నిత్యనూతనం ‘వేయిపడగలు’
♦ ‘థౌజండ్ హుడ్స్’ ఆవిష్కరణ సభలో కొనియాడిన వక్తలు
♦ ఆంగ్లంలోకి అనువాదమైన కవిసామ్రాట్ నవల
♦ విశ్వనాథుడు తెలుగు వాడి ఆస్తి అన్న మండలి బుద్ధప్రసాద్
సాక్షి, హైదరాబాద్: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయిపడగలు’ నవల ఏ తరం వారికైనా నిత్యనూతనమైన సాహితీ గ్రంథమని , అది మానవ సమాజంలోని భిన్నకోణాలను ఆవిష్కరించిన మహారచన అని పలువురు వక్తలు ఆ నవల విశిష్టతను కొనియాడారు. ఆదివారం రవీంద్రభారతిలో విశ్వనాథ సాహితీపీఠం, హైదరాబాద్ భాషా సాంస్కృతిక సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ వెల్చాల కొండలరావు అధ్యక్షతన ‘థౌజండ్ హుడ్స్’(వేయిపడగలు) ఆంగ్ల గ్రంథావిష్కరణ సభ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అనువాద గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వనాథ సత్యనారాయణ తెలుగువారి ఆస్తి అని కొనియాడారు. వేయిపడగలు వెలువడిన 78ఏళ్ల తర్వాత డాక్టర్ వెల్చాల కొండలరావు ఆ నవలను ఆంగ్లంలో అనువదించి ఆ భాష మాట్లాడేవారికి పరిచ యం చేయడం అభినందనీయమన్నారు.
విజయవాడలో పుట్టిన విశ్వనాథ సత్యనారాయణను కరీంనగర్ వాసులు అమితంగా అభిమానించేవారని చెప్పారు. ఎంపీ వినోద్ మాట్లాడుతూ భాషా, ప్రాంతీయ సంకుచితత్వం ఉండకూడదని కవిసామ్రాట్ చెప్పేవారన్నారు. విశ్వనాథ సాహిత్యపీఠం గౌరవాధ్యక్షుడు వెల్చాల కొండలరావు మాట్లాడుతూ విశ్వనాథ రాసిన నాటి కిన్నెరసాని పాటలే, నేటి కిన్నెరసాని ప్రాజెక్టుకు స్ఫూర్తిబాటలని చెప్పారు. ఆయన సాహిత్యంలో కిన్నెరసాని వాగు రసమై, రాగమై విరాజిల్లిందన్నారు.
భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలుగులో విస్తృతమైన గ్రంథాలు రాసిన మహానుభావుడు విశ్వనాథుడని కొనియాడారు. మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ఆ మహనీయుని రచనలు నేటి తరం ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సినీనటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ వేయిపడగలు తెలుగుజాతికి ఒక దర్పణమన్నారు. ప్రజా కవి సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ప్రకృతి అందాలను పాటల్లో బంధించిన గొప్ప సాహితీమూర్తి విశ్వనాథ వారు అని తెలిపారు. ఏపీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ భవిష్యత్తులో వచ్చే మార్పులను ముందే ఊహించి చెప్పిన గొప్ప కవిగా సత్యనారాయణ నిలిచారన్నారు.
విశ్వనాథుని మనుమడు విశ్వనాథ సత్యనారాయణ మాట్లాడుతూ తన తాత తుదిశ్వాస విడిచే పావుగంట ముం దు వరకూ ఆయన కావ్య పఠనంలోనే గడిపిన కర్మయోగి అని చెప్పారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వనాథ రచించిన కిన్నెరసాని పాటల్లో భావుకవిత్వం తొణికిసలాడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ నర్తకి స్వాతీ సోమనాథ్ బృందం ప్రదర్శించిన కిన్నెరసాని నృత్యరూపకం ఆకట్టుకుంది.
వేయిపడగలులోని ముఖ్యాంశాలు పుస్తకాన్ని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు, తెలంగాణ ఎ క్లాసికల్ కల్చర్ ఖజానా పుస్తకాన్ని ప్రఖ్యాత రచయిత బి. నర్సింగరావు, విశ్వనాథ రాసిననాటి కిన్నెరసాని పాటలే నేటి కిన్నెరసాని ప్రాజెక్టుకు స్ఫూర్తి పుస్తకాన్ని కె. శ్రీనివాస్ ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా సత్యనారాయణను, థౌజండ్ హుడ్స్ ఆంగ్ల అనువాదంలో భాగస్వాములైన పలువురిని సత్కరించారు. కార్యక్రమంలో తొలినేపథ్యగాయని లావు బాలసరస్వతీదేవి, వాడ్రేవు చినవీరభద్రుడు, సి.సుబ్బారావు, ఐనంపూడి శ్రీలక్ష్మి, డాక్టర్ అరుణ వ్యాస్, చీకోలు సుందరయ్య పాల్గొన్నారు.