ప్రతీకాత్మక చిత్రం
కథాసారం
ఒకసారి ఒక పెద్దమనిషి ఆడ సీమకుక్కను స్టేషనులోకి తెచ్చాడు. వాటి రెంటికీ ప్రథమ దర్శనంలోనే ప్రణయం ఏర్పడ్డది. ఆ పెద్దమనిషి చేతిలో కర్ర ఉంది. దాన్ని చూచి మన కుక్క తన ప్రియురాలి దగ్గరికి వెళ్లింది కాదు.
మాక్లీదుర్గం రైలుస్టేషను గుంటకలు నుంచి బెంగళూరు పోయే త్రోవలో నాల్గు స్టేషనుల కివతల నున్నది. ప్లాటుఫారం కన్న రైలు స్టేషను పదిగజాలు ఎక్కి వెళ్లాలి. రైలురోడ్డు ప్రక్కనే పెద్దకొండ ఉన్నది. దాని నిండా చెట్లూ చేమలూ, రాళ్లూ రప్పలూ ఉన్నవి. అప్పుడప్పుడు వేగోలాలు సివంగులు రాత్రిళ్లు స్టేషనులోకి వస్తూ ఉంటవి. స్టేషనుకి వెనుక పెద్దలోయ ఉన్నది. లోయ కవతలతట్టు ఉన్న కొండ మీద నెవరిదో భాగ్యవంతులది పెద్ద సౌధం ఉన్నది. మాక్లీదుర్గం స్టేషను చిన్నది. అందులో చిన్న అంగడి ఉంది. రైళ్లు వచ్చేవేళకూ పోయేవేళకూ అంగడి తెరచి ఉంటుంది. ఒక కుక్క అంగడి తెరచినప్పుడల్లా అక్కడ తయారు. అంగడి ఎత్తుగా ఉంటుంది. కుక్క తన చూపు అంగడిలోని పళ్లికలలో ఉన్న మిఠాయి మీద పడే అంత సమరేఖలో నుంచుకొని ఊర్ధ్వ దృష్టితో తపస్సు చేస్తుంది.
వాడంగడి సర్దేటప్పుడైనా, యెవడైనా కొనుక్కునేటప్పుడైనా చిన్న ముక్క జారిపడుతుందేమో అని యెదురు చూస్తూ ఉంటుంది. వారానికో పదిరోజులకో అట్లా యెప్పుడూ పడదుగాని, పది రోజుల క్రింద చేసిన పకోడీ కొనుక్కున్నవాడు చద్దివాసన వేసి పారేస్తే కుక్క దాన్ని నోటితో అగావుగా పట్టుకుని ముందు పళ్లతో నొక్కి రెండు గతుకులు మ్రింగి దగ్గు వచ్చి మళ్లీ కక్కుతుంది. రైలు వెళ్లిపోవటం తోటే అంగడివాడు మూస్తాడు. కుక్క పోయి సెలయేట్లో నీళ్లు తాగుతుంది. ముందు కాళ్లు చాచి గడ్డిమీద పడుకుని, లేత గరికపోచలు కొరుకుతుంది. ఆ కుక్క మంచి మిడతల వేటగాడు. అప్పుడప్పుడు పొలము పిచ్చుకలను గూడా పట్టుకుంటుంది. సెలయేటి నీళ్లూ, మంచి గాలీ, లోయలోకి దిగటం, ఎక్కటం– కుక్క మంచి దేహపటుత్వంలో ఉన్నది.
కుక్క చెదరిౖయెనా స్టేషనెదురుగా ఉన్న కొండమీదికి పోదు. ఒకసారి ఒక పెద్దమనిషి ఆడ సీమకుక్కను స్టేషనులోకి తెచ్చాడు. వాటి రెంటికీ ప్రథమ దర్శనంలోనే ప్రణయం ఏర్పడ్డది. ఆ పెద్దమనిషి చేతిలో కర్ర ఉంది. దాన్ని చూచి మన కుక్క తన ప్రియురాలి దగ్గరికి వెళ్లింది కాదు. పుట్టింట ఉన్న ఆడపిల్ల వలె సీమకుక్క మాత్రం నిర్భయంగా తన వలపుకాణ్ణి చూడటం మొదలెట్టింది. పెద్ద మనుష్యులు తన్ను పోకిరీ అనుకుంటారేమో నని దుర్గపు కుక్క దానివంక చూచీ చూడకుండా చూడటం మొదలెట్టింది. పెద్దమనిషి తన కుక్కను కటకటాలకు కట్టివేసి సామానులు తూయించుకోటానికో దేనికో వెళ్లాడు. రెండు కుక్కలూ కలసికొన్నవి. స్టేషను మాస్టరు కొంచెము చదువుకొన్నవాడు. పెద్దమనిషికీ, ఆయనకీ ఆధునిక సిద్ధాంత రాద్ధాంతాల చర్చ జరుగుతోంది.
స్టే. మా.: కాదండీ! వర్ణ వ్యవస్థ ఉండాలి. మన పూర్వులు ఏ ప్రయోజనం కోసం దాన్ని నేర్పరచారో ఆ ప్రయోజనాలు తెలియకుండా మనం వాటిని తీసివేయరాదు.
పె.మ.: మనవాళ్లు ఏర్పరచారు కదా అని గ్రుడ్డి ఎద్దు చేలో పడ్డట్లు పోరాదు. ప్రతిదీ వాదానికి నిలవాలి.
స్టే. మా.: అయితే మీరు వర్ణ వ్యవస్థ తీసి పారవెయ్యాలి అంటారా?
పె.మ.: ఈ వ్యవస్థ మూలంగా అనేక భేదాలేర్పడుతున్నవి. వర్ణాంతర భోజనములూ, వివాహములూ జరుగవలె. అప్పుడే దేశానికి ముక్తి. పెద్దమనిషి బయటకు వచ్చాడు. తన కుక్క వంక చూచాడు. రెండు కుక్కలూ తమ వర్ణభేదం మరచిపోయి కలసికొంటున్నవి. పెద్దమనిషి పరుగెత్తుకొనిపోయి దుర్గపు కుక్కను పదిపదకొండు దెబ్బలు కొట్టినాడు. ‘జ్ఞాతాస్వాద’మైన ఆ కుక్క వెంటనే వదిలిపెట్టుటకు S సమర్థము కాక చివరకు వదిలించుకొని పోయింది. స్టేషను బయటకు పోవువరకు కుక్కకు తెలిసింది, తన ఒక తొంటి విరిగినదని. ఆ పెద్దమనిషి తన కుక్కను కూడా నాలుగు మోదినాడు. స్టేషను మాస్టరీ గందరగోళం విని బయటకు వచ్చాడు. ‘అయ్యా, ఎందుకు కుక్కనట్లా కొట్టారు?’
పె.మ.: ఇది జాతిగల కుక్క. దీనికి రుతువు వచ్చింది. బెంగళూరు తీసుకుపోతున్నాను. ఈ జాతి మగకుక్కతో కలపవలెనని.స్టేషను మాస్టరు కొంచెము నవ్వాడు. పెద్దమనిషి కనుబొమల మీద కొంచెం నల్లనిరేఖ యేర్పడ్డది. ఆయనా నవ్వాడు.
స్టేషను మాస్టరు సీమకుక్క మొగాన మచ్చకూ, తోకకుచ్చుకూ, గోధుమవన్నె రంగునకూ మెచ్చుకొని ముద్దాడాడు. దీనికి పిల్లలు పుడితే నాకో పిల్లను తప్పకుండా ఇవ్వాలని వాగ్దానం చేయించుకొన్నాడు.
ఊరకుక్క సంసర్గం చేత సీమకుక్క ఒళ్లంతా మన్నయింది. పెద్దమనిషి తన తోలుపెట్టె తెరచి రెండుతికిన తువాళ్లూ సబ్బుబిళ్లా తీసి పడెలో కుక్కను అభ్యంగము చేయించి చక్కగా తుడిచాడు. ఇంతలో రైలు వచ్చింది. చంకను పెట్టుకొని రైల్లో ఎక్కాడు. ‘లీలా! అల్లా చేయవచ్చునా?’ అని దాని నోట్లో నోరుపెట్టి ముద్దు పెట్టుకొన్నాడు. ఇందాకటి కుక్క యీ పనే చేస్తే అంత హృదయంగమంగా ఊరుకున్న ఆ కుక్క పరపురుష చుంబనం పరిహరించినట్లుగా అతని చుంబనం పరిహరించింది.
2
దుర్గములో కుక్క తన తొంటి గాడిదగడపాకునకూ, అడ్డసరపాకులకూ వేసి రుద్దుకొని సెలయేటి ఒడ్డున ఒండ్రుమట్టితో అద్దుకొని పదిహేను రోజులకు కాలు సరిచేసుకుంది. మళ్లీ స్టేషనులోకి వస్తూన్నది. మిఠాయి దుకాణం వంక చూస్తున్నది. ఒకనాడు ఇద్దరు విద్యార్థులు అక్కడికి వచ్చి దుకాణంలో యేదో కొనుక్కుని తింటూ బల్లమీద కూర్చున్నారు. ఒకడు: మనదేశంలో భూతదయ అన్నది లేదు. నేను బీఏ ప్యాసైనాను. ఉద్యోగమిచ్చే దిక్కు లేదు. పేదవాళ్లు మలమల మాడిపోతున్నారు. గొప్పవాళ్లు సోఫాల మీదగాని ఒరగరు.
రెం: మనవాళ్లు పిడికెడు బిచ్చం పెట్టరు. చివరకు కుక్కకు వేసినట్లన్నా పేదవాళ్లకింత వెయ్యరు. కుక్క వాళ్ల చేతిలో పొట్లం వంక చూసింది. వాళ్లిద్దరూ ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకతని కాళ్లకు బూట్లు ఉన్నవి. ఆ బూటు కాలితో కుక్కను డొక్కలో తన్నాడు. దానికి రెండు మూడు రోజుల నుంచీ తిండి లేదు. ఆ దెబ్బ పొట్టలో యే నరానికి తగిలిందో అది మెలికలు తిరిగిపోయింది. ఆ రోజు సాయంత్రం కొండ మీద నుంచి ఒక వేగోలం దిగి రాత్రిపూట స్టేషనులోకి వచ్చింది. కుక్క భయపడి దుకాణం క్రింద గూడుగా ఉంటే దానిలో దాక్కుంది. స్టేషనంతా నిర్జనంగా ఉంది. వేగోలం పసిగట్టి మూతి గూట్లోకి పెడితే కుక్క దాని నోరంతా కరచింది. మూడు నాలుగు గంటలు దాగుడు మూతల యుద్ధం చేసిన ఒక ఒడుపులో వేగోలం పీక పట్టుకుని దాని ఊపిరి ఆగేదాకా కుక్క వదలలేదు.
ఏడాది రెండేండ్లుగా మర్యాద లేని కుక్కకు ఆనాటితో మర్యాద యెక్కువైంది. అంగడివాడికి మహాదయ కలిగింది. సంవత్సరము బట్టీ పరిశిష్టపు నూనెతో పరిశిష్టంగా వస్తున్న మిఠాయి జంగిలీ దాని ముందర పెట్టాడు. అది తిన్నది. తెల్లవార్లూ ఏడవటం మొదలుపెట్టింది. దానికేదో మహావాతం పుట్టింది. కనపడ్డ ఆకల్లా కొరికింది. ఏ ఆకూ పని చెయ్యలేదు. వేగోలాన్ని చంపిన కుక్క వారము అయ్యేటప్పటికి చిక్కి శల్యమయింది. చీడకుక్క, పేలకుక్క అని దాన్ని కొట్టడం మొదలుపెట్టారు.
3
ఆరు నెలలైంది. కుక్క చావదు, బతకదు. ఒకరోజు ఆ పెద్దమనిషి వచ్చాడు. స్టేషన్ మాస్టరు ‘కుక్క పిల్లలను పెట్టిందా?’ అని అడిగాడు. పెద్దమనిషి ఇట్లా అన్నాడు: ‘మీ పాడుకుక్క పాడు చేసింది. కుక్క రెండు పిల్లలను పెట్టింది. ఊరకుక్కల్ని పెట్టింది’. మాస్టరు ‘అది మంచి పౌరుషశాలి’ అన్నాడు. పెద్దమనిషి ‘పోనిద్దురూ! వెధవకుక్క. దాన్ని నరికిపోతా’నన్నాడు. ఇంతలో ఆ కుక్క యీడ్చుకుంటూ వచ్చింది. పెద్దమనిషి కోపం పట్టలేక పేము బెత్తంతో ఒకటి వేశాడు. ఆనాటి రాత్రి ఆ కుక్క రైలు క్రింద పడ్డది. అరగంట తన్నుకుని చనిపోయింది.
4
తరువాత నాల్గు నెలలకు ఆ పెద్దమనిషి తన రెండు కుక్కపిల్లలలో ఒకటి చచ్చిపోయినదని చెప్పి రెండవ దానిని స్టేషను మాస్టరు కిచ్చాడు. అది ఆరు నెలల్లో యెదిగి తన తండ్రి వలె నైనది. దానికి భయము లేదు. కొండమీదికి షికారు పోయి వస్తుంది. ఎన్ని ఆడకుక్కలు వచ్చినా వాటి వంకకు చూడదు. విద్యార్థులు భూతదయోపన్యాసములు చేస్తుంటే తిరస్కారముగా చూస్తుంది. ఆ పెద్దమనిషి ముద్దుగా ముట్టుకోబోతాడు. కోపంగా పళ్లు చూపి(స్తుంది). మిఠాయి దుకాణమువా డొకనాడు చద్ది మిఠాయి వేయబోయినాడు. వాడి పిక్క కండలు లాగింది. అది వేగోలం గాని కుక్క కాదన్నారందరూ. కొన్నాళ్లకు అడవుల్లోనే ఉంటూ వచ్చింది. నిత్యగహన సంచారం వల్లనో, తల్లి పోలికో తోకకుచ్చు బలిసింది. కోరలు వచ్చినై. మనుష్యుని గాలి తగిలితే బృహస్పతి తమ్ముడు సంవర్త మహర్షి వలె సీదరించుకుని తొలగిపోతుంది.
కేవల ప్రదర్శితాదర్శాల మీద విశ్వనాథ
సత్యనారాయణ
(1895–1976)
ఎత్తిన కథాఖడ్గం
‘మాక్లీదుర్గంలో కుక్క’. రచనాకాలం 1936. సంక్షిప్తం:
సాహిత్యం డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment