూ ఇద్దరూ ఇద్దరే! చెళ్లపిళ్లవారి గురించి విశ్వనాథ ఒక చమత్కార పద్యం చెప్పారు. అది: ‘అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం డలఘుస్వాదు... బ్రాహ్మీమయమూర్తి శిష్యు డైనా డన్నట్టి దావ్యోమపే శలచాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళవంశస్వామి కున్నట్లుగన్’. నన్నయకు, తిక్కనకు తన వంటి శిష్యులెవరూ లేరని, తన గురువైన చెళ్లపిళ్ల వారికే ఆ వైభోగం, కీర్తి దక్కాయని సగర్వంగా చెప్పుకున్నారు విశ్వనాథ. అధ్యాపక వృత్తిలో కొనసాగిన విశ్వనాథకు ఎందరో ప్రత్యక్ష శిష్యులే కాకుండా, మరెందరో పరోక్ష శిష్యులూ ఉన్నారు. విశ్వనాథను శ్రీశ్రీ ‘కవికుల గురువు’గా ప్రస్తుతించడమే కాదు, ‘తెలుగువాళ్ల గోల్డు నిబ్బు’గా అభివర్ణించారు. ఒకానొక సందర్భంలో ‘నా వంటి కవి మరో వెయ్యేళ్ల వరకు పుట్టడు’ అని విశ్వనాథ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా శ్రీశ్రీ ‘నిజమే! వారు పుట్టి వెయ్యేళ్లయింది’ అని వ్యాఖ్యానించడం ఒక వైచిత్రి. తొలినాళ్లలో శ్రీశ్రీపై విశ్వనాథ ప్రభావం ఉండేది. తర్వాతికాలంలో అబ్బూరి రామకృష్ణారావు శ్రీశ్రీపై ఎనలేని ప్రభావం చూపారు. అబ్బూరి వద్ద శ్రీశ్రీ నేరుగా తరగతిలో పాఠాలు నేర్చుకోకపోయినా, వారిద్దరిదీ గురుశిష్య సంబంధమే! సాహితీ లోకంలో మెరికల్లాంటి శిష్యులను తయారుచేసిన మరో గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. రాచమల్లు రామచంద్రారెడ్డి, నరాల రామారెడ్డి వంటి ఉద్దండులు ఆయన శిష్యులే! ఇక భద్రిరాజు కృష్ణమూర్తి భాషాశాస్త్ర ఆచార్యులుగా సుప్రసిద్ధులు. బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, తూమాటి దొణప్ప వంటి శిష్యులను ఆయన తీర్చిదిద్దారు. ఎందరో గురువులు ఉన్నా, శిష్యుల మనసుల్లో చెరగని ముద్రవేసే వారు కొందరే ఉంటారు. అలాంటి వారే ఉత్తమ గురువులుగా చరిత్రలో గుర్తుండిపోతారు. మన దేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా ఎందరో శిష్యులను తయారు చేశారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్లేటప్పుడు ఆయనను గుర్రపు బండిలో కూర్చోబెట్టి శిష్యులే స్వయంగా బండిని లాక్కుంటూ వెళ్లి మరీ మైసూరు రైల్వేస్టేషన్లో సాగనంపారు. అదీ రాధాకృష్ణన్ ఘనత! రేపు రాధాకృష్ణన్ పుట్టినరోజు. మనకు ఉపాధ్యాయ దినోత్సవం. గురువుల ఘనతకు శిష్యుల అభిమానమే గీటురాయి! జీతంరాళ్ల కంటే శిష్యుల అభిమాన ధనమే అసలైన సిరిసంపదలుగా తలచే గురువులు ఉంటారు. అలాంటి వాళ్లే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తారు. -
చెప్పుదెబ్బకు కుక్క కాటు
కథాసారం ఒకసారి ఒక పెద్దమనిషి ఆడ సీమకుక్కను స్టేషనులోకి తెచ్చాడు. వాటి రెంటికీ ప్రథమ దర్శనంలోనే ప్రణయం ఏర్పడ్డది. ఆ పెద్దమనిషి చేతిలో కర్ర ఉంది. దాన్ని చూచి మన కుక్క తన ప్రియురాలి దగ్గరికి వెళ్లింది కాదు. మాక్లీదుర్గం రైలుస్టేషను గుంటకలు నుంచి బెంగళూరు పోయే త్రోవలో నాల్గు స్టేషనుల కివతల నున్నది. ప్లాటుఫారం కన్న రైలు స్టేషను పదిగజాలు ఎక్కి వెళ్లాలి. రైలురోడ్డు ప్రక్కనే పెద్దకొండ ఉన్నది. దాని నిండా చెట్లూ చేమలూ, రాళ్లూ రప్పలూ ఉన్నవి. అప్పుడప్పుడు వేగోలాలు సివంగులు రాత్రిళ్లు స్టేషనులోకి వస్తూ ఉంటవి. స్టేషనుకి వెనుక పెద్దలోయ ఉన్నది. లోయ కవతలతట్టు ఉన్న కొండ మీద నెవరిదో భాగ్యవంతులది పెద్ద సౌధం ఉన్నది. మాక్లీదుర్గం స్టేషను చిన్నది. అందులో చిన్న అంగడి ఉంది. రైళ్లు వచ్చేవేళకూ పోయేవేళకూ అంగడి తెరచి ఉంటుంది. ఒక కుక్క అంగడి తెరచినప్పుడల్లా అక్కడ తయారు. అంగడి ఎత్తుగా ఉంటుంది. కుక్క తన చూపు అంగడిలోని పళ్లికలలో ఉన్న మిఠాయి మీద పడే అంత సమరేఖలో నుంచుకొని ఊర్ధ్వ దృష్టితో తపస్సు చేస్తుంది. వాడంగడి సర్దేటప్పుడైనా, యెవడైనా కొనుక్కునేటప్పుడైనా చిన్న ముక్క జారిపడుతుందేమో అని యెదురు చూస్తూ ఉంటుంది. వారానికో పదిరోజులకో అట్లా యెప్పుడూ పడదుగాని, పది రోజుల క్రింద చేసిన పకోడీ కొనుక్కున్నవాడు చద్దివాసన వేసి పారేస్తే కుక్క దాన్ని నోటితో అగావుగా పట్టుకుని ముందు పళ్లతో నొక్కి రెండు గతుకులు మ్రింగి దగ్గు వచ్చి మళ్లీ కక్కుతుంది. రైలు వెళ్లిపోవటం తోటే అంగడివాడు మూస్తాడు. కుక్క పోయి సెలయేట్లో నీళ్లు తాగుతుంది. ముందు కాళ్లు చాచి గడ్డిమీద పడుకుని, లేత గరికపోచలు కొరుకుతుంది. ఆ కుక్క మంచి మిడతల వేటగాడు. అప్పుడప్పుడు పొలము పిచ్చుకలను గూడా పట్టుకుంటుంది. సెలయేటి నీళ్లూ, మంచి గాలీ, లోయలోకి దిగటం, ఎక్కటం– కుక్క మంచి దేహపటుత్వంలో ఉన్నది. కుక్క చెదరిౖయెనా స్టేషనెదురుగా ఉన్న కొండమీదికి పోదు. ఒకసారి ఒక పెద్దమనిషి ఆడ సీమకుక్కను స్టేషనులోకి తెచ్చాడు. వాటి రెంటికీ ప్రథమ దర్శనంలోనే ప్రణయం ఏర్పడ్డది. ఆ పెద్దమనిషి చేతిలో కర్ర ఉంది. దాన్ని చూచి మన కుక్క తన ప్రియురాలి దగ్గరికి వెళ్లింది కాదు. పుట్టింట ఉన్న ఆడపిల్ల వలె సీమకుక్క మాత్రం నిర్భయంగా తన వలపుకాణ్ణి చూడటం మొదలెట్టింది. పెద్ద మనుష్యులు తన్ను పోకిరీ అనుకుంటారేమో నని దుర్గపు కుక్క దానివంక చూచీ చూడకుండా చూడటం మొదలెట్టింది. పెద్దమనిషి తన కుక్కను కటకటాలకు కట్టివేసి సామానులు తూయించుకోటానికో దేనికో వెళ్లాడు. రెండు కుక్కలూ కలసికొన్నవి. స్టేషను మాస్టరు కొంచెము చదువుకొన్నవాడు. పెద్దమనిషికీ, ఆయనకీ ఆధునిక సిద్ధాంత రాద్ధాంతాల చర్చ జరుగుతోంది. స్టే. మా.: కాదండీ! వర్ణ వ్యవస్థ ఉండాలి. మన పూర్వులు ఏ ప్రయోజనం కోసం దాన్ని నేర్పరచారో ఆ ప్రయోజనాలు తెలియకుండా మనం వాటిని తీసివేయరాదు. పె.మ.: మనవాళ్లు ఏర్పరచారు కదా అని గ్రుడ్డి ఎద్దు చేలో పడ్డట్లు పోరాదు. ప్రతిదీ వాదానికి నిలవాలి. స్టే. మా.: అయితే మీరు వర్ణ వ్యవస్థ తీసి పారవెయ్యాలి అంటారా? పె.మ.: ఈ వ్యవస్థ మూలంగా అనేక భేదాలేర్పడుతున్నవి. వర్ణాంతర భోజనములూ, వివాహములూ జరుగవలె. అప్పుడే దేశానికి ముక్తి. పెద్దమనిషి బయటకు వచ్చాడు. తన కుక్క వంక చూచాడు. రెండు కుక్కలూ తమ వర్ణభేదం మరచిపోయి కలసికొంటున్నవి. పెద్దమనిషి పరుగెత్తుకొనిపోయి దుర్గపు కుక్కను పదిపదకొండు దెబ్బలు కొట్టినాడు. ‘జ్ఞాతాస్వాద’మైన ఆ కుక్క వెంటనే వదిలిపెట్టుటకు S సమర్థము కాక చివరకు వదిలించుకొని పోయింది. స్టేషను బయటకు పోవువరకు కుక్కకు తెలిసింది, తన ఒక తొంటి విరిగినదని. ఆ పెద్దమనిషి తన కుక్కను కూడా నాలుగు మోదినాడు. స్టేషను మాస్టరీ గందరగోళం విని బయటకు వచ్చాడు. ‘అయ్యా, ఎందుకు కుక్కనట్లా కొట్టారు?’ పె.మ.: ఇది జాతిగల కుక్క. దీనికి రుతువు వచ్చింది. బెంగళూరు తీసుకుపోతున్నాను. ఈ జాతి మగకుక్కతో కలపవలెనని.స్టేషను మాస్టరు కొంచెము నవ్వాడు. పెద్దమనిషి కనుబొమల మీద కొంచెం నల్లనిరేఖ యేర్పడ్డది. ఆయనా నవ్వాడు. స్టేషను మాస్టరు సీమకుక్క మొగాన మచ్చకూ, తోకకుచ్చుకూ, గోధుమవన్నె రంగునకూ మెచ్చుకొని ముద్దాడాడు. దీనికి పిల్లలు పుడితే నాకో పిల్లను తప్పకుండా ఇవ్వాలని వాగ్దానం చేయించుకొన్నాడు. ఊరకుక్క సంసర్గం చేత సీమకుక్క ఒళ్లంతా మన్నయింది. పెద్దమనిషి తన తోలుపెట్టె తెరచి రెండుతికిన తువాళ్లూ సబ్బుబిళ్లా తీసి పడెలో కుక్కను అభ్యంగము చేయించి చక్కగా తుడిచాడు. ఇంతలో రైలు వచ్చింది. చంకను పెట్టుకొని రైల్లో ఎక్కాడు. ‘లీలా! అల్లా చేయవచ్చునా?’ అని దాని నోట్లో నోరుపెట్టి ముద్దు పెట్టుకొన్నాడు. ఇందాకటి కుక్క యీ పనే చేస్తే అంత హృదయంగమంగా ఊరుకున్న ఆ కుక్క పరపురుష చుంబనం పరిహరించినట్లుగా అతని చుంబనం పరిహరించింది. 2 దుర్గములో కుక్క తన తొంటి గాడిదగడపాకునకూ, అడ్డసరపాకులకూ వేసి రుద్దుకొని సెలయేటి ఒడ్డున ఒండ్రుమట్టితో అద్దుకొని పదిహేను రోజులకు కాలు సరిచేసుకుంది. మళ్లీ స్టేషనులోకి వస్తూన్నది. మిఠాయి దుకాణం వంక చూస్తున్నది. ఒకనాడు ఇద్దరు విద్యార్థులు అక్కడికి వచ్చి దుకాణంలో యేదో కొనుక్కుని తింటూ బల్లమీద కూర్చున్నారు. ఒకడు: మనదేశంలో భూతదయ అన్నది లేదు. నేను బీఏ ప్యాసైనాను. ఉద్యోగమిచ్చే దిక్కు లేదు. పేదవాళ్లు మలమల మాడిపోతున్నారు. గొప్పవాళ్లు సోఫాల మీదగాని ఒరగరు. రెం: మనవాళ్లు పిడికెడు బిచ్చం పెట్టరు. చివరకు కుక్కకు వేసినట్లన్నా పేదవాళ్లకింత వెయ్యరు. కుక్క వాళ్ల చేతిలో పొట్లం వంక చూసింది. వాళ్లిద్దరూ ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకతని కాళ్లకు బూట్లు ఉన్నవి. ఆ బూటు కాలితో కుక్కను డొక్కలో తన్నాడు. దానికి రెండు మూడు రోజుల నుంచీ తిండి లేదు. ఆ దెబ్బ పొట్టలో యే నరానికి తగిలిందో అది మెలికలు తిరిగిపోయింది. ఆ రోజు సాయంత్రం కొండ మీద నుంచి ఒక వేగోలం దిగి రాత్రిపూట స్టేషనులోకి వచ్చింది. కుక్క భయపడి దుకాణం క్రింద గూడుగా ఉంటే దానిలో దాక్కుంది. స్టేషనంతా నిర్జనంగా ఉంది. వేగోలం పసిగట్టి మూతి గూట్లోకి పెడితే కుక్క దాని నోరంతా కరచింది. మూడు నాలుగు గంటలు దాగుడు మూతల యుద్ధం చేసిన ఒక ఒడుపులో వేగోలం పీక పట్టుకుని దాని ఊపిరి ఆగేదాకా కుక్క వదలలేదు. ఏడాది రెండేండ్లుగా మర్యాద లేని కుక్కకు ఆనాటితో మర్యాద యెక్కువైంది. అంగడివాడికి మహాదయ కలిగింది. సంవత్సరము బట్టీ పరిశిష్టపు నూనెతో పరిశిష్టంగా వస్తున్న మిఠాయి జంగిలీ దాని ముందర పెట్టాడు. అది తిన్నది. తెల్లవార్లూ ఏడవటం మొదలుపెట్టింది. దానికేదో మహావాతం పుట్టింది. కనపడ్డ ఆకల్లా కొరికింది. ఏ ఆకూ పని చెయ్యలేదు. వేగోలాన్ని చంపిన కుక్క వారము అయ్యేటప్పటికి చిక్కి శల్యమయింది. చీడకుక్క, పేలకుక్క అని దాన్ని కొట్టడం మొదలుపెట్టారు. 3 ఆరు నెలలైంది. కుక్క చావదు, బతకదు. ఒకరోజు ఆ పెద్దమనిషి వచ్చాడు. స్టేషన్ మాస్టరు ‘కుక్క పిల్లలను పెట్టిందా?’ అని అడిగాడు. పెద్దమనిషి ఇట్లా అన్నాడు: ‘మీ పాడుకుక్క పాడు చేసింది. కుక్క రెండు పిల్లలను పెట్టింది. ఊరకుక్కల్ని పెట్టింది’. మాస్టరు ‘అది మంచి పౌరుషశాలి’ అన్నాడు. పెద్దమనిషి ‘పోనిద్దురూ! వెధవకుక్క. దాన్ని నరికిపోతా’నన్నాడు. ఇంతలో ఆ కుక్క యీడ్చుకుంటూ వచ్చింది. పెద్దమనిషి కోపం పట్టలేక పేము బెత్తంతో ఒకటి వేశాడు. ఆనాటి రాత్రి ఆ కుక్క రైలు క్రింద పడ్డది. అరగంట తన్నుకుని చనిపోయింది. 4 తరువాత నాల్గు నెలలకు ఆ పెద్దమనిషి తన రెండు కుక్కపిల్లలలో ఒకటి చచ్చిపోయినదని చెప్పి రెండవ దానిని స్టేషను మాస్టరు కిచ్చాడు. అది ఆరు నెలల్లో యెదిగి తన తండ్రి వలె నైనది. దానికి భయము లేదు. కొండమీదికి షికారు పోయి వస్తుంది. ఎన్ని ఆడకుక్కలు వచ్చినా వాటి వంకకు చూడదు. విద్యార్థులు భూతదయోపన్యాసములు చేస్తుంటే తిరస్కారముగా చూస్తుంది. ఆ పెద్దమనిషి ముద్దుగా ముట్టుకోబోతాడు. కోపంగా పళ్లు చూపి(స్తుంది). మిఠాయి దుకాణమువా డొకనాడు చద్ది మిఠాయి వేయబోయినాడు. వాడి పిక్క కండలు లాగింది. అది వేగోలం గాని కుక్క కాదన్నారందరూ. కొన్నాళ్లకు అడవుల్లోనే ఉంటూ వచ్చింది. నిత్యగహన సంచారం వల్లనో, తల్లి పోలికో తోకకుచ్చు బలిసింది. కోరలు వచ్చినై. మనుష్యుని గాలి తగిలితే బృహస్పతి తమ్ముడు సంవర్త మహర్షి వలె సీదరించుకుని తొలగిపోతుంది. కేవల ప్రదర్శితాదర్శాల మీద విశ్వనాథ సత్యనారాయణ (1895–1976) ఎత్తిన కథాఖడ్గం ‘మాక్లీదుర్గంలో కుక్క’. రచనాకాలం 1936. సంక్షిప్తం: సాహిత్యం డెస్క్. -
దొరసాని – కిన్నెరసాని
సురవరం ప్రతాపరెడ్డి ఒకసారి విశ్వనాథ సత్యనారాయణకు కొంత ఆర్థిక సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఆయనను ఒక సంస్థానాధీశురాలి దగ్గరికి తీసుకెళ్లారు. నాడు సంస్థానాధీశులకు సివిల్, క్రిమినల్ అధికారాలు ఉండేవి. నాటి మర్యాదలను అనుసరించి ఆమె పరదాకు ఆవైపు, ఇవతలివైపు విశ్వనాథ కూర్చున్నారు. ‘‘మీరు చాలా సంప్రదాయికులనీ, మంచి కవిత్వం వ్రాస్తారనీ విన్నాను. కానీ మీరు ‘సాని’ పాటలు కూడా వ్రాశారేమిటండీ?’’ అని ప్రశ్నించిందామె. ఆమె తన ‘కిన్నెరసాని’ పాటలను గూర్చి అడుగుతున్నదని విశ్వనాథకు అర్థమైంది. ‘‘అమ్మా! అది ఈ ప్రాంతంలో ఒక వాగు పేరు. ఆ పేరుతో పాటలు వ్రాశానే గాని, వాటిల్లో ఎలాంటి అశ్లీలమూ లే’’దని ఎంతచెప్పినా ఆమె వినిపించుకోలేదు. ‘మీరు ఎన్నైనా చెప్పండి సాని సానే’ అని ముక్తాయించింది. ఇది విశ్వనాథ అహాన్ని దెబ్బ తీసింది. ‘‘అమ్మా, ఇందాకటినుంచీ పనివాళ్లు మిమ్మల్ని దొరసానీ! అని పిలుస్తున్నారు గదా, దాని సంగతేవిటి? ఇక వస్తాను, సెలవు’’ అని లేచి వచ్చేశారు. ఇది చూస్తున్న ప్రతాపరెడ్డి, ‘‘ఎంతపని చేశావయ్యా, ఆమె కోపిస్తే ఏమైనా చేయవచ్చు’’ అన్నారట. అందుకు విశ్వనాథ, ‘‘ఆ ఏం చేస్తుంది, చంపుతుందా? నిజం చెప్పడానికి భయపడటం కన్నా చావడమే నయం’’ అన్నారట. అప్పుడు ప్రతాపరెడ్డి నవ్వుతూ, ‘‘ఏది ఏమైనా మీరీ వేళ నూటపదహార్లు పోగొట్టుకున్నారు’’ అన్నారట. అందుకు విశ్వనాథ ‘‘నా అభిమానాన్ని మాత్రం పోగొట్టుకోలేదు, అదే నాకు పదివేలు’’ అన్నారట. (పురాణం ‘విశ్వనాథ ఒక కల్పవృక్షం’ ఆధారంగా) డి.వి.ఎం.సత్యనారాయణ -
నేను పెద్ద రౌడీనైనప్పటికీ...
కిన్నెరసాని పాటలు రాశాక వాటిని ఇతరులకు చేర్చడానికి ఉబలాటపడేవారు విశ్వనాథ సత్యనారాయణ. ఒకసారి బందరులో ప్రత్యేకంగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి శిష్యుల కవితాగానం ఏర్పాటు చేశారు. చాలామంది కవులు వచ్చి తమ ఛందోబద్ధ పద్యాలు చదివారు. చెళ్లపిళ్ల ఎంతో సంబరపడ్డారు. తర్వాత విశ్వనాథ వంతు రాగానే, కిన్నెరసాని పాటలు పాడి వినిపించారు. అయితే, అవి ఎందుకో చెళ్లపిళ్లకు అంతగా నచ్చలేదు. అదే సమయంలో టేబుల్ మీద పెట్టిన గ్లాసు ఒలికిపోయింది. దాన్నే ఆశువుగా చెళ్లపిళ్ల– ఒలికింది ఒలికింది కలికి కిన్నెరసాని తడిసింది తడిసింది పొడిది మేజాగుడ్డ – అని చదివారు. దీనికి ఉడుక్కున్న విశ్వనాథ, ఒక రౌడీ కథ చెప్పారు. ‘ఒక ఊరికి అతడు ఎంత పెద్ద రౌడీ అయినా కావొచ్చు. ఆ రౌడీకి గురువు ఆ ఊరు వచ్చాడంటే తన మొత్తం రౌడీతనాన్ని ప్రదర్శించలేడు; ఏదో రెండు కుప్పిగంతులు, ఒక లంఘనం ప్రదర్శిస్తాడు. నేనూ అంతే’ అని కూర్చున్నారు తనదైన గడుసుతనంతో. (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
నిత్యనూతనం ‘వేయిపడగలు’
♦ ‘థౌజండ్ హుడ్స్’ ఆవిష్కరణ సభలో కొనియాడిన వక్తలు ♦ ఆంగ్లంలోకి అనువాదమైన కవిసామ్రాట్ నవల ♦ విశ్వనాథుడు తెలుగు వాడి ఆస్తి అన్న మండలి బుద్ధప్రసాద్ సాక్షి, హైదరాబాద్: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయిపడగలు’ నవల ఏ తరం వారికైనా నిత్యనూతనమైన సాహితీ గ్రంథమని , అది మానవ సమాజంలోని భిన్నకోణాలను ఆవిష్కరించిన మహారచన అని పలువురు వక్తలు ఆ నవల విశిష్టతను కొనియాడారు. ఆదివారం రవీంద్రభారతిలో విశ్వనాథ సాహితీపీఠం, హైదరాబాద్ భాషా సాంస్కృతిక సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ వెల్చాల కొండలరావు అధ్యక్షతన ‘థౌజండ్ హుడ్స్’(వేయిపడగలు) ఆంగ్ల గ్రంథావిష్కరణ సభ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అనువాద గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వనాథ సత్యనారాయణ తెలుగువారి ఆస్తి అని కొనియాడారు. వేయిపడగలు వెలువడిన 78ఏళ్ల తర్వాత డాక్టర్ వెల్చాల కొండలరావు ఆ నవలను ఆంగ్లంలో అనువదించి ఆ భాష మాట్లాడేవారికి పరిచ యం చేయడం అభినందనీయమన్నారు. విజయవాడలో పుట్టిన విశ్వనాథ సత్యనారాయణను కరీంనగర్ వాసులు అమితంగా అభిమానించేవారని చెప్పారు. ఎంపీ వినోద్ మాట్లాడుతూ భాషా, ప్రాంతీయ సంకుచితత్వం ఉండకూడదని కవిసామ్రాట్ చెప్పేవారన్నారు. విశ్వనాథ సాహిత్యపీఠం గౌరవాధ్యక్షుడు వెల్చాల కొండలరావు మాట్లాడుతూ విశ్వనాథ రాసిన నాటి కిన్నెరసాని పాటలే, నేటి కిన్నెరసాని ప్రాజెక్టుకు స్ఫూర్తిబాటలని చెప్పారు. ఆయన సాహిత్యంలో కిన్నెరసాని వాగు రసమై, రాగమై విరాజిల్లిందన్నారు. భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలుగులో విస్తృతమైన గ్రంథాలు రాసిన మహానుభావుడు విశ్వనాథుడని కొనియాడారు. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ఆ మహనీయుని రచనలు నేటి తరం ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సినీనటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ వేయిపడగలు తెలుగుజాతికి ఒక దర్పణమన్నారు. ప్రజా కవి సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ప్రకృతి అందాలను పాటల్లో బంధించిన గొప్ప సాహితీమూర్తి విశ్వనాథ వారు అని తెలిపారు. ఏపీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ భవిష్యత్తులో వచ్చే మార్పులను ముందే ఊహించి చెప్పిన గొప్ప కవిగా సత్యనారాయణ నిలిచారన్నారు. విశ్వనాథుని మనుమడు విశ్వనాథ సత్యనారాయణ మాట్లాడుతూ తన తాత తుదిశ్వాస విడిచే పావుగంట ముం దు వరకూ ఆయన కావ్య పఠనంలోనే గడిపిన కర్మయోగి అని చెప్పారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వనాథ రచించిన కిన్నెరసాని పాటల్లో భావుకవిత్వం తొణికిసలాడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ నర్తకి స్వాతీ సోమనాథ్ బృందం ప్రదర్శించిన కిన్నెరసాని నృత్యరూపకం ఆకట్టుకుంది. వేయిపడగలులోని ముఖ్యాంశాలు పుస్తకాన్ని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు, తెలంగాణ ఎ క్లాసికల్ కల్చర్ ఖజానా పుస్తకాన్ని ప్రఖ్యాత రచయిత బి. నర్సింగరావు, విశ్వనాథ రాసిననాటి కిన్నెరసాని పాటలే నేటి కిన్నెరసాని ప్రాజెక్టుకు స్ఫూర్తి పుస్తకాన్ని కె. శ్రీనివాస్ ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా సత్యనారాయణను, థౌజండ్ హుడ్స్ ఆంగ్ల అనువాదంలో భాగస్వాములైన పలువురిని సత్కరించారు. కార్యక్రమంలో తొలినేపథ్యగాయని లావు బాలసరస్వతీదేవి, వాడ్రేవు చినవీరభద్రుడు, సి.సుబ్బారావు, ఐనంపూడి శ్రీలక్ష్మి, డాక్టర్ అరుణ వ్యాస్, చీకోలు సుందరయ్య పాల్గొన్నారు. -
విశ్వనాథ పలుకు.. విరుల తేనె చినుకు
కిన్నెరసాని వచ్చిందమ్మా.. వెన్నెల పైటేసి.. మరిచి పోలేని పాట. విశ్వనాథ కవితలై లోతు కైతల ఊటలై వచ్చినవి కిన్నెరసాని పాటలు. భూమ్మీద మూడువంతుల నీరు ఒకవంతు మాత్రమే నేల ఉంది కదా. పుడమి తల్లి బిడ్డలమైన మన తనువుల్లో మూడువంతుల రక్తం, ఒకవంతు ఎముకలూ ఉన్నాయి. పాట గానరసమై మన రక్తంలో ప్రవేశించి ప్రవహిస్తుంది. హృదయాణువుల్ని కదుపుతుంది. విశ్వనాథ సత్యనారాయణ ఒకవైపు ‘పాషాణ పాకి’ అని శ్రీశ్రీచే చెప్పబడ్డ కవి. సర్వసాహితీ ప్రక్రియల్లో శిఖరాయమాన రచనలు చేసిన దిట్ట శ్రీమద్రామాయణ కల్ప వృక్షం వంటి ప్రౌఢ పద్య కావ్య నిర్మాత విశ్వనాథ జానపదుని అవతారమెత్తి జానపద పాటలా అన్నంతగా కిన్నెరసాని పాటల్ని తెలుగు పలుకుబడి అనే అందచందాల వేదికపై గాయకుడై గానం చేశా రు. ఆధునిక సమాజానికి ఆయన భావజాలం అవసరం లేదుగాని.. ఆయన కవిత్వ ఇంద్రజాల ఉన్నత ప్రదర్శనలు అందరికీ అవసరమే. అలాంటి కవితా ప్రదర్శన కిన్నెరసాని పాటలు, సాహిత్య సభల్లో ఆయన రామాయణ కల్పవృక్ష పద్యాలు వినిపించడానికి వస్తే మాకు కిన్నెరసాని పాటలు వినిపించండి అని ప్రజలు కోరేవారంటేనే వారెవ్వా ఆ పాటల మజా గ్రహించవచ్చు. లయబద్ధ పదాలు సుళ్లు తిరుగుతాయి. భావాలు ఎక్కడికో తీసుకుపోతాయి. వాక్యాలు రసరమ్యాలౌతాయి. పాఠకుడు లేక శ్రోత గోదావరిని సంగమించే కిన్నెరగా మారి పోయే రసస్థితి. గోదావరి జాలి గుండె గూడులు కదలి/ సాదుకిన్నెరకెదురుపోయీ/ ఆమె-లోదిగులు తరగ చేదోయీ. ఇలా సాగుతుందా కిన్నెరసానిని గోదారి ఆ ప్యాయంగా తనలో కలవడానికి ఆహ్వానిస్తుంది. గోదావరి పేద గుండె లోతులు కలిగి.../ గోదావరి జాలిగుండె ప్రేగులు తడిసి.../ గోదావరి ఎడ ద కోసలను కోతపడి../ గోదావరి దేవి కోసమనసులో వొరసి/ కిన్నెరసానిని పిలిస్తే ఆమె వచ్చి కలుస్తుంది. ఆదుకొను, పాదుకొను, తలిరుమల్లికలు, పొలుచుటలు/ కోరగించుటలో ఇటువంటి తెలుగు మాటల ప్రయోగాల్లో కిన్నెరసాని గోదావరిలో కలిసిపోతుంది. గోదావరి దేవి గొప్ప వంశపు రాణి అని, ఆమె ఏమ న్నా కాదనేందుకు వీల్లేదని, అసలు ఆమె కాదంటే ఏ పనీ చేయరాదని భావించింది కిన్నెరసాని నీటిదొరసానిగా. గోదావరి కిన్నెర కలసిపోయాక సమ్మేళనమైన జలం. గోదావరి నీరు కూడి కిన్నెర నీరు/ఏది ఏదో తెలియనంతగా మారిపోయిందట. గోదావరి దేవిని కిన్నెరసాని కూడిన తర్వాత కిన్నెరసానికి దిగులే లేదట. ఏదైనా దిగులున్న ఎడదలున్న వారెవరైనా కిన్నెరసాని పాటలు చదువుతుంటే, పాడుకుంటే ఆనందం అర్ణవమవుతుంది వేవేల వర్ణాల వర్ణనా శోభతో. -సన్నిధానం నరసింహశర్మ